అసిధారవ్రతం
మా మనోహరం అత్తయ్య అరిసెలు బ్రహ్మాండగా వండుతుంది. పాకం ఎలా పట్టాలో పిండి ఎప్పుడు వెయ్యాలో మాత్రం ఎవర్నీ చూడనిచ్చేదికాదు. ఇది నాట్రేడ్ సీక్రెట్ అనేది. పైసా లాభం లేకపోయినా మా అమ్మా, పిన్నీ రహస్యంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేసిచేసి విసిగిపోయారు. చివరికి ఆవిడపోయే ముందు ఎలా పాకం పట్టాలో కాయితంలో రాసిపెట్టి పోయింది కానీ ప్రాక్టికల్‌గా మాత్రం ఎన్నిసార్లు చేసినా మా అత్తయ్య చేసిన అరిసెలలాగా కుదరలేదు. చివరిగా ఆవిడరాసింది అరిసెలపాకం అసిధారవ్రతం కన్నా కష్టమే అని. ఈ మాట నాకు నిజమేనన్పించింది. అరిసెల సంగతి ఎలా ఉన్నా పిల్లల్ని పెంచడం అసిధారవత్రం కన్నా మరీకష్టం అని అమ్మలు తెలుసుకోక పోరు.
కళ్యాణికి ఒక్కతే కూతురు. అది ఎంతో బాధపడిపోతుంది. మా పాపకి తోడుగా ఓ చెల్లో తమ్ముడో ఉండి ఉంటే ఎంత బాగుండేది అని. ఒక్క పిల్ల అని అతిగారాబం చేశారు. ఏది అడిగితే అది అప్పుచేసైనా కొనేవాళ్ళు. ఆఖరికి అది పరమ మొండి అయి కూర్చుంది. దానికి తప్పేదో ఒప్పేదో తెలియటల్లేదు. ఏది అడగాలో ఏది అడక్కూడదో తెలీదు. తల్లీ తండ్రి అంటే భయం, భక్తీ, గౌరవం అనేవి మచ్చుకయినా లేవు. చిన్నప్పణ్ణించ జీహుజూర్ అన్నట్లుగా వాళ్ళు దాని ఆజ్ఞలకోసం పడిగాపులు పడేవాళ్ళు. ఇప్పుడు ఆజ్ఞాపించడానికే గాని ఓ పని చెయ్యడానికి పనికిరాకుండా పోయింది. అమ్మని ఎంత మాట పడితే అంతమాట అంటుంది. ఎవరన్నా వున్నప్పుడైనా సరే తను అమ్మని విమర్శించడం ఘనకార్యం అనుకుంటుందేగాని అమ్మ ఎంత బాధపడుతోంది ఎంత అవమానపడ్తుందో అనే బుద్ధీ జ్ఞానం లేదు. ఇక పెళ్ళి చేస్తే కొంపమీదకి ఏంతెస్తుందో అని ఆ తల్లిదండ్రులు ఆహోరాత్రులూ కుమిలిపోతున్నారు.
ఒక్క పిల్ల గాబట్టి గారంచేసి పాడుచేశారనుకుంటే మరి కావేరి సంగతీ ఇలాగే వుంది. దానికి ఇద్దరమ్మాయిలు. ఇద్దరియినా వీళ్ళు గారాబంగానే చూసుకునేవారు. ఎవరు ఏదికోరితే అదికొనేవారు. తీరాకొన్నాక అక్కయ్య వస్తువు ఎక్కువ డబ్బు పెట్టికొన్నారు నాక తక్కువ డబ్బు అని చెల్లాయి మూతి బిగించేది. దాని అలక తీర్చడానికి కావేరి దంపతులకు మూడురోజులు పట్టేది. ఏమ్మా నువ్వుకోరిందే కొన్నాం కదా అంటే విన్పించుకోదు. చిన్పప్పట్నించీ ఏవేవి కొన్నారో, ఏ వూళ్ళో ఏమైందో చెప్పి అక్కంటేనే మీకిష్టం అని బోరుమని ఏడ్చేది. చెల్లాయి తగాదా తీరి కొద్దిగా కుదుట పడేసరికి అక్కకి ఏదో తేడా కన్పించేది. దానికి మీరు నేర్పిస్తున్నారనో, దానికి వీణకొనిచ్చారనో పేచీ పెట్టేది. నువ్వూ లూనా నేర్చుకో వీణ నేర్చుకో నీకూ కొంటాం అని చెప్తే వినేది కాదు. భగవంతుడా ఇప్పుడే చిన్న వస్తువులకే ఇలా కొట్టు కుంటున్నారు ఇక పెద్దయ్యాక అక్కయ్యకు మంచి సంబంధం చూసి చూసావని చెల్లాయీ, చెల్లికి గొప్పవాణ్ణి చేసావని అక్కాయి తమని సతాయించుకు తినకుండా వుంటారా అనేదిగులు కావేరిని శుష్కింప చేస్తోంది. ఇంత చిన్న విషయాలకే మనసులు ముడుచుకుపోయే వీరు దేశానికి ఏం చెయ్యగలరు ? సమాజానికి ఏం చెయ్యగలరు ? ఇరుగు పొరుగులను మర్యాదగా ప్రేమగా ఏం చూడగలరు ? వీళ్ళ మనసులను విశాలం చెయ్యాలంటే వీళ్ళకెలాంటి పాఠాలు చెప్పాలి ? ఏం చెప్పినా చెవిలో కెక్కించుకోలేని వీళ్ళ మనసుల్లోకి మంచి మాటలెలా చొప్పించగలం ? అనేవి తెగని ప్రశ్నలు.
ఇక కస్తూరి బాధ వర్ణనా తీతమే దానికి కొడుకులూ కూతుళ్ళూ ఇద్దరూ ఉన్నారు. కొడుకులేమో నీకు కూతుళ్ళంటేనే ఇష్టం అంటారు కూతుళ్ళేమో కొడుకులంటేనే ఇష్టం అంటారు. అసలు మాకు ఎవరంటేనూ ఇష్టంలేదు. వెళ్ళి ఆశ్రమంలోనో వుంటాం అని కస్తూరి ఏడుస్తుంది.
ఇలా ఎంతో మంది తల్లుల బాధలను గమనించాను. ఇంట్లో ఏ కూరచేసినా ఏ పిండివంట చేసినా పిల్లలు సంతోషంగా తినలేని కుటుంబాలను చూశాను. పిల్లల్లో ఇంత ఆశాంతి కల్గడానికి కారణం ఏమిటి ? ఇది వరక్కంటే ఇప్పటి తల్లులకి చైల్డ్ సైకాలజీని గురించి మంచి ఎవేర్‌నెస్ వచ్చింది. చిన్న కుటుంబం వల్ల పిల్లలు ఏంచేస్తున్నారో ఏంచెయ్యాలో అన్నకనసర్న్ ఎక్కువయ్యింది. సంఘం, ఆర్థికంగా, విద్యావిషయికంగా వైజ్ఞానికంగా మెరుగుపడ్డట్టుగానే అన్పిస్తుంది. అయినా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క పిల్లలోనూ ఏదో ఒక అసంతృప్తి, అశాంతి, తిరుగుబాటు తనం, లెక్కలేని తనంచోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎందుకు ? అన్నిటికీ ఒక్కటే జవాబు స్వార్థం అన్నిటికీ ఒకటే మందు అహంకారన్ని చంపుకోటం ఇందుకు ఒకే గమ్యం సర్వసమానత్వం ఈ కుటుంబం నాది, ఈ అక్కతమ్ముళ్ళు నావాళ్ళు అనే భావం ఉన్నప్పుడు ఈ దేశంనాది, దీని బాగోగులు అనే విశాల దృక్పథం అలవడుతుంది.
|