ధనాంజనం
చంద్రమండాలనికి వెళ్ళాం. మానవ మేదస్సుకు అసాధ్యమైనది ఏదీ లేదని నీవు చదువుకుని మనకుమనమే శహభాష్ అనుకుంటున్నాం. నిజమే మానవమేధ ఎంతో సాధించింది. సాధిస్తుంది. కాని మనసు మాత్రం నానాటికీ సంకుచితమై పోతోంది. దయకీ, కరుణకీ, సానుభూతికి మనసులో చోటు దొరకటం లేదు. స్వార్థం పెచ్చు పెరిగిపోతోంది. అత్యాశకు అంతే లేదు. ఉంటే ఇన్ని హింసలూ ఇన్ని అరాచకాలూ, జరిగేవి కావు.
మొన్నటికి పాలుగారే పసివాడిని నిధి కోసం బలిఇచ్చారు. లేత పూమెగ్గ లాంటి జీవితాన్ని దారుణంగా కాలరాచేసారు. అ పసివాడి శరీరంలో రక్తపు చుక్క లేకుండా ఓడ్చి ఆ నిక్షేపదేవి కి తర్పణం చేసారు. చేజేతులా ఒక నిండు ప్రాణాన్ని తీస్తున్నాయే అన్న భావం కూడా ఆ మనుషుల చెంతకి చేరడానికి భయపడి ఉంటుంది. కేవలం ధనవాంఛ వాళ్ళనింత అన్యాయానికి పురిగొల్పింది.
చేతబడి చేశారనో బాణామతి చేశారనో అనుమానంమీద కొందరిని మంటల్లోకి తోసేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఒరిస్సా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలోను మనరాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల్లోను ఈ సంఘటన లెక్కువగా గణనకెక్కుతున్నాయి.
మూఢనమ్మకులకి కారణం చదువులేక పోడమా ? అనుకుంటే అది కారణం కాదనిపిస్తుంది. తోటిప్రాణిని తన స్వార్థంకోసం హింసపెట్టడం న్యాయమో అన్యాయమో తెలుసుకునేందుకు చదువెందుకు ? మనిషై పుట్టాక మానవత్వం లేని బ్రతుకెందుకు ? ఇలాంటి మానుషులకంటె పశువులు నయం కాదూ ? వాటిలో పశుత్వం ఎవరికి హాని చెయ్యకపోవచ్చు కాని మనుషుల్లో రాక్షసత్వం మాత్రం ఎన్నో ప్రాణాలని బలిగొంటుంది.
అయ్యా, నిధులనీ, నిక్షేపాలనీ దేవతో దెయ్యమో కాపలాకాస్తూ కూర్చోదు. దాన్ని తీసుకునేటప్పుడు నువ్వు నరబలి ఇయ్యిక్కరలేదు. మన తాతలూ, తాతల తాతలూ ఎప్పుడో దాచుకున్న ధనం ఇప్పుడు కాలక్రమేణా బయటపడింది. దాని మీద హక్కుచారు ప్రభుత్వమేకాని మనం కాదు అని చాటి చెప్పాలనిపిస్తుంది. పాడు పడిన శిథిల గృహల్లో లంకెబిందెలుంటాయని ప్రతీతి పల్లెటూళ్ళలో ఉంటుంది. దాన్ని భూత్ బంగళా అనో దెయ్యాలకొంప అనో అపప్రథతో నరమానవుడు అందులో అడుగుపెట్టటానికి అదిరిపోతాడు. ఇలాంటి పుకార్లు కొన్ని మంచి ఇళ్ళకే లేవతీస్తారు.
ఆ ఇంటి యజమానిమీద వుండే కోపమో, అసూయో, చుప్పనాతి తనమో కొందరు స్వార్థపరుల చేత ఇలాంటి పని చేయిస్తుంది. అదిగో తోక అంటే ఇదిగో పులి అనే కాకుల్లాంటి లోకులనోళ్ళలో నానితే ఎంత శుభప్రదమైన ఇల్లయినా దీపంపెట్టే వాళ్ళులేక పాడు పడిపోక తప్పదు. ఇలాంటి దయ్యాలకొంపనే ఒకసారి ఏదో అనుమానంతో పోలీసుల సోదాచేస్తే అపారంగా బంగారం దొరికింది. బందిపోటు దొంగలు తాముదోచిన నగలనీ ధనాన్నీ అక్కడ దాచి అలాంటి పుకారు పుట్టించారుట.
ఇలా ఎవ్వరో అత్యాశతో పరోపకారం చెయ్యకుండా ఏ కుండలోనో బిందెలోనో బంగారాన్ని దాచి మర్చిపోతేనో, చచ్చిపోతేనో, ఆ తరువాత కాలాంతరానికి మరో భాగ్యవంతుడిగా భాగ్యం దక్కుతుంది. ఇలా భూగర్భంలో నిధులెక్కడ వున్నాయో చెప్పగల మేధాలున్నారని ప్రతీతి కూడా వుంది. ఇది ఈనాటి మాట మాత్రమేకాదు. పదకొండో శతాబ్ధపువాడైన నన్నెబోడుడు కూడా ధనాంజనం ప్రసక్తి తెచ్చాడు. ధనం ఎక్కడ వుందో పసిగట్టగల కాటుకనే ధనాంజనం అంటారు. నన్నెబోడుడు పార్వతీదేవి చేత ధనాంజనం వేయిస్తాడు. కర్పర ఖండంబున మంత్రకాటుక తగన్ ఫాలాక్షు కూర్పింప నగ్గిరిజాత్మజ పట్టే... అంటాడు. ఆగిరిజాత్మజ పట్టిన మంత్రాలు జనం ఏమిటో తెలిస్తే బావుణ్ణు. పెళ్ళి కావల్సిన పిల్లలున్న తల్లిదండ్రులకు వరాన్వేషణ శ్రమతగ్గుతుంది అనుకునేరు. ఇదే నొక మూఢనమ్మకమేనని చెప్పక్కరలేదు కదా !
ఇక వితంతువు ఎదురొచ్చిందనో పిల్లి ఎదురొచ్చిందనో ఎవరో తుమ్మారనో ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకునే వారుంటారు. అలా అనుమానం ఉన్నవాళ్ళు అలా ఆగడమే మంచిది. అమ్మో ఏంకీడు జరుగుతుందో అనుకుంటూ వెడితే కీడు జరిగినా జరగొచ్చు. ఎందుకంటారా యద్భావం తద్భావతి అని నానుడి ఉండనే ఉంది కదా ! ఏం జరగదు నాసికారంధ్రంలో ఏధూళోపోతే తుమ్మువస్తుంది. దీనికి అశుశసూచకానికి ఏమసంబంధం లేదు అని విచక్షణ చేసుకుంటే ఏమీ ఉండదు.
మా బంధువుల ఇంట్లో ఇంకో నమ్మకం ఉంది. పొరపాటున అన్నమో బియ్యమో కింద ఒలికితే ఏదో ఆపద వస్తుందని వాళ్ళ భయం. పాలుపొంగి పొర్లిపోతే భయం పాలు విరిగితే భయం దేముడి దగ్గర దీపారాధన పూజ మధ్యలో ఆపితే భయం. అంటించిన అగరత్తు ఆజాగ్రత్తగా పెట్టి ఏబట్టో అంటుకుంటే అపశకునం. ఇలా ఉంటాయండీ రకరకాల నమ్మకాలు.
మన భయాలకు తగ్గట్టుగానే మనకావ్యాల్లో కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించే పోకడలు ఉన్నాయి. సీతమ్మ వారికి కుడికన్ను అదిరితే అశుభం జరిగిందట అర్జునుడికి కుడి భుజం అదిరితే శుభం జరిగిందట. ఆడవాళ్ళికి ఎడమవైపూ మగవాళ్ళకి కుడి వైపూ అదిరితే శుభం ఇలా ఎన్నో !
ఎవరి పిచ్చి వారికానందం అని కొన్ని మూఢనమ్మకాలు సరిపెట్టుకోవచ్చు.
కొన్ని సరదాగా నవ్వుకోడానికి పనికొస్తాయి. కాని నరబలులవంటి మూఢనమ్మకాలను గురించి విని ఊరుకోకూడదు.
హింసను సహించే సంఘం మానవత్వానికి దూరంగా ప్రయాణం చేస్తున్నదని గ్రహించుకోవాలి.
కరుణలేని సమాజం కసాయిల కూటమి. దయా దాక్షిణ్యం లేని మానవులు దానవుల కన్నా భయంకరులు ప్రస్తుతం మనకు కావల్సిన ముఖ్యమైన టానిక్ కరుణ విచక్షణ.
|