75
 

ఓహో, నేను నిశాచ‌రుడ‌నేన‌ని నీ భావ‌మా, మిత్ర‌మా ?

నిజ‌ముగా నీవు నిశాచ‌రుడ‌వే, అందుకు నాకెట్టి సందేహమూలేదు, అనినాడు వేంక‌ట‌ప‌తి చిరున‌గ‌వులు చిందిస్తూ.

నీ క‌వ‌న‌మును వింటిని గ‌దా, నీవు శేషాచ‌ల‌ప‌తికి కావు. శ్లేషా చ‌ల‌ప‌తికి కానిమ్ము నన్ను రాక్ష‌సుడవంటున్నావుగా !

సైనికా ! నీవు రాక్ష‌సుడ‌వు కావ‌య్యా, రాజువి !

అంటే న‌న్ను సింహాస‌న‌ము కొర‌కు కుట్ర ప‌న్న‌మ‌నా నీ ఉద్బోధ !

రాజు అన్నా విశాచ‌రుడ‌న్నా చంద్రుడ‌ని నీకు తెలియ‌దా ! నీవు చంద్రుడివంటి ఆహ్లాద‌క‌రుడ‌వు. చంద్ర‌కాంతులు రాత్రివేళ‌ల‌లోనే ఆహ్లాద‌కార‌ములైన‌ట్లు నీవు రాత్రి వేళ‌ల‌లోనే వ‌చ్చి నాకు ఆనంద‌కార‌కుడ‌వై నావు !

రాజు శ‌బ్దాన్ని బ‌హు చ‌మ‌త్కారంగా ప్ర‌యెగించినావు. రేపేక‌దా మీ ప్ర‌యాణ‌ము ?
అవును రేపే మేము తంజ‌పురికి బ‌య‌లుదేరుతున్నాము, అని అన్న‌మ‌రాజు ఆనందంగా ప‌లికినాడు.

సైనికా, వీని వీర శైవ‌ము చూడు ! గ‌త‌రాత్రి నేను ఇష్ట‌దైవ‌మును స్మ‌రించుకొమ్మంటే, జై ర‌ఘునాథా అంటాడు. నేడు తంజ‌పురికి ప్ర‌యాణ‌మ‌నే మాట వినేస‌రికి చిన్న‌పిల్ల వానిలా గంతులు చిందులు వేస్తున్నాడు.

సైనికుడు అన్న‌మ‌రాజును ఆప్యాయంగా చూస్తూ మీ ఇరువుర‌కూ ఆ ర‌ఘునాథుల‌వారికీ ఏదో పూర్వ‌జ‌న్మ‌బంధం ఉండే ఉండాలి ! లేక‌పోతే ఈ తీరం ఈ దేశం కాక‌పోయిన‌ప్ప‌టికిన్నీ ఇష్ట‌దైవ స్మ‌ర‌ణాన్ని మా పాల‌కుని నామం మ‌ర‌పించిందంటే సామాన్య విష‌య‌మా ? అన్నాడు.

గ‌త‌రాత్రి జాంబ‌వంతుని వంశీకుని అన్న‌మ‌రాజు చంపిన విధాన‌మూ, కుప్ప‌న్న ప‌రిస్థితీ, వారు వేసుకొన్న పందెం విష‌య‌మూ, సారంగ‌ధ‌ర చ‌రిత్ర‌ము పూర్తి చేసిన వైన‌మున్నూ, అన్న‌ద‌మ్ములు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు సైనికునితో గుక్క తిప్పుకోకుండ‌ చెప్పినారు. సైనికుడు కోర‌గా అన్న‌మ‌రాజు సారంగ‌ధ‌ర‌లోని కొన్ని ఘ‌ట్ట‌ముల‌ను చ‌దివి వినిపిచినాడు.

త‌ల‌వ‌రులేగ పులితండ‌ము అన్న ప‌ద్య‌ము సైనికుని హృద‌య‌మును క‌ద‌ల్చి వైచిన‌ది. ర‌త్నాంగి శోక స‌ముద్ర‌మున‌కు త‌న క‌న్నీటిని కూడ కొంత క‌లిపినాడు. ప‌ఠ‌న‌మై పోయిన‌ను ఒక్క‌రూ మాట్లాడ‌లేదు. సైనికుడు నిశ్శ‌బ్ధ‌ముగ శూన్య‌ములోనికి చూస్తుండిపోయినాడు. వేంక‌ట‌ప‌తికి ఆత్ర‌ముగానున్న‌ది. సైనిక‌డు స‌హృద‌యుడు. ర‌ఘునాథుని కొలువులోని వాడు. ఈత‌ని మాట‌లు వింటూ ఉంటే, రాజ‌హృద‌య‌మెలా ఉంటుందో ఎరిగిన‌వాడివ‌లె ఒక్కొక్కసారి మాట్లాడుతాడ‌నిసిస్తుంది. ఈత‌నికి ఈ కావ్య‌ము న‌చ్చిన‌దా, లేదా ? న‌చ్చ‌న‌ట్ల‌యితే, భ‌ళీ ! మిత్ర‌మా ! అంటూ వీపు చ‌ర‌చే అల‌వాటు వీనికున్న‌ది. అట్లు చేయ‌లేదు. క‌న్నులు మూసికొని అతి జాగ్ర‌త్త‌తో కావ్య‌మును విన్నాడే. ఎట్లున్న‌ది అని అడిగితే, త‌ప్పేమి ? బాగుండ దేమో ! అని త‌ల‌పోసినాడు, వెంక‌ట‌ప‌తి.

ఇంత‌కూ కావ్య‌మెట్లున్న‌ది ? అని ప్ర‌శ్నించినాడు అన్న‌మ‌రాజు.

సైనికుడు తడుముకోక‌, ఏడ్చిన‌ట్లుంది అన్నాడు. వేంక‌ట‌ప‌తి గుండె నీర‌యిన‌ది. ఇంత శ్ర‌మ వృధ‌యైన‌ది. క‌న్నుల్లో నీరు క్ర‌మ్ముకొని రాబోయిన‌ది. విష‌ణ్ణ‌వ‌ద‌నంతో సైనికుని చూచినాడు. సైనికుడు లేచి నవ్వుతూ శ్లేష‌క‌వీ ! నీశ్లేష‌తో మ‌మ్మ‌ల్ని ఊద‌ర‌బెట్ట‌గ‌ల‌వుగాని మా భాష నీకు అర్ధ‌ముకాదా ? అని వీపు చ‌రిచినాడు. వేంక‌ట‌ప‌తికి స‌గ‌మ‌ర్థ‌మైన‌ట్లే ఉన్న‌ది గాని పూర్తిగా సైనికుని మాట‌లోని భావ‌ము బోధ‌ప‌డ‌లేదు ప్ర‌శ్నార్థ‌క‌ముగా చూస్తూ ఉండిపోయాడు.

క‌విత్వం అంటే ఇలాగే ఉండాలి, మిత్ర‌మా. ఇందులో శోక‌ర‌స‌ము వెల్లువ‌లై పారిన‌ది. శ్రోత‌ల గుండెల‌లో దుఃఖము ప‌ర‌వ‌డులు తొక్క‌క మాన‌దు. తేనెటీగ‌లు మ‌క‌రందాన్నంతా ఒక చోట చేర్చి పుట్ట‌లు పెట్టిన‌ట్లుగా, నీవు శోకాన్నంతా తెచ్చి ఈ కావ్యంలో పారించావు. అందుచేత , కావ్య‌మే ఏడుస్తోందా అన్న‌ట్లు అలంక‌రించాను. హృద‌య‌మున్న మాన‌వులేకాదు, హృద‌యంలేని ప‌త్రాలు అక్ష‌రాలూ కూడా శోకిస్తున్నా య‌న‌డంలోని అంత‌రార్ధం ఇప్పుడు అర్ధ‌మైందా ? అన్నాడు, సైనికుడు.

వెంక‌ట‌ప‌తి ఆనందాన్ని ప‌ట్టలేక‌పోయినాడు.