సినిమా సాహిత్యం సంఘం
కరుణని చూడటానికి మళ్ళీ పెళ్ళివారొచ్చారు. అన్నిసార్లలాగానే బిస్కట్స్ తినేసి కాఫీతాగేసి అమ్మాయిని నాలుగు ప్రశ్నలు వేసి చప్పరించి వెళ్ళి పోయారు. ఫలితం ఎలా ఉంటుంది ? వాళ్ళు అవునంటారా ? కాదంటారా అనే ఆసక్తి కరుణతో సహా ఎవ్వరికి లేదు. ఇలా ఎన్నోసార్లు జరిగింది కనుకనే వారిలో ఆ నిర్లిప్తత.
కరుణ చక్కగా ఉంటుంది. తియ్యగా పాటలు పాడుతుంది. బోలెడు జీతం తెచ్చుకుంటుంది. తండ్రి కట్నకానుకలు దండిగానే ఇవ్వగల సమర్థుడు. అయినా ఏ పెళ్ళి కొడుకుకీ కరుఫ నచ్చటంలేదు. ఓ కంపెనీలో మేనేజర్‌కి పర్సనల్ సెక్రటరీగా ఉండటమే ఆమెలో ఉన్న లోపమట. పెళ్ళయ్యాక ఉద్యోగం మానడానికిఆమెకేమీ అభ్యంతరం కూడాలేదు.
అమ్మాయిలు ఆఫీసుల్లో సెక్రటరీలుగానో ఆఫీసర్స్ కి పి.ఏలు గానో స్టెనోలుగానో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి పెళ్ళి కావడం చాలా కష్టం అంటుంది కరుణ.
నువ్వు సెక్రటరీ కమ్ స్టెనో అనగానే బెత్తెడు డ్రాయరు లాంటిదేదో తొడుక్కుని బెత్తెడు జాకెట్టో బాడీనో తెలీని పదార్థంతో పై భాగాన్ని సగం అటూ ఇటూగా కప్పుకుని మధ్య భాగాన్ని గాలికి వదిలేసి ఆఫీసరుగారి ఒళ్ళో కూర్చుని హొయలుపోతూన్నట్లుగా నాకు కళ్ళకు కట్టినట్లుగా కన్పిస్తోంది. అందుకని ఎంత బావున్నా నిన్ను చేసుకోలేకుండా ఉన్నాను అని ఓ బుద్ధిమంతుడైన పెళ్ళికొడుకు తన భావాన్ని నిజాయితీగా రాసాడుట. పైగా ఫలానా సినిమాలో బాగానే వుంటారా నువ్వు మీ ఆఫీసరూ అని అడిగాడుట కూడా ఉత్కంఠ ఆపుకోలేక !
లేడీస్టెనోలనీ పి.ఏలని ఇంతకంటె మెరుగ్గా ఏ సినిమాలోనూ చూపించరు. ఎక్కడైనా సంప్రదాయ బద్ధంగా గణవతిగి ఉన్నా కడకు ఆఫీసరకూ ఆ అమ్మాయికి పెళ్ళిచేసికాని ఊరుకోడు దర్శకుడు. ఎ.సి. రూముల్లో కూర్చుని ప్లాటులను సిద్ధం చేసుకునేవారికి సమాజం ఎలా కన్పిస్తుంది ? నిర్మాత పెట్టిన పెట్టుబడికి ఎలా న్యాయంచెయ్యాలా అనే ఆలోచనా, మళ్ళీ తనను దర్శకుడిగా తోసుకోడేమెననే భయమూ ఉన్న పెద్ద మనిషికి డబ్బు సంపాదనే ప్రధానధ్యేయంగా కన్పించదూ ! డబ్బు సంపాదించుకోమనండి ఎవరూ వద్దనలేదు. కాని వీరు ప్రజలమీదికి ఎలాంటి కారెక్టర్స్ ను సృష్టించి వదులుతున్నారు ? భర్త మీద తిరుగుబాటు తండ్రి మీద తిరుగుబాటు వ్యవస్థమీద తిరుగుబాటు సంప్రదాయం మీద తిరుగుబాటు ఇక కులమూ మతమూ సంగతి చెప్పనే అక్కరలేదు. పరమపావనమూ భక్తిరసప్రధానమూ వేదాంతభావనకు పరాకాష్టమూ అని పేరు పడిన అన్నమాచార్యుల వారి కీర్తలను పాప్ సాంగ్ స్థాయికి దిగజారుతున్నాయి. దీన్ని పలువురు మెచ్చుకున్నారు. ఈ పాటకు బహుమతులు కూడారావచ్చు. నీతి బోధకే ఇలా చిత్రీకరించామని ఆత్మవంచన చేసుకోనూవచ్చు. సామాన్యమానవులకు ఇదేమిటి అనే అనుమానం రాకూడదు.
సినిమాను ఈనాడు ప్రచారసాధనంగా ఉపయోగించుకుని ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలనెన్నింటినో తెలియచెప్పవచ్చు. కాని ఎలా బ్యాంకులను దోచుకోవాలి. ఎలా హత్యలు చేయాలి, కోర్టుల నెలా పక్కదారుల పట్టించాలి, పగలనెలా సాధించుకోవాలి వంటి అగ్నిహోత్రాలన అమాయక ప్రేక్షకుల గుండెల్లో రగిల్చేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నో నేరాలు సినిమాలు చూసే నేర్చుకున్నామని కారాగారంలో మగ్గే ముద్ధాయి లెందరో చెప్తారు.
ఏదైనా మెట్లెక్కడం కష్టంగాని అక్కడ్నించి జారి పడిటానికి ఎంతో కాలం పట్టదు. పది మంది మాటలు చెవినివేస్తే ఒక్కటైనా మనస్సుకెక్కుతుందో లేదో చెప్పడం కష్టం. చెడుచేత ఇట్టే ఆకర్షింపబడటం తేలిక ! సకుంటుంబంగా చూసే సినిమా ఎప్పుడొస్తుందా అని తపస్సు చెయ్యాల్సిందే పత్రికా సాహిత్యం స్థితి. సినిమా స్థాయి కన్నా కొంత మెరుగుగానే ఉంది. అయినా ప్రస్తుతం ప్రచండ వేగంతో మారణహోమాలు మృత్యుమృదంగా మరణ గానాలూ పఠితలను ఉక్కిరిబికిరి చేస్తున్నాయి.
సాహిత్యంలో హితవు తక్కువై పోతోంది సాహిత్యం కితవులను తయారు చేసేదిగా ఉంది. ఆ మధ్యనే చదివాం ఒకబాలికని తల్లి ని చేసింది అన్నగారేనట ! పదేళ్ళపిల్ల కూడా తల్లికావచ్చనే విషయాన్ని పాపం రచయిత ఎంతో కష్టపడి మెడికల్ జర్నల్స్ నుంచి సేకరించాడు. చాలా అభినందించవలసిన విషయమే. ఇటువంటి ప్రమాదాలు ఈ మహా ప్రపంచంలో ఎక్కడో ఒకచోట జరిగే వుండొచ్చుకూడా. అయినప్పటికీ ఇలాంటి దుర్ఘటనను తీసుకుని పెంచి పెద్ద చేసి నవరసాలూ పూరించి పాఠకుల్లో ఉత్కంఠరేకెత్తించాల్సిన అగత్యమూ అవరసమూ ఎంత మాత్రమూ లేదు.
ఎంతైనా రచయిత్రులు మాత్రం మంచి సెంటిమెంట్స్ ఉన్న కథలనే రాస్తున్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. రచయిత్రులందించే సాహిత్యాన్ని వంటింటి సాహిత్యం అనీ హేళనచేసే వారున్నారు. వంటిల్లులేంది మనిషి మనుగడే లేదు. స్త్రీల రచనలు మానవమేధస్సులకు ఆహారంగా ఉపయోగపడితే అంతకన్న కావల్సిందే లేదు. విశ్వనాథ అంటారు ధర్మం నిలచి ఉందీ సంప్రదాయం నిలచి ఉందీ అంటే స్త్రీల వల్లనే అని అది ముమ్మాటికీ నిజం.
అలనాటి వేదాలూ, కావ్యాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ చెప్పిందీ చెప్పదలచుకొన్నదీ ప్రజాశ్రేయస్సు. సాంఘిక పురోభివృద్ధి సామాజిక ,చైతన్యం, సర్వమానవాళి పారిశుద్ద్యం.
నేటి సాహిత్యం దేనిని పెంపోషిస్తోంది ? ఏ విషయంలో మార్గ దర్శకత్వం నెరపుతోంది. ఏ ప్రయెజనాలను ప్రధానోద్దేశంగా మలచుకొంది అని ఒక్క క్షణం విచికిత్స చేసుకోవాలి. స్త్రీ లయినా బాధ్యతాయుతమైన రచనలు చేస్తూ ఉంటే స్త్రీలైనామంచి ఇతివృత్తాలను తీసుకుని మంచి చిత్రాలుగా తీర్చిదిద్దితే ఎంతబాగుండును ? |