109
 

విశాల చోళ భూమండ‌లంలో శాలి ధాన్యముల‌తో బంగ‌రుపంట‌ల‌ను పండించే జీవ‌న‌దీ ధార‌ల‌తో ప్రజ‌లు నిత్యం సంతృప్తులై, శాంతి సంతోషాల‌తో సుఖంగా జీవిస్తూ ఉన్నారు. క‌వులు ర‌స‌మ‌య కావ్యాల‌ను పండిస్తూ సార‌స్వతో ద్యానాల‌ను సుసంప‌న్నం చేస్తూ ఉన్నారు. చోళ‌మండ‌ల స‌రిహ‌ద్దు గ్రామాలలో ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. మాత్సర్యగ్రస్తుల‌యిన మధుర పాల‌కులు తిరుచినా ప‌ల్లి ప‌ట్టణాన్ని యుద్ధ స‌న్నాహాల‌కై అనువుగ పున‌ర్నిర్మించి, సైనిక స్థావ‌రాల‌కు కూడ‌లిగ మార్చి వేసినారు. ఇంతఃపూర్వం ఈ ప‌ట్టణం చ‌క్కని ప‌ట్టువ‌స్త్రాలు నేసే నేత ప‌రివార‌ల కాట‌ప‌ట్టుగా ఉంటూ ఉండెను. ఏలిన‌వారి ఆజ్ఞ ప్రకార‌ము ఊరును వ‌ద‌లి గ్రామానికోక కుటుంబ‌ముగా చెల్లాచెద‌రు కావ‌ల‌సి వ‌చ్చిన‌ది. వారు వ‌ల‌స పోయేటందుకుగాను పాల‌కులు ఆర్ధిక స‌హాయ‌ము చేయ‌ద‌ల‌చి ఖ‌జానా నుండి ఖ‌ర్చుప‌ర‌చిన సంప‌ద‌, కోశాధికారుల నుండి సైన్యాధికారుల వర‌కు పంచుకొనడానికైనా స‌రిప‌డిన‌ది కాదు, ఇక అది ప్రజ‌ల వ‌ర‌కు వ‌చ్చుట అసంబ‌వ‌మైంది. న‌గ‌రాన్ని వీడిపో నిరాక‌రించిన ధైర్యస్థుల‌కు వెండిబెత్తముల వాయింపులు మాత్రం విరివిగా వ‌చ్చిన‌వి.

పాండ్య రాజుల సైన్య స‌మీక‌ర‌ణ‌ము క‌థ యావ‌త్తూ చోళ‌మండ‌లాధీశ్వరుల‌కు వేగుల‌వారు చేర‌వేసినారు. గోవిందామాత్యుల వారున్నూ మాహారాజుల వారున్నూ ముఖ్య ద‌ళవాయిల‌తోనూ కోశాధికారుల‌తోనూ పురోహితుల‌తోనూ క‌ల‌సి నిర్ణయించిన విధాన‌ము ర‌ఘునాథ యువ‌రాజుల‌కు హిత‌వు కాలేదు.

గోవింద :  చోళ‌మండ‌ల పురాధీశులెప్పటికినీ శాంతి కాముకులు. వారు త‌మంత‌ట తాముగా యుద్ధమున‌కు కాలు దువ్వేది లేదు. ప్రాణ‌న‌ష్టాన్ని సాధ్యమైనంత‌గా వారించేందుకే స‌ర్వస‌న్నాహాలూ చేయాలి.

ర‌ఘు :  శ‌త్రువులు విరుచుకొని మీద ప‌డినప్పుడేది దారి, గురుదేవా ?

గోవింద :  మొద‌టి అడుగు వారిదే కావాలి. మ‌నం మ‌న రాజ్యాన్నిదాటి ఒక్క మూరెడు దూర‌మైనా స‌రే, శ‌త్రుభూమిలో చొర‌బ‌డ‌రాదు.ప‌ర‌రాజుల ఆగ‌డాల‌కు గురియైన‌వి, కుంభ‌కోణ‌మూ, మాయూరార్జున‌ము ముసిరి గ్రామాలు. అటు జింజి తీరాన దిండిగ‌ల్లు ప‌ట్టణం కూడ అట్టుడికిన‌ట్లుగా ఉడికిపోతూ ఉన్నది.

గోవిందుల‌వారి ఉప‌దేశాన్ని శిర‌సావ‌హించిన‌ట్లుగా యువ ప్రభువులు తలూపి, అంత‌రార్ధాన్ని గ్రహించుకొన్నట్లుగా చిరుద‌ర‌హాసాంకిత మూర్తులైనారు.

ర‌ఘు : మ‌నసైన్యం స‌ర్వసంసిద్ధంగా ఉన్నది. పాండ్యసైన్యం కూడా యుద్ధ స‌న్నద్ధంగానే ఉన్నది. శ‌త్రుసైనికులు రాత్రులందు మ‌న గ్రామాల‌పై బ‌డి ఘాతుక‌చ‌ర్యలు చేస్తూ వుండ‌గా గ్రామ‌స్థుల వేషాల‌లో ఉన్న శిక్షణ‌ను పొందిన మ‌న సైనికులు వారిని నామ‌రూపాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మేక‌ల‌నూ గొఱ్ఱెల‌నూ తోలుకొనిపోయి, ఇటువారిని రెచ్చగొట్టేవారి దుందుడుకు చ‌ర్యల‌ను, మ‌న సైనికులు ముఖ్యద‌ళ‌వాయీల ఆజ్ఞల ప్రకార‌మే వ‌ర్తించి ఓరిమిని చూపుతూ ఉన్నారు.

మాయూరంలో కావేరీన‌ది సంద్రాన్ని కౌగిలించుకొనే సంగ‌మ స్థానాన ఉన్న మ‌హాలింగేశ్వరుని ఆల‌యాన దైవ ప్రతిష్టోత్సవ మ‌హా క్రతువును ప‌ర‌మ మ‌హేశ్వర దివ్య ప‌దారాధ‌కులై మిక్కిలి భ‌క్తి శ్రద్ధల‌తో నిర్వర్తించుకొని, కుంభ‌కోణ దేశాన కోదండరామ దేవుని ప్రతిష్ఠను తిల‌కించేటందుల‌కు ర‌ఘునాథ ప్రభువులు మిత్ర స‌మేతంగా వెడ‌లినారు. కావేరీ మ‌హాదేవి దివ్యజలాల‌తో మ‌హా లింగేశ్వరున‌కు స‌హ‌స్ర ఘ‌టాభిషేక‌ము చేసినారు. త‌రువాత ద్విస‌హ‌స్ర బిల్వద‌ళార్చన‌, ఉమా మ‌హేశ్వరీ దేవికి స‌హస్ర కుంకుమార్చన‌, నారికేళ గోక్షీర మధుద‌ధిహవిస్సుల‌తో ప్రాణ ప్రతిష్ఠానంత‌రం ఏకాహ పూజ‌లు జ‌రిపించినారు.

స‌ర్వో వై రుద్రస్త స్మై రుద్రాయ న‌మో అస్తు
పురుషో వైరుద్రస్తస్మైన‌మోన‌మః
నిధ‌న ప‌త‌యే న‌మః నిధ‌న ప‌తాన్తికాయ‌నమః
ఊర్ధ్వాయ‌న‌మః ఊర్ధ్వ లింగాయ‌న‌మః
హిర‌ణ్యాయ‌న‌మః హిర‌ణ్య లింగాయ‌నమః
దివ్యాయ‌న‌మః దివ్యలింగాయ‌న‌మః
భ‌వాయ‌న‌మః భ‌వ‌లింగాయ‌న‌మః
శ‌ర్వాయ‌న‌మః శ‌ర్వలింగాయ‌న‌మః
శివాయ‌న‌మః శివ‌లింగాయ‌న‌మః

విప్రవ‌రుల వేద‌మంత్రాల దివ్యనాదంతో దైవ ప్రతిష్ఠాప‌న మ‌హోత్సవం అత్యంత నేత్రప‌ర్వంగా ఉండి శివ‌సాన్నిధ్యం ల‌భించినంత బ్రహ్మనంద కార‌క‌మై భ‌క్తుల హృద‌యాలు మ‌హాతృప్తితో ప‌ర‌మ ప్రశాంత‌మై జ‌న్మలు ధ‌న్యమైన‌వ‌న్న దివ్యభావ‌నాన్ని క‌లుగ‌జేసిన‌ది.