రఘు : నీవు తెచ్చినది నిజము శుభవార్త ! ఈ పచ్చలహారము నీకు బహుమానము.
కుమార : మహాప్రసాదము. ప్రభువుల శాంతికామన జగద్విదితము.
రఘు : ఇలాగ జరిగినట్లయిన యుధ్దమక్కరలేదు. రక్తపాతము, ధననష్టము, ప్రాణ నష్టము పరిహరింపబడతాయి. ముత్తు వీరప్ప నాయనింవారు తుదిక్షణాలలో తప్పు తెలిసికొనినట్లున్నారు.
కుమార : చిత్తం
రఘు : యుద్ధం మాగిపోయినది. తిరుగుబాటుదారులు తప్పు తెలుసుకొన్నారు. తెల్లవారుతూనే తిరిగి అందరము తంజపురికి వెడలి పోవుచున్నామని సర్వసైన్యాన్ని హెచ్చరించండి ! రఘునాథుడు లేచి నిలబడినారు.
రెండు ఘడియల పిమ్మట కుమారనాథుడూ మరికొంతమంది గూఢచారులూ బందీలై యువరాజు మొదుట తలవాల్చుకొని ప్రాణభయంతో నిలచిరాయెను.
మధురనాయకుని ప్రముణ గూఢచారి సర్వప్పకు కుమారనాధుడు వేలు విడిచిన మేనల్లుడు. తంజపుర యువరాజు యుద్ధసన్నద్ధుడై బయలుదేరెనన్న వార్తవిని గుండెలదరగా రఘునాధుని గమ్యస్థానము చేరనీయకుండ వివిధములైన ఆటంకములు కలుగజేయవలసినదిగా సర్వప్పను మధురనాయకుడా దేశించెను. ప్రథమ ప్రయత్నముగా సర్వస్ప తన మేనల్లుడితో అట్లాయసత్య వార్తలను పంపించినాడు.
కుమారనాథుడు తెచ్చిన వార్తలను వినగానే యువరాజు సంశయగ్రస్తులైనారన్నది యదార్థము. నమ్మకుండుటకు యెట్టి హేతువు అగుపడలేదు. కాని, అతడు సమాధానములు చెప్పుచున్నప్పుడు ప్రక్క చూపులు చూచుచు మాటాడెనేగాని ప్రభువుల వైపు చూచి మాటాడలేదు. ప్రక్కచూపులు చూచెడి గూఢచారి మనసు రాజభక్తి పూరితముగ నుండదనీ, దుష్టత్వము కలిగియుండవచ్చుననీ, యువరాజుల నమ్మిక. మోసము ఉండవచ్చునని యూహించిన ప్రభువు, యుద్ధమాగిపోయినట్లు బహిరంగముగా ప్రకటించినప్పటికినీ, కుమారనాథునీ అతని అనుచరులనూ కనిపెట్టి యుండవలసినదిగా చంద్రశేఖర భట్టారకుని నియమించినారు.
తాను తెచ్చిన వార్తను యువరాజు వెంటనే నమ్మెనని భ్రమించి కుమారనాధుడు, తన మేనమామకును, మరికొంతమంది తిరుగుబాటుదార్లకును తన యనుచరులచేత వార్తను పంపుటకు సన్నద్ధుడాయెను. వారందరు ఏదో మిషపెట్టి గుడారములను వదలి వేగాశ్వములపై పొలిమేరను దాటగనే అంతకు క్రితమే ఇట్లు జరుగునని యూహించి కాపువేసిన సైనికులు వారిని చుట్టుముట్టి బంధించిరి.
చంద్రశేఖర భట్టారకుడు :
యువరాజా ! మన సైన్యములోనిట్టి ద్రోహులున్నారని ఇంతవరకు నేనూహింపలేదు. ఇట్టి విద్రోహులతో నిండియున్న మన రాజ్యాంగము వ్యాధిగ్రస్తమైన శరీరమువంటిదైనది. వ్యాధిని వెంటనే శస్త్రచికిత్స చేసి నిర్మూలింపనిచో మొదటికే మోసము వచ్చును. ఇటువంటి రాజద్రోహులను ఏరిపారవేయుటకు అనుజ్ఞ వేడుకొనుచున్నాను.
రఘునాథులు చిరునవ్వు నవ్వినారు. భట్టరకా ! మీరు చెప్పినది నిజమే. మన భటుల గుణగణమలును వాని చర్యలను బట్టి ముఖకళవళికలను బట్టి, వాచకమును బట్టి, అతడు సజ్జనుడా లేక తేనెపూసిన కత్తియా, అమాయకుడా లేక ద్రోహబుద్ధియా అన్నది మనమే నిర్ణయించుకొనవలయును. ఇక అనుమానాస్పదుని చర్యలను పరిశోధించిగాని వానిని నిర్మూలించరాదు. గూఢచారులను వేయికనులతో కనిపెట్టి యుండవలెను. వారు తెచ్చిన వార్తలలోని నిజానిజములు గ్రహించుట మాత్రమే చాలదు. మనరాజ్య వ్యవహారములను ఎవరుగాని పరరాజున కందించకుండ మనమే కనిపెట్టి యుండవలెను. రహస్య విషయములు ముఖ్యాదికారుల మధ్య నుండి బయటికి రాకుండా కట్టుదిట్టము చేయుట అత్యవసరమైన కార్యము. కేవలం పొట్టకూటికై మాటలను ప్రోగుచేసికొను సామాన్య చారులపై మీ బలము చూపించరాదు. అని ఆదేశించినారు. చంద్రశేఖరుడు రఘునాథుని చాతుర్యమునకు ముగ్దుడాయెను. కుమారనాధాదులను కారాగారంలో నిర్భంధింపనాజ్ఞ యిచ్చి వెడలిపోయెను.
రాణివాసపు స్త్రీలు కొందరు యువరాజును కలిసికొన వేడుచున్నా రన్న వార్తను ప్రతీహారి తెచ్చినాడు. వారు చెంజి దుర్గాధిపతి కృష్ణప్ప నాయకులవారి రాణులు. రఘునాధుని ధైర్యసాహసములను, దయాగుణ సంపన్నతను విని తమకాతడు ప్రాణభిక్ష పెట్టునన్న గంపెడాశతో అనేక ప్రయాసలకోర్చి తంజపురమునకు బయలుదేరినారు. ఇంతలో రఘునాథ ప్రభువు యుద్ధసన్నద్ధుడై చంద్రగిరిలో విడిదిచేసెనని తెలిసికొని యుద్ధ శిబిరములకే హుటాహుటిన విచ్చేసినారు. |