55
 

స్త్రీలు   -   ఆస్తులు

 

ఏదైనా ఉంటే ఓ బాధా లేక‌పోతే ఓ బాధా అనే మాట త‌ర‌చూ వింటూ వుంటాం. ఈ ఆస్తి విష‌యంకూడా అంటే అస‌లు ఆస్తిహ‌క్కు అంటే ఏమిటి ?  ఈ హ‌క్కులు పురుషుడికి స్త్రీ కి స‌మానంగా చెందుతాయా లేదా ?  అనే విష‌యం ఆలోచించాలి. అబ్బాయి పుట్టాడు, పుడుతూనే ఆ ప‌సికందుని తాత‌గారి ల‌క్ష‌ల‌కు వార‌సుడంటారు. అమ్మాయి పుట్టింది. ఈ పాప‌క‌లాంటి అవ‌కాశం లేదు. న్యాయ‌శాస్త్రం, మ‌న‌పూర్వ ఋషుల సూత్రాల‌నాధారంగా చేసుకునే అల్ల‌బ‌డింది. మ‌నువు ఆప‌స్తంబుడు, నార‌దుడు, యాజ్ఞ‌వ‌ల్క్యుడు విజ్ఞానేశ్వ‌రుడు మొద‌లైన వారు ఆస్తుల‌ను గురించి హ‌క్కుల‌ను గురించి కూలంక‌షంగా యోచించి సూత్రాల‌ను నిర్మించారు. వారికి ప‌క్ష‌పాత బుద్ధి ఉండ‌టంచేత పిత్రార్జితంఓ స్త్రీల‌కు హ‌క్కు లేకుండా చేశారా ?  వేరే కార‌ణం ఏదైనా ఉందా ?

ఆస్తి అనేది రెండు ర‌కాలు. స్థిరాస్తి చ‌రాస్థి. మ‌ళ్ళీ ఇందులో పిత్రార్జిత‌మ‌నీ స్వార్జిత‌మ‌నీ రెండు విధాలుగా ఆస్తి వుండ‌చ్చు. పిత్రార్జిత‌మంటే పూర్వికుల నుండి సంక్ర‌మించిన ఆస్తి అనీ, స్వార్జిత మంటే తాను క‌ష్ట‌ప‌డి ఆర్జించుకున్న‌ద‌నీ మాట‌ను బ‌ట్టే తెలిసిపోతోంది. ఇక చరాస్తి క్రింద‌కు షేర్లు ధ‌న‌మూ, వెండీ, బంగారం , ఇత్త‌డి ఫ‌ర్నిచ‌ర్ మొద‌లైన వ‌స్తువులూ స్థిరాస్తి క్రింద‌కు ఇళ్ళు, భూములు, ఫ్యాక్ట‌రీలు వ‌గైరాలు వ‌స్తాయి.

1956 నుండి స్త్రీల‌కు ఆస్తుల‌పై మ‌రింత హ‌క్కు సంక్ర‌మించే అవ‌కాశం హెచ్చ‌యింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో అన్న‌ద‌మ్ముల‌తో స‌మానంగా పంచుకునే వీఉ మ‌హిళ‌కి క‌లిగింది. కొడుకుల‌తో స‌మానంగా ఆస్తి పంచుకునే అవ‌కాశం క‌లిగింది.

కానీ ఈ హ‌క్కు ఎప్ప‌డు వ‌స్తుంది ?  తండ్రితాను జీవించివుండ‌గా విల్లు రాసిఇస్తే వ‌స్తుంది. లేక‌పోతే విల్లువ్రాయ‌క పోయినా తండ్రి మ‌ర‌ణాంత‌రం వ‌స్తుంది. ఈ విష‌యంలో కొడుకులూ, కూతుళ్ళూ ఇద్ద‌రూ స‌మాన‌మే. తండ్రి త‌నయిష్టం వ‌చ్చిన‌వారికి త‌న ఆస్తిని వ్రాసెయ‌వ‌చ్చు. పూర్తిగా కొడుకుల‌కైనా వ్రాయ‌చ్చు లేక పూర్తిగా కూతుళ్ళ‌కైనా వ్రాయ‌చ్చు. లేదా అంద‌రికీ స‌మానంగా నైనా వ్రాయ‌చ్చు. ఇందువ‌ల్ల ఈ విష‌యంలో స్త్రీ మోస‌పోయింద‌న‌డానికి లేదు.

ఇంకొక్క‌మాట‌. ఆస్తి అన‌గానే మ‌న‌కి ధ‌న‌మే గుర్తుకొస్తుంది. మ‌న‌కింకొక గొప్ప ఆస్తివుంది. అదే సంప్ర‌దాయం ఆచార వ్య‌వ‌హారాలు అనుచానంగా వ‌స్తూన్న వాటిని మ‌నం స‌గౌవ‌రంగా స్వీక‌రిస్తూనే వున్నాం. నా ఉద్దేశ్యంలో ఆడ‌పిల్ల‌కు అంతో ఇంతో ధ‌న‌మో పొల‌మో ఇచ్చేసి చేతులు దులుపు కోక‌పోవ‌డం, ఇందుచేత‌నే అన్పిస్తుంది. అమ్మాయికి చేసే కొన్ని వేడుక‌లు త‌ర‌త‌రాలుగా వ‌స్తున్నాయి.

అమ్మాయి పుట్టింద‌టే అంతా ఖ‌ర్చే అనుకోరు. చిన్న‌ప్పుడు బాల తొడుగు తొడ‌గాలి . ప‌ట్టు ప‌రికిణీలు కుట్టించాలి. ఏపూల‌సీజ‌న్‌లో ఆపూల‌జ‌డ‌లు వేయాలి. చుదువుకున్నంతా చ‌దివించాలి. అభిలాష‌ని బ‌ట్టి నాట్య‌మో, సంగీత‌మో నేర్పించాలి. మంచివ‌రుణ్ణి తెచ్చి ఆడంబ‌రంగా పెళ్ళిచేసి అత్తారింటికి చీరాసారె, మంచం, కంచం ఇచ్చి పంపాలి. అల్లుడినీ, కూతుర్నీ పండ‌గ‌ల‌కీ పబ్బాల‌కీ తీసుకువ‌చ్చి శ‌క్తి క‌ల్గినంత‌గా ఏదో ఒక‌టి ముట్ట‌చెబుతూనే ఉండాలి. అమ్మాయి నీళ్ళోసుకుంటే సీమంతంచెయ్యాలి. పురుళ్ళూ, పుణ్యాలూ ఇక మ‌నుమ‌ల ముచ్చ‌ట్లూ, వీట‌న్నిటినీ సాంప్ర‌దాయ‌కంగా ఇంకా జ‌రుపుకుంటూనే ఉన్నాం. ఎక్క‌డో మ‌హాప‌ట్నాల్లో త‌ప్ప‌, మ‌గ‌పిల్ల‌ల‌కి గొడ‌వ‌క్క‌ర్లేదు.

ఆస్తిలో వాటా పంచుకుపోతే ఈ అచ్చ‌టా ము్చ్చ‌టా అంటూ జ‌రిగే వ్య‌వ‌హారాల‌న్నీ వెన‌క‌ప‌డొచ్చు. పుట్టినింటితో సంబంధ బాంధ‌వ్యాలు మ‌రింత రొటీన్ అయ్యే అవ‌కాశ‌మూ క‌ల‌గొచ్చు. తండ్రి సంపాదించిన ఆస్తిలో తండ్రి మ‌ర‌ణానంత‌రం సోద‌రుడితో స‌మంగా పంచుకునే హ‌క్కువున్నా ఏ ఆడ‌పిల్లా తండ్రి ఆస్తిలోని భాగం కోసం అన్న‌ద‌మ్ముల‌ను వ‌త్తిడికి గురిచేయ‌డంలేదు. ఎందుచేత ?  పుట్టినింటిపై మ‌మ‌కారం అమ్మాయికి జ‌న్మ‌తః కల్గిన‌సొత్తు. అక్క‌డ్నించి ఆస్తి పంప‌కాలు చేసుకుని వారితో తెగ‌తెంపులు చేసుకుంటే మ‌న‌సులు వాటంత‌ట‌వే మూసుకుపోతాయ‌నే భావం ఆమెకుంటుంది. సంవ‌త్స‌రాని కొక‌సారైనా ఈ ఇల్లునాది, ఇక్క‌డ‌నేను పుట్టిపెరిగాను అనే సుకుమార భావంతో ఇల్లంతా స్వేచ్ఛ‌గా తిరిగే అవ‌కాశం ఆమెపోగొట్టుకో లేదు. ఈ సుహృద్బావం ముందు ఆస్తికున్న విలువెంత ?  చూశారా ?  స్త్రీకి రెండిళ్ళు. ఆమె రెండుచోట్ల ప్రేమ పండించుకునే హ‌క్కు స్వంతం చేసుకుంది. ఆమె ప్రేమ‌ల‌త రెండుచోట్లా గుత్తంగా దిట్టంగా అల్లుకో గ‌ల‌దు.

ఎప్పుడైతే సోద‌రుడితో స‌మానంగా తండ్రి ఆస్తిని పంచ‌కుంటుందో అప్పుడే ఆమెకు తండ్రి చేసిన ఋణంలోనూ, త‌ల్లి దండ్రుల‌ను వృద్ధాప్యంలో కాపాడే బాధ్య‌త‌లోనూ, కూడా సోద‌రుడితో స‌మానమౌతుంది. హ‌క్కుల‌ను వినియోగించుకున్నపుడు బాధ్య‌త‌ల‌ను కూడా స‌క్ర‌మంగా నిర్వ‌ర్తింప వ‌ల్సిందే.

పిత్రార్జిత‌మైన ఆస్తిలో కూడా, ఆంధ్ర‌రాష్ట్రం స్త్రీల‌కు భాగ‌స్వామ్యాన్ని క‌ల్గించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఔన‌నాల్సివుంది. ఔనంటుంద‌నే అనుకుందాం. కానీండి. అంతామ‌న మంచికే.