37
 

ర‌ఘు : నా ప్రార్ధ‌న‌కూడ గట్టిగా మీ ప్రార్ధ‌న‌తో రంగ‌రిస్తున్నాను.

క‌ళా : ప‌్ర‌భువుల ఎదుట ల‌జ్జ‌ప‌డుతున్నాను.

ర‌ఘు : నువ్వు ఎప్పుడూ ముగ్ధ‌వే దేవీ ! మ‌నం అంద‌రం వంతులుగా పాడాలి. ఈ ల‌క్ష్మి చెంచీత అడ‌వుల‌లోని సెల‌యేశ్ళులా, భ‌ర‌త ప‌క్షిలా, పికిలి పిచుక‌లా, కోకిల‌లా, పావుర‌ములా, తుమ్మెద‌ల‌లా, అడ‌వి వెదురుగొట్ట‌ములా పాట‌పాడుతుంది.

క‌ళా : ప్ర‌భువువారికి ఇంత ఇత‌ర ఉప‌ములు దొర‌క‌లేదా ?

ర‌ఘు : ఉండు, దేవీ ! నీ ప‌నీ ప‌ట్టిస్తాను ! రామ‌భ‌ద్రాదేవి వీణ‌లా, వేణులా, నాగ‌స్వ‌రంలా, బంగారు మువ్వ‌లులా, శివుని డ‌మ‌రుకంలా

రామ : నేను ప్ర‌కృతిని సంబంధించిన‌దాన‌ను కాను కాబోలు !

ర‌ఘు : క‌ళావ‌తీదేవి మ‌ల‌య‌మారుతంటా, బంగారు విస‌న‌క‌ర్ర‌లా, కిన్నెరిలా, కిన్నెరిపులుగులా, వెన్నెల‌లా పులుగులా...ముగ్గురు దేవుల క‌ల‌క‌ల న‌వ్వులు ప్ర‌భువు వ‌ర్ణ‌నాల‌హ‌రికి ఆన‌క‌ట్ట అవుతాయి. ప్ర‌భువుకూడా ప‌క‌ప‌క‌న‌వ్వినాడు.
ర‌ఘునాథుడంత‌లేచి క‌ళావ‌తి ద‌గ్గిర‌కుపోయి, ఆమె చెవిలో ఏదో ర‌హ‌స్యం చెబుతున్న‌ట్లు న‌టిస్తూ గుస‌గుస‌లుగా, క‌ళావతీదేవీ ! ప్రాణ‌ప‌త్నీ ! నువ్వు సౌంద‌ర్య‌రాసివి. నీ కోసం నా హృద‌యాన్ని దేవాల‌యం చేసి ఎదురుచూస్తూ ఉంటే, బంగారు దేవి ! విగ్ర‌హ‌మై లోన‌కు రాక ఏమిటీ అలా గుమ్మం ద‌గ్గిరే నిలుచుండి పోయావు ? అన్నాడు.

రామ : ప్ర‌భువులు కావ్య‌నాయ‌కులు అవుతున్నారు.

ర‌ఘు : అవును దేవీ ! నేను కావ్య‌నాయ‌కుణ్ణి కావాలి. ఆ కావ్యం నువ్వు అప్పుడే ప్రారంభించావు. అది మంగ‌ళాంతం వ‌ర‌కూ వ్రాస్తూ ఉండు.

రామ : మ‌హాప్ర‌సాదం, ప్ర‌భూ ! ప్రాణేశుల ఆజ్ఞ‌ను త‌ల‌దాలుస్తున్నాను.

ర‌ఘు : ఈ ల‌క్ష్మీదేవి !

క‌ళా : ఇంకా ముగ్ధ‌నాయిక !

ల‌క్ష్మీదేవి సిగ్గుప‌డి త‌ల‌వంచుకున్న‌ది. ర‌ఘునాథుడు లేస్తూ మీరెవ్వ‌రూ లేవ‌కండి. అంటూ పూర్తిగాలేచి ల‌క్ష్మి ద‌గ్గిర‌కుపోయి , చిన్న‌రాణి ! ఈ ఇద్ద‌రు అక్క‌లూ నువ్వూ నాకు క‌లిసిపోయి ఒక్క‌తే దేవి. మ‌న న‌లుగురిలో ర‌హ‌స్యాలు లేవు. దేహాలు వేరు. అత్యంతావ‌స‌ర మ‌ర్యాద‌లు మాత్రం త‌ప్ప‌వు. అంతే ! మ‌నం ఒంటిగా ఉన్న‌ప్పుడు న‌లుగుర‌మూ చిన్న బిడ్డ‌ల‌ము కాదాదేవీ ? అని ఆమె వెన‌క‌నుండి భుజాల‌పైన చేయివైచి, ఆ బాలిక చెవిలో, మీ ముగ్గురు అందాలు ల‌క్ష్మీస‌ర‌స్వ‌తీ శ‌క్తుల ముగ్గురి అందాలు క‌లిసిపోయిన‌ట్లే, అని న‌వ్వుతూ ఆ బాలిక వెన‌క‌వైపు నుంచి ముందుకువంగి, ఆమె మోము వెన‌క్కువంచి నుదురు ముద్దుగొన్నాడు.

క‌ళావ‌తీ రామభ‌ద్రాంబ‌లు చిరున‌వ్వులతో లేచి చెరి ఒక ప్ర‌క్క‌నూ ర‌ఘునాధుని భుజాల చేయివేసి నిలుచుండినారు. రామ‌భ‌ద్రాంబా క‌ళావ‌తీ దేవి ఇద్ద‌రూ ల‌క్ష్మి పై వాలి చెల్లీ ! మన ముగ్గురం ఒక‌టే సుమా ! అని ఆమె బుగ్గ‌లు ముద్దుపెట్టుకున్నారు.

అంతఃపురాచారం ప్ర‌కారం ముగ్గురు యువ‌రాణులు బంగారంలా పండిన త‌మ‌ల‌పాకుల‌కు ముత్యాల‌సున్నం వ్రాసినారు. సున్నం రాసిన ఆకుల‌న్నీ వారు చిలుక‌లు చుట్టినారు. వ‌క్క‌లు, సువాస‌న వ‌స్తువులు మువ్వురు యువ‌రాణులు ర‌ఘునాథ నాయ‌కున‌కు అందిచ్చినారు. ఆ యువ‌మ‌హారాజు న‌వ్వుతే స్వీక‌రించి, నోటియందుంచుకొని భార్య‌లందించు ఆకుల చిలుక‌లు ఆర‌గిస్తూ, పెద‌వులూ నోరూ కెంపైపోవ ఏదో ఆలోచిస్తూ, క‌ళావ‌తీదేవీ ! నువ్వు ప‌ద్యాలు చ‌ద‌వ‌డం ప్రారంభించ‌వ‌ల‌సి ఉన్న‌ది. నీ వెనుక రామ‌భ‌ద్రాంబ‌దేవి, ఆ వెనుక ల‌క్ష్మీదేవి, త‌ర్వాత నేను, అని సాభిప్రాయ‌ముగా ముగ్గురినీ చూచినారు.

రామ‌భ‌ద్రాంబ భ‌ర్త‌ను క‌నుగొని, ప్ర‌భూ ! చ‌క్క‌గా అన్నారు. అక్క‌గారూ ! తాంబూల‌సేవ అయిన వెంట‌నే మీరు మొద‌లు పెట్టండి, అని కోరిన‌ది. నా ప‌ద్యాల‌లో పెద్ద చెల్లెలుగారు చ‌ప్ప‌ద‌నం రుచి చూస్తారు అని క‌ళావ‌తీదేవి అన్న‌ది.

క‌ళావ‌తీదేవి వీణాస‌న మ‌ధివ‌సించి నాధునిపై భ‌క్తి ప్రేమ‌యుతాలైన వాలుచూపులు ప‌రుస్తూ హాస‌ప్ర‌పుల్ల వ‌ద‌ల‌యై భైర‌వ‌రాగ‌మాల‌పించి, ప్ర‌స్తారించి ,