103
 

శ్రీ‌ధాముని శాప‌వ‌శ‌మున రాధ భూలోక‌మున అవ‌త‌రించ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. ఈ శాప‌ముకూడ జ‌గ‌ద్ర‌క్ష‌ణార్ధ‌మే క‌లిగిన‌దని గ్ర‌హించ‌గ‌లిగిన కృష్ణ‌స్వామి రాధ‌నోదార్చి వ్రేప‌ల్లెలో త‌న‌కంటె ముందు జ‌న్మించ‌మ‌ని నిర్దేశించెను. దేవ‌లోక‌ము నుండి దేవ‌త‌లు, త‌ప‌స్సంప‌న్నులు, యోగులు, భ‌క్తులు, గోపాలురు గోపిక‌లై వ్రేప‌ల్లెలో జ‌న్మించిన వారెయెను.

పై నుండి ఏక‌ధార‌గా స్ర‌వించుతైల‌మువ‌లె కృష్ణ‌దేవునిపైన రాధాదేవి మ‌న‌సులోనున్న ప్రేమ అవిచ్ఛిన్న‌మై ప్ర‌స‌రిస్తూ ఉండ‌టం చేత ఆమె రాధ యైన‌ది. ఈ మ‌హాప్రేమ స్వ‌రూపంలో స‌హస్రాంశ‌మైన‌ను గ్ర‌హింప‌గ‌లిగిన వారు ధ‌న్య జీవ‌నులు.గౌరాంగ ప్ర‌భువున్నూ, చైత‌న్య స్వామిన్నీ జ‌య‌దేవాది మహాక‌వులున్నూ కృష్ణ ప్రేమ‌త‌త్వాన్ని కొంత‌యైనా వ్యాఖ్యానించ‌గ‌లిగినారు. ప్ర‌కృతి రాధ‌, పురుషుడు కృష్ణుడు. పురుషుడైవాడు ఆ మాధ‌వుడొక్క‌డే, స‌ర్వ‌జీవులున్నూ స్త్రీలే ! ఇదియే శృంగార భ‌క్తి ! ఇదియే మ‌ధురాతి మ‌ధుర‌త‌ర‌మైన మ‌హా మ‌హీమాన్విత మ‌ధుర భ‌క్తి ! వైష్ణ‌వులదీ మ‌ధుర‌భ‌క్తియే !

అలంకార ప్రియె విష్ణుః అనిన‌ట్లుగ ఆ విష్ణుమూర్తికి తుల‌సి మాల‌ల‌న్న‌ను చిత్ర‌విచిత్ర సుంగంధ కుసుమ‌హారాల‌న్న‌నూ మ‌హాప్రీతి. క‌స్తూరి సంకుమ‌ద జ‌వ్వాది ఘ‌న‌సార కపురంపు ట‌గ‌రు సువాస‌న‌ల‌న్నియూ ఆ స్వామికి నిత్యావ‌స‌రాలు. అంద‌మైన వ‌స్తువుల‌న్నీ కైవ‌సం చేసికొన్నాడు. శిగ‌పై మ‌యూర పింఛ‌ము. ముజ్జ‌గాల‌ను మోహింప‌చేయు వేణువు అత‌ని చేతినంటుకొనే ఉంటుంది ! ప‌శుప‌క్ష్యాదుల‌ను స‌హిత‌ము వ‌శ‌ప‌ర‌చుకొన‌గ‌ల మ‌ధుర‌నాద‌ము ఆ పిల్ల‌న‌గ్రోవి నుండి సంత‌త ధార‌ప్ర‌వాహంగా స్ర‌విస్తూ ఉన్న‌ప్పుడు, జ‌డాత్మ‌క‌మైన ప్ర‌కృతి స‌హిత‌ము ఆర్ద్ర‌మై క‌రిగిపోతూ ఉన్న‌ప్పుడు, ఇక సుకుమారులైన గోపిక‌ల‌న‌గా నెంత ! వెన్న వంటి హృద‌య‌ము గ‌ల ఆళ్వారులెంత !

ఆళ్వారు స్వాముల హృద‌యాకాశ‌న వేణునాదం నిరంత‌రం జ‌గ‌దాక‌ర్ష‌ణ కార‌కంగా విన‌వ‌స్తూ ఉంటే వారి స‌ర్వ‌నాడులూ, కృష్ణా ! కృష్ణా ! అని ఎలుగెత్తి ఆక్రోశించిన‌వి. పంచ‌ప్రాణ‌ములు, నాధా ! జ‌గ‌న్నాధా ! అని ప‌ల‌వ‌రించిపోయిన‌వి. ఆ ఆక్రోశ‌ములున్నూ, ఆ ఆర్త‌నాద‌ములున్నూ, ఆ ప‌ల‌వ‌రింతులున్నూ పాశురాలు
అను పాల‌న‌దులై ప్ర‌వ‌హించిన‌వి. స్వ‌చ్ఛ‌మైన వారి హృద‌య క‌మ‌ల‌జ‌నిత నిర్గ‌త‌మైన ప్రేమామృత‌ము వాగులై ప‌రుగులు తీసిన‌వి. మ‌హా ప్ర‌ణ‌య‌యోగాన త‌పోదృష్టితో చూచి అనుభ‌వించిన ప్రేమ‌దీప్తులే వేద‌ములై ప్ర‌కాశించిన‌వి. ఈ మ‌హాభావ‌మే వేద‌ము, ఇదే ద్ర‌విడ‌వేద‌ము ఇచ‌ట మంత్ర‌ములు లేవు, య‌జ్ఞ‌ములు లేవు, ఆహుతులు లేవు, బ‌లిదాన‌ములు లేవు, ర‌క్త‌తర్ప‌ణ‌ములు లేవు. స‌ర్వ‌క్ర‌తువులున్నూ అర్ప‌ణ‌ములేన‌నే లీన‌మైపోయిన‌వి.

ఈ అర్ప‌ణ‌ము సర్వార్ప‌ణ‌ము కావ‌లెను. మ‌నోవాక్కాయ క‌ర్మ‌ల‌తో కైంకర్య‌ము గావించే అంత‌రార్ప‌ణ‌ము కావ‌లెను. నీవే త‌ప్ప‌నితః ప‌రంబెరుగ అన్న‌ట్లుగ అన్య‌ధాశ‌ర‌ణం నాస్తి య‌న్న‌ట్లుగ ఆత్మ‌శ‌ర‌ణాగ‌త త‌త్వ మ‌హాభావ‌ము పొంద‌గ‌ల‌గ వ‌లెను. ఇదియే వైష్ణ‌వ‌మ‌త‌ములో నిక్షిప్త‌మైన ప్రేమ‌స్వ‌రూప‌ము. అన్ని మ‌త‌ముల‌లాగునే అంద‌రి చేత‌నూ ఆరాధించ‌బ‌డిన‌ది.

పెరియాళ్వారైన విష్ణుచిత్తుని ప్రేమ కుమారిక‌, గోదాదేవి శ్రీ‌రంగేశుని మ‌దిలోనే ప్ర్రాణ‌నాధునిగ వ‌రించిన‌ది. అత‌డు విగ్ర‌హ‌రూప‌మున వెల‌సిన‌వాడు, తాను ప్రాణ‌ముగ‌ల‌ట్టి మానిసి. ఈ వివాహ‌ము ఏలాటు పొస‌గునో గోదాదేవికి తెల‌య‌క‌పోయెను. త‌న నిశ్చ‌ల‌మైన నిర్మ‌ల ప్రేమారాధ‌న‌తో ఆ విగ్ర‌హాన్ని క‌రిగించ ప్ర‌య‌త్నించిన‌ది. అతనికై చూచి చూచి క్ష‌ణ‌మొక యుగ‌ముకాగా, నిరాశ‌తో విల‌పించి వ‌ల‌చిన వానిని పిలిపించుకొన గ‌ల్గిన ధ‌న్య‌జీవి, గోవ‌కిశోరుని క్ష‌ణ‌మైన ఎడ‌బాసి మ‌న‌లేపి దివ్య ప్రేమ స్వ‌రూపిణి స్వ‌త‌స్సిద్ధ‌ముగ స్త్రీ య‌గుట‌వ‌ల‌న గోదాదేవికి ఊహాగాన‌ము చేయ‌వ‌ల‌సిన అక్క‌ర‌లేక‌పోయిన‌ది. మిగిలిన ఆళ్వారుల‌కే ఆ అవ‌స‌ర‌ము.

కృష్ణ‌దేవుని కైంక‌ర్యార్ధ‌ము తండ్రి ర‌చించిన పూమాలిక‌ను శిగ‌లో ముడుచుకొని, ఆనందించి మ‌ర‌ల య‌ధాప్ర‌కార‌ము త‌ళ్ళిగ‌లో నుంచెడిది, గోదాదేవి, ఒక‌నాడు విష్ణుచిత్తుల‌వారు కొమ‌రిత యొక్క చేష్టిత‌మును చూచి వ‌గ‌చి స్వామికి పూమాల‌ల‌ను స‌మ‌ర్పింప లేక‌పోయినారు. ఆనాటి రాత్రి అత‌ని స్వ‌ప్నాన శ్రీ‌మ‌న్నారాయ‌ణుడు సాక్షాత్క‌రించి ఆండాళ్‌దేవి ముడిచి ఇచ్చిన పూమాలిక‌యే త‌న‌కు ప‌ర‌మ ప్రియ‌మ‌ని తెలిపినాడు. ఆండాళ్ శ్రీ రంగేశుని రాక‌కై ప్రార్ధ‌న‌లే చేయుచు కీర్తించ‌సాగెను. ఆమె యొక్క మ‌హా మ‌ధుర‌భ‌క్తియ‌నెడి దివ్యాందోళిక‌లో శ్రీ మ‌హా విష్ణువు ఊయ‌ల‌లూగ‌ సాగినాడు.