పాపాయి పేరు
ఈ మధ్య ఎడ్వర్టయిజ్‌మెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఇంటిని నిర్వహిస్తోంది మా దమయంతి. మీ పిల్లలకి చక్కని పేర్లు పెట్టాలా ! ఫలానా పుస్తకం కొనండి అనే ప్రకటన చూచి ఆ పుస్తకం కోసం షాపులు గాలించాలనే ఉద్దేశంతో మార్కెట్‌కి బయలుదేరింది.
సంగతేమిటంటే మా చెల్లాయికి మా మరదలికి నాల్గురోజుల తేడాతో అబ్బాయి అమ్మాయీ పుట్టారు. ఈ కొత్త సభ్యులు సమాజంలో ఏ నామ ధేయంతో చెలామణి అవుతారోనని కుర్రకారుకి యావగా వుంది. పాప ఎలా వుంది ఎవరి పోలిక అని అడిగేకన్నా ఏం పేరు పెడ్తారు అన్నదానికే ప్రాముఖ్యాన్నిస్తున్నారు. అందరూ ఒక్క చేట చేరి చిన్నారుల పేర్లను గురించి చర్చించటం మొదలు పెట్టారు.
ఆ పేరులో ఏముందిరా బెండకాయ్ అని మా బామ్మ వాళ్ళ ఉత్సాహంలో ఇన్ని నీళ్ళు చల్లబోయింది. కానీ వాళ్ళు సరదా ఏమాత్రం తగ్గలేదు. మా బామ్మ అంత కంటే ఊరుకోదు. వెనకటికి ఓ పండితుడు కూతురికి సావిత్రి అని పేరు పెట్టుకున్నాట్ట. ఆ పిల్ల కాస్తా ఎనిమిదేళ్ళకే నెత్తిన గుడ్డేసుకు చక్కావచ్చింది. ఇంకోడెమో మార్కండేయులనీ చిరంజీవి అని ...అంటూ తన మామూలు వాగ్దోరణిలో సాగిపోతుంటే మీరు పేర్లలోని అర్థాలనీ అనర్థాలనీ ఈ కాలం పిల్లలకి చెప్పక్కర్లేదు లెండి. శుభమా అంటూ పెళ్ళి జరుగుతుంటే పెళ్ళి కూతురు...ఏది అన్నాడు ఒక బాలుడు. పసివాళ్ళకి పేర్లు వెతుకుతుంటే మీ అపశకునం మాటేలమిటి ? అని మా అమ్మ మా బామ్మని వెనక్కిలాగింది.
మా అన్నయ్య తనవంతు వాదాన్ని వెళ్ళగక్కాడు. రాముడికి సీత ఏమౌతుందే బామ్మా అన్నాడు. బామ్మ బోసి నోటితో నవ్వి హారి బడవా మీ అంతేసి చదువు కోకపోయినా ఈ మాత్రం తెలుసులేరా రాముడూ సీతా భార్యాభర్తలు అంది.
అవునా మరి మీ తమ్ముడు అన్నా చెల్లెళ్ళని చేశాడే మరి అన్నాడు. నీ తెలివి ఇంత లావుందా అని వేళాకోళంగా చూస్తూ పేర్లు పెట్టగానే మొగుడూ పెళ్ళాలౌతారేమిట్రా మా తమ్ముడికి రామాయణం అంటే ఇష్టం అందుకనే ఇద్దరికీ అందులో పేర్లు పెట్టుకున్నాడు. అంది. అన్నాయ్ కోదండ రామారావు భార్య పేరు శాంత అంది. మా చెల్లాయ్ భార్యాభర్తల పేర్లకి మనం వంక పెట్టకూడదు. అమ్మాయి అబ్బాయి ఎక్కడో పుట్టి ఒక్కటౌతారు. కానీ ఒక్క ఇంట్లో పుట్టినవాళ్ళకి పురాణాల్లోని వ్యక్తుల పేర్లు పెట్టుకునేప్పుడు కొంచం ఆలోచించి పెట్టుకోవాలి.
మా పిల్లలకి వాళ్ళ బామ్మ అంటే ప్రేమ అందుకే ఆమెని సమర్థిస్తూ మా నాయనమ్మ చూడు ఎంత తెలివైందో తన పేరు అనసూయ అని మా నాన్న పేరు దత్తాత్రేయులు అని పెట్టుకుంది అన్నారు. పురాణ చుట్టరికాలు చాలా లిమిటెడ్ సపోజ్ గణపతికి కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలి హనుమంతరావు కూతురికి ఏం పేరు పెట్టాలి ఇదంతా ఎందుకు హాయిగా నక్షత్రాన్ని బట్టి పేరు పెడితే కుకూకేకో వస్తుందట. అంటే కుక్కుటేశ్వరరావో కూర్మనాదమో కేశవుడో కోటయ్యో పెట్టాలన్న మాట మా బాబాయి శివకేశవుల భక్తుడు పిన్ని వీధి వీధినా వెలిసిన దేముళ్ళనూ దేవతలనూ పరమభక్తిగా మొక్కుతుంది. అందుకని వాళ్ళ పిల్లలకి మూడు వరసలు వచ్చేలా అందరి దేముళ్ళ పేర్లు కలిపింది.
ఒక నాస్తిక శిఖామణి దేముళ్ళ పేర్లు పెట్టకూడదని పిల్లలకి నీళ్ళు నిప్పు కారం ఉప్పు అనే పేర్లు పెట్టుకున్నారు. నీరు అంటే నారాయణుడు నిప్పు అంటే అగ్ని, సూర్యుడు అని వాళ్ళ పేర్లకు పౌరాణికార్థాలు తీశారు.
అట్టే మాట్లాడితే సర్వం జగన్నాధం అని అన్నీ పేర్ల అర్థాలు పరమేశ్వరుడికి పరమేశ్వరికి చెందుతాయి. ఇలా చర్చ జరుగుతున్న సమయంలో ఎవరో వెళ్ళి సంగీతం పుస్తకమూ బృహత్ స్తోత్రరత్నాకరమూ తెచ్చారు. రాగాల పేర్లు వేలకొద్ది ఉన్నాయి . ఎంతో అందంగా ఉంటాయి. అయినా హాస్యానికి ఖరహరప్రియ అని పెట్టరాదా పిన్నీ అన్నది మా పెద్దది. ఎంత పెద్ద పేరు పెట్టినా పిలిచేది రెండవ రాలె అంచేత ఖరా...అనో ప్రియా అనో పిలుస్తారు అంది. భైరవి పెడితే అంది చిన్నది. భైరవి, చాముండి మహంకాళి నాటకురంజి, భేగడ, కాఫీ ఇవన్నీ ఏరి అట్టే పెట్టుకోండి మీకు పిల్లలు పుట్టాక పెట్టుకుందురుగాని అని హాస్యం చేసాడు తమ్ముడు. చిన్న చెల్లాయ్ నవలలు తెగ చదువుతుంది. అందరూ లైట్లార్పిస్తే బాల్కనీలో కూర్చుని వీధిలైట్ల కాంతిలో చదువుతుంది. ఆహా వీధి దీపాల్లో చదువుకుని ఎంతో గొప్పవాళ్ళు అయిన ప్రముఖుల కోవలోకి ఇదీ చేర్తుంది అని తమ్ముడు వేళాకోశ చేస్తాడు. ఇప్పటి నవలల్లో పేర్లు ఏకరువు పెట్టసాగింది. అనిరుధ్, నిష్వకేన్స్, ప్రాణాంతక్, నరాంతక్, ప్రజ్ఞ, ప్రాభవ, వైభవ అంటూ నాన్‌స్టాప్‌గా వెళ్ళిపోతోంది. అందరూ తమ అభిప్రాయాలు చెప్తుంటే తాను మాత్రం ఎందుకు చెప్పకూడదు అనుకుంది. కాబోలు మాపని మనిషి ఆది కూడా నోరు విప్పింది. అయిదోక్లాసు దాకా చదివింది. అదీ దాని గర్వం అమ్మ ప్రసూన, ప్రసూతి, కనత, అంటూ సజెస్ట్ చెయ్యడంతో అందరూ గొల్లున నవ్వారు.
మా మరదలిఇ చెల్లెళ్ళకి విసుగు పుట్టింది. ఇప్పుడేం పేర్లు పెట్టం, పింకీనోజంకీనో, చిట్టోపొట్టో అని పిల్చుకుంటాం మూడుళ్ళు వచ్చాక వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టుకుంటారు అన్నారు. అబ్బ ఎంత ఆదర్శవంతమైన పెంపకమో పేర్ల గాణ్ణించీ వాళ్ళిష్టమే అయితే పూర్తిగా వాళ్ళ ఇష్టారాజ్యమేనన్న మాట చాలా చర్చలలాగానే పేర్ల చర్చ కూడా పరిష్కారం కుదరకుండానే ముగిసింది.
|