51
 

ల‌క్ష్మ‌ణ మంత్రి నియ‌మం త‌‌ప్ప‌కుండా య‌ధావిధిగా భ‌క్తితో సూర్యోపాస‌న చేసినాడు. ఈ నియ‌మ‌బ‌ద్ధ జీవితం ఆరు నెల‌లు జ‌రిగేసరికి ల‌క్ష్మ‌ణ మంత్రి భార్య సూర‌మాంబ‌, ప్రియురాలు కురంగ‌న‌య‌నా ఇద్ద‌రూ గ‌ర్భ‌ము తాల్చినారు. ల‌క్ష్మ‌ణ మంత్రి ఎన్నో ఉత్స‌వాలు చేయించినారు. భార్య‌కూ ప్రియురాలికీ వేడుక‌లన్నీ చేయించినారు.

ఒక శుభ దినాన భార్యా ప్రియురాలూ ఇద్ద‌రూ సుఖ‌ప్ర‌స‌వ‌మైనారు. భార్య సుర‌మాంబ‌కు బాలిక‌యూ, ప్రియురాలు కురంగ‌న‌య‌న‌కు కొమ‌రుడున్నూ పుట్టినారు. వార‌సుడుగా కొమ‌రుడు పుట్ట‌నందుకు ల‌క్ష్మ‌ణ‌మంత్రి విచారించినాడు. భార్య‌కు కొమ‌రుడు, ప్రియురాలికి కొమ‌రిత క‌లిగి ఉండ‌వ‌ల‌సిన‌ది కాని త‌న విధివ్రాత‌వ‌ల్ల ఈలా తారుమారు అయింద‌ని ల‌క్ష్మ‌ణ మంత్రి త‌ల‌పోసినాడు. అయినా బిడ్డ‌ల‌నిద్ద‌రినీ అతి గారాబంగా పెంచుకుంటున్నాడాత‌డు.

వేంక‌ట‌రాజు, భ్ర‌మ‌రాంబ అల్లారు ముద్దుగా పెరుగుచున్నారు. అన్ని వేడుక‌లూ ఉత్స‌వాలు పిల్ల‌లిద్ద‌రికీ నెర‌పుతున్నాడు. ల‌క్ష్మ‌ణ‌మంత్రి. వారిద్ద‌రూ పుట్టిన మూడేళ్ళ‌కు సూర‌మాంబ‌కు, కురంగ‌న‌య‌న‌కూ మ‌ళ్ళీ క‌డుపులు ఫ‌లించి ఇద్ద‌రికీ కొమ‌ర‌లు క‌లిగినారు. అక్క‌డ నుండి సూర‌మాంబ‌కు ఇక బిడ్డ‌లు క‌లుగ‌లేదు. కాని కురుంగ‌న‌య‌న‌కు వేంక‌ట‌రాజుతో అయిదుగురు కొమ‌రులు ఉద్భ‌వించినారు.

వేంక‌ట‌ప‌తి అని చిరంజీవి వేంక‌ట‌రాజుకు పేరు వ‌చ్చిన‌ది. వేంక‌ట‌ప‌తి నియోగి బ్రాహ్మ‌ణ బాల‌కునివ‌లె పెరిగినాడు. అయిద‌వ‌యేట అక్ష‌రాభ్యాస‌మైన‌ది. చ‌దువు చురుకుగా వ‌స్తున్న‌ది. బాల‌కుడు నిశిత‌మైన మేధ‌క‌ల‌వాడు. స‌ర‌స హృద‌యం క‌ల‌వాడు. సాహిత్యం అంటే ప్రేముడి ఎక్కువ. సంస్కృతంలో అమ‌ర‌ము, శబ్ద‌మంజ‌రి, పంచకావ్యాలు ల‌క్ష్మ‌ణ‌మంత్రి కొమ‌రునకు బోధించినాడు.

న‌న్నెచోడుని కూమార సంభ‌వ‌ము క‌విత్ర‌యం వారి సంపూర్ణ భార‌ము సోమ‌నాథుని పండితారాధ్య చరిత్ర‌ము, బ‌స‌వ పురాణ‌ము, తిక్క‌న నిర్వ‌చ‌నోత్త‌ర రామాయ‌ణ‌ము, కేత‌న‌ద‌శ కుమార చ‌రిత్ర‌ము, గోన బుద్ధారెడ్డి రంగనాధ‌ రామాయ‌ణ‌ము, శివ‌దేశికుల శివ‌నీతిసార‌ము, మార‌న మ‌ర్కండేయ పురాణ‌ము ఎఱ్ఱాప్రెగ‌డ హ‌రివంశ నృసింహ పురాణాలు, హుళ‌ర్కి భాస్క‌ర రామాయ‌ణ‌ము, మంచెన కేయూర బాహు చ‌రిత్ర‌ము, నాచ‌న‌సోముని ఉత్త‌ర‌హ‌రి వంశ‌ము, వేముల‌వాడ భీమ‌క‌వి క‌విజాశ్ర‌య‌ము, రావిపాటి తిప్ప‌న చంద్ర తారావ‌ళీ మ‌ద‌న విజ‌యం, శ్రీ‌నాధుని కాశీఖండ‌, భీమ‌ఖండ, క్రీడాభిరామ‌, శృంగార నైష‌ధ‌, హ‌ర‌విలాసాలు, బ‌మ్మెర‌పోత‌న భాగ‌వ‌త‌, వీర‌భ‌ద్ర విజ‌య‌ము.

జ‌క్క‌న విక్ర‌మార్క చరిత్ర‌, మ‌డికి సింగ‌న వాసిష్ఠ రామాయ‌ణ‌ము, వ‌ల్ల‌భుని అంబికా శ‌త‌క‌ము అనంతామాన‌త్యుని భోజ‌రాజీయం, కొమ్మ‌న శివ‌లీలా విలాస‌ము, హ‌రిశ్చంద్రో పాభ్యాస‌ము, పిన‌వీర‌న జైమిని భార‌ము శృంగార శాకుంత‌ల‌ము, దుగ్గ‌న కాంచీపుర మ‌హ‌త్మ్యం, వెన్నెల‌కంటి సూర‌న విష్ణుపురాణం, నందివారి ప్ర‌బోధ చంద్రోద‌యం, కేత‌న కాదంబ‌రి , పిడ‌ప‌ర్తి సోమ‌నాధుని బ‌సవ‌పురాణం, కృష్ణ‌రాయ‌ని ఆముక్త‌మాల్య‌ద‌, అల్ల‌సాని పెద్ద‌న మ‌నుచరిత్ర‌, నంది తిమ్మ‌న పారిజాతాప‌హ‌ర‌ణం, గోప‌న కృష్ణార్జున సంవాదం, మాద‌న గారి మ‌ల్ల‌న రాజ‌శేఖ‌ర చ‌రిత్ర, ధూర్జ‌టి కాళ‌హ‌స్తి మ‌హాత్మ్య‌ము, ఎల్ల‌క‌వి రాధా మాధ‌వ‌ము, సంకుసాల నృసింహ‌క‌వి క‌విక‌ర్ణ ర‌సాయ‌నం, తెనాలి రామ‌లింగ‌ని ఉద్బ‌టారాధ్య చరిత్ర‌, పాండురంగ మ‌హ‌త్మ్యాలు, మొల్ల‌రామాయ‌ణ‌ము, అయ్య‌ల‌రాజు రామ‌భ‌ద్రుని రామాభ్యుద‌యం, అద్దంకి గంగాధ‌రుని త‌ప‌తీ సంవ‌ర‌ణ‌ము, తెల‌గ‌న్న య‌యాతి చరిత్ర‌ము, శంక‌రుని హ‌రిశ్చంద్రోపాఖ్య‌న‌ము, సూర‌న క‌ళాపూర్ణోద‌య‌, ప్ర‌భావ‌తీ ప్ర‌ద్యుమ్న‌, రాఘ‌వ‌

పాండ‌వీయాదులు, రామ‌రాజ భూష‌ణుని వ‌సుచ‌రిత్ర‌, తెనాలి అన్న‌య సుల‌క్ష‌ణా ప‌రిణ‌య‌ము మొద‌లైన గ్రంథాల‌న్నీ చ‌దివించినాడు. ప‌ద‌హార‌వ ఏడు వ‌చ్చేసిరికి చేమ‌కూర వేంక‌ట‌ప‌తి అష్టావ‌ధాన‌, శ‌తావ‌ధాన‌, ఆశుధార‌ల యందు ముద్దుగా క‌విత్వం ద్రాక్షాపాకంలో చెప్పేవాడు. అన‌ర్గ‌ళ‌ధార ఉభ‌య భాష‌యలందు మ‌ధురంగా చిన్న‌చిన్న కావ్యాలు వ్రాసేవాడు.

సార‌స్వ‌తోపాస‌న‌తోపాటు వేంక‌ట‌రాజును తండ్రి ల‌క్ష్మ‌ణ‌మంత్రి యుద్ద విద్యా విశార‌దుని చేసినారు. ల‌క్ష్మ‌ణ‌మంత్రి ఆ సీమ‌ల‌న్నిటిలో పేరొందిన సేవా నాయ‌కుడు. వేంక‌ట‌ప‌తిరాజు గుఱ్ఱ‌పుస్వారి, ఆశ్వ‌యుధ్ధ‌ము, అశ్వ హృద‌య‌ము, గ‌జ‌యుద్ధ‌ము, ర‌ధ‌యుద్ధ‌ము, వివిధాయుధ్ధ ప్ర‌యోగ‌ము, చ‌తుర్యుధ్ద ఖ‌డ్గ ముష్టి మ‌ల్ల యుధ్ధాలు చేయ‌డం నేర్చుకున్నాడు. జ్యోతిష్య సిద్ధాంతాది శాస్త్రాలు బాగా నేర్చ‌కున్నాడు.