114
 

గోదాదేవి త‌ప‌స్సు ఫ‌లించిన‌ది. స్వప్నమున స్వామి ద‌ర్శన‌మున‌ను గ్రహించినాడు. శ్రీ‌నివాసుడు వ‌ల‌పులు చిందే న‌వ్వుమోముతో, ఆ బాల త‌ల‌పై ముత్యాల త‌లంబ్రాలు పోసినాడు. ఆ స‌మ‌యాన న‌ల్లన‌య్య చేతుల‌లోని తెల్లని ముత్యాలు కారుమేఘాల్ని చీల్చుకు వ‌స్తూన్న రిక్కల‌ను గుర్తుకు తెస్తూ ఉన్నవి. వ‌ధువు ప‌క్షాన ఉన్న అమ్మల‌క్కలు నోళ్లు నొక్కుకున్నారు. ఇంత చ‌క్కన‌మ్మను అంత న‌ల్లన‌య్యకిస్తున్నా రేమ‌మ్మా ! కాకి ముక్కుకు దొండ‌పండులాగా....లోకం గొడ్డు పోయిందా ! అంటూ మేల‌మాడారు. వీరుడివైపు ముత్తయిదువలు ముక్కులు త్రిప్పుకొన్నారు. ఓశ‌మ్మా ! ఇంతోటి అంద‌గ‌త‌క‌త్తెలు చాలామందె ఉన్నారు. ఏడీ, మా క‌న్నయ్య వంటి వాడినొక్కడిని చూపండి, చాలు !  అయినా మీ అమ్మాయి వాడికోసం ఏడ్చి రాగాలు పెట్టి, త‌ప‌స్సు చేసి, పూజ‌లూ వ్రతాలు చేస్తే, పోనీ గ‌దా అని క‌రుణించాడు అంతేగాని కన్యలు దొరక్కమీవెంట ప‌డ‌లేదు. మాకూ ఉన్నారు ప‌ద‌హారు వేల‌మంది. అంద‌రూ ప‌ర‌మ సౌంద‌ర్యవ‌తులే ! అంటూ వీరున్నూ మేల‌మాడారు.

వ‌ధూవ‌రుల‌కు ఈ మాట‌లు చెవిసోకిన‌వి కావు. ఇరువ‌రూ ఒక‌రి కొర‌కొక‌రు ఎన్ని జ‌న్మల‌నుండో త‌పించి త‌పించి నేటికి ప్రియ సంద‌ర్శనాన్ని పొంద‌గ‌ల్గిరి. ఇరువురి కనుల‌లో ప‌దునాల్గు భువ‌నాల‌లోని సౌంద‌ర్యమంతా ప్రతిబింబించిన‌ది సృష్టిలోని ఆనంద మాధుర్యమంతా అచ్చటే ఆగిపోయిన‌ది. త‌లంబ్రాల పేరున ఒక‌రినొక‌రు దోసిళ్ళతో త్రావుచూ ప్రపంచాన్నే మ‌ర‌చిన మ‌ధుర క్షణాల‌లో వారికి ప్రకృతి స్ధంభించి పోయిన‌ది. గోదాదేవి దివ్యాసందోత్సాహాల‌తో తేలియాడిపోతూ ఉన్నది.

ర‌ఘునాథ ప్రభువులు న‌గ‌రంలో లేర‌న్న సంగ‌తి వారు పునఃప్రవేశ సంద‌ర్భంలో శుక‌వాణికి తెలిసిన‌ది. ఆమెలోని సందేహ మేఘాలు ప‌టాపంచ‌లైన‌వి. ప్రభువులు కార్యార్ధులై వెళ్ళినందుచేత‌నే త‌న నృత్య ప్రద‌ర్శన‌కు రాలేక‌పోయిరి గాని త‌న‌ప‌ట్ల ఆగ్రహం చేత‌కాద‌ని ఆమెకు అవ‌గ‌త‌మైన‌ది.

శుక‌వాణీ దేవి నాట్యమ‌యూరియైన‌ది. వార‌ణ‌మాయిర‌ము...వార‌ణ‌మాచిన‌మే...అని మేఘ‌రంజ‌ని రాగాన సఖులాల‌పించ‌గ ప‌ర‌మ మ‌నోజ్ఞమైన ముద్రల‌ను ప‌ట్టి చిత్రవిచిత్ర ప‌ద‌గ‌తుల‌తో న‌ట‌న‌మాడిన‌ది. ఆ నాట్యమేగ‌మామె ఆనందో ద్వేగ‌మును ప్రతిబింప‌జేస్తూ ఉండ‌గా మ‌హా రాజులు కూడా త‌న్మయ‌త్వంతో వీక్షించుచున్నారు.

క‌ళ్యాణ‌రామున‌కు క‌ల్హార‌హారం
క‌మ‌నీయ రూపున‌కు క‌స్తూరి తిల‌కం
కంద‌ర్ప జ‌న‌కుసుకు క‌ర‌వీర పుష్పం
క‌రుణాంత రంగున‌కు క‌న‌కంపు క‌వ‌చం

శుక‌వాణి పున్నాగ‌రాగ గీతిక‌లోవి గ‌మ‌కాలు మూర్ఛన‌లు వింత అందాల‌ను చేకూర్చుచుండ‌గా నాగినియై ఊగిపోయిన‌ది. ఆమె హ‌స్తాభిన‌య‌మున‌కు నేత్ర, భ్రూ, ముఖ‌రాగాదులు మ‌రింత తోడ్పడ‌గ భావ‌ము మ‌రింత సువ్యక్తమైన‌ది. అంద‌రి హృద‌యాలూ సంత‌సంతో నాగ‌నాట్యం చేసిన‌వి.

మార్గశివ్రతంలో మేల్కొలుపున‌ట్టివారికి శంఖ‌ములు, ప‌ల్లాండు పాడువారికి త‌ప్పెట‌లు, మంగ‌ళ‌దీప‌ములు, శుభ ధ్వజ‌ములు , చాందినీ వ‌స్త్రములు కావ‌లెన‌ని కోరుట అనాది ఆచార‌ము. ఈ ఆచార‌మున‌కు అండాళ్ స్వస్తి చెప్పిన‌ది. కృష్ణదేవుని సంపూర్ణ శృంగార ర‌స‌మోహ‌న‌మూర్తి ఆమెకు హృద్గోచ‌ర‌మైన‌ది. ప్రభువు క‌రుణించ‌గా వ్రత‌ము సంపూర్ణమైన‌ది. గోపికా వ‌ల్లభుడు సుల‌భుడైనాడు.

కుడారై వెల్లుమ్ శీర్‌కోవిన్దా ! ఉన్‌ద‌న్నై
పాడిప్చరై కొణ్ణుయామ్ పెఱు శెమ్మాన‌మ్‌.

ఇద్దర‌మూ హృద‌య‌ములు చ‌ల్లబ‌డేలాగ కూడియున్నాము. ప్రభూ ! శ‌రీరాన్ని వీణ‌గా జేసి, నీకై రాగిణినై, విర‌హ‌ముతో విల‌పించిన దుఃఖ‌మంతా నీ రాక‌తో క‌ర‌గిపోయిన‌ది. క‌ష్టాల‌న్నీ నీలిమేఘాలై, దూదిపింజ‌ల‌లా తేలిపోయిన‌వి.