పురాణ స్త్రీలు వ్యక్తిత్వ హీనులా ?
ఆధునిక భావాలున్నాయిన అనుకొనే చాలామంది మేమేమీ సీతా అనసూమా లాంటి వాళ్ళంకాము. మీరు కాదంటే ఏడుస్తూ పోడానికి అంటూంటారు. సీతా అనసూయలు నోరూవాయీ లేని యంత్రాలనీ భర్తలెలా చెప్తే అలా చేస్తూ పడివుండే జడ పదార్ధాలనీ ఈ చాలామంది అభిప్రాయం.
భర్త నిప్పుల్లో దూకమంటే దూకి తన శీలస్వచ్ఛత్వాన్ని నిరూపించుకొన్న సీత అవసరం వస్తే భర్తకు ఎదురాడి నిందించగలదని నిరూపించే ఘట్టం ఒకటుంది. ఒక ఘట్టముంటె చాలు, ఆమె స్వభావం వెల్లిడి కావడానికి, అవసరం వస్తే తిట్టగలదలనడానికీను.
రాముడు కైక కోరికననుసరించి వనవాసానికి ప్రయాణమైనాడు. సీత తానూ వస్తానంటుంది. కానీ రాముడు అడవి ఎంతో భయంకరంగా వుంటుంది. పులులూ సింహాలూ మొదలైన కృర మృగాలుంటాయి. నువ్వు సుకుమారివి. పూరేకులవంటి నీ పాదాలు కఠిన మార్గంలో కమిలిపోతే నేను చూడలేను అంటాడు. అప్పుడు సీత తన ప్రయత్నం విరమించుకోలేదు. అతనిని బ్రతిమాలలేదు, కంటతడిపెట్టి నా ఖర్మ ఇంతేననుకోలేదు. మానాన్న నన్ను నీకిచ్చేప్పుడు ఎంతో బలవంతుడికీ పౌరుషవంతుడికీ ఇచ్చానని సంతోషించాడు.
నిజానికి నీవు గాజులు తొడుగుకోవల్సినవాడివి కూతురితోపాటు అల్లుడికి కూడా గాజులు పంపాల్సిన ఖర్మ మానాన్నకి పట్టింది. అంటుంది. ఇందులో భావం ఏమిటో ? పులులను పుట్రనూ చంపగలవు. నడవలేకపోతే ఎత్తుకునన్నా తీసుకువెళ్ళలేవా అన్న ఎత్తి పొడుపేమో మనకు తెలీదు సీతారాములు శృంగార ప్రియులు, క్షణం ఎడబాసి మనలేని జంట పక్షులు. విధి మరోలా వారిని విడదీసింది. అది వేరే కథ. ఈ భావం వాల్మీకిదే, అంటే వాల్మికి కాలాన అలా మాట్లాడే స్త్రీలు లేకపోతే ఇలా వ్రాసి ఉండడు. అనసూయ పౌరుషంఇంతా అంతా కాదు. సృష్టి, స్థితి లయకారులైన త్రిమూర్తులనే పసివాళ్ళగా చేసి పారేసింది.
శకుంతలా దుష్యంతుల కథ చూడండి. శకుంతలను దుష్యంతుడు స్వీకరించన సమయంలో నన్నయ ఒకరకంగా బుద్ధి చెప్పిస్తే కాళిదాసు ఒకరకంగా మాట్లాడిస్తాడు. రెండుచోట్లా శకుంతల పౌరుషంగానే మాట్లాడుతుంది. మాట మెత్తగా వున్నా భావం కత్తిలాగా దూసుకొచ్చేంత పదునుగానే వుంటుంది. మోసగాడివి. నీకు నాలుక చివర తేనె, లోన విషం అంటుంది. కితవ ! ముఖమధు హృదయ స్థితి విష అని.
ఇంక సంతత శ్రీహరి హృదయ విహారియైన శ్రీ మహాలక్ష్మి సంగతి చూడండి. ఆమెకి ఒకనాడు భర్తని చూస్తే అనుమానం కలిగింది. ఏ స్త్రీనో చూచి మోజుపడ్డాడనుకుంది. ఆమె అతన్ని తిట్టలేదు. నన్నన్యాయంచేస్తావా అని ఏడ్చి మొత్తుకోలేదు. వెంటనే సాచి ఓ లెంపకాయ కొట్టింది. అంతే ఆయనగారి తలఎగిరి ఆమడదూరంలో పడింది. బ్రహ్మ మహేంద్ర రుద్రాదులు లబోదిబో మన్నారు. సృష్టి స్థంభించి పోతుంది, ఎల్లా అని తర్జన భర్జనలుపడ్డారు. అందరూ చేరి ఆలోచించి ఓ గుర్రం తలతెచ్చి విష్ణుమూర్తికతికించే శారాసర్జున్లు. అతడే శ్రీ హయగ్రీవ మూర్తి జ్ఞానానందసందోహ కారకుడు సర్వవిద్యలకీ ఆధారుడు.
ద్రౌపదీ ఏం చేసిందో చూడండి. ఆమె గనుక తీవ్రమైన మాటలతో పాండవులను రెచ్చగొట్టి వుండకపోతే కురుక్షేత్రంలో యుద్ధమే జరిగి వుండకపోవచ్చు. పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం నాశనం కాకపోయి వుండవచ్చు. ఆమె హృదయంలో దుశ్శాసనాదులు చేసిన దుశ్చేష్టితాలు పదిలంగా దాచుకుంది. యుద్ధంవద్దు సంథి చేసుకుందాం అని భీముడు తప్ప అందుర అనుకుంటారు. ఒకానొక నీరసక్షణంలో భీముడుకూడా వెనకడుగు వేస్తాడు. ద్రౌపది మాత్రం ప్రతీకారంతో బుసలు కొట్టింది. కౌరవులను ఘాటైనమాటలతో విమర్శిస్తుంది. వారి చర్యలను రాయబారిగా వెళ్ళే కృష్ణుడికి చెబుతూ మధ్య మధ్యలో భర్తల చేతకాని తనాన్ని కూడా ఎత్తిపోడుస్తుంది. ఈ ఇతర ఘట్టాల్లోకూడా డైరెక్టుగానూ ఇండైరెక్టుగానూ భర్తలను సూటిపోటి మాటలనడంలో ద్రౌపది మహాకుశలురాలు. ఇక సత్యభామ సంగతి చెప్పనే అక్కర లేదు. ఆవిడ ఆడింది ఆట పాడింది పాట !
ఇదింతా ఎందుకుచెప్పాల్సి వచ్చిందంటే సమయాన్ని బట్టి పురాణస్త్రీలు కూడా ఎదురు తిరిగారు. మళ్ళీ భర్తల కనుకూలంగానూ వున్నారు. అనుకూలంగా వున్నంత మాత్రాన స్త్రీ స్వాతంత్ర్యం హరించుకుపోతుందను కోడం పొరపాటు. ఎవరు చెప్పిన మాట సమయాన కూలంగా ప్రయోజన కారిగా వుంటుందో వారి మాట పాటించబడటం సంసారానికి మేలును కలుగచేస్తుంది. సంసారంలోని మంచిచెడ్డలను భార్యాభర్తలిద్దరూ కల్సి నిర్ణయించుకోవాలి ! భార్యమాట భర్తవింటాడా, భర్తమాట భార్య వింటుందా అన్నది ముఖ్యంకాదు. ఎవరిమాట ఎక్కువసబబుగా వుంది. శ్రేయస్కరంగా వుంది అన్నది ముఖ్యం. అంతేకాని ఒకరు ఎడ్డెమంటే ఇంకోరు తెడ్డెమనాలిని ఖచ్చితంగా నిర్ణయించుకొన్నట్లుగా వ్యతిరేక భావాలతో ఆస్తమానం కీచులాడుకోడం వారికే కాదు, ఎదుటి వారికి కూడా చీకాకు కల్గిస్తుంది.
|