2
 

వీణా వేణు మృదంగ‌నాదములు గాయ‌ని యొక్క మంజుల గాత్ర‌మున‌కు శోభ‌నినుమ‌డింప చేస్తూండ‌గా ప్రేక్ష‌కులు ర‌స స‌ముద్ర‌ములో నీదు లాడుచున్న‌ట్లుగా, క్షీర‌సాగ‌ర త‌రంగ‌ముల‌పై తేలియాడుచున్న‌ట్లుగా భావ‌న క‌లిగి ప‌ర‌మానంద భ‌రితుల‌గుచున్నారు.

వ‌సంత హిందోళ‌ములో జాన‌కీ క‌ళ్యాణ‌ము సాగిపోయిన‌ది. కోదండ రాముడు జాన‌కీదేవి పాణిగ్ర‌హ‌ణ మ‌హొత్స‌వ శుభ సంద‌ర్భ‌మున కాత్ర‌ప‌డుచు శివ‌ధ‌నుర్భంగ‌ము గావివంచుట‌కు విల్లును ప‌ట్టి క‌డ‌గంటివ‌ర‌కు లాగి ఎక్కు పెట్టుచున్నాడు. న‌ర్త‌కి క‌ట‌కాముఖ‌పాణియైన‌ది. ఆమెన‌ఖాగ్ర‌ముల పైనా క‌డ‌గంటి చూపుల మిణుకులాత‌ని హృద‌య‌మును ప‌ట్టియానిన‌వి. పంచ‌బాణుడు త‌న కుసుమాస్త్ర‌ము నొక్క‌మారు ఎక్కు పెట్టినప్పుడు తుమ్మెద‌ల‌న్నియు ఝుమ్మ‌ని రొద‌చేసిన‌ట్లుగా క‌ళ‌వెళ‌ప‌డిన‌దాయువ‌కునియెద‌.

పెళ్లున విల్లువిరిగిన‌ది, జాన‌కీదేవి హృద‌య‌ము సంభ్ర‌మానంద‌ముల‌తో పుల‌కించిపోయిన‌ది. ఆమె హంస‌ప‌క్ష‌ము న‌భిన‌యించి, స్తంభ‌మును రోమాంచ‌మును విభ్ర‌మ‌విశేష‌మును సూచించి ల‌జ్జాతిరేక‌మున ఆర‌విరిసిన ప‌ద్మోత్ప‌ల‌మై ముకుళిత‌హ‌స్త‌యై సిగ్గుల మొగ్గ‌యైన‌ది. చిదంబ‌ర దేవాల‌య కుడ్య‌స్థ‌యైన శిల్ప‌ల‌క్ష్మి నేడీ నాట్య‌ల‌క్ష్మియ‌యి మూర్తించిన‌ట్లున్న‌ది.

న‌ర్త‌కి మ‌ర‌ల రాధ‌యైయిన‌ది. కృష్ణ‌మూర్తి యామెకు సంకేత‌మిచ్చినాడు. మాల‌తీవ‌ల‌మున‌నున్న మాధ‌వీనికుంజచ్ఛాయ‌లో నీ ద‌శ‌మి వెన్నెల‌లో స్నాన‌మాడుద‌మ‌ని పిలిచినాడు. రాధ తెలివ‌లిపెములు క‌ట్టి వెండి బ‌డ్డాణ‌ము, శంఖ‌హార‌ములు, ముత్తెపు మురువులు ధ‌రించిన‌ది. మొల్ల‌ల‌ను సిగ‌లో ముడిచి సిగ్గుతో ముడుచుకొనిపోతూ వెన్నెల‌కుప్ప‌వ‌లె మెల్ల‌మెల్ల‌న గ‌జ్జ‌ల చ‌ప్పుడు కాకుండ న‌డ‌చి వ‌చ్చిన‌ది. ఏడీ కృష్ణ‌మ్మ ! గుండె నీరైన‌ది. ఆశ‌ల‌న్ని ఇంకిపోగా, మ‌రొక గోపిక‌తో కులుకుతున్నాడేమోన‌న్న అనుమాన‌ముతో, రోష‌క‌షాయిత నేత్రియైన‌ది. తెల‌తెల‌వార‌బోవుచున్న‌ది. ఎదురు చూచిన క్ష‌ణ‌ములు చేజారిన ముత్యాల‌వెల‌కాగా నేమి చేయుట‌కు తోచని ఆ అమాయిక చెట్టునూ గుట్ట‌నూ, పువ్వునూ పుట్ట‌నూ కృష్ణుని జాడ‌చెప్పి పుణ్య‌ము క‌ట్టుకోమ‌ని వేడుకొంటున్న‌ది. సుపోషిణిరాగంలో గేయం హృద్యంగా సాగిపోతూన్న‌ది.

చేయెత్తి మొక్కేను ఓ మ‌ల్లికా
చిన్నికృష్ణ‌మ్మ ఎక్క‌డే సిరిమ‌ల్లికా !

ఆల‌య శిఖ‌ర‌మున‌కు పైగా మేష‌రాశి మెరిసిపోతూ ద‌ర్శ‌న‌మిచ్చిన‌ది. న‌ర్త‌కి మృగ‌శీర్షా హ‌స్త‌మును ప‌ట్టిన‌ది. అత‌డు త‌ల యెత్తి చూచినాడు. ఆమె క‌నులు భార‌ముతో వాలిపోవుచున్న‌వి. అడుగులు ల‌య‌బ‌ద్ధ‌ములుగా త‌డ‌బ‌డుచుండ‌గా ప్ర‌కృతి త‌న దుర‌దృష్ట‌మును చూచి న‌వ్వుచున్న‌ట్లుగా భావించిన‌ది.

ఈ పువ్వు పువ్వు ఇటులేల న‌వ్వు
ఆ కొమ్మ కొమ్మ ఉడికించెన‌మ్మ‌
సుర‌పొన్న లూ సుమ‌పొగ‌డ‌లూ విర‌జాజులూ
న‌నుజూచి మొక్కేను ఓ మ‌ల్లికా
చిన్నికృష్ణ‌మ్మ ఎక్క‌డే సిరిమ‌ల్లికా.

రాధాదేవి ప్ర‌కృతి న‌వ్వుల‌ను ప‌ట్టించుకోడం మానివేసింది. మ‌ద‌న‌తాపం మ‌రిమ‌రి పెరిగిపోయిన‌ది. చంద్రుడూ వెన్నెలా వెగ‌టైపోయిన‌వి. విర‌హాగ్నితో నిలువెల్లా ద‌హించుకుపోతున్న‌ది.

చందురుడు నేడేల వ‌డ‌గాల్పు రువ్వేను
మంచి ముత్తెపుస‌రులు స‌ల‌స‌ల‌కాగేను
చంద‌న‌గంధ‌ములేల పూల‌శ‌య్య‌లు ఏల‌
నా రాజు నా చెంత నిల‌చెనా అదె చాలు.
చేయెత్తి మొక్కేను ఓ మల్లికా
చిన్నికృష్ణ‌మ్మ ఎక్క‌డే సిరిమ‌ల్లికా !

ఈ ముగ్ధ‌బాల విర‌హ‌మునెంత చ‌క్క‌గా మూర్తిక‌ట్టించిన‌ది !

చిన్న బాలిక‌ల‌చేత విర‌హాభిన‌య‌ము చేయించ‌రాద‌ని తాను గురుదేవునితో ఎన్నిమారులు చెప్పినాడు ? చేతులు క‌నులు త్రిప్పినంత మాత్ర‌మున‌, ల‌య‌బ‌ద్ధ‌ముగ ప‌ద‌గ‌తులు ప‌రిఢ‌వించినంత మాత్ర‌మున ప్రేమ‌ర‌స‌మును వారు ప్ర‌త్య‌క్ష‌ము చేయ‌గ‌ల్గుదురా ? వారి క్రీడా ప్రియ‌త్వ‌ము, భావ‌నా శైశ‌వ‌ము అభిసారికా ల‌క్ష‌ణ‌ముల‌కు విరుద్ధ‌ముల‌ని తానెన్ని మారులు అన‌లేదు ? నాయ‌నా ! ప్ర‌తిభావ‌ము బీజ‌రూప‌మున హృద‌య‌మున విక్షిప్త‌మ‌య్యే ఉంటుంది. దానికి వ‌య‌సుతో నిమిత్త‌ములేదు అని గురుదేవుల‌న్న మాట‌ల‌ను ఈ బాలిక నిజ‌ము చేయుచున్న‌ది !