ఆత్మ విశ్వాసం
తాడినితన్నేవారి తల దన్నేవారుంటారి సామెత ! నా అంతవారులేరని విర్రవీగే వారికీ మాట ఒక హెచ్చరికన్నమాట. కొందరికి తాము ఎక్కువవారమనే భావన వుంటే కొందరు తాము తక్కువ అనే భావనతో తమనుతామే కించపరుచుకుంటూ వుంటారు.
మా నీరజాక్షి ఇంటికెవరైనా వస్తే ముడుచుకుపోతుంది. చిన్ననాటి స్నేహితులు ఒకరిద్దరితో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడదు. భర్తపోరుపడలేక ఎప్పుడైనా మాట్లాడబోయినా ఒకమాట కొకమాట మాట్లాడుతుంది. వాక్యం మధ్యలోనే ఆపేసి తరువాత మాట అదెంత చిన్నదైనా వాడుకలో ఉన్నమాటైనాసరే గుర్తురాక తడుముకుని మరింత సిగ్గుపడి మరింత కుంచించుకుపోతుంది. ఇందుకుకారణం తను చదువుకోలేదు. గనుక తను తెలివితక్కువ దాన్ననీ చదువుకున్నవారంతా చదువుల సరస్వతులనీ భావించుకుని వాళ్ళతో మాట్లాడటానికి కూడా వెరుస్తుంది. ఇలాంటి భావాలతో ఉన్నవారిని ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడ్తున్నారని సైకాలజిస్టులు చెప్తారు. ఇది నిజంగా ఒక మానసిక బలహీనతే ఈ బలహీనతవల్ల అనేక సమస్యలు వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇన్‌ఫీరియారాటీ కాంప్లెక్స్‌వల్ల వ్యక్తి కెంత నష్టంవుటుందో సంఘానికి కూడా అంతా నష్టం ఉంటుంది. ఎందుకంటె తమకున్న శక్తిసమార్థ్యాలను తమలోనే అణచివేసుకంటూ తమద్వారా సంఘానికి జరుగవలసిన మేలును జరుగకుండా లోటు చేస్తారు కదామరి !
మాధవి చాలా ధనవంతురాలు. ఆమె ఎప్పుడూ పట్టుచీరలే కట్టుకుంటుంది సాదా వాయిల్ చీరో నేతచీరో కట్టుకునే నాతో మాధవి మాట్లాడదు అంటుంది శైలు. నిజానికి తనతో మాట్లాడేవాళ్ళు చాలామందే ఉన్నా ఆ ధనవంతురాలు మాట్లాడదనే భావం శైలూని నిలువనీయదు. ఆమె తనతో మాట్లాడకపోతే వచ్చే నష్టమేమిటి అనే ఆలోచన శైలుకి రాదు. నేను చెప్పినా విన్పించుకోదు. తను బీదదాన్న నీ లోకంలో మరెవ్వరూ వాయిల్ చీరలు కట్టుకోరనీ అందరూ తన చీరవంకే చూస్తున్నారనీ ఎవరైనా ఏదైనా చెప్పుకుని నవ్వుకుంటుంటే అది తనగురించేనని ఊహించుకుంటూ బయటికి రావడానికే భయపడి పోతుంది. అది క్రమంగా మరింత మానసికంగా దిగజారి భర్తను అసమర్థుడని సతాయించడం దాకా వచ్చింది. పట్టుచీర కొనమని పట్టు బట్టి భర్తప్రాణం తీసిందట. ఆ పిచ్చి మానవుడికంత ఆర్థికస్తోమత లేదు. భార్య కోరిక తీర్చడం కోసం అతను పక్కదారులు తొక్కినా అనుమానించక్కర్లేదు. శైలజ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత ప్రమాదానికి దారితోసిందో చూశారా ? నీతిపరుడైన భర్తను అవినీతిదారులకు పయనించేలాగ ప్రోత్సహిస్తోంది. అలాకాక మాకున్నంతలో మేము ఉంటాము. మా స్థాయికి తగ్గ బట్టలు వేసుకుంటాము. అని నిర్భయంగా ఉంటే అందరికీ హాయిగా ఉంటుంది. శైలజలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం ఎలాగా అన్నదికాదు ఇప్పటిసమస్య. పై పై మెరుగులకు మోజుపడకుండా నిజమైన శక్తి సామర్థ్యానికి విలువియ్యడం మనమెప్పుడు నేర్చుకుంటామా అన్నదే !
ఈ అత్మ న్యూనతకు ఏకైకకారణం స్వశంక, అంటే తమమీదా, తమ శక్తి సామర్థ్యాలమీదా వీరికి నమ్మకం ఉండదన్న మాట. తమను తమ ప్రతిభను అనుమానించుకుంటూ తమకు లేనిదాన్ని గురించి గోరంతలను కొండంతలుగా చేసి ఊహించు కుంటూపోతే అదే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి దారితీస్తుంది. అక్కడ్నించి వీరు సమాజానికొక సమస్యగా తయారవుతారు. ఒకరికి చదువురాదు రాకపోతేనేం చక్కని గొంతు ఉంటుంది. దాంతో సంగీతసాధన చేసి తాను ఆనందిస్తూ నలుగుర్నీ ఆనందింపచేయవచ్చు. కొందరికి గాత్రం లేక పోవచ్చు. నైపుణ్యంగా వాద్య సంగీతం విన్పించగల నేర్పు వారి మునివ్రేళ్ళకుండే వుంటుంది. లేదా, చిత్రలేనంతో కళారాధన చేయవచ్చు. చక్కటి సాహిత్య కల్పనా చేయవచ్చు. ఏదైనా ప్రయత్నం చెయ్యాలి ! సాధన చెయ్యాలి ! కథలూ, కాకరకాయలూ అల్లలేకపోయినా కుట్లో అల్లికలో చేసుకోవచ్చు. అన్నిటినిమించి ఇంటిని తీర్చిదిద్దుకోగల నేర్పుంటే అంతకు మించినదేదీ ఉండదు. ఇలా ఏదో ఒక శక్తి ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఉండే వుంటుంది. దానిని వెలికితీసి సానపెట్టటమే చేయవలసిన కర్తవ్యం. అంతేగాని మనకు లేనిదాన్నిగురించి ఆహర్నిశలూ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుపోవడంవల్ల ప్రయోజనం లేకపోగా అనారోగ్యం చుట్టుకుని ఇల్లూ వొల్లూ గుల్లఅయ్యే ప్రమాదం ఎంతోఉంది.
ఈ కాంప్లెక్స్ ఒక్క ధనం విషయం లోనేకాదు. చాలావిషయాల్లో కలుగుతూనే వుంటుంది. నల్లగా ఉన్నామనో లావుగా ఉన్నామనో పళ్ళెత్తుగా ఉన్నాయనో బాధపడుతూనే ఉంటారు. అందంగా ఉండటానికిగాని అనాకారిగా ఉండటానికిగాని తమకెంతబాధ్యత ఉన్నది ? అన్న ఆలోచన వీరికిరాదు.
మా బంధువుల అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరే అక్కాచెల్లెళ్ళు తల్లిదండ్రులెంతో గారాబంగా పెంచారు. ఖర్మవశాత్తు పెద్ద అల్లుడు తాలూకా ఆఫీసులో గుమాస్తా, చిన్న అల్లుడు ఇంజనీర్. ఇంజనీర్ గారి భార్య అక్కగారి దగ్గరకూడా హోదా వెలగబెడుతుంది. పెద్దామోకసలే ఇన్‌ఫీరియారిటీ. తనను తక్కువ ఉద్యోగస్తుడికిచ్చి పెళ్ళి చేశారని తల్లిదండ్రులమీద కచ్చగట్టింది. ఎవరి అదృష్టం, అవకాశం వారిదనే సమన్వయ భావం ఇద్దరిలోనూ లేక తల్లి దండ్రులకు ఇక్కడే నరక సందర్శనం చేయిస్తున్నారు ఆ పుత్రికారత్నాలు.
ప్రతివారిలోనూ అంతర్గతంగా ఏదో సామర్థ్యం ఉండేవుంటుంది. ప్రతివ్యక్తీ సంఘానికేవోరకంగా ఉపయోగపడటానికివకాశం ఉంటుంది. అనే ఆత్మవిశ్వాసంతో తమకుగల ఏ చిన్నలోపాన్నో, మరిచి ధైర్యంగా, సంతోషంగా, హుషారుగా, ఏక్టివ్‌గా ఉన్ననాడు ఈ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ దాని దారి అది చూసుకుంటుంది. వ్యక్తి శ్రేయస్సు దృష్ట్యా, సంఘ శ్రేయస్సు దృష్ట్యా కూడా ఈ ఆత్మవిశ్వాసం ఎతో అవసరం.
ఈ ఆత్మవిశ్వాసం శృతిమించిపోయినా ప్రమాదమే. అది మళ్ళీ ఇంకో కాంప్లెక్సుకు దారితీస్తుంది. ఏదైనా సమపాళ్ళలో ఉంటేనే అందమూ ఆనందమూను.
|