ఈ హఠాత్పంఘటనకు నివ్వెరపోయిన అమాత్యులకు, సేనాధిపతులకు గొబ్బూరి జగ్గరాజు దుర్నీతి క్షణకాలంలో అవగతమైనది. వేలప్ప నాయకుడు క్రోధంతో వణకిపోయెను అమాత్యులు, ప్రాణరక్షణ చేసికోవలెనన్న ఏ ప్రకారం సంచరించవలెనో, యోచిస్తూ ఉండిరి. రాజబంధువులు ధర్మమే జయిస్తుందనే గాఢమైన నమ్మికతో, ప్రస్తుత పరిస్థితులకు తల ఒగ్గక తప్పదు, అన్నట్లుగా నిలచిరి.
ప్రముఖులందరూ కనులువిచ్చుకొని చూస్తూ ఉండగానే, విజయనగర సామ్రాజ్య నూతన సార్వభౌములు శ్రీశ్రీశ్రీ శ్రీరంగరాయల వారిని, పదిమంది మహాయోధులు చక్రాకారంగా చుట్టుముట్టి, ఆయుధాలను గురిపెట్టి బలవంతాన నడిపించుకొని పోయిరి. తాము సార్వభౌములయిన విషయము మనసున కందకముందే ఆ అమాయిక ప్రభువు దుష్టు చేతబడినాడు.తమ ప్రాణాలను అర్పించి అయినా మహారాజుల మాటలను పాటించగల ప్రభుభక్తులకు సైతం కాలుకదప వీలుగాని పరిస్థితటస్థించినది. కాలనాగువలె గిరగిర తిరుగుచు పగవారి ఆయుధాలను లాగుకొని, వారింనందరినీ ఒక్క మాటు మట్టుపెట్టి, మహారాజుల మాటను నిలబెట్టవలెనని సిధ్దపడిన వేలప్ప నాయకుడు ప్రభువుల శరీరముచెంత రక్తపాతం చేయవెరచి మిన్నక ఉండి పోయెను.
అమాత్యులు సోమశేఖర భట్టారకులన్నూ, ముఖ్య దళవాయి వేలప్ప నాయకుడున్నూ, మరికొందరు ముఖ్యలున్నూ విడివిడిగ భవంతులలో నిర్భందించబడిరి. మరికొద్ది నిమేషములలో బయ్యాంబికా మహారాణివారి కూహనా పుత్రడు విశ్వపతిరాయలకు గొబ్బూరి జగ్గరాజు పట్టాభిషేకము చేసినాడు. కొమరుడు నమస్కరించినపుడు మహారాణులకు తెలివివచ్చినది. జరుగుతూ ఉన్నది ఆమె మనసున నిలవడంలేదు. మహాప్రభువుల వియోగానికి ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకొనిపోతూ ఉన్నారు. చెలికత్తెలు ఆమెను పొదవుకొని అంతఃపురానకు కొనిపోయి ఉపచారాలు చేస్తూ ఉండిరి. తమకు సేవచేస్తూ ఉన్న పరిచారికలు నూతనులని కూడ గుర్తింపగల స్థితిలో బయ్యాంబికా మహారాణివారు లేకుండిరాయెను.
గొబ్బూరి జగ్గరాజుచే నూతనముగ నియమింపబడిన అమాత్యులు, సేనాధ్యక్షులు, దళాధిపతులు, కోశాధికారులు మున్నగు వారందరూ ఇమ్మడి వేంకటపతి మహారాజుల భౌతిక కాయానికి నమస్కరించి, నిలచియుండిరి. వేంకటపతిరాయ సార్వభౌముల మాటను వేదవాక్కుగ నెరవేర్చగలిగిన వారినందరను, క్రమక్రమంగా రూపుమాపేటందుకు నూతన అమాత్యులు నారాయణ భట్టారకులు ప్రతిన పూనెను.
గొబ్బూరి జగ్గరాజు మనసులో ఉన్నట్లుండి ఒక భయం కలిగించే తలపు మెరుపులా మెదలినది. మహారాజునకు అంజనేయుని వంటి భక్తుడు, మహావీరుడు, బుద్ధిశాలి, యుక్తిశాలి , తన ప్రాణాలను సైతం ప్రభువుల పాదాలచెంత అర్పించగల శూరాగ్రణి అయిన యాచనునాయకుడు ఏడీ ? ఎక్కడున్నాడు ? బంధితులైన వారిలో లేడే ! శ్రీ రంగరాయల దురదృష్ట హస్తానికి మహారాజు రాజముద్రికను తొడిగిన క్షణాలలో అతడక్కడనే ఉండెను కదా ! దుర్గాధిపతులను, సామంతులను తన వైపునకు త్రిప్పుకొనే మార్గాన్వేషణలో మునిగి ఉన్న జగ్గరాజు యాచమనాయకుని విస్మరించి నాడు ! జగ్గరాజు గుండెలో చెప్పరాని బాధ గుబగుబలాడినది.
గొబ్బూరి జగ్గరాజును విజయనగరధరాదేవి తబ్బిబ్బు చేస్తూ ఉన్నది. బయ్యాంబిక పెంచిన ఈ బ్రాహ్మణ బాలుడు. విశ్వపతిరాయుడు ఇంకెన్నాళ్లు మనగలడు ? ఈ బుడుతని పేరుతో రాజ్యాన్నే లేది తానేకదా ! పరిస్థితులు తనకు అనుకూలము కాగానే ఈ బాపనోరి చిన్నోడికి బుడ్డిచెంబు చేతికిచ్చి యాయవారానికి పంపివేయగలడు కదా ! కాని, వీణ్ణి జీవంతో ఉండనీయవచ్చాయ ? ఈ అర్భకుడి ప్రాణాలు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ! గొబ్బూరి జగ్గరాజు వికృతానందంతో వికటాట్టహాసం చేసెను.
అంతఃపురమున సంవత్సరముల తరబడి సేవలు చేస్తూ ఉన్న విశ్వసనీయులైన పరిచారికలు, పరిచారకులు మంత్రము వేసినట్లుమాయమైపోయిరి. ఎచ్చట చూచినా క్రొత్తవారే. ముఖ్యోద్యోగుల ప్రాకారములకడ పహారావారు సహితము నూతనులే. మంత్రల, సైన్యాధ్యక్షుల, సర్వసైన్యాధ్యక్షుల, ధళాధిపతుల, చమూపతుల, భవంతులలోను, పాఠశాలలోను ఉద్యానవనములలోను సేవచేయు పరిచారిలకలనున రావించి, గొబ్బూరి జగ్గరాజు వార్తలను సేకరిస్తూ ఉండెను. వీరందరినీ స్వర్ణ నిష్కాల సంచులతో కొనగలిగినాడు. ధనాశ, అధికారకాంక్ష మనిషిని ఎంతటి నీచానికైనా ఒడి గట్టించగలదు.
కొత్తగా అమాత్యపదవిని చేబట్టిన నారాయణభట్టారకుడు, ఎంత కాలంగానో అమాత్యుడుగా ఉన్న తన పినతండ్రి కుమారుడైన సోమశేఖర భట్టారకుని నిర్ధాక్షిణ్యంగా చంపించెను. అమాత్యులు సోమశేఖర భట్టారకుల వారి పత్ని జగదీశ్వరీదేవి భర్తగారి రాకకొరకు నిరీక్షిస్తూ నాటికి మూడు వాళ్ళుగా అభోజనంగానే ఉండిరని అమాత్యుల పాఠశాలలోని సేవకుడొకడు జగ్గరాజుకు మనవి చేసుకొన్నాడు. జగదీశ్వరీ దేవి భర్త భుజించిన తరువాత వారు భుజించిన స్వర్ణపళ్ళెరాన మాత్రమే తాను భుజించే అలవాటును వ్రతంటా పాటిస్తూ ఉంటారు. గొబ్బూరి జగ్గరాజు గుంటకనులు వేడుకతలో మెరసినవి. అమాత్యులు ? ఇంకెక్కడి అమాత్యులు ? ఏనాడో కైలాసానికి వేంచేసినారు ! ఇక ఆ పతివ్రత ఎన్నాళ్ళు తిండి తినకుండా వేచివేచి చస్తుందో చూడాలి, అనుకున్నాడు. |