అచ్చర
అచ్చర చిన్న తనమున గస్తియను యువకుని ప్రేమించి కింబు అనునతని పెండ్లాడి కారణాంతరములచేత మలర గస్తిని చూపట్టినది. చిట్లీ చిట్లని గాజులు అను నవలలో అచ్చర తన సంగీతముతో పురుషులను రెచ్చగొట్టగల్గి వారి సంయమమును పరీక్షించు చుండెడిది.
నేపాళముననున్న పర్వత సానువులలోనున్న కొన్ని గ్రామములు కొన్ని గుంపు ల చేతులలో నుండెడివి. ఈ గుంపుల కొక్కొక్క నాయకుడుండెడివాడు. నాయకులలో ఒకరితో నొకరికి పడెడిదికాదు. చోరి, దళారి అను రెండు గుంపులు బలవంతముగ నుండెడివి. చోరి గుంపు నాయకుడు కంబు. అచ్చర చిన్న తనమున గస్తిని ప్రేమించి తల్లిదండ్రుల పోద్బలముచే కింబును పెండ్లియాడినది. గస్తి కామె దక్కనందున కింబునకుకూడ దక్క రాదని భావించెను. ఈర్ష్య యట్లుండగా కింబు అచ్చరను నాలుగు గోడల మధ్యన బంధించెనని కోపముగ నుండెను. ఆనాడు చార్వాకమతము నవలంబించు నీ గుంపులోని స్త్రీలకు బహువివాహములు నిషిద్ధముకావు. ఒకనిని చంపుటయు వాని భార్యనితడు స్వీకరించుట వారి ఆచారము. స్త్రీలు కూడా తాము మెచ్చిన వీరునితో భోగించుట దోషముగ పరిగణించెడివారు కారు.
నాలుగై దేండ్లు గడచిన తరువాత గస్తి ధనవంతుడగుటయే గాక గొప్ప ఖడ్డవీరుడై చోరి గుంపునకు తిరుగులేని నాయకుడై కింబుపై పగదీర్చుకొన సమర్ధుడయ్యెను. అచ్చర కూడ గస్తిని మరువలేదు. కింబు గృహము చెరసాలయైనది. ఆమెకు పరిమళ ద్రవ్యములకు గాని అధికారమునకుగాని లోపసాలేదు. కాని మనసులోనేదియో లోపము.
గస్తి యచ్చర స్థితిని కనుగొనుటకు శిఖామణి యనునొక మూర్ఖశిఖామణిని నియోగించెను. అతనికి ఎవరేమి మాట్లాడిన నేమిచేయవలెనో ఎవరేమి యడిగిననేమి చెప్పవలెయునో చిలుకకు చెప్పినట్లు చెప్పి యచ్చర దగ్గరకు పంపెను. శిఖామణి వేయిపడగలులోని పసరికకు ఆకారమున ప్రతికృతి వంటివాడు. అతడీనకఱ్ఱ పుల్లవలె నుండును. కాని వాని కేనుగుకున్నంత బలమున్నది. జిఱ్ఱున చీదడు గాలి పటమువలె నుండును. నల్లని పడగగల నల్లని త్రాచు తూలుచు పోవునట్లుండును. ఇట్లీ శిఖామణి వికృతాకృతికి తోడొక నవ్వునవ్వును. ఆనవ్వు ఎప్పుడు వచ్చునో ఎందులకు వచ్చునో తెలియదు. ఆనవ్వును విన్న అచ్చరకు అంతరాంతములలో హాస్యముచికి వచ్చుచుండును. పరమ కిరాతుడైన కింబుకూడ శిఖామ నవ్వునకు పొట్టపగులునట్లు నవ్వెడివాడు. ఇట్టి శిఖామణి సాయమును గస్తి కోరెను. గస్తి అచ్చర తననింక ప్రేమించు చుండెనాయని అనుమానించెను. కింబును వధించి అచ్చరను తీసుకొని రావలెననుకొనెను. గస్తి కచ్చరపైగల ప్రేమ యట్టిది.
గస్తి యచ్చరకొక లేఖవ్రాసి పంపెను. ఆమెఎట్టి ప్రశ్నయునో శిఖామణి యేమిజవాబు చెప్పవలయునో చెప్పెను. అచ్చర తన పేరు చెప్పిన తరువాత మాత్రమే జాబు నియ్యమనెను. శిఖామణి నందర్భము చెడకుండ సన్నివేశము నడుపుటను చూచి గస్తి చాతుర్యమునకు అచ్చర యచ్చెర వందినది. అతని యనురాగమునకు కంపించినది. గస్తికి తాను స్త్రీ కాదు. ఒక భోగ ద్రవ్యముకాదు. ఒక అనుభవించవలసిన పదార్ధముకాదు. ఒక విలక్షణమైన స్వభావముచేత ప్రకాశించుచున్న యొక మధురమైన జీవుడు.
ఒకనాటి రాత్రి కింబు యింటలేని సమయమున గస్తి వచ్చి యచ్చర నక్కడ నుండి తప్పించెను. దవ్వుననున్న మహారణ్య మధ్యముననున్న పర్వతములో ప్రవహించు నీలాంబరి నదియొడ్డున రహస్యముగ నొక గ్రామమున నిర్మించుకొని అచట కింబు తన కామవ్యాపారమును సాగించుచుండెను. గస్తి అచ్చరను అక్కడికి తీసికొనివెళ్ళి కింబును చూపించెను.
అచ్చర ధూర్తమును, అసభ్యమునైన ఒక పాటను నేర్చినది. ఆ పాలయందొక వ్యంజక శక్తి యున్నది. ఆపాటలో మోటిదనము వెగటుదనమున్నవి. ఈ భావములన్నియు కలిసి చరణాంతమున నొక్కసారిగ భాసించును. ఆ రెండు భావములు ప్రతిచరణము చివరనున్న మాటలో భాసించును. ప్రతిచరణాంత మందొక దీర్ఘము తీయబడును. అచ్చర యా దీర్ఘము తీసినప్పుడెల్ల యావెగటు దనము మోటుదనములు చిత్రముగా నాలుగు రెట్లుగా వినిపించును. ఈ పాట పాడునప్పుడు అచ్చర గొంతు చిత్రముగా చీలును. శిఖామణి నవ్వుయెట్టిదో అచ్చరపాట అట్టిది. ఆపాట పాడునప్పటి చరణాంతమున పగులు గొంతు సవ్వడి యట్టిది. భర్త చేత వలపింప చేసికొనుటకీ పాట యొక ఆయుధము. ఆయాయుధమే పురుషుని పైననైనను పనిచేయును. సంగీతమునకున్న శక్తి యట్టిది. వర్షమును కురిపించిరి. అగ్నిని రగిల్చిరి, అట్లేకామమును కూడ రేకెత్తింపగల ప్రభావమున్న పాటలను అచ్చర ఆయుధముగ చేసికొన్నది. కర్ణాటక సంగీతమున ప్రకృతి సిద్ధమైన స్వభావముల సుద్దీపింపజేయు లక్షణములున్న రాగములున్నవి. ఉదాహరణముగ కదనకుతూహలమును కామవర్ధిని రాగములను పేర్కొన వచ్చును. అచ్చర గానమీ రెండు రాగముల కలయికను లక్షణయుక్తముగాని దేశసంగీతమున గానము చేసియుండవచ్చును.
అచ్చర గస్తి తనను ప్రేమించినందున వివాహముగాకుండ నుండి పోయెనని విని యిన్నాళ్ళెందుకూర కుంటివి ? అతనినేదో చేసినన్నెప్పుడో తీసికొని రావలసినది అని కింబునేదైన చేయవచ్చునన్న సూచనయు తన కతనిపై ప్రేమ లేకుండుటయు తెలియజేసినది.
అచ్చర కింబుచేయుచున్న ఘోరములను చూచియతనిని అసహ్యించుకొన్నది. అతడు స్త్రీలననుభవించి వారలను కొండల మీదనుండి బిచ్చగత్తెలుగ చేయుటయో కొందరు భర్తలంగీరించినచో మరలవారి కడకంపుటయో చేసెడివాడు. అచ్చర కింబు నిట్లు ప్రశ్నించినది. నీవు బిచ్చమెత్తు కొందువా ? కొండల మీదినుంచి దొర్లించు మందువా ? మరల నిన్ను నీభార్య స్వీకరించునంత సిగ్గుమాలిలేదు. అనుటలో అచ్చర యొక్క బుద్ధి కౌశల్యుము వెల్లడియగు చున్నది. చార్వాకులలో నొక స్త్రీ కొక పురుషుడని గాని ఒక పురుషునకొక స్త్రీయనిగాని నియమములేదు. ఒకరినిప్రేమించుట కూడలదు. కాని అచ్చర, గస్తి, ఈ విషయములనెదిరించి ప్రత్యేకతను చూపియున్నారు. గస్తి కింబుల ద్వంద్వయుద్ధమున కింబుమరణించెను. అచ్చర కిశోర శర్మయను పండితుని సాహచర్యమున తాను కూడ వైదిక మతాభిమానియైనది. చార్వాకులపై నేవగింపు తనకు తెలియకనే కలిగినది.
కింబుమరణము తరువాత గస్తి వివాహప్రసక్తియెత్తలేదు. గస్తి పెండ్లియాడనప్పుడతని యింటనుండ నిచ్చగింపని అచ్చర కింబుఇంటికి వచ్చినది. ప్రేమలేని కింబు యింట నీమెకేమియధికారమున్నది, ప్రేమలేక పోయినను తన భర్త యిల్లు, గస్తికి తనపై ప్రేమకలదు. అయినను గస్తి యింటనుండుట కభిజాత్యమడ్డువచ్చనది. ప్రేమగల వానియింట నుండుట అభిమాన హేతువు. మొదటి నుండి మనసును చంపుకొని కింబు ఇంటిలోనున్నది గావున మరల నభిమానము చంపుకొనుటయన్న ప్రసక్తి యచ్చర కచ్చటలేదు.
కింబు పరిచారికలలో పలురకములుగ పలికినది. చమత్కారముగ పరిస్థితులను తనకనుకూలముగా మలచుకొన్నది. కాని కిశోరవర్మ యదార్థము గ్రహించెను. కిశోరవర్మ అచ్చరకు కింబు తండ్రి సంపాదించిన వేయి ఎకరములకు పట్టా తెప్పించి, గస్తికి నగరరక్షక పదవినిప్పించెను. అతడు తన హిందూ మతాభిమానముతో మంత్రుల హృదయమును గెల్చి యిట్టి పనులను చేయగలిగెను.
దళారి గుంపు గురువు అచ్చర దగ్గరకువచ్చి ఆతధ్యమిమ్మనెను. అచ్చర వీలుకాదనినది. అతడు అచ్చరపె మోహపడెను. అచ్చర కావిషయము తెలియకుండలేదు. సంకేతములు చేయుటలో నీమెదిట్ట. ప్రతిదినము నాయింటికి వచ్చుచుండువు రాత్రులందు వచ్చు చందువు కాదు. వచ్చినచో తరిమ వేయుదును నీమల్లరు పనికిరారు అన్నది. ఆగురువునకు పదిమంది మల్లురుండిరి. వారు దుందుభ సమానులు. వారిని సుకుమారియైన అచ్చర ఎట్లు తరిమి వేయగలదు ? అనగ వారిని రాత్రిరమ్మని సూచనయన్నమాట మల్లురతో కూడరమ్మనుట ఒక పనిని ప్రత్యేకముగ చేయవద్దని చెప్పుటతో తప్పక చేయవలెనని యనిపించుననియచ్చరకు తెలియును. ఆమెకు మరిమొక ధైర్యము గలదు. గస్తి తనను పరిరక్షించుచునే యుండును. గురువు వచ్చుట పోవుట, అతనికి తెలిసియేయుండును. తనకై పెక్కువధలు గావించిన గస్తి, తనను గురువున కప్పగించి యూరకొనడు. గురువునకు సంకేత మిచ్చినప్పుడు శిఖామణి యచ్చటనే యుండెను. శిఖామణి పూర్వపు అమాయక చక్రవర్తి కాడు. అతడు వార్తను గస్తికందీయగలడని అచ్చర నిశ్చంతగ నిదురించినది.
గస్తి అచ్చర యూహించినట్లుగ దళారి గుంపును వధించి గురువు నొంటరి వానిని చేసెను. వధించిన మల్లుర నందరనొక దుప్పటిలో మూట కట్టెను. ఆమూటను చూచిన గురువు మూర్ఛపోయెను. శిఖామణి వాదము ప్రభావముతో నాగురువు వైదిక మతస్థుడయ్యెను.
ఇక చోరి గుంపు గురువు మిగిలియుండెను. అచ్చర అతనికి లేఖ వ్రాసినది. తాను గస్తిని పెండ్లియాడుటకు గురువానతీయ వలెనన్నది. ఆ గురువు అర్జునుడు అచ్చరయున్న సూచియానా పట్టణమునకు వచ్చి విధవరాలిని వివాహమాడరాదన్న నియమము వైదికులదిగాని చార్వాకమతస్థులుకాదని. అచ్చరను పెండ్లియాడమని గస్తికి చెప్పెను. అర్జునుడు అచ్చర యింటికిపోయి మతచర్చ చేయబోవును. ఆమె యతనిని శృంగార రసములోనికి దింపును. అర్జునుడు కామమును పరిహరింప వలెననును. అచ్చర తానుచ్చిష్టముననెను. అర్జునుడు అచ్చరవుగాన దేవవేశ్యవంటిదానవు రంభాద్యప్సరసకుచ్చిష్ట దోషమంటదనెను. చార్వాక మతస్థులకు దేవతలేల ? దేవవేశ్యలేలయని ప్రశ్నించినది. ఇంత కవ్వించిన తరువాత అర్జునుడు అచ్చరపై తనకుగల మోహమును వెల్లడించెను. అచ్చర మరునాటిరాత్రికి రమ్మని కబురు పెట్టినది. గస్తికి కూడ కబురుపెట్టినది.
మరనాడు గస్తి వచ్చి యటకపై కూర్చుండెను. అర్జునుడు వచ్చుట చూచి గస్తి యాశ్చర్యపోయెను. అర్జునుడు అచ్చరకై ఎదురుచూచుచుండెను. అచ్చర తన యొద్దనున్న బ్రహ్మాస్త్రమును ప్రయోగించినది. అది యసభ్యపుపాట ! అంతకుముందామె ప్రక్కగదిలో గజ్జెల మ్రోతయును మద్దెలను వాయించునట్లుగ పరిచారికలను సిద్ధముచేసినది. చిట్లిపోయినవి గాజులు, వెలయిడి కదులుమన్న సాహిత్యముతోనున్న పాటను పాడినది. పాదాంతమున నామె తీసిన దీర్ఘమునకు అర్జునుడును గస్తి యును తాళలేకపోయిరి. అర్జునుడామెను పట్టుకొనబోగా గదినుండి నిష్క్రమించినది. కొంతవడికి గురువుకూడ తనను తాను తిట్టుకొనుచు వెలడిపోయెను.
భౌద్ధమత స్థాపకుడయిన బుద్ధునికూడ అప్సర తనపాటలతో రెచ్చగొట్ట ప్రయత్నించినది. కానియతడు శిలయైచలింపక యుండెను. అచ్చరకు పురుషుని రెచ్చగొట్టి యతని యుద్రేకమును బయటపెట్టి గురువైనను కామమును జయించిన వాడుకాడని తెలియజేయుటయే అభిమతము.
తరువాత నెలరోజులకు గస్తిని పెండ్లియాడి అచ్చర పాటపాడినది. అతడు బంగారు గాజులు తెచ్చితొడిగి అవి పగులవని చెప్పెను.
పశ్చాత్తాపము
అపరాధము చేయుట సాధారణ మానవ నైజము. జీవియొక్క పరిపాకము వలన జరిగిన పొరపాటునకు చింతించుచు పశ్చాత్తాపమనెడి యగ్నిని రగిల్చితద్దోషమును అందు హోమము చేయుట మధ్యే మార్గము. ఇట్టి పశ్చాత్తాపాగ్నిలో దగ్ధమైన దోషముగల వారిలో వేయిపడగలు నవలలోని మంగమ్మ, దిండుక్రిందపోకచెక్క లోని రత్నవళి. చెలియకట్టులోని రత్నావళి, ప్రముఖులు, వారి ప్రకరణమున విశ్లేషింపబడిరి.
త్వగింద్రియస్పర్శ
ఒక్కొక్క వ్యక్తి కొక్కొక్క గుణమతిశయించి యుండును. స్పర్శ గుణాధిక్యముగల స్త్రీలుమువ్వురు. ఏకవీరలోని ఏకవీర, మీనాక్షి, తెరచి రాజులోని వాసంతి, వీరికి అతిశయించిన త్వగింద్రియ స్పర్శజ్ఞానమున్నది. ఈ పాత్రలపై వైవిధ్యమిచట నిరూపింపబడినది.
మంగమ్మ
లోకములో కొన్ని యాకర్షణలకుగాని, ప్రలోభములకుగాని కొందరు వ్యక్తులు లొంగిపొయి ధర్మబాహ్యులై చరించుట జరుగుచునేయుండును. ఇట్లు దిగజారిన వ్యక్తును సంఘము వెలివేసి వారిని మరింత దిగజార్చుటయే లేక ప్రయత్నము చేసి పైకిలేచుటకై చేయినందించుటయే యన్న సమస్యకు సమాధానముగ విశ్వనాథవారు వారి నవలలో కొన్ని పాత్రలను సృష్టించి సమాజముననొక మార్గమును నిర్దేశించిరి. విశ్వనాథ వారు దిగజారిన పాత్రలను మరింత యధోగతికి తీసికొనిపోక వారికికూడ సద్గతులు కల్గింపవలయునన్న రీతిగ పాత్రలను చిత్రీకరించిరి. ఇట్టిపాత్రలలో వేయిపడగలు నవలలోని మంగమ్మకూడా నొకటి
మంగమ్మయను నమాయకురాలు ధనవ్యామోహముచేత పరపురుష సంబంధము నేర్పరుచుకొన్నాది. కాని తన పొరపాటు గ్రహించి శీలమునకున్న విలువను తెలిసికొన్నది. పశ్చాత్తప్తురాలై శేషజీవితము సక్రమముగ గడుప నెంచినది. ఈమెకు కధానాయకుడైన ధర్మారావు సంపూర్ణసహకారమునందించెను. మిగిలిన నవలాకారులకును విశ్వనాథవారికిని గల వ్యత్యాస మిచ్చట గోచరించును. శీలము నొకసారి కోల్పోయిన స్త్రీ మరింత విచ్చలవిడి బ్రతుకునే గడుపునట్లు పెక్కురు రచింతురు. చుంవ్రాసిన మైదానము అను నవలలో రచయిత రాజేశ్వరి బ్రతుకును మైదానమును గావించెను. తప్పుచేసినను స్త్రీ బ్రతుకు హీనము కారాదన్నసంకల్పముతో శీలవతికాని మంగమ్మ జీవితమును సానుభూతితో చిత్రించుట జరిగినది. నవలారచయిత్రులు సహితము స్త్రీ పాత్రల కింత విలువను చేకూర్పలేదనుట సత్యము.
మంగమ్మ పురోహితుల యింటిబిడ్డ. అందకత్తె. చిన్నవయసులో నుండెను. పల్లెటూరి వాతావరణమున పెరిగినది గావున నాగరకలక్షణములు తెలియవు. ధనమునందభిమానమోక్కువ. ఆమె భర్తబీదపండితుడు పాఠశాలలో ఉపాధ్యాయునిగ నుండెను. అతడునల్లగ వికారము స్ఫోటకపు మచ్చలతో నుండెను. అతని పేరు జోస్యులు. తన వాంఛలకు విరుద్ధముగనున్నను మంగమ్మ యతనితో గుంభనముగ కాలము గడుపు చుండెను.
మంగమ్మ సంసారము నిరాటంకముగ జరుగుచుండగా నామెజీవితంలోనికి రామేశ్వరమను తాలూకాబోర్డు అధ్యక్షుడు ప్రవేశించెను. జోస్యులు పనిచేయు పాఠశాలను తనిఖీ చేయుటకై రామేశ్వరము వచ్చెను. జోస్యులు మర్యాద కొరకై తనయింటికి భోజనమునకు పిలువగావచ్చి విశ్రాంతి గై కొను సమయమున జోస్యులు లేకుండజూచి మంగమ్మను మంచితీర్థమడిగెను. మంగమ్మ మంచినీటి చెంబును క్రిందబెట్టి తానొడ్డిగిలి వినయముగనిలబడెను. ఆమెయాసమయమున అతిథిగానున్న పరపురుషునకెంత మర్యాద గౌరవము నీయవలెనో నంతటి వినయమును గౌరవమును భయభక్తులను ప్రదర్శించినది. కాని రామేశ్వరము మంగమ్మ తనకిచ్చిన గౌరవమును నిలబెట్టుకొనలేక మంగమ్మను వంచింపదలిచానాడు ఆమె తెచ్చిన నీటితో ముఖప్రక్షాళనము గావించుకొని మరలనీరడిగెను. రెండవసారి మంచినీరు తెచ్చినపుడతడు మంగమ్మ చేయి పట్టుకొనెను. మంగమ్మ బెదిరిపోయి చెంబచ్చట విడిచిలోనికి పరిగెత్తినది. రామేశ్వరము లోనిఇపదిరూపాయలనోటు విసరగా మంగమ్మ యానోటును రామేశ్వరమున్న గదిగుమ్మము దగ్గరనుంచి వెళ్ళిపోయినది. ఆమె యీ విషయమును గూర్చి భర్తకు చెప్పునేమోయని రామేశ్వరము భయపడెను. అతడు తనయధికారమును దుర్వినయోగపరచెను. ఆమెయితని సంగతి భర్తకు చెప్పలేదు. ఇదియామోచేసిన మొదటి యపరాధము. ఆమెను చెప్పనీయకుండ చేసినది పదిరూపాయలనోటు, అమెకున్న ధనవ్యామోహము తెలియకున్నను రామేశ్వరము ధనమునెరగా వైచినాడు. ఆమె భర్తతో చెప్పియున్నచో రెండవమారు రామేశ్వరమును తనయింటికి రానిచ్చెడివాడుకాడు. మంగమ్మ యొక్క గోప్యమామె పతనమునకు దారితీసినది.
మరల కొన్నానాళ్ళ తరువాత రామేశ్వరము రంగాపురమువచ్చి జోస్యులతో, తాను చేయిపట్టుకొన్న విషయమును మంగమ్మచెప్పలేదని తెలిసికొనెను.అతినికి మరల యాశకల్గి యామెను వశము చేసికొనుటకై రెండవసారి ప్రయత్నించెను.రెండవసారి జోస్యులు రామేశ్వరము నింటిఓ వదలి పాఠశాలకు వెడలెను. రామేశ్వరము మంగమ్మను మరల మంచినీరడిగెను. తెచ్చియీయగా నతడామె చేయి పట్టుకొనినాడు ఆమె చేయి వదిలించుకొనుటకు బ్రయత్నించెను..రెండు పదిరూపాలయనోట్లామెకందించెను. ఆమె ఎడమ చేతితో బుచ్చుకొనెను. ధనమును పుచ్చుకొనుటతో మంగమ్మ యొక్క పతనము పూర్తియైనట్లయినది.
మంగమ్మ యొక్క పతనమునను కారణము రామేశ్వరములోని పశుప్రవృత్తియా ? మంగమ్మతో పేరుకొనిన ధనవాంఛయా ? వికారస్వరూపుడైన భర్తయందామో హృదయ కుహరములో నేర్పడిని వైముఖ్యమా ? వీనిలో నామెను పరపురుషుని యందాసక్తిని రేపినదేదియనినచో, మంగమ్మలోని ధరవ్యామోహమే ముఖ్యకారమణమనిపించును. జోస్యుల యొక్క వికారరూపమును, రామేశ్వరము యొక్క నీతిబాహ్యమైన ప్రవర్తనము నిందులకు తోడైనవి. ఆమెకు నగలన్న చో ప్రీతి. వానిని కొనలేని భర్త యన్నచో నిరాదరణము కూడ నున్నవి.
అప్పటి నుండియు మంగమ్మ భర్తకుగాని సంఘమునకు గాని వెరవక యధేచ్చావిహారము చేసినది అప్పటివరకును సత్సంప్రదాయములోనున్న మంగమ్మ, యకస్మాత్తుగా దుష్టజగత్తులోని కడుగు పెట్టుటకు వలయు ధైర్యము మంగమ్మలో నేర్పడినది.
రామేశ్వరము మంగమ్మ తనకు దగ్గరగా నుండుటకై జోస్యులకు సుబ్బన్న పేట బదిలీ చేయించెను. జోస్యులకనుమానము కలుగకుండ నతనికి చేతినిండ పనిపెట్టెను మంగమ్మ రామేశ్వరముల రహస్యము జోస్యులకు దప్పించి యందరకు తెలిసినది. కడకు జోస్యులకు కూడ తెలియ వచ్చినది. అతడు మహాదుఃఖసాగరమున మునిగిపోయెను. చెరువులోపడి చచ్చుటకు ప్రయత్నించి ధైర్యముచాలక మరల తిరిగి వచ్చెను. జోస్యులు పడిన నరకయాతనకు దుఃఖమునకు కారణము తానేయని తెలిసినను మంగమ్మచలింపలేదు. ఆమె నెరజాణయైనది. రామేశ్వరమునకు తిరస్కారపూర్వకముగ జోస్యులొక లేఖను వ్రాసి దానిని తోటి ఉపాధ్యాయులందరకు చూపెను. రామేశ్వరము జోస్యులపై పగ బూనెను. జోస్యులనాకారి యైనను వివేకమున్న వాడుగనుక రామేశ్వరము తనను బ్రతకనీయడని తెలిసికొనెను. మంగమ్మకు రామేశ్వరుము యొక్క ఆస్తినెట్లు చేజిక్కించుకొన వలయునో మార్గము చెప్పెను. ఆ తరువాత రామేశ్వరము యొక్క మనుష్యుల చేతిలో జోస్యుల మరణించెను.
జోస్యుల యొక్క మరణాంతరము మంగమ్మ రామేశ్వరము యొక్క ఆస్తినంతయు చేజిక్కించుకొని రామేశ్వరమును చెరకు పిప్పివలె వదలివేసినది. రామేశ్వరము కారాగారమునుభవించునప్పుడు చూచుటకు వెళ్ళి తాను భ్రష్టురాలగుటకు కారణము రామేశ్వరమేయన్నది. నేనేమో పల్లెటూరి పిల్లను. నీవేమో ధనవంతుడ వనుకొని భ్రష్టురాల నైపోతిని. నన్ను నీవు చేసిన మోసమునకు నీకీ శిక్షయైనందుకు నాకు జాల సంతోషముగా నున్నది అనినది. మంగమ్మలోనున్న ధనమోహము రామేశ్వరము యొక్క యాస్తినామె పేరున వ్రాయించుకొనుట తోడనే తీరినది. ఆశ తీరిన తరువాత తాను మోసపోయితిననియు. తనయమాయకతను రామేశ్వరముపయోగించుకొనెననియు భావించినది. రామేశ్వరము నతనిపాట్లతనినిపడుమని వదలివైచినది. అతని ధనముతోనే మంచి పనులను చేయ తలపెట్టినది.
రామేశ్వరుమనకు శిక్షపడుటతో మంగమ్మకు తాను మంచిపనులుచేయవలెనన్న తలంపుకలిగినది. ఆమెలో పశ్చాత్తాపముకల్గుట కూడనప్పటినుండియే ప్రారంభమైనది ఒక సంవత్సరము మంగమ్మ యనేకములైన ప్రదేశములు తిరిగి నాగరికతను పూర్తిగ నేర్చుకొన్నది. లౌక్యమునిర్భయమునంతకు మున్నేయలవడినది.
మంగమ్మ జోస్యుల నొకవిధముగ రామేశ్వరము నొకవిధముగ అన్యాయము చేసినది. ఈ ప్రవర్తనయామె ప్రయత్నమునకు తగినట్లే యున్నది. జోస్యులపై నామెకెట్లు ప్రేమాభిమానములు లేవో రామేశ్వరము పైన గూడనట్లేలేవు. రామేశ్వరమునుండి రాబట్టుకొన గల్గినంత రాబట్టుకొని యాతడు చిక్కులలో పడ్డసమయమునకు కంటికి కనుపించకుండ పోయినది. ఈ ప్రవర్తన కేవలము శరీరవ్యాపరము చేసెడివాడు చేసినట్లే యున్నది. రామేశ్వరము చెరసాల పాలైన తరువాత మంగమ్మ బెజవాడ వెళ్ళినది. అచట రాధాపతియను కుహనా సంస్కారి యనాధశరణాలయమును నడుపుచుండెను. దానినే విడి ప్రేమ సంఘమనికూడా నందురు. మంగమ్మ రాధాపతి
మిత్రురాలైనది. రాధాపతితో గూడివచ్చి మరల సుబ్బన్న పేటలో నివసింప మొదలిడినది.
మంగమ్మ యే ధనమునకై శరీరమును పావుగచేసినదో యాధనము పుష్కలముగ లభించిన తరువాత దానియందు మమకారమును కోల్పోయి శీలయందు దృష్టియేర్పడినది. పోయిన శీలము తిరిగి పొందుట యసాధ్యమని తెలిసికొని మంగమ్మ కీవిషయమై యపరిమిత వేదన కలిగినది.
దుష్కృత్యముల చేసి గడించిన ధనము వలన లభించునది దుఃఖమేగాని సుఖముకాదని మంగమ్మ గ్రహించెనని యామెపడిన వేదనవలనతెలియుచున్నది. ఒకని యమమునకు గాని ధర్మమునకు గానిట్టుబడక తెగించిసంచరించిన మంగమ్మ బ్రతుకు రామేశ్వరముతో నాగకమరికొంత మందితో జీవితమును పంచుకొని కుక్కలు చింపిన విస్తరివంటిది కావలసినదే గాని రచయిత మంగమ్మ నంతటి నైచ్యదశకు త్రోయలేదు. ఒకటి రెండు దోషముల తరువాత నామెలో జ్ఞానోదయమును కలిగించినారు.
|