ఆదర్శాలు వల్లించడానికేనా !
అమ్మా నన్నెత్తుకోవా ? ఎత్తుకోవే అమ్మా చిన్ని బాబు ముద్దులు మూట కట్టే ముత్యాల పలుకులు ! ఆ ముద్దు మాటలకు మైథిలి పులకించిపోయింది.
గర్భంధరించే యోగ్యత లేదని డాక్టర్లు నిర్ధారణ చేసి చెప్పిన నాటినుంచీ నిరాశా నిస్పృహలకు లోనయి ఎండి బీటలు వారిన మనస్సును శాంతింప చేసుకోడానికి శత విధాలా ప్రయత్నం చేసి విఫలురాలయ్యింది మైథిలి. పరమ శాంతమూర్తీ గంప గయ్యాళిగా మారింది. చీటికి మాటికీ చిర్రు బుర్రు లాడుతూ ఎవరిని పడితే వారిని ఎంతమాట పడితే అంత మాట అని అందరినీ దూరం చేసుకుంది. బంధువులు లేరు, మిత్రులు లేరు.
యౌవనంలో ఆమె అందాన్నీ హృదయాన్నీ సంపూర్ణగా వశం చేసుకొన్న భర్త ఆత్రేయకూ, ఏ మాత్రమూ వెనుదీయకుండా ఎంత అడిగితే అంత ఆమె యిచ్చే ధనానికి ఆశపడే పనివారికీ మాత్రం ఆమె అంటే ప్రేమ తగ్గలేదు. తిట్టినా తుడిచేసుకుంటే తరువాత తిట్టినందుకుగాను పదింతలుగా అపరాధ రుసుం మైథిలే చెల్లిస్తుంది. పిల్లల కోసం ఆమె పడే వ్యధ ఇంత అంతాకాదు. ఎవర్నైనా పెంచుకోమని చెప్పడానికి ఎవరికీ ధయిర్యం లేదు. అమ్మో దయ్యాల ముందు బిడ్డలా మాడ్చివెయ్యదూ అనుకుంటారు.
మండుటెండల్లో మాడిపోయే ఎడారి ఇసుకలా ఉన్న మైథిలి మనస్సులోకి ఆ బాబు ముద్దుపలుకులు వినేసరికి చివ్వుమని గంగమ్మ అమృత ధరులను పొంగించింది. వసంతం వెల్లి విరిసింది. తాను చేసే తపస్సుకి మెచ్చి చిన్ని కృష్ణుడే చిరుబొజ్జతో కాలి గజ్జలతో జగన్మోహనంగా నవ్వుతూ తన ముందుకు వచ్చి అమ్మా ! ఎత్తుకోవే అంటేన్నాడనుకొని మురసి పోయింది.
తెలియరాని ఆనందంతో తాను చదివే పుస్తకాన్ని కిందపారేసి గుమ్మం కేసి దృష్టిసారించిన మైథిలి కక్కడ ఎవ్వరూ కన్పించలేదు. మళ్ళీ భాగవతం విప్పింది. ఈ కొంటె కృష్ణుడు నన్నాటలాడిస్తున్నాడు అనుకొంది. ఆమె చదివితె భాగవతమే చదువుతుంది. అందులోని బాలకృష్ణుని లీలలే మళ్ళీ మళ్ళీ చదువుతుంది. ఈ గోపికల్లో తానూ ఓ గోపిక, ఆ కన్నడు తన కడుపున పుట్టినవాడు కాడూ ! కృష్ణుని రాలుగాయి తనాన్ని మందలిస్తుంది, లాలిస్తుంది, బుజ్జగిస్తుంది కిష్టప్పను ఒక్క క్షణం దించని యశోద అయ్యి మధురానగరంలో విహారం చేస్తుందామె హృదయం.
ఆత్రేయకీ పిల్లల గోల పట్టదు. ధన సంపాదనే అతని ధ్యేయం. భార్య తన కళ్ళముందు కదలాడుతూ ఉంటే అంతేచాలు ! భార్యని చూసి జాలిపడతాడేగాని ఆమెకు మనశ్శాంతి కలిగేందుకు చిన్న ప్రయత్నమూ చెయ్యడూ. ఖర్చులేదు రాబడి అధికమై పోయింది. ధనం మూలుగుతోంది.
ఇదంతా ఎవరికి మూట కట్టిస్తావు ? అని ఎవరైనా అడిగితే మాట దాటవేస్తాడు.
మళ్ళీ అదే గొంతు ఆ గొంతునుండి మకరందాలు జాలువారుతున్నాయి. ప్రకృతంలా శిశురూపం దాల్చి అమ్మకోసం ఆక్రోసిస్తోంది. అమ్మా అమ్మా ! ఎత్తుకేవే ? మైథిలి హృదయం తెలియరాని భావావేశంలో తల్లడిల్లింది. ఏదో ఆనందం. తాను యశోద ! తన కౌసల్య ! తాను అమ్మ ! అందరికీ అమ్మ ! మాతృహృదయం ఒక్క మాటుగా ఆ బాబు పిలుపుతో తలుపులు తెరుచుకుంది. ప్రేమామృతం ఉధృతంగా పొంగిపోయి పిక్కటిల్లి గుండెలను మనస్సునూ ముంచివేసి వరదలై పొరలుతోంది. మైథిలి ఇటూ అటూ బిడ్డకోసం పరుగులెత్తింది. కలయచూసి ఎక్కడా కానక వీధి తలుపుతీసి అక్కడ దృశ్యాన్ని చూసి నిర్విణ్ణురాలై పోయింది.
తను గేటు ప్రక్కనే ఉన్న లైటు స్థంభాన్ని అనుకొని ఒక స్త్రీ పడిపోయి ఉంది. ఆమెకు శరీరం పై ధూళి కొట్టకు పోయిన కొన్న గుడ్డపీలికలు వేళ్ళాడుతున్నాయి. కాళ్ళూ చేతులూ అటూ ఇటూ గా పడివున్నాయి. స్పృహలేనట్లుంది. పాదాలకూ, ఒక చేయికీ గుడ్డతో కట్లు ముక్కూ చెవులూ సగం సగం ఆకారంతో వున్నాయి ! జోలె, జర్మన్ సిల్వర్ గిన్నె పక్కనే పడివున్నాయి. ఆమె కుష్టిరోగి ! మైథిలి గుండె ఆగిపోయింది. ఆమె పక్కనే రెండేళ్ళు నిండాయో లేదో పసివాడు ! బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అమ్మ స్పృహ తప్పిందో చచ్చి పోయిందో తెలిసికోలేని పాపాయి ! అమ్మలేచి తననెత్తుకోలేదని మారాం పెడ్తున్నాడు. అమ్మా ఎత్తుకోవే అంటూ. ఎత్తుకోడం లేదెందుకనో పడుకునే వుంది ఎందుకు తెలీని వాడికి ఆకలెక్కువయంది. కాళ్ళు కాల్తున్నాయి. అమ్మ గుండెల్లో దూరి పాలు తాగటానికి తంటాలు పడ్తున్నాడు. ఆమె కదలటం లేదు.
మైథిలి కర్తవ్యం వెంటనే వెన్ను దట్టింది. అప్పన్నా అంటూ అరిచి వాడిచేత ఆమె మొహాన నీళ్ళు కొట్టించి ఆ బాబుని ఆత్రంగా ఎత్తుకుంది. కొత్తవాళ్ళెవరో ఎత్తుకోవడంతో బిత్తర పొయి ఏడ్పుమాని ఎత్తుకొన్న వారెవరా అని విస్తుపోయి చూస్తున్నాడు. అప్పన్నా ఆమె కళ్ళు తెరిచింది. అర్జంటుగా ఫ్రిజ్‌లోంచి మజ్జిగ తెచ్చిపొయ్యి అన్నది మైథిలి. అప్పన్న దొడ్డంతా వెదికి కొబ్బరి చిప్ప తెచ్చి ఆమెకు త్రాగించాడు. మైథిలి గయ్యమంది. తెల్లగ్లాసుతో తెచ్చి పొయ్యక పోయావా కొబ్బరి చిప్పేమిటి అని ఉరిమింది.
అమ్మగారూ తెల్లగళాసుతో మేము కాఫీ తాగుతాం గదండీ. ఇది ముట్టిది. కుట్టుది. దీనికెల్లా ఆ గళాసుతో ఇయ్యాలండీ అన్నాడు. మరి ఈ బాబుకి కాసిని పాలుపట్రా. ఇంకో కొబ్బరి చిప్పతోకాదు. మేముతాగే అమెరికా గ్లాసుతో తీసుకురా ! చెమ్చాకూడా పట్రా అని గర్జించింది.
ఆమె మజ్జిగ తాగి తేరుకుని వెయ్యిసార్లు దీవించింది. నీ ఇల్లు చల్లగా నీ కడుపు చల్లగా ఇంటినిండా పిల్లా పాపలతో కళకళలాడుతల్లీ ! మా తల్లీ మా లచ్చితల్లి బంగారు తల్లీ ! వెయ్యేళ్లు వర్థిల్లు అని కొంచెం కోలుకొన్నాక పిల్లాడిని చంకనేసుకొని లేచింది. తూలుతూ నడవ సాగింది.
ఆమె జోలెలో అయిదు రూపాయలూ ఒంటిమీదికో పాతచీర పిల్లాడికి చాక్లెట్లూ ఇచ్చి తానెంత ధర్మంచేశానని పొంగిపోయింది మైథిలి. ధర్మదేవత అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ కనుమరుగై పోయింది ముష్టిది.
కొంతసేపటికి మైథిలిలో మధనం ప్రారంభమైంది. ఆమె కుష్టురోగి, వాడు పండువంటి పాపాయి ! పచ్చగా ముద్దొస్తున్నాడు. వాడి తల్లి కొన్ని రోజుల్లోనో, నెలల్లోను ఆ జబ్బుతో చనిపోవచ్చు. ఆ బాబుగతేమిటి ? వాడికి కూడా ఆ రోగం రాదని గారంటీ లేదు. ఇప్పటికే ఆ క్రిములు వాడిలో ప్రవేశించే ఉండవచ్చు. ఈ సమాజం ఇలాంటి వారికేం చేస్తుంది ? చేస్తోంది ? వాణ్ణేవరైనా పెంచి పెద్దచేసి మంచిపౌరుడిగా తీర్చిదిద్దకూడదూ అనుకొంది.
ఎవరన్నా ఎందుకు తాను ఎందుకు చెయ్యకూడదు. నూటికి ఒక్కడినైనా ఆదుకొంటే ఒక్కడైనా ఈ భయంకర రోగాన్నుంచి బయట పడతాడు. ఆ తరువాత మైథిలి చేయవల్సిన పనులన్నీ చకచకా చేసేసింది. అప్పన్నను వారికోసం వీధుల వెంట తోలింది. ఆత్రేయ వాడిని తమ యింట్లో పెంచేందుకు ససేమిరా వప్పుకోలేదు. అంతగా అయితే ఎంత డబ్బయినా దానం చెయ్యమన్నాడు. దానం కాదు నేను వాణ్ణి పెంచుకొని తీరతాను మైథిలి పట్టుపట్టింది. మాటా మాటా పెరిగిపోయింది. కలహం మరింతగా హెచ్చయ్యింది. ఎన్నడూ కసురుకొని కూడా ఎరుగని ఆత్రేయ ఆమె చెంపలను ఎడా పెడా వాయించాడు. నీతో నాకు సంబంధం లేదని తోసేసాడు.
మైథిలి మూగగా రోదిస్తూ ఉండిపోయింది. తనకే గతిలేదు. భర్త పొమ్మంటే తాము ముష్టెత్తుకోవాల్సిందే. ఉద్యోగం చేసేంత చదువులేదు. కాయకష్టం చేసేంత శరీర శక్తిలేదు.
అయినప్పటికీ మైథిలి పట్టిన పట్టువదలలేదు. తీవ్రంగా ఆలోచించింది. భర్త కాంపుకు వెళ్ళాడు. వచ్చేసరికి పదిరోజులు పడుతుంది ? తల్లితండ్రులు తనకు పెట్టిన నగలను బాగ్‌లో సర్దుకుంది. బాంక్‌లో తనపేరువున్న డబ్బును డ్రా చేసింది. ఆ బాబూనూ అమ్మనూ ఎక్కడున్నారో వెదికి పట్టుకొంది. ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసిందిగాని ఆమెకవే తుది ఘడియలైనాయి. తమ పుట్టింటికి ప్రయాణమైంది.
బాబుకి తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి డాక్టరుకి ఉన్న పరిస్థితి అంతా చెప్పి అవసరమైన మందులన్నీ వాడింది. వాడు ఒక్క క్షణం తనను వదలడు. తాను వాడిని వీడి అసలే ఉండలేదు. మంచం మీద వాణ్ణి కరుచుకొని పడుకొంది.ఆమెలోని తల్లి హృదయానికి వేయి చేతులొచ్చాయి. అన్ని చేతులతోనూ ఆబగా వాణ్ణి పొదువుకొంది.
. భగవంతుడా వీడిని ఒక్కణ్ణయినా ఆ కుష్టురోగ రక్కసికి బలికాకుండా చేయగలిగాను. వీడొక్కడైనా మాతా కబళం తల్లీ అని వీధుల్లో ఆడుకోకుండా చూశాను. వీడొక్కడినైనా తల్లి ప్రేమకు తపించకుండా చూస్తాను. వీడొక్కడినైనా ఆదర్శాలు వల్లించడానికి కాదు ఆచరించడానికేనని నిరూపించగలిగేలా పెంచుతాను.
ఆత్రేయ సంగతి నాకు తెలుసు ! అతడు ఊరినుంచి రాగానే నేను కన్పించక పోతే పిచ్చెక్కినట్లయి పోతాడు. నాకోసం ఆఘమేఘాలమీద ఇక్కడకు పరిగెత్తుకొస్తాడు. అప్పుడు మేమిద్దరం మా యింట్లో డన్‌లప్ బెడ్ మీద మా యిద్దరి మధ్యా వీణ్ణిపడుకో పెట్టుకొని హాయిగా నిద్రపోతాం ! ఎంత హాయిగా తృప్తిగా నాయనా కన్నా అని వీడిని పిలుచుకుంటామో అన్నట్లు వీడికి పేరేంపెట్టను. కర్నా ! కన్నా! కన్నడూ అనుకుంటూ మైథిలి తృప్తిగా వాడిని డొక్కల్లో దూర్చుకొని నిద్దురపోయింది.
|
|
 |
|