44
 

కాల హ‌ర‌ణం

 

ఎవ‌రు ఏం చేసినా ఏం చెయ్య‌క పోయినా, ఎవ‌రికి ఇష్ట‌మున్నా లేక‌పోయినా క‌డ‌కు ఆ ప‌ర‌మేశ్వ‌రునికి కూడా చెప్పుచేత‌ల‌లో లేకుండా జారిపోయేది కాలం !  క్ష‌ణం క్ష‌ణం క‌రిగిపోతూనే వుంటుంది. హౌడు యు కిల్ యువ‌ర్ టైమ్  అనిగాని టైమ్ పాస్ ఎలా అవుతోంది అనిగాని అడ‌గ‌టం ప‌రిపాటి. రైళ్ళ‌లో బ‌ఠాణీలు అమ్ముతారు. అవి వొక్క‌క్క గింజా నోట్లో వేసుకుని న‌ముల్తూవుంటే కొంత‌కాలం గ‌డిచిపోతుంది. అందుకే వాటిని కాల‌క్షేపం బ‌ఠానీలు అంటారు.

బ‌ఠాణీలు న‌ముల్తూ జీవితాన్నే కాల‌క్షేపం చేసే ప్ర‌బుద్ధులూ ఉన్నారు. ఈ ఆనంత కాల‌వాహినిలో సూప‌ర్ స్పీడ్‌తో ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ ఒక్క క్ష‌ణం ఆగి మ‌నం ఈ లోకంలోకి వ‌చ్చినందుకు ఏం చేశాం ?  ఏం చేస్తున్నాం ఈ అవ‌తారానికి ప్ర‌యోజ‌నం ఏమిటి ?   ఫ‌లితం ఏమిటి ?   అని ఆలోచించుకుని మ‌న‌ల్ని మ‌నం విళ్లేషించుకోగ‌ల్గితే అంతే చాలు !  ఈ ఆలోచ‌నే మంచి ప‌నుల‌కి మార్గ‌ద‌ర్శ‌క‌మౌతుంది. ఈ ఆలోచ‌న  ముందు ముందు ఎన్నో ఘ‌న‌కార్యాలు చేయ‌డానికి మూలాధార‌మౌతుంది.

అర్థిక‌స్థితిగ‌తుల‌నుబట్టి ప్ర‌జావాహినిని మూడు త‌ర‌గ‌తులుగా విభజింప‌వ‌చ్చు. క్రింద త‌ర‌గ‌తులుగా , మ‌ధ్య త‌ర‌గ‌తి, పై త‌ర‌గ‌తి ! క్రింద త‌ర‌గ‌తి, స్త్రీలు చాలాభాగం నిర‌క్ష‌రాస్యులే. పొలాల్లోనో, క‌ట్ట‌డాల్లోనో కూలీ నాలీ చేసుకుంటునో పాలూ పిడ‌క‌లూ క‌ల్లూ సారా అమ్ముకుంటూనో, ఆఖ‌రికి నాలుగిళ్ళ‌లో పాచిప‌ని చేసుకునో పాటుప‌డి పొట్ట పోసుకుంటారు. వీరికి కాల‌క్షేపం ఎలా అన్న ప్ర‌శ్న ఉండ‌దు. అచ్చ‌మ్మ బుచ్చ‌మ్మ క‌బుర్లు అక్క‌ర్లేదు. నిరంత‌ర శారీర‌క శ్ర‌మ‌జీవుల‌వ‌డంచేత శారీర‌క మాన‌సిక వ్యాధుల‌కు వీరిమీద మ‌మ‌కారం ఉండ‌దు. పై త‌ర‌గతి స్త్రీల‌కి, చ‌దువుకున్న వారికైనా చ‌దువుకోనివారికైనా మిక్కిలి ఎక్కువ ధ‌నం ఉండ‌టంచేత‌, ప‌నివాళ్ళు, వంట‌వాళ్ళు వుండి, ఆడంబ‌రంగా ఖ‌ర్చులు చేస్తూ ఇంట్లో కాలు కార్లోనూ, కార్లో కాలు ఇంట్లోనూ పెట్ట‌డం త‌ప్ప‌మ‌రో ప‌నేం ఉండ‌దు. నిరంత‌రం అలంక‌ర‌ణ చెడ‌కుండాఉంచుకోడానికి త‌నుస్థాయివారిక‌న్నా త‌మ‌కే మంచిచీర‌లూ న‌గ‌లూ ఉన్నాయ‌ని నిరూపించుకోడానికి ఆప‌సోపాలు ప‌డిపోతూ ఉంటారు. ఉన్నంత‌లో తీరిక చేసుకుని లేని వ్యాధుల‌ను ఊహించుకుంటూ మాన‌సికంగానూ, వ్యాయామం లేక పోవ‌డం చేత శారీర‌కంగానూ వ్యాధిగ్ర‌స్త‌మ‌వ‌డానికి కాలాన్ని ఉప‌యోగించుకుంటారు.

ఇక మ‌ధ్య త‌ర‌గ‌తి వారు చివ‌రికి వ‌స్తారు. వీరి అల‌వాట్లూ అవ‌స‌రాలూ పైవారికి క్రింది వారికి మ‌ధ్య‌గా ఉండి ఊహ‌ల్లో పైవారిని అందుకోవాల‌నే క‌ల‌లు కంటూప్ర‌య‌త్నాలు చేస్తూ లేనిపోని డాంబికుల‌కు  లోన‌వుతూ ఉంటారు. ఒక్కొక్క‌ప్పుడు ఈ అనుక‌ర‌ణ శ‌క్తికి మించిపోతే భ‌ర్త‌ల‌ను త‌ప్పుదార్లు ప‌ట్టించ‌డానికి సైతం వెనుదీయ‌క వారిని ప్ర‌యాస పెట్టి తాము ఆయాస‌ప‌డిపోతూ ఉంటారు.

ఈ రోజుల్లో చాలా వ‌ర‌కు ప్ర‌తియింట్లోనూ గ్యాస్ పొయ్యి, కుక్క‌ర్‌, గ్రైండ‌ర్‌, వాషింగ్ మెషిన్ వంటి ప‌రిక‌రాలు ఉంటున్నాయి. త‌క్కువ కాలంలో ప‌ని అయిపోగా మిగ‌తా కాలాన్ని ఎలా వినియోగించాలో తోచ‌కుండా పోతోంది. అందుకే ఎవ‌రి నోట‌విన్నా బోర్ బోర్ ఉత్త బోర్ లైఫే ఒక బోర్ అయిపోతోంది అన్న‌మాటే !

ఏం చేస్తే కాలాన్ని స‌ద్వినియోగం చేస్తున్న‌ట్లు ?  మాన‌వ‌సేవే మాధ‌వ‌సేవ అన్నారు. మ‌నంచేయ‌గల్గిన ప‌ని ఏదైనా స‌రే ఎంత చిన్న‌దైనా స‌రే ఇంకొక‌రికి ఉప‌యోగ‌ప‌డితే అది మంచిప‌నే అయితే కాలాన్ని స‌క్ర‌మంగా న‌డిపామ‌న్న మాటే !  అస‌లు కాలం దానంత‌ట అది ప‌రుగెత్తుకుపోతూనే వుంటుంది. కాలంతో పాటు మ‌న‌మూ సత్క‌ర్మ‌లు చేసుకుంటూ పోవ‌డ‌మే స‌త్కాలక్షేపం ! ఏం చేసినా ఏం మాట్లాడినా దీనివ‌ల్ల ఏమైనా ప్ర‌యోజ‌నం ఉందా అన్న విమ‌ర్శ చేసుకుంటూ సాగిపోతే ఈ విమ‌ర్శే మంచి కాల‌క్షేపాన్ని మ‌న ముందు ఉంచుతుంది.

కొంద‌రు శ‌రీర శ్ర‌మ చేయ‌డం నామ‌ర్ధా అనుకుంటారు. ఉద్యోగం చేసేంత చ‌దువూ వుండ‌దు. నేనొక గ్రామంలో చూశాను. అక్క‌డ స్త్రీలంద‌రూ క్రింద త‌ర‌గ‌తీ, పై త‌ర‌గ‌తీ అన్న భేదం లేకుండా ధనార్జ‌న చేస్తారు. ఎలాగ అంటారేమో ?  ఇంటింటికీ ఏజెంట్స్ వ‌చ్చి దార‌పు ఉండ‌లూ, సూదులూ ఇచ్చి వారికి ఏ ర‌కంగా  అల్లాలో చెప్పి పోతారు. గ‌డువులోప‌ల ఈ గృహిణులు ఇంట్లో కూర్చునే చ‌క్క‌ని అల్లిక‌తో లేసులు క‌ర్టెన్లు, టేబుల్ క్లాతులు, దిండు గ‌లీబులు, గౌను వంటి వాటిని క‌ళాత్మ‌కంగా త‌యారు చేసి డ‌బ్బు సంపాదిస్తారు. కాలు బ‌య‌ట పెట్టకుండానే త‌మ ప‌నులు చూసుకుంటూనే జ‌పానులోలాగ మ‌న దేశంలో కూడా వ‌స్తూత్ప‌త్తి జ‌రిగితే దేశ‌మూ, ప్ర‌జ‌లూ కూడ బాగుప‌డ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కి పెన్‌, తీసుకుందాం. కేప్‌, క్లిప్‌, నిబ్‌, ఫీడ‌ర్ బాడీ వంటి ప‌రిక‌రాలుంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పార్టుకి సంబంధించిన చిన్న యంత్ర‌మూ ముడిస‌రుకూ కూడా కంపెనీవారు స‌ర‌ఫ‌రా చేస్తారు. గృహిణులు వంద‌లూ వేలూగా ఆ పరిక‌రాల‌ను త‌యారు చేస్తారు. చిన్న వ‌స్తువుల‌కు కూడా పెద్ద ఫ్యాక్ట‌రీలు అక్క‌ర్లేదు. మన దేశంలో అప్ప‌డాల‌కీ వ‌డియాల‌కీ త‌ప్ప ఇలాంటి సౌక‌ర్యం త‌క్కువ !

శారీర‌క శ్ర‌మా ప‌రిశ్ర‌మా అలా వుంచి, ఏ క్ష‌ణ‌మూ మ‌న‌దికాదు. అనుక్ష‌ణ‌మూ నీకే ముడ‌పు అని భావించి నిత్య‌మూ హ‌రి నామ‌స్మ‌ర‌ణ‌మే శ‌ర‌ణ్య‌మ‌నుకునేవారికి కాలం వ‌శ‌మౌతుంది.

ఈ కాళ్ళూ చేతులు ఏ క్ష‌ణాన త‌మ ప‌ని చెయ్య‌డం మానుకుంటాయో ఏ క్ష‌ణం ఈ నోరు మూగ‌బోతుందో ఈ కంఠాన ఏ క్ష‌ణం క‌ఫ‌వాత వాయువుల‌డ్డుగోడ‌లై ప్రాణ‌వాహినిని నిల‌వ‌రిస్తాయో ఓ ప్ర‌భూ ! ఈ క్ష‌ణ‌మే నిన్ను నా హృదిలో బందించుకుంటాను. భ‌జించుకుంటాను అనే భావ‌న‌తో పునీతులైన‌వారు ధ‌న్యులు మూర్థ‌న్యులు.