మణిదీపాల వెలుగు దేదీస్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. ప్రభువులు శుకవాణి దేవిని చిరునవ్వుతో పరికించి, వీణాసనము ఉన్న ప్రదేశానికి నడచి, పీఠిక నధిరోహించి, వీణెను మీటసాగినారు. ప్రభువులు చేతిలో వీణ ఎలా పలకమన్న అలా పలుకుతూ ఉన్నది. ప్రభువుల శుకవాణి చిలిపిగా చూస్తూ రాగము మార్చి ఇంకొక గీతికను వాయించసాగినారు.
శుకవాణి కనులు పెద్దవై విచ్చుకొన్నవి. ఆనాడు ప్రభువులను తాను ఈ పాటనే కాదా, పాడి చిన్న బుచ్చినది ? ఆ పాట వారి గుండెలలో ఇంకనూ మార మ్రోగుతూనే ఉన్నదనడానికి ఆనవాలు ఆ కొంటె పాటను ప్రభువులు కోనగోటితో ధ్వనింపజేయడమే !
కోతి బావాగారు కులుకూతు వచ్చారు
కొమ్మలంతా రారే సేవచేతాము.
ప్రభూ ! ప్రభూ మన్నించండి...తెలియక తప్పు చేశాను. శుకవాణి యువప్రభువుల చెంత చేతులు మోడ్చి లోస్వరాన కలవరించినది.
ఓసి చెంచితా ! నరసింహ దేవుని వశం చేసుకున్న చెంచులక్ష్మి దేవికి వచ్చినన్ని మాయలూ మంత్రాలూ నీకు వచ్చునా ?
ప్రభూ ! ప్రభూ ! అదేమిమాట !
శ్రీ మహాలక్ష్మీదేవి, బ్రహ్మరుద్రాదులూ సంస్కృత శ్లోకాలలో విన్నపాలు చేస్తే శాంతించిన విష్ణుమూర్తి, ఒక అడవిపిల్ల కోయపాటలు పాడితే ఛీ ! ఫో అనినా వెంటపడి వెళ్ళాడుట ! అలాగే నీ కొంటె పాటలు వినడానికి నా మనస్సు నిత్యం ఉవ్విళ్ళూరుతూ ఉరకులువేస్తూ ఉన్నది.
నేను అడవిపిల్లను కాను, ప్రభూ ! అన్నది శుకవాణి చిరుకోపంతో.
మూర్తెప్ప నాయకులవారు చిన్న పూల అడవిని పెంచుతున్నారు కారా ? ఆ చిట్టడివిలో జంతువులు లేవన్న మాటేగాని వనదేవతలా శుకవాణీ దేవీగారు చరిస్తూ ఉండరా ? ఏం ?
ప్రభూ ! ప్రభూ ! తప్పే చేసినానని ఒప్పుకొంటూ క్షమాపరణలు అర్ధించుకొన్నక కూడ నిష్ఠూరములు పలకడం మానరా ?
వాణీ ! వీణాపాణీ ! మధుర మంజుల మనోజ్ఞ వాణి ! శుకవాణీ ! నీవానాడు ఆలపించిన గేయానకు కోపించుకొనేటంతటి అరసికుడనని నీవు భావిస్తూ ఉన్నావా ? అంటూ శుకవాణి బేడిన కనులలోనికి ప్రేమైక దృక్కులతో చూస్తూ, చుబుకొన్ని అలవోకగా స్పృశించినాడు.
ప్రభూ ! ఆనాడు...మీ కనులలో...ఆగ్రహం...!
రఘునాథ నాయనిం వారు హేలగా నవ్వినారు.
అప్పుడు, శ్రీ మద్రామాయణ మహాకావ్యానికి అక్షర రూపాన్నిచ్చిన ఆదికవి, వాల్మీకి జీవితాన్ని కావ్యంగా సృష్టించవలెననే సంకల్పంతో కొండ కోనలలో నివసించే శబరుల జీవితాలను అతి దగ్గరగా పరిశీలించే ప్రయత్నంలో ! లీలావేషాన వారితో కలసి మెలసి తిరిగాను. ప్రకృతి బిడ్డల స్వేచ్ఛా జీవితం, పాలపిట్టలలా ఎగిరిపోయే వారి స్వేచ్ఛ, చిత్తమొచ్చిన రీతిలో వేగంగా పరుగెత్తి ప్రవహించే నీలనదులలా, చక్రవాకాలలా జంటకోసం అలమటిస్తూ, చాతకాలులా వెన్నెలలను భోజనం చేస్తూ, సద్యోమధువును భ్రమరాలులా గ్రోలుతూ, ఒకరినొకరు మాయా మర్మాన్నెరుగని హృదయాలలో, ప్రణయ వారాసిలోని తుది మొదలులను కొలవగలిగే ఆ నిషదుల జీవితాలను చూచి మాత్సర్యం చెందాను. గురుదేవులు చెంచులక్ష్మీ అని నిన్ను పిలిచినప్పుడు, అది ఇది అని తెలియరాకుండా మనోవీణ, ? ఝమ్మన్నది. బృహదీశ్వరాలయాన నీ నాట్య సందర్శనం రూపుదాల్చని తీయని భావానికి స్పందన, ప్రణయరాగాలాపనకు అదే తొలిశ్రుతి. నీకొంటె కోణంగి పాటలు, నాలోని ప్రణయ సముద్రం ఉప్పొంగి ఉత్తుంగ తరంగయై నన్ను కదల్చివేయడమేగాక, వేయి బాహువులతో నిన్ను పొదవుకొమ్మని నన్ను ఉద్వేగపరచినది. ఆ క్షణమే ఆ తావును వదలి వడివడిగా వెడలి పోయినాను. ప్రకాశమానమైన నీవైదుష్యానికి, శేముషిత్వానికీ, ప్రతిభా వైదగ్ధ్యానికీ నేనెంతగా పరవశుడైనానంటే, ఇక నాకంటూ ఏమీ మిగలక, నాలోని ప్రత్యణువునూ నీకు కైంకర్యం చేయాలనే మహాతపన, నన్ను విలువనీయకుండా చేసినది.
రఘునాథ యువప్రభువులు తమ హృదయాన్ని శుకవాణి దేవికి విశదపరచిరి. శుకవాణి పెదవి కదుపలేక రెప్పవేయలేక, విరిసిన దిరసెన పూల వంటి కనులతో, విస్తుపోతూ చూచినది. ఆమె హ్రీస్పందిత హృదయం నుండి ప్రభూ ! ప్రభూ ! నా స్థితి కూడా అట్టిదే ! అన్న ఆలాపన ఆమె కంఠ కుహరాన్ని దాటి వెలుపలికి రాకపోయినది. |