పాట లాగా దీర్ఘం.
డాక్టరు - మాధవరావుగార్కి పూలభాష తెలుసా ?
ఇంతలో ఒక పూజారి వచ్చి మాత్రలు అడుగుతాడు.
పూజారి - జ్వరానికేమైనా బిళ్ళలివ్వండి.
డాక్టరు - మాధవరావుగారూ ఈయనకైనా నన్ను రికమెండ్ చెయ్యండి. ప్రిస్కిప్షన్ రాస్తా.
మాధవయ్య - ఈయనకి ప్రిస్కిప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు వచ్చేదేం ఉండదు. ఎప్పుడైనా పులిహోర ప్రసాదం పెడతారంతే.
మాత్రలిస్తాడు. పూజారి పూలవంక చూసి రెండురూపాయలిచ్చి పూలు కొంటాడు. మాధవరావు చెప్పిన పూలు తీసుకొంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు పూజారి వెళ్ళాక....
పూలమ్మాయి - బాబుగోరూ మీర్చెప్పినట్లే ఆ పువ్వు వెంకటేశ్వరుడి గుడికి వెడుతోంది.
మాధవయ్య - ఇది ఆ టీచరమ్మ జడకే.
పండు వాళ్ళ అమ్మని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు.
మాధవయ్య - ఏమ్మా ప్రపుల్లా ఏమిటీ... ఈ టాబ్లెట్స్ ఎందుకూ...
ప్రపుల్ల - అవును. బాబాయ్ ఒంట్లో బాగాలేదు.
మాధవరావు పట్టిపట్టి ఆమెను చూస్తాడు. ఏదో వేదనపడ్తూన్నట్లు ఉంది.
ప్రపుల్ల కంగారుపడుతుంది బాధగా చూస్తూ.
ప్రపుల్ల - లేదు ఎక్కడో పారేసుకున్నా.
మాధవయ్య - పరవాలేదు లేమ్మా. ఆరు మాత్రలియ్యనా ?
ప్రపుల్ల - చాలవు. పదిరోజులు వేసుకోవాలి. ఇరవై ఇయ్యండి.
మాత్రలు చిన్న కవర్లో వేసి అందించాడు.
మాధవయ్య - జాగ్రత్తగా దాచుకో పండుగాడికందనీకు.
ప్రపుల్ల గభాల్న తీసుకుని బాగ్‌లో వేసుకుంది.
మాధవయ్య - జాగ్రత్తమ్మా.
ప్రపుల్ల - (తల ఊపింది)
ఇంకొకరు వచ్చి పోట్లాడ్తున్నట్లుగా అడుగుతారు.
ఏమండీ ఎక్స్‌పైరీ అయిన ఇంజక్షన్ ఎందుకిచ్చారు ? మీ మీద రిపోర్ట్ చేస్తా.
మాధవరావు బిల్లు తీసుకుని పరిశీలించి నవ్వుతూ
మాధవయ్య - అయ్యా ! ఇది మా షాపులోకొనిలేదు. ఈ బాచ్ నెంబర్ మా దగ్గర లేదు.
అతను తెల్ల మొహం వేసుకుని వెళ్ళిపోయాడు.
డాక్టర్ కేశవరావు మాధవరావుని పరిశీలిస్తూ.
డాక్టరు - మీరు ప్రమాదకరమైన టాబ్లెట్స్‌ని ప్రిస్కిప్షన్ లేకుండా ఇచ్చారు. అది చాలా నేరం.
మాధవరావు పట్టించుకోకుండా బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు.
పండు కళ్ళుమూసుకుని సీరియస్‌గా ధ్యానం చేస్తూంటాడు.
పండు - లెక్కల మాష్టారిక్కడుపు నొప్పిరావాలి లెక్కలమాష్టారిక్కడుపునొప్పిరావాలి. నొప్పి రావాలి.....రావలి...రావాలి.
ఇంతలో ఇద్దరు అదే వయస్సు అబ్బాయిలు అంత కన్నా చిన్న అమ్మాయి వచ్చారు.
రాజా - ఏదా పండూ ఏంటి అంటున్నావ్ ?
పండు - రాత్రి పడుకునేప్పుడు దేవుణ్ణీ కోరుకుంటే అదయిపోతుందని మామ్మ చెప్పింది. అందుకనే రేపు లెక్కల మాష్టారుకి కడుపు నొప్పి వస్తే స్కూలుకి రాడు కదాని దేవుణ్ణి కోరుకుంటూన్నా...
రాజా - ఛా, ఇదేం కోరిక. కడుపు నొప్పొస్తే బెరాల్గాన్ వేసుకుని స్కూలుకొచ్చేస్తాడు.
పండు బాధపడతాడు. మరి ఏమి చెయ్యాలి అన్న ఆలోచన
పండు - మరైతే ఎల్లా.
రాజా - స్కూటర్.... డాషింగ్ చెయ్యాలి అని కోరకో...
ఇంకొకడు - ఆయన గుండుమీద గోళీ కాయలేసికొడితే.
పిల్లలిద్దరూ ఛీ అన్నట్లు మొహం పెడతారు. అమ్మాయి గొప్ప సలహా చెప్తున్నట్లు ఫోజు కొడుతుంది.
అమ్మాయి - మరే....మరే...పచ్చిమిరపు పచ్చడి వేసి అన్నం పెడితే కారంతో గంతులేసి...ఏడ్చి స్కూలుకి రాడూ....
ఛీ ఫో అన్నట్లు ఆ పిల్లను తోసేస్తారు. ప్రపుల్ల పండుని లోపలికి పిలిచింది.
ప్రపుల్ల - పండుఊ అల్లరి చెయ్యకు
పండు - ఛీ నేనల్లరి చెయ్యనమ్మా... నాకసలు చేతకాదుగా...
ప్రపుల్ల - బాగా... చదువుకోనాన్నా
పండు - ఓ....
ప్రపుల్ల ఏడుస్తుంది.
పండు - ఎందుకమ్మా ఏడుస్తున్నావూ.
ప్రపుల్ల - నేనూ...దేవుడి దగ్గరకి వెడ్తున్నా బాబూ...
పండు - నన్నూ తీసికెళ్ళు మమ్మీ. నేనూ వస్తా...ఊ...ఊ...నేనూ వస్తా...
ప్రపుల్ల పండుని నిద్ర పుచ్చింది.
ఉత్తరం రాయడం మొదలు పెట్టింది. రాస్తూ ఏడుస్తుంది మాత్రలు మింగి నిద్రపోతుంది.
ఉత్తరం - ప్రపుల్ల - ఏమండీ నేను మిమ్మల్ని మోసం చేసానండీ... దేవుడిలాంటి మీకు నేను తగనండీ...తగను.. పెళ్ళికాక ముందు నేనొకతన్ని ప్రేమించాను. అతనే సర్వస్వమనుకున్నాను. కానీ పెళ్ళి చేసుకోలేకపోయాను. అది నాదురదృష్టం. మిమ్మల్ని చేసుకోడం నా అదృష్టం. అతనిప్పుడు ఒక సంవత్సరం నుంచీ మన పక్క వాటాలోనే కాపురం వుంటున్నాడు.
శేఖర్ వచ్చి ప్రపుల్ల నీ ఉత్తరాన్నీ చూసి కుప్పకూలిపోయాడు. శేఖర్ నెత్తీనోరూ బాదుకోన్నాడు.
ఉత్తరం - రాఘవ...తెల్పింది కదూ రాఘవ భార్యా కొట్టుకు చచ్చిపోతున్నారు. అతను నాగురించి భార్యకు చెప్పాడు. ఆమె అతన్ని కాల్చుకు తింటోంది. ఆ మంటలు నా కొంపకి అంటు కోకముందే నేను తప్పుకుంటున్నాను.
రాఘవా భార్యా యుద్ధం చేసుకుంటూ ఉంటారు. భార్య సామానులన్నీ కిందా మీదా పడేస్తూ ఉంటుంది. రాఘవ ఏం చెయ్యలేక ఆమెని రెండు బాత్తాడు.
శేఖర్ చదివాక పండు వంక ఆమె వంక చూశాడు. గడియారం వంక చూశాడు. 9 గం|| అయింది. గబగబ నడుచుకుంటూ మందుల షాపుకి వెళ్ళాడు.
శేఖరు - బాబాయ్ ఓ ట్వెంటీ గార్డినాల్.....
ఈ మాట విన్పించిన ప్రక్క రూము డాక్టరు కేశవరావు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
డాక్టరు - ఆ ఎవరండీ...అన్ని గార్డినాల్స్ కొనేందుకు ప్రిస్కిప్షనుందా...నేను రాయనా ?
మాధవరావు డాక్టరు వంక చూసి నవ్వుతూ శేఖర్‌కి మాత్రలిచ్చి పంపించాడు.
డాక్టర్ కోపంగా చూస్తాడు. మాధవరావు నవ్వుతూ...
మాధవయ్య - ఇంతకీ మీకెందుకింత కోపం...
డాక్టరు - మీరు అన్యాయం చేస్తున్నారు. ఇవ్వాళ నలభై గార్డెనాల్స్ అమ్మారు.
మాధవయ్య - ఇంకా ఏమే మందులు ఎన్నెన్ని అమ్మానో కూడా మీకు ఖచ్చితంగా తెల్సుగాని ఊరుకోండి డాక్టర్.
సుశీల వచ్చింది మాత్రలకి.
మాధవయ్య - ఏమ్మా ఏం మందులు కావాలి.
డాక్టరు గది వంక చూస్తూ...
సుశీల - గార్డి....
మాధవయ్య - ఆ ఆ.... గట్టిగా అనకు. ఎన్ని కావాలో చెప్పు. పోనీ ఇరవై ఇయ్యనా.
సుశీల తల ఊపింది. మాధవరావు మాత్రలిచ్చి పంపించాడు. వెళ్తున్న సుశీలని ఆపి మాధవరావు మరో పొట్లాం ఇచ్చాడు. సుశీల ఎందుకన్నట్లు చూసింది.
మాధవయ్య - ఉంచమ్మా ఎందుకన్నా పనికొస్తాయ్.
డాక్టర్ కేశవరావు వచ్చే సరికి సుశీల వెళ్ళిపోయింది.
మాధవయ్య - ఏం డాక్టరుగారూ ఇవ్వాళ మా కొట్లో ఇహ గార్డినాల్స్ లేవు....
డాక్టరు - నాకో ఇరవై.....
మధవయ్య - క్షమించండి లేవు.
ఉదయం ఎనిమిది గంటలు. మాధవరావు చేతిలో ఒక పూల బొకే రెండొది బాగ్‌లో ఉంది. శేఖర్ ఇంటి తలుపు తట్టాడు. శేఖర్ ప్రపుల్లా లేచివచ్చి కళ్ళునులుముకుంటూ చూవారు తలుపు తీసి.
మాధవయ్య - శతమానం భవతి ! ఇదుగోనమ్మా ప్రపుల్లా ఈ బొకే అందుకోండి ఇద్దరూ సమంగా...
ప్రపుల్ల - గులాబీలు మరువం ఎంత బావున్నాయో....ఇంతకీ ఎందుకూ ?
మాధవయ్య - మిమ్మల్నీ శతమానం భవతి అని దీవించడానికి ఉత్తి చేతుల్తోరాలేక....
ప్రపుల్ల తానింకా బ్రతికే ఉన్నట్లు ఆనందంగా చూసుకుంది.
ప్రపుల్ల - ఆ...నేనింకా బ్రతికే...
అప్పుడే పండు మంచం దిగి వచ్చాడు.
పండు - మమ్మీ దేవుడి దగ్గర్నించి వచ్చేశావా ?
మాధవరావు పక పకా నవ్వాడు.
మాధవయ్య - నిన్న మీకిచ్చిన వన్నీ గార్డినాల్స్ కాదు. ప్రమాదంలేని మాత్రల్లో రెండు గార్డినాల్స్ కలిపా అందుకే మొద్దు నిద్రపోయారు.
శేఖర్....ప్రపుల్లా....ఆ.....ఆ....
శేఖర్ - ఇంతకీ ఆ రెండో బొకే.
మాధవరావు లేచి నుంచుంటాడు.
మాధవయ్య - ఇదీ .... రాఘవకీ, సుశీలకీ ఇయ్యాలి...వాళ్ళ నీ శతమానం భవతి... అని దీవించాలి !
మాధవరావు లేచి వెళ్తుంటే బొమ్మలల్లే చూస్తూ నుంచుంటారు శేఖర్ ప్రపుల్ల... ప్రపుల్ల వచ్చి అతన్ని ఆపి...
ప్రపుల్ల - ఇంతకీ నీకు మా సంగతెలా తెల్సింది.
మాధవరావు బొకెల్లోని పూల వంక చూపిస్తూ.....
మాధవయ్య - ఈ పూలు చెప్పినాయమ్మా. ఈ ప్రపుల్ల తనని తల్లో పెట్టుకోలేదని మల్లెలు బావురుమంటే ఎందుకా అని మిమ్మల్ని పరిశీలించాను. ఇక రాఘవ సుశీల సంగతి సరే సరి...మరి పోయిరానా.
మాధవరావు పాటపాడుకుంటూ వెడతాడు.
పూలబాస తెలుసు ఎంకికీ... మల్లెపూల బాస తెలుసు ...ఎంకికీ....
|