అయినప్పటికిని పాతపగల వేడిమిలో, రఘునాథుడు జీవించి ఉండగా తనకు శాంతి కలుగదన్న గాఢతలపుతో ప్రాణాలకు తెగించి బాణాలను వదల సాగినాడు.
పాండ్యరాజు విడిచిన అమ్ములను రఘునాధనాయకులు తుత్తనియలు చేయడమేగాక వాని రధాశ్వాలను వాడి బాణాలతో గాయపరచినారు. బారుకత్తి పిడితో మధ్యాశ్వం మెడపై గట్టిగా మోదగా అది కుప్పకూలిపోయినది. బంగరు పూతల రధము తుత్తునియలైనది. ముత్తు వీరప్ప మూడు బారల ఆవలకు విసిరి వేయబడినట్లు ఎగిరిపడినాడు. అతని శిరోలంకారముగా నిలచిన నవరత్న ఖచిత కిరీటరాజము చోళమండల ధరాధీశ్వరుడైన శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారి పాదాలకడ మోకరిల్లుతున్నట్టుగా వ్రాలినది. రఘునాథులు ఆ కిరీటాన్ని తన ఎడమచేత ఎత్తి తన రథములోనికి విసిరి వేసినారు. ముత్తువీరప్ప మహారోషముతో లేచి ద్వంద్వ యుద్ధానకు తలపడినాడు. చోళపాండ్య భూవీరుల కరవాలములు ఖణిల్లు ఖణిల్లుమని డీకొని నిప్పురవ్వలను పుట్టించినవి. పదిలిప్తల సమయములో రఘునాధుల కెంపుల పిడిబాకు ముత్తు వీరప్ప నాయకుని కంఠాన గురి పెట్టబడి ఉన్నది. కన్నుమూసి తెరచేటంరలో వీరప్ప వీరస్వర్గ మార్గాన ఉండేవాడే. కాని అతడు ప్రాణాలకన్న స్వర్గమే విధంగానూ మిన్న కాదన్న అవకాశవాది. అరువది ఏళ్ళు నిండిన ఆ పాండ్య ప్రభువు, తన వయసులో సగం కూడలేని లేత వయసు బాలుడు, తంజపుర ప్రభువు పాదాలమ్రోల అన్యధా శరణం నాస్తి అన్నట్లుగా, తన నాలుగున్నర మూరల మహాకాయంతో మోకరించినాడు. పాండ్య సేనానాయకులీ దృశ్యాన్ని విస్తుపోతూ కనులారా చూచినవారైపోగా మిగిలిన సగం బలగంతో పిక్కబలం చూపి వెనుకకు మరలినారు.
రఘునాథుల కమలనేత్రాలు ముత్తువీరప్ప దీనస్థితి చూచి దయామృతాన్ని వర్షించినాయి, ముత్తువీరప్పను ఆదరంగా లేవదీసి ఆలింగనం చేసికొన్నారు. సిగ్గుతో మొగమెత్తలేని పాండ్య ప్రభువులు తలవాల్చుకొని ఇక తన కంఠాన ప్రాణము ఉండగా తంజపురాధీశులపై కత్తి ఎత్తేది లేదని ప్రమాణం చేసినారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పునరుద్ధ రించవలసినదిగా రఘునాథులను మరి మరి కోరినారు. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసికొని, ఆ దేవి కృపాకటాక్ష వీక్షణాశీర్వాదాలను పొందవలసిందిగా యువ ప్రభువులకు విన్నపాలు చేసికొన్నారు. పిదప, తన సేవకుడొకడు చేయందించగా ఎదురుగా ఉన్న జవనాశ్వాన్ని అధిరోహించి తిరోగమనం చేసినారు.
రఘునాధ ప్రభువులు తంజనగరానికి విజయం చేసే సమయానికి పాండ్యరాజు మీనాక్షీ అమ్మవారి ప్రసాదంతో బాటు మూడువేల అశ్వగజ దళాలనూ, విలువలైన వజ్ర వైఢూర్యాది రత్నతతులనూ, అపారధనాన్నీ సగౌరవంగా పంపించుకొన్నారు.
శ్రీ మన్మహా చోళమండలేశ్వరులు శ్రీశ్రీశ్రీ అచ్యుతనాయక మహారాజుల వారు విచ్చేస్తూ ఉన్నారు, అనే హెచ్చరికలతో వెండి బెత్తముల వారు ఇరువంకల నడుస్తూ ఉండగా శుకవాణీదేవి భవనాలకు దయచేసినారు. అప్పుడు శుకవాణీదేవి సాయం సంధ్యా నృత్యము పూర్తి చేసికొని విశ్రాంతి తీసుకొనుచున్నది. దౌవారికలు తెచ్చిన వార్తనువిని దిగ్గునలేచి నిలబడినది. ప్రభువులు విచ్చేసినప్పుడు ఎలా మాటలాడవలెనో ఏ విధమైన మరియాదలు చేయవలెనో తెలియక గడగడలాడిపోయినది. రాచనగరులో ఈలాంటి సమస్యలు త్పున్నమౌతాయని ఆ బాల ఇంతకు మునుపు ఎరుగదు. తానున్నది ప్రభువుల భవంతియే ! వారింట వారికి తాను మర్యాదలు చేయడం ఏమిటి ! అనుకొన్నది. ప్రస్తుతము తానీ భవంతిలోనివసిస్తూన్నందు వలన తన గృహానికి మహారాజులు అతిధులే అనిన్నీ భావించినది. పెద్ద అంతర్భవంతిలోని ఉన్నతాసనం మహారాజులకు సముచిత ఆసనం కాగలదని నిశ్చయించుకొన్నది. చెలికత్తియులతోడను తాను ద్వారయుకడ నిలబడి, తలవంచి నమస్కరించి, వినయభక్తి పూర్వకంగా మహారాజుల వారిని లోనికి తోడ్కిని ఆశీనులు గమ్మని ప్రార్ధించినది.
మహారాజులు ప్రేమాదర పూర్వక దృక్కులతో శుకవాణిని చూచినారు. అప్పుడా బాల ఒకొటి రెండు సాధారణ భూషణాల తక్కుఎక్కువగా ఎట్టి ఆభరణాలనూ ధరించి ఉండలేదు. జిలుగుపచ్చపట్టు కాశ్మీర వలువలను ధరించినది. నుదుట కుంకుమ తిలకము తప్ప అంగరాగములను దిద్దుకొని ఉండలేదు. నాట్య సమయాన, అలంకారములతో సాక్షాత్తూ మహాలక్ష్మీదేవివలె అగుపడుతూ ఉన్న శుకవాణీదేవి, నిరలంకారయై ఉన్నప్పుడు ఎట్లుండునో వీక్షించాలనే కుతూహలంచేత, శ్రీ అచ్యుత నాయకులంవారు ఆ సమయాన దయచేసి ఉన్నారు. అదిన్నీగాక, శుకవాణీ దేవి నర్తిస్తున్నప్పుడు గానం చేస్తున్న కీర్తనలన్నీ ఆమెయే రచించినదని వినియున్నారు. ఆ గేయాలెంతో భక్తిపూర్వకముగ, రసవంతముగ, భావస్ఫోరకముగ ఆత్మానందాన్ని కలిగిస్తూన్నవి. చిరుతప్రాయములో నున్న ఈ బాలిక లీలాశుకులను, జయదేవులను, యామునాచార్యులను మరిపింపచేస్తూ ఉన్నది. పాటలకు తగిన రాగములనమర్చినది. ఏ గంధర్వ బాలయో శాపవశాన ఈ మూర్తెప్ప నాయకుల గృహాన అవతరించలేదు కదా ! అని మహారాజులు తలపోసిరి. ఇన్ని సంత్సరాల తమ జీవితంలో శుకవాణి దేవి నృత్యవీక్షణంలో లభించినంత ఆనందంవంటి అద్భుతానందాన్ని తానెన్నడూ అనుభవించలేదని మహారాజులు భావించినారు. |