దారు వలస్త్రీలదగిలెగాని యదేమొ నీవలె ముక్కంటి నేరడయ్యె
గారాబూకూతునే గవిసెగాని యదేమొ నీవలె బరమేష్ఠి నేరడయ్యె
నలయహల్యాకాంతనంటెగాని యదేమొ నీవలె జంభారి నేరడయ్యె
గురుని యిల్లాలితో గూడెగాని యదేమొ నీవలెనుడు రాజు నేరడయ్యె
అవి పురాణములలోని శృంగారగాధలన్నిటిని తడవి చూపినది. వారికంటె నువ్వు హెచ్చయిన వాడివా అని రెచ్చగొట్టినది. చివరకు విసుగుతో రాయివలె కరుగకుండా ఉండడం నీకు గొప్పగా ఉన్నదేమోగాని ఆడదానికి ఉసూరుమనిపించుట తగదు అన్నది.
చిత్రాంగి ఇంతగా సిగ్గువిడిచి వేడినది కాబట్టే అంతగా పగపట్టినది. మగనితో లేనిపోనివన్నిటినీ ఏర్చకూర్చి చెప్పింది. మగణ్ణి మామా! అని సంబోధించినది.
ఎంతటి జాణ కాకపోతే ఆమె అలాగున చేయగలగు ? నీదుపట్టి నన్నింతట నుండి బట్టి రమించిన యప్పుడె మామవైతి. నీకింతటి నుండి కోడల జుమీ నను ముట్టకు అన్నది. హౌరౌరా ! ఏమి స్త్రీ ! ఏమి స్త్రీ !! చివరికి రాజుచే కొమరుని కాలుచేతులు ఖండింపజేసినది ! ఏమి రాజు ! పుత్రప్రేమ ఏమైనది ?
అన్నయ్యా ! నేను సిధ్దము. నీదే ఆలస్యము అన్నమరాజు వేంకటపతి భావనకడ్డు వచ్చినాడు. ఎంతవరకు కథ నడిచినదో చెప్పమన్నావా ? సారంగధరుని తల్లి రత్నాంగి కుమారుని కొరకు శోకించుచూ, రాజు దగ్గరకు వెళ్ళి ముందు చిత్రాంగిని దూషించినది. ఆ పుత్రుని శివవరప్రపాదుని ఎన్ని కష్టములకోర్చి, ఎన్ని తపసులు చేసి కన్నారో జ్ఞప్తి చేసుకొమ్మన్నది.
మతకరి మాటలు చెవినిడి
గతకల్మషు బుణ్యచరితు గారణజన్మున్
సుతుదునుమదందగునె ముద్దుల
......
చివరి చరణం నాకు గుర్తు ఉన్నదో లేదో చూడు, తమ్ముడూ !
రతనమ్మునయో యిదే దొరతనమ్ము నృపా ! అని పూరించినాడు, వేంకటపతి.
అంతే అన్నయ్యా ! ఆ తరువాత గాధను నడిపించు, వ్యాసుల వారికి భారతము వ్రాసిన గణపతిలాగ నేనుకూడా నీకు వ్రాసి కీర్తిని గడించదలచు కొన్నాను.
తమ్ముని కమ్మని ముద్దుపలుకులకు వేంకటపతికి ముచ్చటవేసి అతని గడ్డమును పుణీకినాడు. నువ్వంతటివాడివే చిట్టితండ్రీ ! కాకపోతే గణపతికున్న బొజ్జ నీకులేదు.
ఎలుక వాహనంకూడా లేదుకదా
పోనిమ్ము. రేపు నీవు సైన్యములో చేరినపిదప దొరవారు నీకొక అశ్వమును దయచేస్తారుకాదా, దానికి ఎలుక అని పేరు పెట్టుకొందువు.
ఇరువురును నవ్వుకొన్నారుజ
అన్నయ్యా నామీద జాలిచేత, నాకోర్కె తీర్చవలెనన్న కాంక్ష చేత నీవు ప్రయత్న పూర్వకముగా ఓడిపోదామను కొంటున్నట్లున్నది. అది నేను గెలుపుగా భావించను. ఓటమిగానే స్వీకరిస్తాను. ఎట్లయిన పందెము పందెమే. ఇందుకు నీవు కూడా సంతోషముగా పాల్గొనవల్సినదే.
తమ్ముడూ, పందెము పందెమే అని నాకు మాత్రం తెలియదా ? నేను గెలుపుకోసము ప్రయత్నమే చేస్తాను. లేకపోతే ఏ యుధ్దములోనో ఏ బాణము వల్లనో కత్తికఠారులవల్లనో గాయపడి నీవు వచ్చినట్లయిన నేను చూడలేను. ప్రారంభించు.
కావ్యరచనము అకుంఠింతగా సాగిపోతూ ఉన్నది. ఇరువురూ ఒకరినిమించి ఒకరు వేగరులౌతున్నారు.
రత్నాంగి కన్నబిడ్డ కొరకు కంటికి మంటికి ఏకధారగా విలపించినది. భర్తని దూషించినది. చిత్రాంగిని తూలనాడినది. తన దురదృష్టాన్ని తిట్టుకొన్నది. పాలుగారే బుగ్గలతో, తప్పటడుగులతో, తొక్కు పలుకులతో, అమ్మా ! అని చిట్టిచిట్టి చేతులు చాచుకొని, ఎత్తుకొమ్మన్నట్లుగా ముందుకు వచ్చే బాలుడే ఆమె కనులముందు నిలచినాడు. బిడ్డడి నగుమోమును తలచుకొని తలచుకొని రోదించినది. బ్రతకని బిడ్డ బారెడంటారు, ఇందుకనే కాబోలు నా చిన్ని నాయన అంత చక్కగా పుట్టినాడు అని కుమిలిపోయినది. ఆనాడు దశరధరాముడు తండ్రి ఆజ్ఞాపించగా అడవుల పాలయినాడు. ఈనాడు తన తనయుడు తండ్రి ఆజ్ఞవలన ప్రాణాలనే కోల్పోవలసి వస్తోన్నది. జిత్తులమారి భార్యవల్లనేగదా ! ఈ భూపతులెంత మత్తులోకదా ! అని వారి స్త్రీలౌల్యాన్ని ఈసడించుకొన్నది. ప్రహ్లాదుని వంటి గుణవంతుడైన నా చక్కనయ్యకు నూరెండ్లు అప్పుడే నిండినాయా ! అని నేలపై పడి దొర్లిదొర్లి ఏడ్చి, మూర్చిల్లి తేరుకుని, తన బిడ్డకు మారుగా తన ప్రాణములను తీసికొమ్మని భర్తను వేడికొందమని తలచి, లేచి, శక్తి ఉడిగి, మరల కూలిపోయినది. |