|
రచయిత యొక్క కావ్యలక్షణ వేతృత్యం, పూర్వసాహితీ పరిచయం :-
ఆధునిక యుగంలో యువతీయువకుల హృదయ వీణులపై ముగ్ధమోహన శృంగార శ్రుతులు మీటిన నండూరి సుబ్బారావుగారి యెంకి పాటలపై బాపిరాజు గారికీ అభిమానము మెండు. ఆ గేయాలలో కుదురుకున్న పూలమనసులు పూలబాసలు మొ|| లలితపద బంధాలు అభిమానం కొద్ది యిందు అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. (పుట. 19).
యెంకివంటి పిల్ల లేదోయి, లేదోయి !
యెంకి నావంకకింక రాదోయి, రాదోయి !
నీతోడె ఉంటాను, నాయుడుబావా !
నీమాటె యింటాను నాయుడు బావా !
అనే నండూరివారి యెంకి పాటల చరణాలను మనోహర కంఠస్వరంతో పరమేశ్వరునిచే పాడించి, నాయికయైన శారదాదేవి యొక్క అపూర్వ సౌందర్య రాసిత్వాన్ని, అభిజాత్య వైశిష్ట్యాన్ని, గుణగరిష్టత్వాన్ని, దుష్టశక్తుల దుష్టప్రభావాలవల్ల ఏర్పడిన నాయికా నాయకుల యెడబాటును, నారాయణరావు యొక్క మానసిక వేదనను, నాయికా పశ్చాత్తాపాన్ని ఆమె అనురాగమును స్థిరనిశ్చయాన్ని కావ్యార్థ సూచనవలె యిందు భంగ్యంతరంగా సూచించారు. మరియు మంగళాంతాని కావ్యాని అని రాజారావుచే అనిపించడం, రచయిత యొక్క కావ్యలక్షణ పరిజ్ఞానానికి ప్రోద్భలకంగా కనిపిస్తుంది. రాజారావు తథాస్తు అనడం దానికి వాదోడుగా రైలుబండి కూడ కూతకూయడం, రైలుగార్డు కూడ చేయెత్తి దీవించినట్లు జెండా ఊపడం, సమయానికి జమీందారు ప్రసాదరావుగారు ఆకస్మికంగా పరుగిడుచువచ్చి బండి ఎక్కడం మొ|| సంఘటనలు శారద నారాయణరావుల వైవాహిక సమాగమాన్ని సూచిస్తున్నాయి. భావోద్వేగంతో దొర్లిన నానుడులు, ఛందోబద్ధ వాక్యాలు ఆయన పూర్వ సాహితీ ప్రగాఢ పరిచయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చదువులలో మర్మమెల్లదివితి తండ్రీ ! కరాట విరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ ! అను భాగవత పద్యపాదముల వరవడిలో చదువులలో చిత్రమెల్ల చదివినా బాలా ! (పుట.14) జమీందారు విరాతు చేత నిడనమ్మ త్రిశుద్ధిగ నమ్ము శారదా (పుట.15) అను వాక్యాలు పద్యపాదాలుగా కూర్చబడ్డాయి. పాత్ర చిత్రణాది ప్రముఖ సన్నివేశాలలో సమయ శుద్ధితో యుక్తియుక్తంగా వాడబడిన ఉపమానాలు, దృష్టాన్తాలు, నిదర్శనాలు, అర్థాంతరన్యాసాలు, మొ||నవి ఈ రచయిత యొక్క అలంకార శాస్త్రవైదుష్యానికి నికషోపకాలు. ఉదా - నిర్జల భూమిలో నూయి త్రవ్వినట్లు (పుట. 35) మొ||నవి.
లలితకళాభిమానం
బాపిరాజుగారి లలితకళాభిమానం అపారమయినది. తాను సహజంగా కవి, చిత్రకారుడు, గాన కళాకోవిదుడై యుండుట దీనికి ముఖ్యకారణం. కాల్పనికోద్యమానికి చెందిన కవులలో యిట్టి విశిష్ట శక్తులు కానవస్తాయి. కవిత్వ, సంగీత, నాట్య,, చిత్ర, శిల్ప కళాప్రస్తావనలు తన సాహిత్యంలో ప్రస్తుత వాతావరణాలలో కూడ తనివితీర చేసిన కళాతపస్వి ఈయన. భావచిత్రణ రూపాలలో తన చిత్రకళా వైదగ్థాన్ని, వివిధ రేఖాంచిత రూప చిత్రణలో శిల్పకళా పటిమను, మనస్తత్వానుగుణ హావభావ ప్రకటన భంగిమలలో నాట్యకళా పాటవాన్ని మధుర కంఠాలతో శాస్త్ర బద్ధంగా ఆయా పాత్రలు చేసిన గానరూపాలలో సంగీత కళా కోవిదత్వాన్ని, సమయానుకూలంగా పాత్రలల్లిన పద్య గేయాల రూపాలలో తన కవిత్వ ప్రతిభను ప్రదర్శించారు. పరమేశ్వరమూర్తిచే చిత్రకళా ప్రస్తావన చేయించారు. (పు. 96) మానవజీవితమంతయు చక్కని చిత్రలేఖనమే ! (పుట. 47) అని తన సహజ చిత్రరేఖానుభవంతో జీవితాన్ని చిత్రలేఖనంతో చక్కగా పోల్చి నారాయణరావు చేత చెప్పించినారు. నందలాలు, ప్రమోదకుమార, అవనీంద్ర, ప్రసాదరాయ, దామెర్ల రామారావు మొ|| ప్రసిద్ధ భారతీయ చిత్రకాళాకారులు కూడ ప్రస్తావించబడ్డారు (పుట. 203) శారద వర్ణనలో గీతవాద్య ప్రస్తావన చేయుట (పుట. 14) పరమేశ్వరమూర్తి సహజ పంచమస్వనమున తేనెలూర సంగీతము పాడుకొనుట (పుట. 27) నారాయణరావు శామసుందరీదేవి యింటికడ తన స్వరభేదాలతో తోడి రాగాన్ని వాయులీనంపై ఆలపించడం, (పుట.163) ద్వారం వెంకటస్వామి నాయుడు, చౌడయ్య మొ||సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులను పేర్కొనడం (పుట. 31) మొ|| నన్ని వేశాలు రచయిత యొక్క అపరిమిత సంగీత కళాభిమానానికి తార్కాణాలు. నాటక కళాప్రస్తావన కూడ విపులంగా చేశారు. (పుట. 200, 201) సహజంగా పొంగివచ్చే కవితా స్రవంతీ లహరికాభంగిమలు ఆపుదామన్నా ఆగవు, దాచుకుందామన్నా దాగవు, అణచుకుందామన్నా అణగవు. ఇంగువను తొలగించినను దాని వాసన తద్వస్త్రాన్ని వీడనట్లు సహాజంగా పెల్లుబికివచ్చే బాపిరాజుగారి కవితాధార పరిమళాలు అనుకూలవేదికకానే నవలలో కూడ హృద్య రూపంలో గుబాళించాయి.
ఉ :- కుంచెకొసల్ విచిత్రలత గూర్చి మనోహర వర్ణభంగి మూ
ర్తించి పరీమళావృత శరీరరుచుల్ పొదిలించి కందమున్
పంచమరాగ గీతికల పల్కితి తేనెలు వాకవారమా
ధ్వంత దివ్యసుందర సుధామయ భావములల్లు వెట్టుచున్
(పుట. 35) అను సుందరపద్యం పరమేశ్వర మూర్తి లేఖలో చోటుచేసుకున్నది. ఆత్మరచనా ప్రాభవ గరిమతో ఆయా పాత్రలో విన్యాస వైఖరులలో ఆయా కక్షలకు ప్రాణంపోసి, పఠితల యెదలపై పదిలంగా చెరగని రస ముద్రలు వేసిన కళాలోలుప హృదయులు ఆయన.
|