53
 

యూర‌పుఖండంలో ఇంగ్లండు, ఫ్రాన్సు, హాలండు, పోర్చుగ‌ల్ మొద‌లైన దేశాల‌న్నీ చాలా చిన్న‌వి. కాని వారంద‌రూ యుధ్ధ విశార‌దులు, ఉత్త‌మ నావికులున్నూ. వారి ధ‌నతృష్ట‌, రాజ్య‌తృష్ట వారిని ప్ర‌పంచం అంతా తిప్పుతూ, అతి హీన‌స్థితుల్లో ఉన్న మ‌నుష్యులు వాసంచేసే ఆఫ్రికాకూ, అమెరికాకూ, శాంత మ‌హాస‌ముద్ర దీవుల‌కూ పంపించింది.

అంద‌రూ భార‌త‌దేశ‌ము బంగారుభూమి అనీ, అక్క‌డ నుండి వ‌ర్త‌కాలు చేసి, కోటీశ్వ‌రులు కావ‌చ్చున‌నీ బ‌య‌లుదేరి, భార‌తదేశంతోపాటు ఇత‌ర దీవుల‌తో గూడా వ‌ర్త‌కం ప్రారంభించారు.

త‌ల్లికోట యుద్ధానంత‌రం విజ‌య‌న‌గ‌రాన్ని నాశ‌నం చేసిన త‌రువాత తిరుమ‌ల రాయ‌ల‌వారు పెరుగొండను ముఖ్య‌ప‌ట్ట‌ణం చేసుకొన్నారు. అయినా తురుష్క‌న‌వాబుల వ‌త్తిడి వ‌స్తూనే ఉండి. తిరుమ‌ల‌రాయ‌ల మ‌ర‌ణానంత‌రం ఆయ‌న పెద్ద కొమ‌రుడు శ్రీ రంగ‌రాయ‌లు సామ్రాట్ట‌యిన వెంట‌నే, బిడ్డ‌లు లేక చ‌నిపోయినాడు. ఆయ‌న వెన‌క వేంక‌ట‌ప‌తిరాయ‌లు చ‌క్ర‌వ‌ర్తి అయినాడు. ఇప్పుడా చ‌క్ర‌వ‌ర్తి కాలంలో తురుష్కులు విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యంపై ఒత్తిడి ఎక్కువ చేస్తూంటే వేంక‌ట‌ప‌తిరాయ‌లు రాజ‌నీతి ద‌క్ష‌త‌తో, ఉత్త‌మ యుద్ద‌నీతితో రాజ్యం కాపాడుకుంటూ ఉండినాడు. గోల‌కొండ కుతుబ్‌శాహి సైన్యాలు వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు సామంతులు తురుష్క సైన్యాల‌ను చేర‌డ‌ము, వేంక‌ట‌ప‌తిరాయులు సైన్యాల‌ను పంపించేసరికి ఆ దొంగ సామంతులు విజ‌య‌న‌గ‌ర సైన్యాల‌ను చేర‌తూ ఉండ‌ట‌ము చేస్తూ ఉండేవారు. నిడుద‌ప్రోలు ప్ర‌భువు మాత్రం ల‌క్ష్మ‌ణ‌మంత్రి మంత్రాంగం వ‌ల్ల విజ‌య‌న‌గ‌ర చ‌క్ర‌వ‌ర్తులను క‌ప్పంక‌ట్ట‌డం మాన‌లేదు. కాని తురుష్క సైన్యాలు వ‌చ్చిన‌ప్పుడు అంటీ అంట‌న‌ల్లు రాజ‌కీయాలు నడిపి, రాయ‌లు సైన్యాలు రాగానే వారిలో చేరి మ‌హాయుద్ధం చేస్తూ ఉండేవాడు.

ల‌క్ష్మ‌ణ‌మంత్రి అస్త‌మించిన ఏడాదికి వృద్ధుడైన వేంక‌ట‌రెడ్డి నాయ‌నిం వారూ అస్త‌మించారు. ఆయ‌న‌కు ఆరుగురు పుత్రిక‌లు వారి అంద‌రి వెన‌కా క‌డ‌గొట్టు పుత్రుడు రామానాయ‌నిం వారు.

ఆయ‌న‌కు ప‌ద‌వ ఏట‌నే తండ్రిపోవుట చేత మేన‌మామ‌లు రాజ్య‌ప్ర‌తి నిధుల‌యారు. వారికీ ల‌క్ష్మ‌ణ‌మంత్రికీ లోగడ కొన్ని మాట‌ప‌ట్టింపులు వ‌చ్చి ఉన్నందున వారి అధికారం రాగానే ల‌క్ష్మ‌ణ‌మంత్రి కుటుంబానికి కోట‌నుండి వెళ్ళే వేయిదీనారాలు యివ్వ‌డం మానివేయించారు.

వేంక‌ట‌రాజు ఉప సైన్యాధ్య‌క్షుడూ, రాజ‌స‌భ‌లోక‌విరాజున్నూ, ఈ రెండు ఉద్యోగాల‌వల్ల చేమ‌కూర‌వారి కుటుంబానికి నాలుగైదువేల టంకాలు వ‌చ్చేవి. మేన‌మామ‌ల అధికారం వ‌చ్చింది. అన్నీ ఆగిపోయాయి.

వేంక‌ట‌ప‌తి హృద‌యంలో పిడుగుప‌డింది. కోశాగార‌ప‌తి విష‌యం చ‌ల్ల‌గా తెలిపినాడు వేంక‌ట‌ప‌తికి. ఈ త‌మ్ముళ్ళ‌నంద‌రినీ పోషించాలి. వైభ‌వంగా బ్ర‌తికిన కుటుంబం, పువ్వుల‌మ్మిన‌చోట పుల్ల‌ల‌మ్మ వ‌ల‌సి వ‌స్తుంది. బిడ్డ‌ల‌కోసం వేంట‌క‌ప‌తి త‌ల్లుతిరువురూ స‌హ‌గ‌మ‌నం చేయ‌కుండా ఉండి పోవ‌ల‌సి వ‌చ్చింది.
వేంక‌ట‌ప‌తి ఎంతో ఆలోచించుకొని న‌మ్మ‌క‌మైన ప‌దిమంది వీరుల్ని త‌న నాయ‌క‌త్వం క్రింద చిన్న‌ద‌ళంగా ఏర్పాటు చేసుకొని, అన‌వ‌స‌ర‌మైన సామాను బందుగుల‌కిచ్చి, భూముల్ని దాయాదుల‌క‌ప్ప‌గించి, వ‌చ్చినంత ద‌నం ప్రోగు చేసుకొని, మూడు నాలుగు నెల‌ల‌కు స‌రిపోయే ధాన్యం, బియ్యం, ప‌ప్పులు, చింత‌పండు వగైరా వ‌స్తువుల సేక‌రించి, ఉన్న రెండెడ్ల బండ్ల‌న్నీ స‌మాయ‌త్తం చేసి, రెండేనుగుల‌నూ మూడు ర‌థాల‌నూ ప‌దునెనిమిది గుఱ్ఱాల‌నూ ప‌ది ఆవులు పన్నెండు గేదెలు కూర్చుకొని, పురోహితుడు పెట్టిన శుభ‌ముహూర్త‌ము నందు త‌మ్ముల‌తో, త‌ల్లుల‌తో ద‌క్షిణ దేశ‌యాత్ర‌కు బ‌య‌లుదేరినాడు.

వేంక‌ట‌ప‌తి కొంచెం ప‌సిమికి తేలే చామ‌న‌చాయ మ‌నిషి. ముఖం అంద‌మైన‌ది కాదు. కాని ఆ ముఖంలో ఏదో ఒక తేజ‌స్సు ఒక శ‌క్తి ప్ర‌కాశిస్తూ. ప్ర‌స‌రిస్తూ అత‌న్ని అంద‌మైన పురుషుల‌లో ఒక‌నినిగా ఒక‌రిస్తున్న‌వి. అత‌ని ఫాల‌ము వెడ‌ద కోల‌మోము కాబోయిన గుండ్ర‌టిమోము, స‌మ‌త్వం కాబోయిన నాసిక చిన్న క‌నులు, కాని అంద‌మైన రేఖ‌లు, లోతుగా తీక్ష‌ణంగా ఉంటాయి. అవ‌స‌ర‌మైతే న‌వ్వుతాయి. ఏమీ తెలియ‌న‌ట్లు న‌ల్ల‌మందు మ‌త్తులా వాలిపోతాయి. అత‌ని కంఠ‌ము, భుజ‌ములు, బాహువులు, హ‌స్తాలు, అంగుళులు, వ‌క్ష‌ము, క‌టి ఎంతో అంద‌మైన‌వి.