6
 

గోవింద దీక్షితుల‌వారి మాట‌ల‌కు అచ్యుతప్ప నాయ‌కులు దీర్ఘ నిశ్వాస‌ము చేసినారు.

అచ్యుత : నా చిట్టి తండ్రిని, పాలుగారు ప‌సివానిని అప్పుడే స‌మ‌ర‌భూమి కేలా పంపేది గురుదేవా ? చిన్న‌నాయ‌న‌కింకా క్రీడా ప్రియ‌త్వ‌ము వ‌ద‌ల‌లేదే ! సాహిత్య‌, సంగీత‌, నాట్యాది క‌ళాల‌హ‌రిలో ఈదులాడే ప‌ర‌మ సుకుమారుడే ! ఇట్టివానిని, మృత్యుదేవీ విహార‌రంగ‌మైన ర‌ణ‌భూమికి మ‌హాదంష్ట్రా క‌రాళ వికార విక‌టాట్ట‌హాసాల‌తో య‌మ‌కింక‌రులు తాండ‌వం చేసే అతి భ‌యంక‌ర సీమ‌కు ఎలా పంపేది గురుదేవా ! శెల‌వియ్యండి ?

గోవింద : ప్ర‌భూ ! త‌మ‌రు కేవ‌ల‌ము మ‌మ‌కార‌మ‌నే మ‌బ్బులో చిక్కుకున్నారు. త‌మ క‌న్నుల‌కు చిరంజీవి యొక్క ప్ర‌చండ భాస్క‌ర‌మైన శౌర్య‌దీధితులు సోక‌కుండా ఉన్న‌వి. చిన్న‌నాటినుండిన్నీ ర‌ఘ‌నాథులు ఎన్నిమారులు త‌మ ధైర్య సాహస‌ముల‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు ? త‌మ తండ్రిగారు, చిన చెవ్వ‌భూపాలురేమ‌నే వారో జ్ఞ‌ప్త‌కి తెచ్చుకోండి.

ఆస్మాక‌మే తేన భ‌వ‌త్ప్ర‌తిష్ఠా ధర్తుం స‌మ‌ర్థ‌శ్చ‌న ఏవ‌రాజ్య‌మ్‌, అనేవారు కారూ...

అచ్యుత నాయ‌ని వారు కుమారుని వంక చూడ‌గా అత‌డు సిగ్గుతో త‌ల‌దించుకొనినాడు. తండ్రిగారు త‌న భుజ ప‌రాక్ర‌మ‌మును గుర్తింప‌లేక పోయెనన్న విచార‌ము వారి కనుల‌లో చూచిన గోవిందామాత్యుల హృద‌య‌ము నీరైన‌ది.

అచ్యుత : గురుదేవా ! మ‌న‌దేశ‌మున‌కు కాని యుద్ధ‌ములో మ‌న‌ము పాలు పంచుకొన‌డ‌మెందుకు ? ప‌్ర‌జాన‌ష్ట‌ము చేసికొన‌డ‌మెందుకు ? సార్వ‌భౌముల‌కు మ‌న‌ము స‌దా విధేయుల‌మే. తిరుగుబాటు త‌త్త్వ‌ము మ‌న‌లో లేదు. సాయ‌ము కొర‌కు కొంత సైన్య‌మును పంపుద‌ము. ఇక ఆర్ధిక విష‌య‌ము. భ‌గ‌వంతుని ద‌య‌వ‌ల‌న మ‌న‌కు ఐశ్వ‌ర్య‌మున‌కు కొర‌త‌లేదు. యుద్ధ‌మున‌క‌య్యెడు వ్య‌యంలో స‌గ‌ము మ‌న‌మే భ‌రింతుమ‌ని సార్వ‌భౌముల‌కు వార్త పంపించండి...

గోవింద దీక్షితులు ఆగ్ర‌హ‌ము న‌ణ‌చుకొంటూ ప‌లికినాడు ప్ర‌భూ ! ఎన్ని మారులు చెప్పిన‌నూ మీ ప‌ట్టుద‌లే మీద‌న్న‌మాట‌..ర‌ఘునాథుల‌ను యువ‌రాజుల‌ను చేయ‌డ‌మ‌నేది ఉన్న‌దా, లేదా ? ఈ రాత్రికి నాకు తెలియ‌వ‌లెను. లేనిచో...లేనిచో నా ప్ర‌య‌త్న‌ములు..నేను చేసికొన‌వ‌ల‌యును. అమాత్యులు యుద్ధ‌ము నుండి మ‌ర‌లి యోవ‌రాజ్య ప‌ట్టాభిషేక‌మున‌కై ప‌ట్టు ప‌ట్ట‌సాగారు.

అంటే !? మహారాజు తీక్ష‌ణ‌ముగా చూచినాడు. ఈ రాత్రిలోప‌ల నేను అంగీకార‌ము తెలియ‌చేయ‌వ‌ల‌యున‌న్న మాట ! బెదిరించినంత మాత్రాన చేసెద‌న‌నుకొనుచున్నారుగా ! చేయ‌ను. చేయ‌నిచో నేమి ? ఏమి జ‌రుగనున్న‌ది. ఊహింప‌లేనంత‌టి మూర్ఖుడ‌ను కాను...రాజ్య‌మున నేడిట్టి సంక్షోభ‌ము క‌లుగుట‌కు మంత్రివ‌ర్యుల‌దే బాధ్య‌త. లేక, రాజున‌దా ? రాజ‌న‌కూ మంత్రికినీ కించిత్తు ప‌లుకు భేద‌మ‌న్న‌ది గ‌త అర్ద‌శ‌తాబ్ద‌ము నుండి రాలేదు. నేటికి...ఇట్లు జ‌ర‌గ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది !... అమాత్యుడెంత అద్వైత విద్యావిశార‌దుడైన‌ప్ప‌టికి, అధీత స‌క‌ల శాస్త్ర‌జ్ఞుడైన‌ప్ప‌టికిని, ఎన్ని య‌జ్ఞ‌ములు చేసిన‌ప్ప‌టికిని స‌మ‌య‌మును బ‌ట్టి ఎట్టి ప‌ని చేయించుట‌కై న‌ను వెనుదీయ‌డు చాణ‌క్యుడు మ‌హాపండితుడు కాడా ? బ‌్రాహ్మ‌ణుడు కాడా ? ర‌క్త‌పాత‌మున‌కు వెఱ‌చినాడా ? ఈ అచ్యుతుని శిర‌ము ఖండింప‌బ‌డ‌వ‌చ్చును ! లేదా ర‌క్త‌పాత‌మును స‌హింప‌క కారాగార‌మున ప‌డ‌తోయ‌బ‌డ‌వ‌చ్చును. విప్ల‌వ‌మే చెల‌రేగ వ‌చ్చును, విప్ల‌వ‌ము వ‌చ్చిన త‌రువాత ఎంత జాగ‌రూక‌త వ‌హించినా ప‌రిస్థితి చేయిదాటి పోక‌త‌ప్ప‌దు. ఆ శ్రీ రంగ‌శాయి ప‌ద ప‌ద్మ‌ముల‌ను సేవించుకొన నిచ్చ‌గించు ఈ చేతుల‌కీ వృధా కార్య‌క‌లాప‌ముల‌లో పాల్గొన‌డ‌మ‌న్న‌ది త‌గ‌ని అని ! అయినప్ప‌టికివి ర‌ఘునాధున‌కీ కాల‌ము శుభ‌క‌ర‌ముకాద‌నీ, జాగ్ర‌త్త‌గ నుండ‌మ‌నీ తండ్రిగారు ప్ర‌త్యేకించి చెప్పినారు. నేను నా తండ్రిని సార్వ‌భౌమునికి సాయ‌ముగ యుద్ధ‌మున‌కు పంప‌ను ! పంప‌ను. నా కుమారునికి యౌవ‌రాజ్య‌ప‌ట్ట‌ము క‌ట్ట‌వ‌లెనా, వ‌ల‌దా అన్న‌ది నా అభిమ‌త‌మును బ‌ట్టి జ‌రుగ‌గ‌ల‌దు...నన్ను ఆజ్ఞాపించిన వారి శిర‌స్సు...క్రోధ‌ఘూర్ణిత మ‌న‌స్కులైన మ‌హారాజుల‌వారి మ‌న‌స్సును, ఆలోచ‌న‌ను మంత్రివ‌ర్యులు అక్ష‌ర‌ము పొల్లుబోకుండ చ‌దువ‌గ‌ల్గినారు.