106
 

శుక‌వాణి : కాత్యాయ‌ని వ్ర‌త దీక్ష‌. ఇపుడే మీరంద‌రూ వీక్షించినారు క‌దా .

ల‌క్ష్మీదేవి : నీవు చేసిన‌ది నాట్య‌ము, న‌ట‌న‌ము, కేవ‌లం అనుక‌ర‌ణ‌ము, అంతే క‌దా !

రామ‌భ‌ద్ర : చెల్లెలుగారు వైష్ణ‌వ మ‌తాన్ని గురించి మ‌రికొంత తెలిసికోవ‌ల‌సిన‌ది ఉన్న‌ది. ఇప్పుడు శుక‌వాణీ దేవి గోదాదేవివ‌లె అభిన‌యింప‌లేదు. తానే గోదాదేవియైన‌ది.

ల‌క్ష్మీదేవి : ఇంత‌కూ గోదాదేవి వ‌రించిన‌దెవ‌రినో నాకు తెలియ‌జెప్పండి, పెద్ద అక్క‌య్య గారూ !

క‌ళావ‌తి : తండ్రిగారిది మరీ ఇంత వీర‌శైవ‌మా ? విష్ణుమూర్తిపేరుతో వ‌ర్ధిల్లుతూ ఉన్నారు. కుమ‌ర్తెకు ల‌క్ష్మీదేవి పేరు పెట్టుకొన్నారు. అంతఃపురాన నారాయ‌ణ క‌థా స్మ‌రాణాన్ని స‌హితం నిషేధించినారా ?

ల‌క్ష్మీదేవి : అక్క‌గారూ ! ఇది చాలా చిన్న విష‌య‌మే అయినప్ప‌టికిన్నీ నేను మూఢురాలివ‌లె ఏమీ బోధ‌ప‌ర‌చుకోలేక‌పోయాను. నన్ను క్ష‌మించ‌రూ ?

రామ‌భ‌ద్ర : చెల్లెలుగారు తొంద‌ర‌ప‌డ‌కండి. మ‌న శుక‌వాణీ గోదాదేవిని మ‌న కనుల ముందున‌కు తెచ్చిన‌ది. ఈ లోగా మీరు గాథ తెలిసికొన వ‌లెన‌న్న ఉత్స‌క‌త‌ను అణ‌చుకొంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవ‌తార గాధ‌నే మ‌న హృద‌యాల‌కు హ‌త్తుకొనేలా శుక‌వాణీ న‌ర్తిస్తుంది.

ల‌క్ష్మీదేవి : శుక‌వాణీ కూమారి ఏ ఫ‌లితాన్నాశించి ఈ వ్ర‌తాన్నాచ‌రిస్తూ ఉన్నారో అక్క‌గారికి తెల‌స్తే చెప్ప‌కూడ‌దా !

రామ‌భ‌ద్ర : మా చెల్లెలుగారు ఏ వ్ర‌త‌మూ చేయ‌కుండా విభూతిదేవుడి, ఉబ్బులింగ‌డి ఆశీస్సుల‌తో పురుషోత్త‌ముని చెట్ట‌బట్టినారు. ఈ శుక‌వాణి వ్ర‌తం ఏ రూపాన ఫ‌లిస్తుందో వేచి తెలిసికొందాము.

కిల‌కిల న‌వ్వుల‌తో, స్వ‌ర్ణ‌కింకిణుల ఘ‌ణం ఘ‌ణ‌ల చిరుమ్రోత‌ల‌తో వారు మువ్వురూ అంతిపురాల‌కు సాగిపోయినారు.

ర‌ఘునాథ ప్ర‌భువుల ద‌ర్శ‌నార్ధం శుక‌వాణీదేవి వేయిక‌నుత‌లో ఎదురు చూస్తూ ఉన్న‌ది. ప్ర‌భువులెంతో భ‌క్త‌ప‌రేణ్యుల‌ని తాను విని ఉన్న‌ది. ధ‌నుర్మాసం ముప్ప‌ది దినాలున్నూ స్వ‌యంగా వీణావాద‌నంతో శ్రీ క‌న‌క‌వ‌ల్లీ మ‌న్నారు దంప‌తుల‌కు గాంధ‌ర్వ వేదార్చ‌నం చేస్తారుట‌. కొంగ్రొత్త‌రాగాలు, నూత్న తాళ‌గ‌తులు, చిత్ర విచిత్ర‌మైన మూర్ఛ‌న‌లు వారి కొంగోట లాస్యం చేస్తాయ‌ని కూడా విద్యాగుర‌వులు గోవిందా మాత్యుల వారు సెల‌విచ్చినారు. ఈ నాటి అర్చ‌నా స‌మ‌యానికి ప్ర‌భువులు ఎందువ‌ల‌న రాకున్నారో ? ఎవ‌రి పైన వారికీ కినుక ? ఎందుకొర‌కు వారికీ ఆగ్ర‌హ‌ము ? త‌న‌పై కాదుక‌దా ! నాడు వారి ఆహ్వానాన్ని తిర‌స్క‌రించినందుల‌కు ప్ర‌భువులు అలిగినారా ? వారి ప్రేమ‌పూరిత‌మైన దృక్కుల‌లో రోష‌క‌షాయిత నేత్రాంచ‌లాల చిరుజీర‌ల‌ను తాను చూచి భ‌రించ‌గ‌ల‌దా ? రేపైనా వ‌స్తారో, రారో ? రాకుంటే ఏమ‌ని నిర్ణ‌యించుకోవాలి ? తానెవ‌రికొర‌కీ రాచ‌న‌గ‌రున గ‌జ్జె క‌ట్టిన‌ట్లు ? యువ‌రాజుల కొర‌కుకాదా ? ఆ ప్ర‌భువే ఆగ్ర‌హంతో త‌న‌కు దూర‌మైతే ?

ప్ర‌భూ ! ప్ర‌భూ ! రావాలి ! త‌మ‌రు రావాలి ! మీ ద‌ర్శ‌నం నాకు కావాలి. మీ దివ్య‌మంగ‌ళ రూపాన్ని చూడ‌కుండా మ‌న‌లేను. శుక‌వాణి హృద‌య‌ము నాగ‌వ‌ల్లీ తీగ‌లా ఊగిస‌లాడి పోయిన‌ది. ఆమె క‌నుల‌నిండ నీరు నిండిన‌ది. ఆమె గొంతు డగ్గుత్తిక ప‌డిన‌వి.

బంగ‌రు బుట్ట‌ల‌తో ప్ర‌సాదాన్ని, వెండి బుట్ట‌ల‌తో ఫ‌లాల‌ను శ్రీ‌మ‌త్తాత‌య రామానుజాచార్యుల‌వారు పంపించినారు. అల‌వోక‌గా మునివ్రేళ్ళ‌తో కొంత పొంగ‌లిని స్వీక‌రించి క‌న్నుల‌క‌ద్దుకొని సేవించిన‌ది. ఏల‌కీచూర్ణ‌ము, ప‌చ్చ‌క‌ప్పుర‌ము, శ‌ర్కెర మ‌ధువుల‌ను మిశ్ర‌మం చేసిన గోక్షీరాన్ని ర‌జ‌త పాత్ర‌తో సేవించి, విశ్ర‌మించిన‌ది. మ‌ర‌ల మ‌రునాడు ఇదే స‌మ‌యానికి భుజింప‌వ‌ల‌యును క‌నుక ఇప్పుడు మ‌రికొంత ఆహారాన్ని తీసికొన‌వ‌ల‌సిన‌దిగా స‌ఖియ‌లు బ్ర‌తిమాలిన‌ప్ప‌టికిని ఆమె మిన్న‌కుండి పోయిన‌ది.

శుక‌వాణీ దేవి నాట్య‌మారంభించి నాటికారుదినాలు.

యువ‌రాజుల గురించి ఎవ‌రిని ప్ర‌శ్నించాలో ఆమెకు తెలియ‌టం లేదు. యువ‌రాణులు కూడా వారి ప్ర‌స‌క్తిని తెచ్చుట‌లేదు. రామ‌భ‌ద్రాదేవి ఎంతో ఆత్మీయంగా, ర‌క్తం పంచుకొని పుట్టిన సోద‌రిలా, నిరంత‌రం ద‌ర‌హాస వ‌ద‌నంతో శాంత‌మూర్తిలా ఉంటున్న‌ది. పెద్ద యువ‌రాణీవారున్నూ, ల‌క్ష్మీదేవి వారున్నూ మొద‌టివ‌లె ప్ర‌స‌న్న‌త క‌న‌బ‌ర‌చుట‌లేదు. వారుకూడా దేని కొర‌కో వ్య‌ధ చెందుతూ ఉన్న‌ట్లుగా చిన్న అశాంతిరేఖ వారి క‌నుల‌లో అగుప‌డుతూ ఉన్న‌ది.