78
 

నిన్ను నీవు చిన్న‌బుచ్చుకొనుట‌, ర‌ఘునాథుని చిన్న‌బుచ్చుటయే కాదు, నీతండ్రి ప్ర‌వ‌ర్త‌న‌ను ఎత్తిచూపుటే !

దాన‌దాసీజ‌న‌ము హార‌తులెత్తుతూ వేంక‌ట‌ప‌తిని లోనికి గొనిపోయివారు. లోనికి వెళ్ళ‌గానే తూగుటుయ్యాల‌లో విశ్ర‌మించిన త‌న త‌ల్లి క‌నుపించిన‌ది. ఆమె పాద‌ముల‌కు న‌మ‌స్క‌రించినాడు. ఆమె అక్ష‌త‌లుగా ఆనంద భాష్పాల‌ను కురింపించిన‌ది, నాయ‌నా, నీ తండ్రి మ‌హామాత్యుల‌న్న మాట కంటెకూడ నేడానంద‌ముగ న్నుదిరా ! నాక‌డుపున పుట్టినందుకు నీవు హీన‌మైన జీవిత‌ము గ‌డ‌ప‌వ‌ల‌సి ఉండ‌గా తంజ‌పుర ఆస్థానంలో మహాగొప్ప స్థానాన్ని పొంద‌గ‌లిగావు. నీ నలుగురి త‌మ్ముల‌ను గురించి నాకు ఇంక బెంగ‌లేదురా ! అన్న‌ది. త‌ల్లి మ‌న‌సులో ఇంత వేద‌న క‌ల‌గ‌టానికి కార‌ణ‌ము తానే. త‌న‌ను తానెప్పుడూ కుల‌హీనుడ‌ని తిట్టుకుంటూ ఉంటే ఆ త‌ల్లి ప‌డే బాధ‌కు సంత‌సిస్తూ చూచినాడు, పెక్కుమార్లు. ఇక అమ్మ మ‌న‌సు క‌ష్ట‌పెట్ట‌ను అని గ‌ట్టి నిర్ణ‌య‌ము చేసికొనినాడు. త‌రువాత సూర‌మాంబ‌కు న‌మ‌స్క‌రించినాడు, త‌మ్ముల‌ను ఆప్యాయంగా ప‌ల్క‌రించినాడు, వేంక‌ట‌ప‌తి.

అన్న‌మ‌రాజు హృద‌య‌ము ఆకాశ విహారంచేస్తూ ఉన్న‌ది. ఆ అశ్వ‌ము నెక్కి ప‌ట్ట‌ణ‌మంతా తిరిగి తిరిగి భ‌వంతికి చేరుకొన్నాడు.


తృతీయ స‌ర్గ‌ము

శార‌దారాధ‌న‌ము

నాటికి అర్ధ సంవ‌త్స‌రం పైగా శుక‌వాణి స‌ర్వ‌విద్య‌లూ విశ్రాంతి తీసి కొంటున్నాయి. ఆమె త‌న గురువులైన గోవింద దీక్షితుల‌వారి చెంత‌కు కూడా పోవ‌టం లేదు. సంగీత సాధ‌నం చేయ‌టం లేదు. అలంకార శాస్త్రాన్ని అవ‌లోకించ‌టం లేదు. కాలి గ‌జ్జెలు, సిరిమువ్వ‌లు సాయ‌ప‌డ‌క మ్రెగుట‌లేదు. స‌న్న‌ని బంగారు జ‌ల‌తారు ప‌ట్టువలిప‌పు తెర‌ల‌నుంచి రాజ‌వీధికి దృష్టి సారించి సంత‌త నిర్విరామ నిరీక్ష‌ణ చేస్తూ ఉన్న‌ది. న‌గ‌రాజ కుమారితో న‌వ్వుతూ ప‌లుక‌దు. త‌ల్లితో తండ్రితో కూడ ప‌రిమిత‌మైన మాట‌లే ! ముమ్మారు మాత్ర‌ము స్యందన‌మెక్కి గోవిందుల ద‌ర్శ‌న‌ము చేసికొని వ‌చ్చిన‌ది. వారికి ఆమెతో మాట్లాడుట‌కు కూడా తీరిక లేకున్న‌ది. కుశ‌ల‌మ‌డిగి పంపించి వైచినాడు. సంగీత నాట్య శాస్త్రాభ్యాసం చేస్తున్నావా అనిగాని సంస్కృతాంధ్ర భాషా ప‌ఠ‌న‌మెంత‌వ‌ర‌కు వ‌చ్చిన‌ద‌నిగాని పృచ్ఛ‌చేయ‌లేదు. గురుదేవులు మ‌ధ్య‌లో న‌న్ను ఎందుచేత ప‌రిత్య‌జించినారు ? అని దుఃఖితురాలైన‌ది.

కుమార్తె బాధ చూచి నిలువ‌లేని మ‌ర‌క‌త‌వ‌ల్లి మూర్తెప్ప‌నాయ‌నిం వారిని పోరి గోవిందుల చెంత‌కు పంపించిన‌ది. అమాత్యుల‌కు స‌గౌర‌వ భ‌క్తి పుర‌స్ప‌రంగా ప్ర‌ణామ‌ములు చేసి విన‌య‌వంతుడై నిలిచినారు మూర్తెప్ప నాయ‌కులు.

అమ్మాయి పంపినాదా ? చిరున‌వ్వుతో ఆశీర్వ‌దిస్తూ ప్ర‌శ్నించినారు. గోవింద దీక్షితులు. అవును - కాదు అని త‌బ్బిబ్బుగా ప‌లికి. చిట్టిత‌ల్లి విద్యాభ్యాస‌ము కుంటుప‌డిన‌ది. ఆమెకు విద్యయే ఊపిరి. చ‌దువులే ఆహార‌ము. క‌ళ‌యే స‌ర్వ‌స్వం. ఆరుమాసాల నుండి ఇవిలేక కృశించిపోతూన్న‌ది. చిన్నపిల్ల తెలియ‌క దోష‌మేదైనా చేసిన‌చో క్ష‌మింప వేడుకొంటున్నాను. మ‌ర‌ల మీరామెకు విద్యాదాన‌ము చేసిన‌చో ప్రాణ‌దాన‌ము చేసిన‌ట్లే. ఆమె దోష‌ముల‌ను సైచి స్వీక‌రింపుమ‌ని వేడుకొంటున్నాను మూర్తెప్ప‌నాయ‌నిం వారి మాట‌ల‌కు గోవిందామాత్యులు లోలోన న‌వ్వుకొన్నారు.

ఆమె చేసినా ఎవ‌రు చేసినా దోష‌ము దోష‌మే. చిరంజీవి చెంచుల‌క్ష్మి యువ‌రాజుల దృష్టిలో ప‌డిన‌ది. అదియే ఆమె దోష‌ము. అదిదోష‌మో కాదో తండ్రిగారే నిర్ణ‌యింతురుగాక ! ఇక‌నేను ఆమెకు గురుత్వ‌ము వ‌హించే బాధ్య‌త‌ను స్వీక‌రించలేను.