చేమకూర అన్నమరాజు మహాయోద్ధయై యువప్రభువులకు రాజ్య సంరక్షణ భారవహనంలో కుడిభుజమువంటి వాడైనాడు. గ్రామగ్రామాలలోను, అడవులలోను, కోనలలోను బలవంతులైన అనేకమంది యువకులను సమీకరించి యుద్ధ విద్యలలో శిక్షణ నిచ్చేటందుకు నియమింపబడిన ఇరవై అయిదు మంది దళవాయిలలో అన్నమరాజు ప్రధముడు. అతడీ యుద్ధ శిక్షణ శిబిరాలన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అశ్వారూఢుడై మనోవేగాన దేశమంతా సంచరిస్తూ ఉన్నాడు. మూర్తెప్ప నాయనిం వారు నగర సైన్యాధ్యక్షులై అంతఃపురాలనూ రాచనగరునూ వేయికనులతో కాపాడుతూ ఉన్నారు. ఈ కారణం చేతనే మూర్తెప్ప నాయకులకు కుమార్తెను తరచు చూచుకొనడానికి సావకాశము లభించకుండా ఉన్నది.
రఘునాథ నాయకుల మాయూరదేశ యాత్రను గురించి మహారాజులకునూ, మహామాత్యులకునూ, పదిమంది అతిముఖ్య అధికారులకునూ తక్క తక్కొరు లెవరికినీ తెలియదు. యువరాణులకు సహితము ఈ సంగతి తెలియదు. వారికిన్నీ, వారి అంతరంగిక ముఖ్య సేవికల కొందరికిని యువరాజులు పట్టణాన లేరన్న విషయము మాత్రమే గ్రహింపైనది. యువరాణి లక్ష్మీకుమారికి సేవకురాలైన అలగమ్మ పైన ప్రభువులకు పూర్తి నమ్మకము కుదరలేదు. అలగమ్మ మంధరవలె దుర్నీతులను బోధిస్తూ ఉన్నట్లుగా వార్తలందినవి.
కుంభకోణ నగరానికి యువరాజుల రాక ఆ నగరాన శిక్షణ పొందుతూ ఉన్న సైనికులకు మహోత్సాహాన్ని కలుగజేసింది. ప్రభువులు ప్రతి ఒక్క సైనికుని భుజం తట్టి, కుశల ప్రశ్నలు వేసి అభిమానపూర్వకంగా ఆదరిస్తారు. అన్నమరాజుకు ఏ దైవమైనా, మరేదైనా ప్రభువుల తరువాతనే. అతనికి కుటుంబము ధ్యాస కూడా లేకపోయింది. వివాహమైతే ప్రభువుల తరువాతనే. అతనికి కుటుంబము ధ్యాస కూడా లేకపోయింది. వివాహమైతే ప్రభుసేవకు ఆటంకమేర్పడుతుందేమోనని బ్రహ్మచారిగా ఉండిపోవాలనే నిర్ణయించుకొన్నాడు. శ్రీ సీతారామ ప్రతిష్ఠకు ఇంకనూ రెండు దినములు వ్యవధానమున్నది. పరిసరాలెంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా భావన కలిగిస్తున్నప్పటికిన్నీ, అన్నమరాజు ఒక చేతిని రాజసేవార్ధమూ మరొక హస్తాన్ని శ్రీశ్రీశ్రీ అచ్యుత నాయనిం వారిచే బహూకృతమైన వజ్రకరవాలము మీదనూ ఆయత్తపరచి ఉంటూన్నాడు.
శ్రీరంగదివ్యక్షేత్రాన రఘనాథులు తులాభారం తూగి దీనులకు వెండి నాణేలను దానంచేసి ఉన్నారు. ఈ దానాలను స్వీకరించేటందుకు సమీప గ్రామాల నుండి ప్రజలు దండులుకట్టుకొని రావడంచేత ముసిరి, కుంభకోణం, శ్రీరంగం మొదలైన ఊళ్ళలో జనసంచారం అధికమై వర్తకులకు వ్యాపారము ఇబ్బడి ముబ్బడిగా సాగిపోతూ ఉన్నది. అన్నసత్రములు కిటకిటలాడిపోతూ ఉన్నాయి. దొమ్మరాటలు, ధనుర్విద్యా ప్రదర్శనలు, నాగనృత్యాలు, గొల్లకలాపాలు ఇత్యాదులతో ప్రజలు క్షణం తీరికలేక ఆనంద డోలికలలో ఊగిపోతూ ఉన్నారు. పగటి వేళల్లో ఇలా లీలావిలాసంగా గడిపి రాత్రి రెండోయామంకాగానే యుద్ధ విన్యాసాలలో తలమునకలయి పోతారు.
రఘునాథ ప్రభువులు శిబిరంలో తూలికాతల్పంపైన బరుండి నిదురకూరక దీర్ఘాలోచనలో మునిగిపోయినారు. విధి లీలలకు యువప్రభువుల మనస్సెంతగానో వ్యధపడుతున్నది. ఏ మహా దివ్యక్షణాలలో తాను చెంచులక్ష్మి బాలను చూడటం తటస్థించిందో ఆ క్షణాన్నుండి ఆ బాలిక తమ హృదయాంతరాలలో ఒదిగిపోయి సర్వకాల సర్వావస్థలలోనూ సంచలనము కలిగిస్తూ నిలకడన్నది లేకుండా చేస్తూ వున్నది.
యువరాణులకు తన ప్రవర్తనపై కినుక కలుగుతూ ఉన్నప్పటికీ తాను పూర్వంవలె వారితో కలసిమెలసి యధేచ్ఛగా క్రీడించలేకపోతూ ఉన్నాడు. ఒక్క రామభద్రాదేవి తన హృదయాన్ని అవగతం చేసికొన్నది.తనను ఊరడించిన మగువ. రామభద్రా ! నీ హృదయమేమి హృదయము దేవి ! చంద్రునికైనా మచ్చ ఉన్నదిగాని నీ మనస్సెంత స్వచ్ఛమైనదో ! ప్రియభర్తమరొక మగువనారాధిస్తున్న సంగతి ఎరిగికూడ మాత్సర్య పడవేమి ! నీవు పారిజాతాల ప్రోవువి. గొజ్జంగిపూల సుగంధాలకన్న నీ అంతరంగమెంతో మనోజ్ఞంగా పరీమళిస్తూ ఉన్నది. స్వచ్ఛమైన శ్వేత కుసుమాలకే సిగ్గు కలగచేసే నీ స్వచ్ఛ దరహాస చంద్రికలలో ఎంతయో పరమప్రశాంతత అనుభవించగల నేను, శుకవాణి బాల మధుర గాంధర్వగానాన్ని, దివ్యనర్తనాన్ని, కండచక్కెరవంటి తీయని పలుకులను మాటిమాటికీ గుర్తుకువస్తూ ఉండగా అశాంతిపాలై అలమటించిపోతున్నాను. ఆ శుకవాణీ, అంతటి ముగ్ధబాల, కనులెత్తి సూటిగా చూడలేని అమాయిక, ఆమెకు నా ఆహ్వానాన్నే తిరస్కరించగల ధైర్యమెలాగ కలిగిందో ! మహారాజుల పనుపున ఆ దివ్యనర్తకి రాచనగరునకు విచ్చేస్తూన్న మహా శుభ సమయంలో నేను నగరును వీడి రావలసిన రాచకార్యాలు ఏర్పడినాయా ? ఓహో ! మన్నారుప్రభువు ఈలాగున నాకీ విరహవేదనను అనుగ్రహించినాడు కాబోలు. ఇట్టి భావతరంగాల్లో తలమునకలైనారు, రఘునాథులు. |