1922 లో నాన్న గాంధీజీ పిలుపువిని జైలుకి వెళ్ళారు. కొద్దిరోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచి తరువాత కడలూరు జైలుకి పంపించినారు నాన్నని. జైలులో ఉండగానే నారాయరణరావు నవల రాయటం మొదలు పెట్టారు. ఆయనకి తెల్ల కాగితాలూ పెన్సిలు లభ్యం కావడానికి చిత్రమైన అవకాశం లభించింది. నాన్నకి హస్త సాముద్రికం వచ్చును అని ఎలా తెలిసిందో జైలు సూపరెంటెండింట్‌కి. ఆయనస్వయంగా వచ్చి నాన్నని హంతకులు ఉండే సెల్ దగ్గరకి తీసుకు వెళ్ళి యిద్దరు ఖైదీల చేతులు చూడమన్నారు అందులో ఒకరికి ఆయుర్ధాయం ఉంది. ఈ విషయం నాన్న చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయారు. నాన్న చెప్పింది అక్షరాలా నిజం ఒకరికి వెంటనే ఉరి తియ్యమనీ ఒకరికి యావజ్జీవ కారాగారవాసమూ విధిస్తూ ఆర్డర్సు వచ్చాయి. ఆ విషయం నాన్నకి తెలియజేసి నాన్నని అభినందించారు. ఆయనే నాన్నకి కాగితాలూ పెన్సిళ్ళూ సప్లయి చేశారు.
సంవత్సరం యిట్లే గడిచిపోయింది. నాన్నతో పాటు శ్రీ కొండా వెంకటప్పయ్యగారు, శ్రీ వేలూరి సత్యన్నారాయణగారు, శ్రీ ముష్టి సుబ్రహ్మణ్యంగారు ఉన్నారు. అప్పటి ఫోటో ఉంది. అదీకాక నాన్న జైలులో తనతోపాటు ఉన్న స్నేహితులవి, జైలరు, సూపరెండింట్ వగైరా వారివి బొమ్మలు స్కెచ్‌బుక్‌లో వేశారు. వారి పేర్లు అందులో ఉన్నాయి. 1923లో జైలునుంచి వచ్చాక మద్రాసులో బి.యల్. చదివి డిగ్రీ తీసుకున్నారు. భీమవరంలో కొన్నాళ్ళు ప్రాక్టీసు పెట్టారు.
అంతకుముందే అనుకుంటాను, బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రమోదకుమార ఛటర్జీగారి దగ్గర చిత్రలేఖనం నేర్చుకున్నారు. చిన్నప్పటినుంచీ బొమ్మలు బాగా వెయ్యగలిగినా గురువు ముఖతావస్తేనే పరిపూర్ణత్వం లభిస్తుంది కాబోలు. తిక్కన బొమ్మకు అఖిలభారత చిత్ర కళా ప్రదర్శనంలో ప్రథమ బహుమతి వచ్చింది.
1932లో నారాయణరావు నవలకు ఆంధ్రా యూనివర్సిటీ ప్రథమ బహుమతి వచ్చింది. 1934లో బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1937లో కాబోలు శ్రీ సి.పుల్లయ్యగారి ఆహ్వానం పై ఒక నెల రోజులు సెలవు పెట్టి కలకత్తా వెళ్ళి సతీఅనసూయ - ధృవ విజయం చిత్రానిక కళాదర్శకులుగా పనిచేశారు. ఆ తరువాత గుంటూరులో మకాం పెట్టి కళాపీఠం నిర్వహించారు. బందరులో ప్రిన్సిపాలుగా ఉన్నప్పుడు శ్రీ మట్నూరి కృష్ణారావుగారు నిర్వహించే సాహిత్య సమావేశాల్లో కవిమిత్రులతో పాటు పాల్గొనేవారు. 1938-1940 మద్రాసులో నివాసం. మీరాబాయి చిత్రానికి కళా దర్శకత్వం నిర్వహణ. చిత్రపు నరసింహారావుగారు తియ్యాలనుకొన్న దక్షయజ్ఞానికి కూడా యీయన చాలావరకు పని చేశారు. ఈ చిత్రం తీయడం జరిగిందో లేదో తెలియదు.
మళ్ళీ గుంటూరు మకాం. 1943 నుండి 1947 ఆగష్టు ఫస్టువరకూ హైదరాబాదు మీజాను పత్రిక సంపాదకులుగా పనిచేశారు. అప్పుడే మిగతా అయిదు పెద్ద నవలలు రాయడం జరిగింది. కధలు, పాటలు ఒకటేమిటి ? ఆర్థికంగా ఇతరత్రా కూడా హైదరాబాదు నివాసం వారి జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖింప వచ్చును. అలాగే రాజమండ్రీ విద్యార్థి జీవితంకూడా. 1949 మా వివాహాలు అయ్యాక తిరిగి మద్రాసుకు వచ్చారు. 1951లో సిలోను వెళ్ళివచ్చారు.
మొత్తంమీద జీవితం వడ్డించిన విందు భోజనం కాకపోయినా ఆనందంగా గడిపారు. ఎన్నో సంఘటనలు ! అన్నీ వివరంగా రాస్తే ఎన్ని పేజీలయినా చాలవు. నాకు యీనాటికీ మనశ్శాంతి కలిగించే విషయం ముఖ్యంగా ఒకటి ఉన్నది. అందరూ అనుకొంటున్నట్లు మా నాన్నగారి చివరి రోజులు ఆర్థికమైన ఇబ్బందులకు గురికాలేదు. అంతకు ఎన్నైనా బాధలు పడి ఉండవచ్చును ! మద్రాసులో స్థిరపడాలనీ అందుకు కొంత సంపాదన అవసరమనీ భావించి ఆ ప్రయత్నాలు చేసి, ఫలించక ఆవేదన పడ్డారు, ఆందోళన పడ్డారు. తన ఆస్తి ఖర్చుపెట్టడానికి యిష్టపడలేదు. బాగా సంపాదించి మాకు ఏ విధమైన లేటూ లేకుండా ఏర్పాటు చెయ్యాలని తపన పడ్డారు. తాత్కాలికమైన ఇబ్బందులు పడటం, కొద్దిపాటి అప్పులు చెయ్యటం నేరమేమీకాదే !
ఆయన ఆఖరి రోజుల్లో చాలా బాధలు పడ్డారిన, కొందరు అర్థిక సహాయం చేశారనీ రాశారు. బీదరికం శాపమనను. నిజానికి మనిషి అప్పుడే అన్ని విధాలా అదుపులో ఉంటాడు. నాన్నకి అలాంటి ఇబ్బందులు సంభవించి ఉంటే బాధపడను. అలా జరగలేదు. నాన్నాగారు ప్రాస్తేటెక్టమీ ఆపరేషన్ కోసం రాయపేట హాస్పటల్‌లో ఎడ్మిట్
కాగానే మా బాబయ్య అడివి సత్యన్నారాయణ గారు కొంత డబ్బుతో మద్రాసు వచ్చేసి అన్నగారి దగ్గరే ఉన్నారు. నువ్వు నా చెయ్యి పట్టుకుని కూర్చుంటే చాలు. నాకు ఎక్కడ లేని ధైర్యమూ వస్తుంది అనే వారు నాన్న. శ్రీ డాక్టరు ఎ.యస్. రామకృష్ణ చేసిన ఆపరేషన్‌కి శ్రీ బాపిరాజు మేనల్లుడు శ్రీ డాక్టరు బుద్ధవరపు కృష్ణారావు, స్నేహితులు శ్రీ డాక్టరు గోవింద రాజుల సుబ్బారావు, శ్రీ డాక్టరు సి. సత్యన్నారాయణగార్లు కూడా హాజరయ్యారు.
పూర్తి ఆరోగ్యం వచ్చింది. నారాయణరావు నవల స్వయంగా అచ్చువేయించుకుంటున్నారు. ప్రూఫ్ కరక్షన్ హాస్పటల్ లోనే చేసేవారు. పెదపవనిరాణిగారు, లక్ష్మీదేవిగారు వారి బిడ్డలకు విద్య నేర్పినందుకు పారితోషికంగా వెయ్యిరూపాలయు యిస్తామంటే నాన్న ఒప్పుకోలేదు. నొటురాసిచ్చి అప్పుగా తీసుకుని నారాయణరావు ఆంధ్రపత్రిక ఆఫీసులో ప్రింటు చేయించటం ప్రారంభించారు. ఆపరేషన్ అయ్యాక వారి వనలలు త్రివేణి పబ్లిషర్సు భావరాజు నరసింహారావుగారికి ప్రింట్ చేసే హక్కులతో యిచ్చారు. నారాయణరావు నవలవల్ల వచ్చిన డబ్బుతో వారి ఆఖరి రోజులు ప్రశాంతంగా నిశ్చింతగా గడిచాయి. నిజం తెలియని వారు రాసే రాతలు నాకు విపరీతమైన దుఃఖాన్ని కలిగించాయి.
సిలోను వెళ్ళి తిరిగివచ్చేటప్పుడు కొంత డబ్బు తక్కువయి అనూరాధపురా అర్కిలాజికల్ డిపార్టుమెంటులో పనిచేసే శ్రీ వీరసింఘేగారి వద్ద 150 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ విషయం నాకూ బాబయ్యకీ చెప్పి ప్రభుత్వం వారు మిగిలిన డబ్బు యివ్వగానే సిలోను పంపాలి అని చెప్పారు. ఆ నూట యాభై రూపాయలూ శ్రీ వీరసింఘేగారికి మేము స్టేట్ బ్యాంక్ ద్వారా పంపాము. రసీదు కూడా వచ్చింది. శ్రీ కాటూరి మామయ్యగారు, డాక్టరు సి.సత్యన్నారాయణ గారు నాన్నను ఖర్చుపెట్టనివ్వక వారు ఖర్చుపెట్టే వారు శ్రీ కృష్ణశాస్త్రి బాబయ్యగారు ఎన్నడూ నాన్నకి ఆర్ధిక సహాయం చెయ్యలేదు. చేసినా నాన్న ఏ మాత్రం ఒప్పుకోరు. అంతేకాదు ఎవరినీ దేవిరించి డబ్బుఅడుగలేద. ఇబ్బందులు వస్తే మౌనంగా తట్టుకున్నార. డబ్బు వస్తే బాగా ఖర్చు పెట్టేవారు. కొందరికి ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన తన కుటుంబాన్ని పెంచుకున్నారు. ఆశ్రితులు శిష్యులు కూడా ఉండేవారు.
క్షమించండి ఒకసారి వెళ్ళిరావాలి. భీమవరంలో సుహృత్ పరిషత్తువారు శ్రీ చెరుకువాడ సుబ్బారావు శ్రీ అత్తిలి సూర్యనారాయణమూర్తి శ్రీ చోడవరపు రాధాకృష్ణ శాస్త్రి మొదలయినవారు నాన్నకి కనకాభిషేకం చేసారు. ఆ సందర్భంలో వారి మేనల్లుడు శ్రీ బుద్ధవరపు కామరాజు, శ్రీ కృష్ణారావుగార్లు ముఖ్యపాత్ర వహించి పాల్గొన్నారు. ఆయన స్నేహితులు, అభిమానులు శిష్యులు అంతా వచ్చారు, ఆ గౌరవాన్ని అందుకుంటూ నాన్న యిలా అన్నారు ! ఈ సన్మానం నాకు కాదు. నాలోని శశికళాదేవికి. ఇది ఒక విధంగా శశికళారాధన, ఆ సమయంలో నాన్నపై చక్కని గేయాలు రెండు రాశారు. రాచకొండ నరసింహమూర్తిగారు. నాన్నను పోగొట్టుకొన్నాక, నా దుఃఖాన్ని కొంచెం మళ్ళించడానికి సుహృత్‌పరిషత్తువారు నిర్వహించే నాన్న వర్థంతి సందర్భంలో నేను కూడా పాలుపంచుకునేట్టు చేశారు.
1952 సెప్టెంబరు 22 మహా భయంకరమయిన రోజు రానే వచ్చింది. మా నాన్న మమ్మల్ని విడిచి భగవంతుని (ఉన్నాడని నమ్మితే) మెడలో ఆణిముత్యాలహారమై చేరేందుకూ, ఈ భూమి పరిధికావల కోటి కోటి యోజనాల దూరంలో ప్రవహించే కాంతి వాహినిలో తానూ ఒకతరంగమై ప్రవహించేదుకూ మహాప్రస్థానమయి వెళ్ళిపోయారు. దుఃఖంతో శిలనై, గడ్డకట్టుకుపోయాను.
ఒకమారు కన్నీరు, ఒలికినంతనె నీవు
బతిమాలుతూ నన్ను బుజ్జగించావూ !
ఈ రేయి నా కనుల, వారాశి పొంగినా
కనుపింపగరావు, కలనైనా నీవూ !
ఎటులోర్తునో యింక, జటిలమగు యీ బ్రతుకు
కారుమబ్బులు కదిలి, కమ్మినవి లోకాల
శిలఅయ్యె నా మనసు, కలకాదు కఠినమై
కాలమే నాతోటి, మేలమాడిందీ !
ఇలా ఎన్ని రాసుకుని ఏంచేస్తే నా దుఃఖం తగ్గుతుంది ? నేనిలా ఏడుస్తూ పడిఉంటే నాన్న ఆత్మ తల్లడిల్లి పోతుంది. నెమ్మదిగా వారిచ్చిన శక్తితో లేచి బాధనంతా అట్టడుగుపొరల్లో దాచేసి నా వారి కోసం బ్రతికి ఉన్నాను. ఎన్నాళ్ళకో ముక్తి నాకు, నాలా ఎన్నతగోండ్రికి కరుణ ఎప్పుడో ?
ఊహల ఉయ్యాలలో
(ఆహ్వానము)
ఓ కవీ రావోయి, మా కవీ రావోయి
నా బ్రతుకు నా పూజ నీకోసమేనోయి
ఓ కవీ రావోయి ! మా కవీ రావోయి !
అనంతమీ విశ్వమావల
అందమే ఉన్నదని, ఆనందమున్నదని
అనుసరించితి వీవు ఆ లోకపధమూ ! || ఓ ||
నీ గుండె లోతులో, వాకలై తేనియలు
లోకేశు నవ్వులై, లోకాల పర్వినవి || ఓ ||
మానవుల హృదయాలు, మధుర పరీమళాలు
లోకాలగాథలూ, మూక బాధార్తులూ
సకల విషయము నీవు, సందేశ మిచ్చావు || ఓ ||
గంగా తరంగాలు, పొంగి నీ భావాల
ప్రవహించి, ప్రవహించి పరమపావనమౌదు
వివిధ రాగాలలో వినిపించే గీతాలు ! || ఓ ||
ఏ మహాశాంతి పుంజమ్ములో
ఏ భావనాద్భుత ప్రతిభలో
ఏ నవరసానందమ్ము లో
మలచుకొన్నావు, నీ బ్రతుకు మంజులాత్మా !
ఏ దూరతీరాల, నేదారి నడచావో
ఏ వెలుగులో చేరి ఏకమయి పోయానో || ఓ ||
చిత్రమయి, శిల్పమయి, కావ్యమయి, కధనమై
మా గుండె మీటించి, మాటలాడావూ
కోటిగొంతులు చేరి, పాటపాడావూ !
ఓ కవీ రావోయి, మాకవీ రావోయి
నాబ్రతుకు నా పూజ నీకోసమేనోయి
ఓ కవీ రావోయి, మా కవీ రావోయి !
నాన్నా ! నిన్ను ఈ లోకానికి రమ్మనే ధైర్యమూ సాహసమూ నాకులేవు. ఆ రోజుల్లోనే, అడుగు అడుగున కీప్రపంచపు చెడుగు హృదయము లెన్నో చుట్టీ కడుపునకు, ఇసుమంత దొరకని, బడుగు బ్రతుకుల, తూలునడకలో, మధుర మెక్కడ, మంజులత లేవీ అని ఆవేదనపడు ఆ పరిస్థితుల్లో చిక్కుకుని అలమింటచేవారికి స్వర్గమెలా లభ్యమౌతుంది ? మార్గమేమిటి ? అనుకుంటూ తల్లడిల్లిపోయావు. ప్రేమ. నీతి., నియమం లేని తామసులతో దట్టంగానే ఉంది యీ లోకం. డబ్బు గుణాన్ని పొగిడేవారే అధికారంలో ఉన్నారు. కోపతాపాలతో మండిపోతూ కుములుతున్నాయి రాష్ట్రాలు. రాబోయే కాలం యిలా ఉంటుందన్న ఊహే నువ్వు భరించలేకపోయావు అలాంటిది మళ్ళీ యీ లోకానికి ఎందుకు రమ్మంటావు ! పాలమీగడ వంటి మనస్సుగల నువ్వు తట్టుకోలేవు.
అయినా తప్పదు. అక్కడనుండే ఇటు దృష్టిసారించి నీ ఆశీస్సులందించి మా ఆనందంలో భాగం పంచుకోమని ప్రార్థిస్తూ నిన్ను ఆహ్వానిస్తున్నాను. నువ్వు నన్ను వదలి వెళ్లాక జరిగిన కొన్ని విషయాలు నీకు వినిపిస్తాయన్న నమ్మకంతో చెప్పుతున్నాను. నీ అభిమానులు నిన్ను తలచుకొంటూ, కన్నీరు మున్నీరవుతూ, సభలు సమావేశాలు జరిపారు. ఎన్నో పత్రికలు తమ భక్తిని వెల్లడించుకున్నాయి. శశికళ గేయసంపుటి అచ్చువేయించాడు. ఆర్.భధ్రిరాజు మామయ్య. అంతేకాదు. కులపతి ప్రత్యేక సంచిక వెలువరించాడు. అందులో నీ మేనల్లుడు శ్రీ బుద్ధవరపు కామరాజుతో పాటు ప్రముఖులెందరివో రచనలున్నాయి. నీ మనుమలు నువ్వుండగా రాలేకపోవడం దురదృష్టం అనుకుంటున్నారు నాతోపాటు నీ యందుభక్తినీ , అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్న చిరంజీవులు శ్రీ తిరుపతయ్య, శ్రీ మన్నవ సత్యనారాయణ, శ్రీ వి.సిమ్మన్న, శ్రీమతి డి. విజయలక్ష్మి, ఉస్మానియా, నాగార్జున, ఆంధ్రా, వెంకటేశ్వరా యూనివర్శటీలలో ఏ సాహిత్యంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. డిగ్రీలు పొందారు. డాక్టరేటు గౌరవాన్ని అందుకున్నారు. శ్రీమతి డాక్టరు డి. శ్యామలాదేవి నీ సాహిత్యంపై పరిశోధన చేసి డి.లిట్. తీసుకోవాలనే నిశ్చయంతో ఉన్నది. ఈ 1986 అక్టోబరు 8వ తేదీన నీ పుట్టినరోజు ఘనంగా జరుగబోతున్నది.
నాన్నా సత్యమూ, శీలమూ, సాధుత్వమూ, శాంతమూ, అహింస మొదలగునవి సాధించగలిగితే అదే మధురమూ మంజులత్వమూ అన్నావు. అలాంటి స్థితిని సాధించి భువిలోనే స్వర్గాన్ని స్థాపించే మార్గాన్ని కనుకొనే ఆత్మశక్తిని మాకు ప్రసాదించమని వేడుకొంటున్నాను.
నాన్నా ! నీకిదే నమస్సుమాంజలి !!
అడవి బాపిరాజు రచన ఆంధ్రమాత !
జోత్యిర్మయి ఆంధ్రీ
జ్యోత్స్నావళి ఆంధ్రీ
త్రయీనాద పూర్ణ కంఠి
ద్వయీమూర్తి అద్వైతీ || జో ||
సర్వతంత్ర స్వాతంత్ర్యీ
ఖర్వ రహితనీతి మంత్రి
నిర్వక్రమ నిక్రమాంశు నిర్మల పూర్ణేంచుమూర్తి
అర్థ చంద్ర ధవళాసన్
అలంకృత సువర్ణ వదన
దయామయీ తెలుగుతల్లి
అమరకథా పూర్ణవల్లి || జో ||
|