80
 

నాన్నా ! మా గురువు గోవిందుల‌వారు సామాన్యులు కారు. వారు ఆడే ప్ర‌తిమాట‌కీ ఎంతో అర్ధం ఉంటుంది. ఒక‌ప్పుడెప్పుడైనా ఏదేనా మాట అధాటుగా ప‌లికినా అది కూడా నిజ‌మై తీరుతుంది. వారి వాక్సుద్దీమంత్ర‌బ‌ల‌మూ అట్టివి. అంచేత‌నే వారితో చాలా జాగ్రత్త‌గా మాట్లాడాలి.

అమ్మా, చెంచూ ! ఈ దినము న‌గ‌రాజుకి క‌బురు పెట్ట‌నా ర‌మ్మ‌ని ? ఇద్ద‌రూ చ‌ద‌రంగ‌మో, ఒప్పుల‌గుప్పో ఆడుకుందురుగాని, అన్న‌ది త‌ల్లి.

లేద‌మ్మా, నేనీనాడు ఉద్యాన‌వ‌నానికి వెళ్ళానుకుంటున్నాను. మ‌న నెమ‌లితల్లికి బుల్లి పాపాయిలు పుట్టినాయిగా, వాటితో ఆడుకొని వ‌స్తాను. న‌గ‌రాజుకి నెమళ్ళంటే గిట్ట‌దు, అన్న‌ది సంబ‌ర‌ప‌డుతూ.

అయ్యో. ఇదేమి విచిత్ర‌మే చెంచూ ! ఇంకా నెమ‌లి పిల్ల‌లు బుల్లి బుల్లిగా ఉన్నాయ‌నీ, నీతో ఆడుకోడానికి సిద్ధంగా ఉన్నాయ‌నీ అనుకుంటున్నావా ! అవిపుట్టి ఎన్ని మాసాల‌యిందో. ఇంకో నాల్గ‌యిదు నెల‌లుపోతే వాటికే బుల్లి పాపాయిలు పుడ‌తాయే మె కూడా !

పోనీలే, అమ్మా ! ఊర‌కే వెళ్ళొస్తాను. ఎంత పెద్ద‌వ‌య్యామో చూచి వ‌స్తాను. ఈ వేళ మేఘాలు క‌మ్ముతున్నాయి క‌దా, మ‌యూరాలాడితే నేనూ వాటితో గ‌జ్జె క‌లుపుతాను. స‌రేనా ? త‌ల్లివీపున మోము నానించి గారాలు పోయింది. మ‌ర‌క‌త‌వ‌ల్లి కంటె ముందు మూర్తెప్ప నాయ‌నింవారు స‌మాధాన‌ము చెప్పినారు.
మ‌ధువ‌నానికి వెళ్ళెటందుకు ఇంత యోచ‌న యెందుకు, త‌ల్లీ ! ఇప్పుడే ర‌ధాన్ని పిలిపిస్తాను.

ఒద్దు నాన్నా ! నేను న‌డిచి వెళ‌తాను.

న‌డ‌చా ! ఇద్ద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

ఆవునండీ ! నాన్న‌గారూ న‌డ‌చే వెడ‌దామ‌ని నాకెంతో కోరిక‌గా ఉండి. ర‌ధంలో కూర్చొని ప‌ట్టు ప‌ర‌దాల మాటునుండి ప్ర‌కృతిని ప‌రికించే వీలు లేకుండా క్ష‌ణాల‌లో అక్క‌డికి వెళ్ళి వాలాల‌ని లేదు. వ‌నం ఎంతో దూరం కూడా లేదు క‌దా !

చెంచుల‌క్ష్మి త‌ల్లిదండ్రులు అంగీకార సూచ‌కంగా మౌన‌ము వ‌హించినారు.

మూర్తెప్ప నాయ‌ని వారి మ‌ధువ‌న‌ము తంజ‌పురీ ప‌ట్ట‌ణానికే శోభావ‌హంగా ఉంటుంది. రాజోద్యానానిక‌న్న మూర్తెప్ప ఉద్యానంలోనే పుష్ప వృక్షాల‌ధికంగా ఉన్న‌వి.

మూర్తెప్ప‌నాయ‌నివారే స్వ‌యంగా ఎక్కువ జాగ‌రూక‌త‌తో, వ‌న సంర‌క్ష‌ణ చేస్తారు. వివిధాలైన ఫ‌ల‌పుష్ప‌వృక్షాల‌ను సేక‌రించినారు. మ‌ధుర‌, వేలూరు, క‌ర్ణాట‌, మ‌హారాష్ట్ర దేశాల‌నుండి చిత్ర‌విచిత్ర‌మైన వ‌ర్ణాల‌తో పూచే పువ్వుల మొక్క‌ల‌ను తెప్పించినారు. ఒలంద‌దేశీయుడొక‌డు మూర్తెప్ప‌తో త‌న‌కున్న మైత్రికి చిహ్నంగా త‌న దేశాన్నుండి అపురూప‌మైన మొక్క‌నొక‌దాన్ని తెప్పించి బ‌హూక‌రించినాడు. దానిని పెద్ద‌కుండ‌లో పెట్టి ప్రాణ‌స‌మంగా పెంచుతున్నారు.

మూర్తెప్ప‌నాయ‌కులు. ఆ మొక్క పూవుల‌ను పూయ‌దు. లేలేత ఆకులు చిగురించే స‌మ‌యాన ఆ చిగుళ్ళు చ‌క్క‌ని ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతాయి. ఒకే చిగురుకున్న మూడు ఆకులు మూడురంగుల‌తో వింత‌గా చూప‌రుల‌నాక‌ర్షిస్తాయి. ఈ మొక్క‌కు వేరే అంటుగ‌ట్టి దానిని ర‌ఘునాథుల‌కు కాన్క‌చెయ్యాల‌ని అనేక విధాలుగా ప్ర‌య‌త్నించారు. కాని ఒక్క అంటూ బ్ర‌త‌క‌నేలేదు. ఒలంద మిత్రుని పేరు సిన్మెంటా వియెస్‌. ఆ క‌వి పేరుమీదుగా ఆ మొక్క‌ని సిన్మెంటా అని పిలుచుకుంటారు, మూర్తెప్ప‌నాయ‌కులు.

ఇక తంజ‌పుర పాల‌కులంద‌రికీ చంప‌క‌పుష్ప‌మ‌న్న మ‌హాప్రీతి. పంచ‌ముఖ చంప‌క‌ము, ముద్ద చంప‌క‌ము, రేక చంప‌క‌ము మొద‌లైన వివిధ చంప‌కాలీవ‌నంలో తెలుపు ప‌సువు గోధుమ‌వ‌ర్ణాల‌లో విర‌గ‌బూస్తాయి. గ‌న్నేరు, దేవ‌గ‌న్నేరు, తెల్ల‌గ‌న్నేరు, ప‌చ్చ‌గ‌న్నేరు, ముద్ద‌గ‌న్నేరు, కెంపుగ‌న్నే, బిళ్ళ‌గ‌న్నేరు, వ‌కుళ‌, పొగ‌డ‌, పొన్న‌, పారిజాత‌, శ్యేమంతిక‌, గొజ్జంగి, కుదురుమ‌ల్లి, రాగ‌మ‌ల్లి, బొడ్డుమ‌ల్లి, దొంత‌ర‌మ‌ల్లి, జాజి, విర‌జాజి, కాశీర‌త్నాలు, క‌న‌కాంబ‌రాలు, నీలాంబ‌రాలు మొద‌లైన పుష్ప‌వాటిక‌లేగాక‌, నిండా తేనెలూరు తీయ‌ని ఫ‌లాన్నిచ్చే వృక్షాలుగ‌ల ఫ‌ల‌వాటిక‌లు, కృష్ణ‌మృగాలు, నెమ‌ళ్ళు, కుందేళ్లువంటి చిన్న జంతువులు సైత‌ము క్రీడించ‌డానికి వీలుగా, ముప్ప‌దిని వ‌ర్తాల సుక్షేత్ర‌మైన సార‌వంత‌మైన శాలిభూమిని నంద‌న వ‌నానికి స‌మానంగా మొలిపించి క‌నుల‌కు పండువ‌గావించ‌గ‌లిగినారు, మూర్తెప్ప‌నాయ‌కులు. వారికి మొక్క‌ల‌పై గ‌ల ప్రీతిని గ‌మ‌నించిన మిత్రులు, న‌గ‌ర ప్ర‌ముఖులు, రాయ‌బారులు, దేశ‌విదేశాల నుండి విచిత్ర‌మైన మొక్క‌ల‌ను తెచ్చి కాన్క‌జేస్తూ ఉంటారు.