ఈ మగవారి బడాయిలు చూడు, ఒసే, ఏమే, ఇదుగో, అవునే, ఓతువాలా, ఓ తలుపూనిన్నేనే అనేవే వీళ్ళబడాయిలు.
అంతే. డాక్టరు చర్చను పక్కదారి పట్టిస్తాడు. మాటమాటకూ పక్కదారి దొక్కేమాటలీ నవలలో కోకొల్లలు.
మరోసందర్భంలో మొహరున్నిసా అనంతలక్ష్మి మాటాడుకుంటుంటారు. మొహర్‌కు బావ రియాసత్ ఆలీ అంటే ప్రాణం. తానతని పాదాల మీద వాలగా ప్రాణేశ్వరీ, నా చిన్నారిచిలకా అంటాడని అనబోతుంది. ఆ మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ ఇలా అంటుంది అనంత. నిన్ను కాబోయే మీ ఆయన నాబుల్‌బుల్ - నా రోజా - నాదిల్‌కుష్....ఇద్దరూ పక పక నవ్వుతారు.
కలలోకి వచ్చాడు :
ప్రథమ వీక్షణంలోనే అనంత హృదయంలో ముద్రవేసుకున్నాడు కోనంగి. అతణ్ని గురించే ఆలోచిస్తున్న కూతురును తల్లి హెచ్చరిస్తుంది. అతడు పెద్దమనిషిని తెలుసుకున్నాను అంటుంది తల్లితో.
పెద్దమనిషి అయితే కావచ్చును, మనకెందుకా గొడవ అంటుంది తల్లి.
ఆ అబ్బాయి కలలోకి కూడా వచ్చాడు అంటుంది అనంత.
కలలోకివస్తాడు, తలలోకి వస్తాడు, బుద్ధిలేక పోతేసరి.... అంటుంది జయలక్ష్మి.
యమ సీరియస్ సన్నివేశాల్లో కూడా హాస్యాన్ని చొప్పించడం అందరికీ సాధ్యం కాదు - బాపిబావకు తప్ప.
పైపళ్లు - ఓ టన్ను గులాబీల ప్రోగు :
వరుడు కావాలి శీర్షిక చూసి తన టీకూ - టాకూ ప్రదర్శించడానికి బందరునుండి మద్రాసు వచ్చాడు కోనంగేశ్వర్రావు. తన ప్రదర్శన సంగతి ఎట్లున్నా సీతాదేవిని చూశాడు, ఆమె ఆగమనం బెట్టిదనగా -
......ఆ ఇంట్లోనుంచి, నూటయాభై రూపాయల ఖరీదుగల బెనారసు జరీపూవుల నూరు నెంబరు ఆరుగజాల నూలుచీర ధరించి, చిన్న ఐరావతం వంటిదిన్నీ, తెల్లని పళ్ళెత్తుగలిగినదిన్నీ, బాలిక ఒకరు రెండు జడలతో, ఎత్తు మడమల జోళ్ళతో చక్కా వచ్చింది..... డ్యాడీ, వరుడు వచ్చాడనుకొంటా, ఈయనేనా అని ప్రశ్నించింది. ఆ అమ్మాయిపై పళ్ళు నాలుగు బాగా ఎత్తుగా ముప్పది డిగ్రీలు ముందుకువచ్చి, క్రింది పెదవిని కప్పుతూ పై పెదవిని ముక్కుకంటిస్తూ ఉన్నాయి.......ఆమె కారెక్కి చక్కాపోయింది.
కోనంగి అలా దిగ్భ్రమపడి ఆ చక్కని ఒకటన్ను గులాబీపూవుల ప్రోవులాంటి పెళ్ళికూతురును తలచుకొంటూ కొంటూ కొంటూ ఉన్నాడు.
ఎంత కొంటెకోనంగి అయితే ఇలా వర్ణిస్తాడు !
ఇంతకెవరా కోనంగి ! ఇంకెవరూ బాపిబావే !
అపురూపం :
కాని ఇదేకోనంగి తనప్రాణం అనంతలక్ష్మిని అపురూపంగా వర్ణించాడు. ఒక్కమాటా బయటికి రాలేదు. అంతా అంతర్గుడగుడాయతే....
ఏమిటి ఈ బాలిక అందం ? అసలయిన అలమండ మామిడితాండ్ర ! వేయిసిసలైన పచ్చకర్పూరపు డబ్బాలు గుమ్మరించిన ప్రోగు ! అయిదువందల ఎకరాలలో పడిన కాశ్మీరపు కుంకుమ పూవులరాశి ! వికసించిన పూవులతో నిండివున్న కోటి గులాబీ పూవుల చెట్లున్న దివ్యక్షేత్రం !! క్షేత్రయ పాటలన్నీ వీణమీద వాయిస్తూ పాడిన తీయని కంఠంలోంచి వచ్చిన నూరురాగాలమాలిక !! మదరాసు మాలికా కారులు కట్టిన జరీదారాలతో తళ తళలాడే పెద్ద చామంతుల దండలు వరసగా వేసిన కంఠంగల ప్రపంచ సుందరుల ఎన్నికలో మొదటగా నెగ్గిన విశ్వసుందరి !!!!
ఇంకేముంది తనహృదయం ఆగిపోయింది. ఆగిపోవడమేమిటి ? ఉండవలసిన స్థలంలోలేదు. అదుగో ఆమెపాదాలక్రింద కోటి కోటి కోటి పరమాణువులై పోయినది.
ఏంపలికినా, ఏం గిలికినా ప్రత్యక్షరంలోనూ పఠితను ఆనందంలో ముంచాలనే కోనంగి వాంఛ.
భార్యకు బందరు చూపిస్తూ కొట్టిన పేరడీ తిరుపతి వేంకటకవులనే మురిపించింది.
అదియే బందరు. అల్లదే కనుము పట్టాభీ మహా నాయకుండదియే....
ప్రేమంటే :
ప్రేమంటే కవులు వర్ణించిన ప్రేమో - కాదో నాకు తెలియదు అంది సారా. ఈ విషయం అయిదారు రకాల కవులనడగాలి అన్నాడు కోనంగి.
ఒకరు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు పూర్వ కవుల ఆఖరుకావు , తర్వాత రాయప్రోలు సుబ్బారావుగారు నవ్యకవుల ప్రథమ సంతానం. ఆ తర్వాత శ్రీ శ్రీ నవ్యకవిత్వంలో వంకర బొమ్మ, ఆ తర్వాత గోపీచందు ఎక్కడా విత్తుకుపుట్టని ఆర్బిడ్ కవిత్వం. ఆ తర్వాత విద్వాన్ విశ్వం అభ్యుదయ పరంపరాభి వృద్ధిరస్తే కవి. ఇంకో అదోరకం వాళ్ళలో చిన్ని చిన్ని చిన్నారి వాళ్ళందరినీ జమకడుదాం !
ఈ మాటలన్నీ విన్న సారా ఏమిటీ పిచ్చి సంభాషణ అంది. అవును పిచ్చే, ఎవరికీ కోనంగికీ, బాపిబావకూ, మనకూ.
కాని ఇదే కోనంగిని ప్రేమ విషయంలో మీ అభిప్రాయమేంటని రెడ్డి అడిగినప్పుడు ప్రేమా అండి ! ఒక పురుషుడూ ఒక స్త్రీ న్నీ రాసాయనికంగా కలిసి మిశ్రమైపోదామన్న కాంక్ష ! అంటాడు. అప్పుడే దేహం కలయిక ఒకటేకాదు, మనస్సూ, ఆత్మాకూడా కలవా అంటాడు.
ఓ సారి అనంతలక్ష్మి ఉపాధ్యాయ వృత్తి చాలా మంచిదంటారు కాదా అని అడిగితే, మంచిదే ! గోవుమాలచ్చిమి వంటిది ఆ వృత్తి. అందులో దిగితే గోవునో, గొర్రెనో లేకపోతే గాడిదనో అవడానికి సావకాశం వుంది అంటాడు కోనంగి.
గర్భ నిరోధకాల జోక్ :
శుభమా అని కోనంగి పెళ్ళి చేసుకుంటే డాక్టర్ రెడ్డి గర్భ నిరోధక విషయాన్ని ప్రస్తావిస్తాడు.
నువ్వు గర్భనిరోధక విషయాలేమన్నా ఎప్పుడన్నా చదివావా
గర్భ నిరోధకం ? నాకు గర్భం వస్తుందని నేనెప్పుడన్నా భయపడితేకదా ?
ఆ తర్వాత ఇద్దరి మధ్య హాస్య సంభాషణ కొనసాగుతుంది. డాక్టరుకు కోపం వచ్చి నీకు ఎంత బుద్ధి చెప్పినా ఈ హాస్యంగా మాట్లాడడం మానవు అంటాడు.
నాకీ ప్రపంచమంతా పెద్ద జోక్
తక్కినవాళ్ళకిది పెద్ద షాక్
డాక్టరు రెడ్డికి కోనంగికి మధ్యన ఇలాంటి జోక్‌లు ఎన్ని ప్రేలాయో లెక్కలేదు. మచ్చుకొక్కటి రెండు. పోలీసులు ఇద్దరినీ జైలుకు తీసుకొని వెడుతూ దారిలో కమ్మని టిఫిన్లు పెట్టారు.
ఈ మర్యాద అత్తవారి మర్యాదలనే వుందోయి అన్నాడు కోనంగి.
ఒక అత్తవారింట్లోంచి ఇంకో అత్తవారింట్లోకి వెడుతున్నావు
నీకిది మొదటి అత్తవారిల్లేగా
అవునయ్యా, భార్యమాత్రం లేదుగాని
ఇలాంటి మాటలే గాకుండా ఈ ఇద్దరూ పరస్పరం అభినందన పూర్వక విశేషాల్ని ప్రయోగించుకుని ఒకరి వీపు ఒకరు గోక్కున్నారు.
డాక్టరు కోనంగిని అన్నవి :-
ఓయి వంకర బుర్రకొక్కిరాయిగారూ ! జాపకుండ చేతిరాయా ! చీపురుకట్టహస్తా....
కోనంగి డాక్టరునన్నవి :-
ఓయి ఎక్సరే బుర్రగల వైద్య శిరోమణిగారూ ! కత్తిచేతరాయా, స్టెతస్కోపు ఆయుధహస్తా, ధర్మా మీటరు కొలతబద్ధ విభూషా......
చమత్కారం - అలంకారం :
బాపిరాజుగారి ఈ రచనల హాస్యం శబ్దార్థ వాక్య భావ సంయోజితమయ్యేగాక, అలంకారికోక్తుల్ని కూడా ఆశ్రయించి వుండడం గమనార్హం. సరసోక్తి. నర్మోక్తి, వక్రోక్తి, వ్యాజోక్తి, వ్యంగ్యోక్తి, ఛలోక్తి మొదలైనవన్నీ అలంకారిక భేదాలే. చూచే కంటినిబట్టి ఆలోచించే మనస్సునుబట్టి చమత్కారోక్తులతో కూడుకున్న ఈ అలంకారం ప్రత్యక్షమవుతుంది.
తనతోబాటు సినిమాలో నటించే కథానాయిక ముఖాన్ని గూర్చి వర్ణిస్తూ కోనంగి ఇలా అంటాడు. చంద్రబింబం అంటారేమిటి ? దానికి తరగడం పెరగడం వున్నాయి. నా నాయకురాలి మోము, అచ్చంగా తిరగాలి రాయిలావుంది.
కోనంగిని గూర్చి సినిమా కథానాయిక ఇలా అనుకుంటుంది. అందరినీ నవ్విస్తూ వుంటాడు. వట్టి అనాఘృత పుష్పంలా వున్నాడు. ఈగ వాలని రసగుల్లాలా వున్నాడు. వాయితీసిన ఇడ్డెనులా వున్నాడు.
కోనంగి జైలునుంచి తన భార్యకు వుత్తరం రాస్తూ ఈ ప్రయోగం చేస్తాడు. కాకిపిల్ల కాకికి ముద్దు అన్న సామెతలా ఆడకాకి మగ కాకికి హంసలా కనబడుతుంది.
కోనంగి సంపాదకీయం రాస్తూ అమెరికాను గూర్చి ఈ ఉపమానాలు వేశాడు. అమెరికా యుద్ధంలోకి రావడం యొక్క పరమార్థం వీరభద్రుడు దక్షయజ్ఞంలోకి ఉరకడం అన్నమాటే ! హనుమంతుడు అశోకవనంలోకి దూకడం అన్నమాటే.
మరోచోట జపాన్ విమాన దాడుల్ని ప్రస్తావిస్తూ దోమల ముసురూ మిడతల దండులా రావడమే అంటాడు. మరొక సందర్బంలో ఆలోచిస్తూ ప్రపంచం అంతా హాస్యంతో నిండి ఉంది. హిట్లరు స్టాలిన్ వంటి ప్రపంచ నాయకులు ప్రపంచ స్వరూపాన్నే మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచ శక్తి తిమింగలం అయితే దాని ముక్కుకు ఒక సన్నదారం కట్టి ఈ నాయకులు ఆ తిమింగలాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తారు. తిమింగలము తన దారిని తానే వెడుతూవుంటే తామే నడుపుతున్నామనుకుంటారు.
నియంతల మీద ఎంత సున్నితమైన దెబ్బ ఇది, గంధం ముద్దచేసి ముఖానికి కొట్టినట్లు పూలకుచ్చుతో ఎడాపెడా వాయించినట్టు, అలా కొట్టడం బాపి బావకే చేతనవుతుంది.
ప్రణయ ప్రశయం - ప్రార్థనా పారవశ్యం
కొంటె కోనంగి ఈ హాస్యాన్ని గూర్చి ఇలా రాసుకుంటూపోతే, కమ్ములు ఘుమ్ముమంటాయి, కొమ్మలు పూలకన్నులతో తొంగి చూస్తూ తమ రెమ్మల్ని మరచిపోతాయి. అందుకే చివరగా, అలిగిన అనంతలక్ష్మిని కోనంగి ఎలా వశీకరించుకున్నాడో గమనిద్దాం ప్రియురాలి ప్రణయపుటలుక తీర్చడానికి కోనంగి మోకరిల్లాడు.
వందే లక్ష్మీదేవీం
నా యొక్క ప్రాణేశ్వరీం, ఆత్మేశ్వరీం
నేను వట్టి డండర్ హెడ్డునుం
నీ హృదయానికి బాధ కలిగించినందుకు క్షమింపు మాం
నేను చేసిన తప్పిదానికి నీవు ఏవిధమైన శిక్షవేసినా
నేను భరింప సిద్ధముగా వుంటినః
లక్ష్మీస్తోత్రానికిది పేరడి. వందే పద్మకరాం ప్రసన్న వదనాం ఫక్కీ ప్రహసించింది. అనంతలక్ష్మి పకాలున నవ్వింది. వరదహస్తమూ, అభయ హస్తమూ పట్టి కోనంగిని కటాక్షించింది.
ఓయి భక్తుడుగారూనాం
నిన్న క్షమంచితినం, అహం
నీకు ఏ కోర్కె కావాలో
అది తీర్చ సిద్ధముగా వుంటినః
కోనంగి కరిగిపోయాడు. ఆనందంతో వెలిగిపోయాడు. అనంతవైపు చేతులు చాచి స్తోత్రపాఠాలు చేశాడు.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం,
దాసీభూత సమస్త దేవవనితాం !
ధర్మార్థ కామమోక్ష ప్రధాయనీం,
నా హృదయాన వాలిపోం,
నాకు రెండు చుంబనాలు ప్రసాదించుమీం
ప్రణయంలో ప్రళయం మాయమయింది. ప్రార్థన పరవశింపజేసింది. అది పరీరంభంతో ముగిసింది. ఈ కొంటె కోనంగి ఎంత గడుసుపిండం, ఈ అడవి బాపిరాజెంత అమృతభాండం.
హస్యపరమార్థం
కోనంగి హాస్యాన్ని ఆశ్రయించడంలోని అర్థాన్నీ పరమార్థాన్నీ ఆ నవలలోనే ఈ విధంగా విశదీకరిస్తాడు బాపిరాజు.
పుట్టిన బ్రతుకు అర్ధము లేనిదవడం వల్లనూ, అతనిలో అనంతమైన శక్తి ఉండడంవల్లనూ అతనికి హాస్యరసం శరణాగతమైంది. మానవజీవితంలో సంభవించే ఒడుదుడుకులకూ, కష్టనిష్ఠూరాలకూ బండిని కాపాడే స్ప్రింగులవంటిది హాస్యరసం. దుఃఖం అనే చెరువుగట్టుతెగితే ఆ నీరు వెళ్ళిపోయే తూము హాస్యభావం. హాస్యం అనే కాపుదల లేకపోతే మానవుని హృదయానికి దుఃఖఘాతం ఒక్కటి తగిలినా ముక్కలవుతుంది. మానవ జీవితం అద్దపు సామాను జాగ్రత్త వంటిది. ఆ సామాను విచ్చిన్నం కాకుండా రక్షించే ఉక్కు పెట్టె హాస్య రపం (పు. 106)
లోతుకు చొచ్చుకుపోయి మానవాంతఃకరణాల్ని కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి అమృత సారాన్ని అందించిన మహామనిషఙ అడివి బాపిరాజు, ఆయన కొంటె కోనంగి ఆంధ్రప్రజానీకాన్ని దెబ్బలు కొట్టాడు. లాఠీలతోకాదు, కొరడాలతోకాదు, పూల కుచ్చులతో - హాస్యపరిమళాన్ని నింపిన పూల కుచ్చులతో.
|