17
 

కుమారుని విజ‌య ప‌రంప‌ర‌ను వినుచున్న అచ్యుతనాయ‌నింవారి యానంద‌మింతింయ‌ని చెప్ప‌న‌ల‌వికాదు. మహారాజులు మ‌హామంత్రులు స‌క‌ల ప్ర‌జానీక‌ము ర‌ఘునాథునికై ఎదురు చూచుచున్నారు.

అచ్యుత నాయనంవారు యువ‌రాజుల‌ను బిగియార‌కౌగ‌లించుకొన్నారు. ఆనంద‌భాష్ప‌ములు వారి క‌నుల నిండుగా త‌ళ‌త‌ళ‌లాడిన‌వి.

అచ్యుత : నాయ‌నా ! నాడు నిన్ను శ‌త్రువులు బంధించార‌నివిని ఎంత బాధ‌ప‌డ్డానో, నేడు శ‌త్రుచ్ఛ‌ద‌ము చేసి వ‌చ్చిన నిన్ను చూసి అంత‌కు మూడింత‌లుగా మురిపోతున్నాను. ఇక నీకు అంతా మంచికాల‌మేన‌నీ, ఉన్న చెడుకాల‌మానాటితో చెల్లిపోయింద‌నీ మహామంత్రులు సెల‌విచ్చారు.

ర‌ఘు : నాన్న‌గారూ ! మ‌న్నారు ప్ర‌భువుల‌ను సేవించ‌డానికీ, గురుదేవుల‌ను ద‌ర్శించ‌డానికీ ఉద‌య‌మే బ‌య‌లుదేర‌తాను.

అచ్యుత : తండ్రీ ! విజ‌య‌ల‌క్ష్మితో నీవు వ‌స్తావ‌ని గురువులు ఎప్పుడూ అంటూనే ఉన్నారు. రేపు నీవు ఊరేగింపుగా, పువీధుల గుండా సంచ‌రించ‌వ‌ల‌సి వుంది. మ‌న ప్ర‌జ‌లంద‌రూ నీ రాక‌కై క‌నుల‌కాయ‌లు కాయున‌ట్లు ఎదురుచూస్తూ ఉన్నారు. పెద్ద‌వారి దీవెన‌లు, ముత్త‌యిదువుల చేతి అక్ష‌త‌లు నీకు శుభ‌దాయ‌క‌ములు.

ర‌ఘు : అలాగే నాన్న‌గారూ !

యువ‌రాజు శ్వేత‌గ‌జ‌ము న‌దిరోహించినాడు. వారిది స్వ‌చ్ఛ‌హృద‌య‌ము. వారికి శ్వేత‌వ‌ర్ణ‌ము ప్రియ‌ము. మ‌ద‌గ‌జ‌మును చక్క‌గా అంలంక‌రించారు. దాని తెల్ల‌ని మొగ‌మున ఎఱ్ఱ‌ని నామ‌ము దిద్దారు. ఇంద్ర‌నీలాలు త‌ళుకు వ‌జ్రాల‌తో చేసిన త‌ల‌మాళిగ‌లు ధ‌రింప‌జేశారు. తెలివెన్నెల‌ను మ‌ర‌పించు ముత్తెపుస‌రులు, మిన‌కు మినుకుమ‌ను చెవుల‌జాలులు, పుష్య‌రాగ‌ముత‌లో ఫాల‌ము నుండి న‌డుము వ‌ర‌కు మ‌ల‌చిన గంట‌ల‌బారు. హురుమంజి ముత్యాలు వైడూర్య‌పు మెడ‌గంట గొలుసు. ర‌త‌నాల పిన‌మించు ర‌వ‌ల‌యందియ‌లు. మెరుగుల‌ను వ‌ట్టువ‌స్త్ర‌ము రంగుగా న‌మ‌ర్చినారు. ఇంత చ‌క్క‌గా న‌లంక‌రించిన రామ‌భ‌ద్ర‌య‌న్న దంతావ‌ళ‌మును శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ ప్ర‌భువుల‌వారు అధివ‌సించి ఉన్నారు.

సంగీతనాట్య గురువు, వేద వేదాంగ వేత్త దార్శ‌నిక సాహిత్యాది, విద్య‌ల గురువ‌గు మ‌హ‌ర్షి గోవిద దీక్షిత మ‌హామంత్రి దేశికుల ప్రాసాదం ద‌గ్గ‌ర‌గా పోయిమ్మ‌ని యువ‌రాజులంవారు ఆజ్ఞ ద‌య‌చేసి ఉండిరి. ఆ కార‌ణం చేత‌, ప‌ట్ట‌పుటేనుగ కొమ‌రుడైన యువ‌రాజులం వారి మ‌ద‌గ‌జ‌రాజును, మావ‌టీడు ప్రాసాదానికి ద‌గ్గ‌ర‌గా, ఎదుట‌గా ఆపుచేసినాడు.

ఉత్స‌వ‌ము ఎక్క‌డిద‌క్క‌డ ఆగిన‌ది. కాని నాద‌స్వ‌ర నాయ‌కులు, నృత్య‌మేళాలు, భ‌జ‌న‌నాండ్రు వేద‌త్ర‌యీ పాఠకులు, కావ‌టి చిందుల‌వారు, వేషాల‌వారు, బుట్ట‌బొమ్మ‌ల‌వారు సాముగ‌రిడీల‌వారు, విజ‌య దుందుభీ కాహ‌ళాది వాద్య‌ములు త‌మ త‌మ క‌ళాప్ర‌తిభ మ‌హాశేముషీ సంప‌న్న‌తతో చూపిస్తూ ఉండిరి.

బ్ర‌హ్మ‌ణ్య శ్రేష్ఠ గోవింద‌ముఖి దీక్షిత విద్యాసాగ‌రుని ప్రాసాద ప్రాంగ‌ణ‌పు ఉప్ప‌రిగ‌పైన గురుప‌త్ని, వారి కొమ‌రిత‌లు, చుట్టాలు, ముత్త‌యిదువులు ఎంతోమంది చేరి ఉండిరి. హార‌తులు ప‌ట్టి వారంద‌రూ,

మ‌హారాజు ర‌ఘునాధ వీరున‌కు మంగాళం !
బ‌హు శత్రు మ‌త్తేభ కుంభ విదారిత‌
ఖ‌డ్గ న‌ఖికేస‌రి రూప విహారున‌కూ
మంగాళం ! మంగాళం !

అని మ‌ధుర కంఠాన పాడి అక్క‌డ ఉండే ఆ ఆర‌తిప‌ళ్లేల తిప్పి అక్ష‌త‌లు పూవులు యువ‌రాజుపై చ‌ల్లినారు.

ర‌ఘునాథ నాయ‌కులు చిరున‌వ్వుతో వెలిగిపొవ ఉప్ప‌రిగ స‌మీపించ‌గానే గురుప‌త్నికి త‌ల‌వంచి ద్విప‌తాక సంయుక్త వంద‌న హ‌స్త‌ద్వ‌యం నుదుటికి చేర్చి త‌ల‌వంచి న‌మ‌స్క‌రించినాడు.

అప్పుడే ఆ న‌వ‌యువ‌కుని చూపులు ఆమెకు ఇంచుక దూరంలో స‌మ‌వ‌య‌స్కుల‌గు మూవురు బాలిక‌లు నీరాజ‌న‌పు బంగారు ప‌ళ్ళెరంబట్టి ఉన్న‌వారిలో మ‌ధ్య నిలుచున్న పుత్త‌డి బొమ్మ‌పై ప్ర‌స‌రించిన‌వి.

ఆ చూపులు పూవుల‌పై వాలిన తుమ్మెద‌లైన‌వి.

ఆ చూపులు చంద్రోప‌ల వెలిగిస్తూ వాలిన చంద్ర‌కిర‌ణాలైన‌వి.

ఆ చూపులు ర‌స‌జ్ఞ శేఖ‌రుని క‌ర్ణాల మ‌ధుర స్వ‌ర‌యుక్త రాగ‌మాలిక‌లైన‌వి.

ఆమె క‌నురెప్ప‌లు సిగ్గుతో ఒక నిమేష‌ము రెప‌రెప‌లాడి క్రింద‌కు వాలిపోయిన‌వి. ఆమె మోము కెంపులు వారిన‌ది. ర‌ఘునాధ‌కుమార నాయ‌క యువ‌రాజు చూపులా బాలిక ప‌ర‌మ సౌంద‌ర్య వికాసిత వ‌ద‌న‌ము చూచి సంభ్ర‌మ‌మందిన‌వి.

న‌వ యౌవ‌న విల‌సితుడా బాలుని చూపులా బాలికా కోమ‌ల నాగ‌వ‌ల్లీ ప‌త్ర‌ఫాలంపై ప్ర‌స‌రించి ప్రేంఖ‌ణితాలైన‌వి.
శృంగార క‌ల‌శ పార‌వార వీచికాస్నాతుడ‌వుతూ ఉన్న ఆ గోవింద మ‌ఖివాగ్గేయ‌కార‌భూష‌ణ శిష్యుని చూపులా బాలిక చ‌తుర్ద‌శ క‌న‌క‌జ పాకుట్మ‌ల నాసిక‌పై వాలి స్పృశించి పుల‌క‌రించిపోయిన‌వి.