చెలులు శుకవాణిని అలంకరించడం పూర్తి చేసినారు. ప్రతి అభరణానికీ శుకవాణి తన అభ్యంతరాన్ని తెలియజేస్తూనే ఉన్నది. బంగరు రాయంచలబారుతోనున్న కంచిపట్టు నీలాంబరమును ధరించినది. పుష్పవర్ణ శోభతో దగద్ధాయమానంగా రత్న వైఢూర్యాలనమర్చిన పైఠాణి రవికను తొడిగినది. వెన్నెలవంటి తెలిపట్టు సన్నవలిపమును అంశోత్తరీయంగా వైచుకొన్నది. హురుమంజి ముత్యములతో వింతశోయగాలను ద్విగుణీకృతం చేసే ముంగెరపై నుండి నగరాజు కనులు మరల్చుకొనలేక పోతూన్నది. తనకూ అటువంటి ముంగెర కావాలని పట్టుబట్టి చేయించుకొన్నది. తనూ అటువంటి ముంగెరమే పెట్టుకొన్నది, కాని, శుకవాణికి ఈ ముంగెర అధిక శోభవిస్తూన్నదా ? లేక, సంపంగి వంటి ఆమె ముక్కు వల్ల ముంగెరకే అందాలు అధికమైనాయా ? హరి నీలమణుల కాంచీదామము వస్త్రవర్ణంతో లీలమైపోయి తళుకులీనినప్పుడు మాత్రమే తన ఉనికిని తెలియజేస్తోంది.
నాట్య సమయాన యువరాజులు బహూకరించిన పచ్చలహారాన్ని పయ్యెదపైకి ద్యోతకమయ్యేలా అమర్చినది, మరకతవల్లి. అమ్మా ! ఇక అభరణాలు చాలే ! శరీరం బరువైపోయినట్లుగా ఉంది, అన్నది చెంచులక్ష్మి.
నగరాజకుమారి : ఇంక రెండితలు బరువువేస్తే తప్ప నీవు భూమి మీద నడవవే చెల్లీ ! లేకపోతే నీ ఊహలు నిన్ను నిలవనీయడం లేదు. ఎప్పుడెప్పడు...
చెంచులక్ష్మి : ఊ ...ఎప్పుడెప్పుడు ...సాంతం చెప్పవే...నీకు మాత్రం ఈలాంటి అనుభవం రాకపోతుందా ! ఆనాడూ నిన్నూ ఒక ఆట ఆడించకపోతానా ?
అయిఏ ఏదో ఒక అనుభవం నీకు కలిగిందని నువ్వే ఒప్పుకొన్నట్లే గదా ! ఏదీ అది ఏమిటో నా చెవిలో మెల్లగా చెప్పు. మరో ప్రాణికి తెలియనీయకుండా రహస్యంగా ఉంచుతాను, అని నగరాజు శుకవాణి పెదవుల దగ్గిరికి తన చెంపను చేర్చింది. పోవే అనుభవమూ లేదు ఏమీ లేదు అని చెంపపై నుతారంగా ఒక దెబ్బవేసి తూనీగలాగ పారిపోబోయినది, శుకవాణి. కాని స్వర్ణాభరణాల బరువుకు అలాగ చేయలేక మందగమనంతో ప్రక్కకు తొలగినది. బంగరు మువ్వలు మధురంగా చిరుసవ్వడులను రవళించినాయి.
మూర్తెప్ప నాయకులు బయలుదేరుటకు సమయమాసన్నమైనదని త్వరపెట్టుచున్నారు. శుకవాణి హృదయంలో చెప్పలేని యారటమేదో కదలాడినది. భయము, ఆనందము, సంతోషము, సిగ్గు మొదలైన భావాలు ఒకదాని తరవాత నొకటి ముంచుకొని వచ్చి ఆమెను నిలువనీయలేదు. తల్లి ధైర్యము చెప్పి ఆలింగనము
చేసికొని పల్లకివరకు చేయిపట్టుకొని నడిపించుకొని వచ్చినది. చెంచూ ! తల్లీ ! భయమెందుకే ! చక్కగా, లక్షణంగా అచ్యుత నాయనిం వారికోటలో జరిగే వైభవాన్ని కళ్ళారా చూసివద్దువుగాని. అక్కడ జరిగే సంగీత సభలూ, కవితా గానాలూ వినడమూ నాట్యసభను తిలకించడం అదృష్టం కాదూ ! నువ్వు బంగారు తల్లివి. అన్నీ చూచి మరల మీ నాన్నగారితో పాటు తిరిగిరా ! అన్నది.
పల్లకి కోటముఖ ద్వారాలను మూటినిదాటి, అంతఃపుర ప్రాంగణాన నిలిచింది. పట్టపు యువరాణీ కళావతీదేవివారి ముఖ్య చెలికత్తెలు కొందరచట ఆమె కొరకే ఎదురు చూస్తున్నట్లుగా నిలచి ఉన్నారు పల్లకి ప్రధమ ద్వారము దాటగానే శుకవాణి ఆగమన వార్త యువరాజుల వారికి అందజేయబడినది. చెలికత్తెలు శుకవాణికి నీరాజనాలందిచ్చి ముంజేతిని పట్టుకొని ఇందిరామందిర సమీపానకు తీసుకొని వెళ్ళడానికి
సంసిద్ధులైనారు.
ఇంతలో అచటికి యువప్రభువులు కళావతీదేవితో కలసి వచ్చినారు. దూరము నుండియే శుకవాణి దర్శనము ఆ ప్రభువు యొక్క మనోవీణనొక్కమారు మీటి ఝుమ్మనిపించినది. వివశుడై కళావతీదేవి మృదుకమల హస్తాన్ని పట్టుకొన్నారు. ఆ చేతిలోని కంపనాన్ని కళావతీదేవి గ్రహించి అచ్చెరువుతో భర్త కనులలోకి వెడద కన్నులతో చూచినది. రామభద్రాదేవి, లక్ష్మీకుమారి, వారి వారి భవంతుల నుండి చెలికత్తెలు వెంటరాగా బయలుదేరి వీరున్న తావునకు వచ్చియున్నారు. యువరాజులు ముందునకు వచ్చి, శుకవాణీదేవీ ! కుశలమా ? అని ప్రశ్నించినారు. శుకవాణి తన వినీల దీర్ఘ పక్ష్మాల నొక్కనూరు పైకెత్తి ప్రభువుల కనులలోనికి చూచి మరల దించుకొన్నది.
పది మాసముల క్రితముకంటె శుకవాణి మరికొంత పొడవైనది. శరీరము కొంత చిక్కినట్లే కనిపిస్తున్నప్పటికీ మరింతగా లతాత్వమును సంతరించుకొన్నది. మిధ్యయై నడుము మరింత శూన్యమైనట్లుగా తోచుచున్నది. కనుల కాంతి రెట్టింపయినట్లూ, కాక మరిన్ని రెట్లుగా హెచ్చయి ఉండవచ్చునా ? ఆ కాంతిలో తనకు చిన్ని సందేశమేదైన నుండునా ? ఇది వరకువలె ఆ కన్నులు వెడదలై చిలిపిగ రెపరెప కొట్టుకొనకుండ బరువుగ వ్రాలియే ఉన్నవేమి ? రఘునాథ ప్రభువుల మదిలో సాగిపోవుచున్న ఆలోచనలు ఒక్క రామభద్రాదేవికే గ్రహింపైనవి. రామభద్రాదేవి దగ్గర ఆ ప్రభువు శుకవాణిని ఎప్పుడును మెచ్చుకొనుచునే యుండును. ఒకవేళ రఘునాథులామె ప్రసక్తి తేకుండ ఆలోచనామగ్నులై యున్నట్లాయెనా, రామభద్రాదేవియే శుకవాణి ప్రసక్తి తెచ్చుచుండును. |