భగవదార్చన పూర్తి అయ్యాక ప్రసాదం స్వీకరించి తన గదిలోకి వెళ్ళి పరధ్యానంలో లోతులకు వెళ్ళిపోయింది జయంతి. ఎంతసేపు అలా శూన్యంగుండా వెళ్ళి సూర్యమండల మద్యస్థ సోమమండల మద్యస్థ అయిన లలితా త్రిపురసుందరీదేవి పాదాలకు హృదయామృతాభిషేకం చేసిందో ఎవరూ గమనించనే లేదు.
ఇంతలో హడావుడిగా కాలిగజ్జలు ఘల్‌ఘల్‌మంటూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఉండగా హంసి పరుగున వచ్చింది. అమ్మమ్మ అమ్మమ్మా అంటూ గొంతును తారాస్థాయికి పెంచి తులపు భళ్ళుని తెరచి లోపలికి అడుగుపెట్టింది. అమ్మమ్మస్థితిని చూసి అవాక్కయి తప్పుచేస్తానన్నట్లుగా నాలుక కరుచుకుంది. అయ్యో పొరపొటున గట్టిగా అరిచాను. అమ్మమ్మ ధ్యానంలో వున్నట్టుంది అనుకుంటూ బొమ్మలాగ నుంచుండిపోయింది. హంసీ ! ఏమిటమ్మా....ఏమిటీ విశేషం ? అంది జయంతి చిరునవ్వు చిందిస్తూ. ఆమె ఎంతసేపు కనులు మూసుకుని ఎంత తీక్షణంగా ధ్యానం చేసిందో గాని కనులు నవవికసిత పద్మదళాలకు మల్లే జాకుసుమ భాసురాలైనాయి. హంసి ఆమెవంక చూస్తూ నిలబడింది. జయంతీ హంసి మిత్ర బృందం వచ్చిందమ్మా అంటూ జయంతి వచ్చింది. హంసిలో చలనం వచ్చింది. ఈ సంగతి చెప్పి నిన్ను హెచ్చరించాలని వచ్చానమ్మమ్మా...అంది హంసి.
ఏయ్ హంసీ అమ్మమ్మగార్ని హెచ్చరించడం ఎందుకే, మేమేం రాక్షసులమా అన్నారు మిత్రులు కలకలా నవ్వుతూ....రాక్షసులా అంతకన్న ఎక్కువే మీ అల్లర్ని వర్ణించడానికి పాత ఉపమానాలు సరిపోవు. కొత్త కాళిదాసు పుట్టుకు రావల్సిందే ! హంసి మాటలకంతా గలగలా నవ్వారు. రండి రండి తల్లులూ మీ కోసమే ఎదురు చూస్తున్నాను ! నాటికి మళ్ళీ నేడు మీ దర్శనం అయ్యింది జయంతి లేచి అందర్నీ ప్రేమతో దగ్గరకు తీసుకుని చేతులు నిమిరి ఆప్యాయంగా దగ్గరగా కూర్చోబెట్టుకుంది. ఆమె ప్రేమ గాయత్రికీ, వేదవతికీ కొత్తకాదు కాని కొత్తగా వచ్చిన శైలజా, సుమనా ఆమె ప్రేమకు కదిలిపోయారు. మనసు ఆర్ధ్రంకాగా రవ్వంత తడి కన్నుల్లో మెరిసింది. అమ్మమ్మగారూ...గాయత్రీ మీరందరు కూడా చక్కగా హంసిలా అమ్మమ్మా అని పిలవొచ్చు, మన మధ్య మర్యాదలూ మన్నింపులూ ఏం వద్దు. ప్రశాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకుందాం. మన మధ్య అడ్డుగోడల్లాంటి ఏ మర్యాదలూ వద్దు. ముందు జయతి చేసిన కమ్మని పులిహార తిని రండి, తరువాత మాట్లాడుకుందాం. బిలబిలమంటూ అందరూ వంటిట్లోకి వెళ్ళిపోయారు. హంసి వెనక్కి వచ్చి అమ్మమ్మ చెయ్యిపుచ్చుకుని అమ్మమ్మా ధ్యానం చేస్తే కళ్ళు ఎఱ్ఱబడతాయా ? అంది. హంసీ ! ధ్యానం అంటే కళ్ళతోనే, కాళ్ళతోనే చేసింది కాదమ్మా, మనసుతోటీ, హృదయంతోటీ ఆత్మను పరమాత్మతో కలిపేందుకు చేసే ప్రయత్నమమ్మా అంది. మరి అయితే ఇందాక నువ్వు ధ్యానం చేసి కళ్ళు తెరచినప్పుడు నీ కళ్ళు ఎఱ్ఱగా మెరిసిపోయాయి అంది హంసి. ఈ కళ్ళు దేవతల ఆలయానికి లోగిళ్ళు. ఈ కళ్ళు కైవల్యబాలకు మెత్తని పొత్తిళ్ళు. ఈ కళ్ళు సత్యశోధనకై రగులు నెగళ్ళు ! అని ఒక భక్త మహాకవి చెప్పాడు. అలాగే భగవంతుడు కళ్ళకు పెద్దవనే పెట్టాడు. వాటి ద్వారానే లోపలికి వెళ్ళేది జయంతి మాటలకు హంసి తికమక పడింది. అమ్మమ్మా వీళ్ళకు నీ మాటలు బాగా నచ్చాయిట ! రోజూ మళ్ళీ ఎప్పుడు రామే అని నన్ను వేపుకు తింటుంటే ఇవాళ రేపు అని తప్పించుకుంటున్నాను. కానీ వీళ్ళు చెప్పాపెట్టకుండా మనింటిమీదికి దండయాత్రకు వచ్చినట్లు ఎంతమంది వచ్చేశారో చూశావా ? జయంతి నవ్వుతూ చూసింది.
ప్రసాదం తిని మంచినీళ్ళు త్రాగి అందరూ జయంతి దగ్గరకు వచ్చేశారు. ఈ ప్రజ్ఞమొన్న ఏడ్చింది అమ్మమ్మగారూ అంది గాయత్రి. జయంతి ప్రజ్ఞ చేతిని తన చేతిలోకి తీసుకుని నవ్వుతూ చూసింది. అవునా ? ప‌్రజ్ఞా నువ్వు ఏడవడమా ? ప‌్రజ్ఞ ఎప్పుడూ తల ఎత్తుకునే తిరుగుతుంది. తిక్కన్నగారు నిన్ను గురించి ఏమని చెప్పారో తెలుసా ? అంది జయంతి. తిక్కన్నగారా ? నా గురించి చెప్పారా ? ఆయనికి నా గురించేం తెలుసు ? అంది ప్రజ్ఞ అమాయకంగా. అందరూ గట్టిగా నవ్వారు. అమ్మమ్మ తనని ఎక్కిరిస్తోందనుకుని ప్రజ్ఞ మూతి ముడుచుకుంది. అలా ఉడుక్కోకురా తల్లీ ప్రజ్ఞయె ప్రతిష్ఠ, లాభము అన్నారు. ప్రజ్ఞే ఆనందం అన్నారు. అంతేకాదు కైవల్యం సంపాదించాలన్న నువ్వు వుండాలట. అంటే ప్రజ్ఞ వుండాలట. అదీ ఇదీ కాదు ఆఖరికి చాలా పెద్దమాటే వాడారు. ప్రజ్ఞా సాధ్యములుగాని పనులుం గలవే అని. అసలు నీ వల్లకాని పనే లేదుట. జయంతి మాటలకి ప్రజ్ఞ గర్వంగా చూసింది చిరునవ్వుతో ! ఆ ఆ....అంత పొంగిపోకు, తల్లీ పేనులోవున్న అర్థాలన్నీ యదార్థాలవుతే ప్రతి వాళ్ళ ఇల్లూ స్వర్గం అయిపోదూ. మా అమ్మపేరు మహాలక్ష్మి. మీకందరికీ తెలుసు మేమెంత ఐశ్వర్యంతో తులతూగిపోతున్నామో అంది సంధ్య. అందరి సంగతీ ఏమోగాని నీ పేరు నూటికి నూరుపాళ్ళూ నిజమే అంది సావిత్రి. ఏం ఎందుకని సంధ్య నిగ్గదీసింది. ఎప్పుడూ తుమ్మల్లో పొద్దుకుంకుతున్నట్లు ధుమధుమలాడుతూ ఓ కళాకాంతీ లేకుండా వుంటావు. సంధ్యాకాలం అంటే వెలుగు పూర్తిగా వచ్చీరాని ఉదయం. వెలుగును వెంటబెట్టుకుని వెళ్ళిపోతున్న సాయంత్రం ! సావిత్రీ నన్ను తిట్టావంటే జాగ్రత్త. నీకు అల్పాయుష్షు..... ఛఛ తప్పమ్మా, హాస్యం శృతి మించకూడదు, జయంతి వారించింది.
సరే ఆంటీ ! క్రిందటిసారి చెప్పిన పౌండ్రకుడి కథ మాకు బాగా బుఱ్ఱకెక్కింది. మా తమ్ముడికి, చెల్లాయికి కూడా చెప్పాను. జయంతి ప్రక్కనే వున్న పుస్తకం తీసి చూసింది వనిత. వనితా నీకు భలే పేరు పెట్టారే మీ వాళ్ళు. నువ్వు పుట్టగానే మీ వాళ్ళకేమైనా అనుమానం వచ్చిందేమో ? అందరూ నవ్వారు వందన మాటలకి. వనితకు కోపం వచ్చింది. ఛీ ఛీ అందేంకాదు, బందర్లో మా ఇంటి దగ్గర్లో వనమలమ్మ అనే గ్రామ దేవత వుంది. ఆ దేవత సంబరాలు జరుగుతుండగా నేను పుట్టాను. అందుకే వన అనే అక్షరాలతో వనిత అనే పేరు పెట్టారు. ఓహో ! ఇది గ్రామదేవతే బాబూ ! దీంతో జాగ్రత్తగా వుండాలి ! లేకపోతే పుంజులు కావాలంటుంది. బలీ.....బలీ.....గొంతు వణికించంది వందన.
జయంతి కల్పించుకుని ఇక పేర్ల సంగతి ప్రక్కన పెట్టి మనం మంచి విషయాల గురించి చెప్పుకుందాం అంది. మీరు చెప్పేముందు నాదొక అనుమానం తీర్చాలి అమ్మమ్మా. ఏమిటమ్మా అది అంది జయంతి. ఈ పూజలూ వ్రతాలూ చేస్తే ఏమిటి ఫలితం ? చాలామంది స్వర్గంకోసం యజ్ఞాలు చేస్తారని విన్నాను. అసలు స్వర్గం నరకం ఉందా, పాపం పుణ్యం అంటే ఏమిటో నాకర్థం కాదు అంది గాయత్రి. జయంతి చక్కని రాగంతో పద్యమూ వచనమూ కలిపి చెప్పింది.
హస్తి మశకాంతరము గల దరశి చూడ
వాస, గృహ, శయన, ఆసన, వసన, గంధమాల్య
తౌర్యత్రికారామ, మానవీ, జన, సుఖ సాధనములకు అందు ఇందు భేదమెంతో కలదు, స్వర్గం స్వర్గమే భూలోకం భూలోకమే నరకం నరకమే.
ఇందుకు మన పెద్దలు చెప్పనే చెప్పారు కదా. పరోపకారమే పుణ్యమనీ పరులను పీడించమే పాపమనీ ! పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో పీడిస్తుందంటారు జయంతి మాటలకు వందన అడ్డుపడింది. కాలానుగుణంగా ఆచారవ్యవహారాలు మారుతూ ఉంటాయికదా. ఒకప్పుడు తప్పు అయినది కొంతకాలమైనాక ఒప్పుగా మారొచ్చునుకదా ! అలాంటప్పుడు పాపపుణ్యాలను ఎలా తెలుసుకోడం ? అంది. భారతంలో ఒక చక్కని పద్యం వుంది. ఎదుటివారు ఏమిచేస్తే నీకు కోపం వచ్చి బాధ కలిగి అప్రియంగా భావిస్తావో అలాంటి పని లేదా అలాంటి మాట నీవు ఇంకొకరిపట్ల ప్రయోగించకు ! అలాగే నీవు ఏ పనికి ఆనందం పొందగల్గుతావో ఆ పనిచేసి ఎదుటవారిని నీవూ ఆనందపరచు అని. ఇదేమీ మీ కర్థంకానట్లు మీ ముఖాలు చెప్తున్నాయి. ఇంకా సులభమైన భాషలో చెప్పాను. ఎవరినీ దుఃఖపెట్టకు. చేతనయితే ఆనందపరచు ! ఇదిరా అమ్మలూ ! పాపపుణ్యాల త్రాసు ! ధర్మం ధర్మం ధర్మం అంటూ మన పురాణాలు ఇతిహాసాలు అక్షరంగా మారుమ్రోగిపోతున్నాయి. శ్రీరామచంద్రుడు మూర్తీభవించిన ధర్మతేజమే. ఇక ఈ ధర్మాల్లో ధర్మసూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. వాటిని విశదంగా అర్థం చేసుకోవాలేగాని ఆవేశంతో విమర్శించకూడదు. అమ్మమ్మా మరి మేం వెళ్ళిరామా ? రామా రామా అంటారుగాని రారు జయంతి మాటలకు నవ్వారు. ఈ సారి మీ తమ్ముళ్ళును అన్నలను కూడా తీసుకురండి. లేకపోతే నన్ను స్త్రీ జన పక్షపాతి నంటున్నారు. అలాగేనని చెప్పి అందరూ లేచారు. అందరిచేత జయంతి జయఘెష చేయించింది. పులకిత హృదయాలతో -
శ్రీ రాజరాజేశ్వరీ మాతకూ జై ! మౌనానంద స్వామికీ జై !
శ్రీ శివచిదానంద భారతీస్వామికీ జై !!
అన్నారంతా.
|