9
 

కేత‌కీపుష్ప సువాస‌న‌లు !...అవును, ఇది ఆ మార్గ‌మే ! అని నిర్ధారించినాడాత‌డు. ఇంకొక నాలుగు గ‌డియ‌లు అశ్వ‌ములిదే వేగ‌మున ప‌య‌నించిన‌చో తెల్ల‌వారునప్ప‌టికి...తాను...ఘోరార‌ణ్య మ‌ధ్య‌మున నుండ‌వ‌చ్చును. ఇప్పుడీ మార్గ‌మ‌ధ్య‌మున‌నే త‌ప్పించుకొన‌వ‌ల‌యును...ఎలా ! ఎలా !..బాహువులు స్వాధీన‌మున లేవు. క‌నులు క‌ట్టి వేసినారు. అత‌డు చురుకుగా యోచించినాడు. అశ్వ‌ముమీద త‌న‌ను ముందు కూర్చుండ‌బెట్టి, త‌న వీపున‌కు వాడి కైజారుకొన నానించి త‌న వెనుక ఒక‌డు కూర్చుని ఉన్నాడు. వీనికి భార‌తీయ‌భాష రాన‌ట్లున్న‌ది, వీడు భార‌తీయుడు కాడు. ఇది విదేశీయుల ప‌న్నాగ‌ము కావ‌చ్చును...మ‌ధుర నాయ‌కునిపేరు విన‌బ‌డుతున్న‌ది. అందువ‌ల‌న మ‌ధుర‌నాయ‌కులు విదేశీయుల‌తో చేతులు క‌లిపి యుండ‌వ‌చ్చున‌ని భావించ‌వ‌చ్చును...త‌న‌ను బంధించి ఏమి చేయ‌ద‌ల‌చుకొన్నారు ! హ‌త్య చేయ‌వ‌లెన‌నియె వీరి యూహ‌కావ‌లెను. కేవ‌ల‌ము బంధించి విడిచి పుచ్చిన‌చో మ‌ర‌ల త‌న సైన్య‌ముతో వీరి దేశ‌ముపై దాడిచేసి వీరిని తుత్తునియ‌లు చేయ‌గ‌ల ప‌రాక్ర‌మ‌శాలిన‌ని వీరికి బాగుగా తెలిసియేయుండును. పిరికిపంద‌లు ! వెన్నుపోటు పొడుస్తున్నారు...ఒక్క క‌త్తి ! ఒక్క చిన్న క‌త్తిని నాకిచ్చి వీరంద‌రూ నాతో పోరాడిన‌ట్ల‌యిన‌, నాభుజ‌శ‌క్తిని చూడ‌గ‌ల‌రు...కాని, వీరినుండి త‌ప్పించుకొనుట త‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం. ఎలా ! ఎలా !

ర‌ఘునాథున‌కు ఒక ఊహ పొడ‌మిన‌ది, అశ్వ‌ములీ కొండ‌నుచుట్టి కొంత ముందున‌కు పోవున‌ప్పుడు, అక్క‌డ ఒక అర్ధ‌క్రోశ‌ము యేర‌స‌న్న‌ని దారియున్న‌ది. ఆ దారి చుట్టుప‌క్క‌ల అన్నియు చిన్నిచిన్ని పొద‌లున్న‌వి. తాను తెలివిగా అక్క‌డే త‌ప్పించుకొన‌వ‌ల‌యును. త‌న ప‌థ‌క‌మును వారు ప‌సిగట్టిన‌చో తాను ప్రాణ‌ముల‌పై నాశ వ‌ద‌లుకోవ‌ల‌సిన‌దే. అంతా దైవేచ్ఛ ! అష్టాక్ష‌రిని హృమ‌య పూర్వ‌క‌ముగ ముమ్మారు మ‌న‌నం చేసికొన్నాడు.

విదేశీయుడు గుఱ్ఱ‌మునాపినాడు. వింత‌వాస‌న ! ద్ర‌వ‌ము తాగుచున్న చ‌ప్పుడు. మ‌ధువు కావ‌చ్చును.

త్వ‌ర‌లో వీని బుద్ధి మంద‌గించ‌వ‌చ్చును. అని అనుకొన్నాడు ర‌ఘునాథుడు. ర‌ఘునాథుని క‌ర్ణ‌ములు శ‌బ్ద శ్ర‌వ‌ణ‌మున‌కు ఏకాగ్ర‌మైన‌వి. త‌న వెనుక అశ్వ‌ప‌ద‌ఘ‌ట్ట‌న ఘోష‌లేదు. క‌నుక తాను అంద‌రిక‌న్న చివ‌ర‌గ యున్న‌ట్లుగ యెంచ‌వ‌చ్చును. ఇంత‌వ‌ర‌కు చుట్టునూ గుఱ్ఱ‌పు డెక్క‌ల చ‌ప్పుడు విన‌వ‌స్తూనే ఉన్న‌ది. ఇక్క‌డ దారి వెడ‌ల్పు త‌క్కువ‌. ఒక్క‌టి లేక రెండు గుఱ్ఱ‌ములు క‌న్నా ఎక్కువ గుఱ్ఱ‌ములు ఒక్క‌మారు ప‌య‌నించ‌లేవు. త‌న‌ది చివ‌రి గుఱ్ఱ‌ము. త‌న వెనుక నెవ్వ‌రును లేరు. త‌న వీపునంటిన కైజారుమొన త‌ప్పిన‌ట్లున్న‌ది. మ‌ధుపాన‌ము చేయుచున్న రౌతుమ‌త్తుగ ప‌రాకుగ నున్నాడు.

ర‌ఘునాథుడు తార‌క మంత్రోచ్ఛ‌ర‌ణ‌ము చేసికొనుచు మెల్ల‌గా క్రిందికి జారినాడు. గ‌చ్చ పొద‌ల‌లోనికి దొర్లినాడు. పామువ‌లె ప్రాకి, ఒక పొద‌మాటున నిశ్శ‌బ్ద‌ముగ ఊపిరి బిగ‌బ‌ట్టి పండుకొనినాడు. ఆ సైనికుడు ఏవో ఈల శ‌బ్ద‌ములు చేయ‌చూ ముందున‌కు సాగిపోయిన ధ్వ‌ని, ఆ త‌రువాత కొంత‌సేప‌టికే పిరంగుల మ్రోత ర‌ఘునాథున‌కు విన్పించిన‌వి. మ‌రికొంత కాల‌మున‌కు అంత‌టా నిశ్శ‌బ్ద‌మైన‌ది. దైవాన్ని త‌ల‌చుకొని విశ్వ‌సించినారు. బాహుబంధ‌ముల‌ను విడిపించుకొన పెన‌గ‌లాడ సాగినాడు. బ‌హు ప్ర‌య‌త్న‌ముతో బంధ‌ములు విడ‌గానే క‌నుల‌కు క‌ట్టిన వ‌స్త్ర‌మును కూడా విప్పికొని పొద‌ల‌మాటు నుండి వెనుక‌కు న‌డ‌క సాగించినాడు.

శ‌త్రుభ‌య‌ము తొల‌గిన‌ది. మ‌ర‌ల తండ్రీ గురువుల న‌డుమ పొడ‌సూపిన భేదాభిప్రాయ‌ము జ్ఞ‌ప్తికి వ‌చ్చిన‌ది. ఇద్ద‌రూ ఉత్త‌ములు ఇద్ద‌రికీ తాన‌న‌న అమిత‌మైన ప్రేమ‌. ఇద్ద‌రికీ త‌న క్షేమ‌మున‌కు మించిన‌ది యేదిన్నీ లేదు. తానెవ‌రి ప‌క్ష‌ము వ‌హించి రెండ‌వ వారిని చిన్న‌బుచ్చ‌గ‌ల‌డు ? ఎవ‌రినీ వ్య‌తిరేకించ‌లేడు. ఇరువురూ త‌న‌కు కావ‌ల‌సిన‌వారే. త‌న ప‌ట్టాభిషేక‌ము గురించి క‌దా వారి బాధ‌. రేపు ద‌శ‌మినాడే కావ‌లెన‌న్న‌ది గురువుల‌కాంక్ష‌. ఈ న‌వ‌రాత్రులు దాటిన త‌రువాత‌గాని చేయ‌రాద‌న్న‌ది పిత్రుదేవుల ఆంక్ష ! తాను పొర‌పాటు చేసినాడు. పిట్ట‌ల‌పోరు పిల్లి తీర్చిన‌ట్లు త‌న‌ను విరోధులు ఎత్తుకొనిపొయి స‌మ‌స్య‌ను తేల్చివేసినారు. తాను మ‌ర‌ల‌ వారి నుండి ఎందుకు త‌ప్పించుకొన్న‌ట్లు ! తాను లేక‌పోయిన తండ్రిగారే గురువుల సాయ‌ముతో ఇంత‌కు పూర్వ‌మువ‌లెనే రాజ్య‌మునేల గ‌ల‌రుక‌దా ! అంతేనా ? అన కొఱ‌కు దుఃఖించ‌రా ? తాన‌గ‌ప‌డ‌క పోయిన‌చో గురుదేవుల‌కు కాలుచేతులాడునా ? ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే తండ్రిగారి హృద‌య‌ము వ్రక్క‌లుగాక మాన‌దు. గురుదేవులు తీవ్ర‌ముగా గాయ‌త్రీజ‌ప‌ములో మునిగిపోయి ఉంటారు. వారి దీవెన‌, వారి మంత్ర‌శ‌క్తీ తోడ్ప‌డ‌క‌పోయిన‌ట్ల‌యిన ఇంత సులువుగా విరోధిక‌బంధ హ‌స్త‌ముల నుండి విడిపించుకొన గ‌లుగుట త‌న‌కీనాడు సాధ్య‌ప‌డేనా !