54
 

వేంక‌ట‌ప‌తి కంఠ‌ము మ‌ధ్య‌మ‌శ్రుతి క‌ల‌ది, ఎంతో మ‌ధురంగా ఉంటుంది. వేంక‌ట‌ప‌తి మాట‌ల నేర్ప‌రి. ఎంత‌టి మందున‌కైనా తీయ‌గా బోధించి ఎలాంటి క్లిష్ట‌భావ‌మైనా పండు ఒలిచిన‌ట్లు చెప్ప‌గ‌ల‌డు. అత‌నికి తెలియ‌ని విష‌యంలేదు. అయినా అన్ని విష‌యాల‌యందూ పాండిత్యంలేదు.హాస్యం చేయ‌డ‌మంటే వేంక‌ట‌ప‌తికి ఆనందం. ఎదుటివాడి మ‌న‌స్పునొవ్వ‌కుండా హాస్యం చేస్తాడు.

మండిపోయే కోపం వ‌చ్చిన‌ప్ప‌టికీ కోపం దాచుకుని పైకి తీయ‌గా మాట్లాడుతాడు. బండ‌గా వాదించేవారిని వారి మాట‌ల‌తోనే నిరుత్త‌రులుగా చేయ‌గ‌ల‌డు.

జ్ఞానం బాగా ఉద‌యించిన కొల‌దీ వేంక‌ట‌రాజు తాను వేశ్యాకుల‌జుడ‌న‌నీ, వేశ్యాకులానికి నీచ‌కులాల‌వారికి ఉన్న గౌర‌వంక‌న్న త‌క్కువ గౌర‌వం ఉంద‌నీ ఆయ‌న తెలుసుకొన్నాడు. వేశ్యాకులంలో పురుషులు ఉన్నా ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే. వారికి చ‌దువులు చెప్పించినా ఒక‌టే, చెప్పించ‌క పోయినా ఒక‌టే. వాళ్ళ‌ల్లో ఎవ‌రోత‌ప్ప వివాహం చేసుకోరు. వివాహానికి ఒప్పుకొనే స్త్రీలు అరుదు, వారిని చేర‌దీసిన నాయ‌కుల‌కు నిజ‌మైన భార్య‌లై పాతివ్ర‌త్యం నెర‌పేవారు. ఈ కులంలో ఎక్కువ‌మంది స్త్రీలు వాడ‌లో ఉండేవారే. వారిది దైనందిన పాతివ్ర‌త్యం.

వేశ్యాకుల స్త్రీలంటే దేశానికి ప్రేమ‌. అంద‌మైన‌వారు, విద్యాపారంగుతులు. గాంధ‌ర్వ‌ము వారి సొమ్ము. ర‌స‌జ్ఞ‌త వారి కాణాచి. విలాస‌ము వారికి స‌దాలంకార‌ము. నాట్య‌శాస్త్ర‌ము వారి రాజ్య‌ర‌మ‌. కాని ఆ కులంలో ఉద్భ‌వించిన పురుషులు వాద్య విశేషాలు నేర్చుకొనో, అక్క‌చెల్లెండ్ర భ‌వ‌ల‌నాల‌లో పెత్త‌న‌ము చ‌లాయిస్తూనో బ్ర‌తుకుతారు. కాని అనేకులు త‌మ త‌మ చుట్ట‌రిక‌పు స్త్రీల ప్రాప‌కంవ‌ల్ల రాజోద్యోగాలు సంపాదించుకొని జీవిస్తూ ఉంటారు. కొంద‌రు యుద్ధ‌వీరులై ప్ర‌ఖ్యాతి పొందుతూ ఉంటారు.

భోగినీజాతి దాసీకుల‌ము ప్ర‌పంచంలో ఎందుకు ఉద్భ‌వించిన‌ది ? ఆ కులానికి ఇంత నీచ‌గ‌తి సంభ‌వించిన‌దేమి ? అని వేంక‌ట‌ప‌తి ఎప్పుడూ విచార హృద‌యంతో క్రుంగిపోతూ ఉండేవాడు. త‌న తండ్రినిబ‌ట్టి త‌న‌కు ఎదురుగుండా ఎంత గౌర‌వ‌మ‌న్నా జ‌రిగేది. యుద్ధ‌స‌మ‌యంలో త‌న‌మాట రామాజ్ఞ ! కాని రాజ‌స‌భ‌లో తాను ఒక‌డు. మంత్రికి ప్రియ‌పుత్రుడై, తాను ఆరువేల‌వారు పొందే గౌర‌వం పొంద‌లేదు. త‌న‌తో ఆశు క‌విత్వా విధాన‌ముల‌లో పాండిత్యంలో ఆ సీమ‌లో స‌మాన‌మైన క‌విలేడు. అయినా తాను వేశ్య కుల‌జుడై నంత మాత్రాన ఈ పండిత బ్రువులంతా కొంచెపుచూపు చూస్తారు.

అప్స‌ర వంశం నుండి త‌మ వంశం వ‌చ్చింద‌ట ! ఎంత హేళ‌న ! ఉత్త‌మ కుల‌జులు ఈ బాలిక‌ల‌ను క‌న్య‌రిక‌ము అన్న పేరుతో వివాహం చేసుకుంటారు. అన్ని వేడుక‌లు జ‌రుపుతారు. అచ్చ‌మైన వివాహ‌మే అవుతుంది. చేసుకునేవారు బ్రాహ్మ‌ణులు, క్ష‌త్రియులు. బ్ర‌హ్మ‌ణ క్ష‌త్రియ‌త్వ‌ము ఏనాడో విస‌ర్జించి మ‌ర‌ల పొంద‌జాల‌క‌పోయిన స‌చ్ఛూద్రులు. వీరికి వేశ్యాం గ‌న‌ల‌తో పొత్తు. వార‌కే బాల‌బాలిక‌లు పుడ‌తారు.

వేశ్య‌జాతి నీచ‌మ‌తానికి చెందిన కుల‌మా ? భ‌క్తి త‌క్కువా ? ఆర్ష సంప్ర‌దాయ‌ము లేదా ? ఇవ‌న్నీ లెక్క‌కు రావ‌ట ! వేశ్య‌లు బ్రాహ్మ‌ణులుక‌న్న ఎక్కువ స‌దాచారంతో క్ష‌త్రియుల‌క‌న్న ఎక్కువ ఠీవితో, వైశ్యుల‌క‌న్న ఎక్కువ సంప‌ద‌తో తుల‌తూగుతూ ఉంటారు. ఈ కుల‌ములో అనేక‌మంది భ‌క్తులున్నారు. దేహ‌, మ‌న, ప్రాణ‌, ఆత్మాదులు కూడా వేశ్యాబాల‌ల‌కు అర్పంచుకొన్న పండితుడు, వేశ్య ఎంగిలి పాటించ‌క చుంబ‌నాదులు నెర‌పే ఆహితాగ్నులు ఆ జాతి మ‌గ‌పిల్ల‌ల‌ను అంతగా అస‌హ్యించుకోవ‌డ‌మేమిటి ?

ఈలా వేంక‌ట‌ప‌తి ఆలోచ‌నా ప‌రిధిలో ఆవేద‌నా త‌మ‌స్సులు ఉధ్భ‌విస్తూ ఉండేవి.

వేంక‌ట‌ప‌తి త‌న కుటుంబంతో నిర‌వ‌ద్య‌పురం నుండి మూన్నాళ్ళ‌లో వేంగీపురం చేరినారు. వేంగీపుర ప్ర‌భువు రాజ‌స‌భ‌లో వేంక‌ట‌ప‌తికి ఏమీ గౌర‌వం జ‌రుగ‌లేదు. కొంద‌రు వెట‌కారంగా మాట్లాడినారు. త‌న చెల్లెలు మామ‌గారుకూడా త‌న‌ను కొంచెపు చూపు చూచినాడు.

ఆ రాత్రి వేంక‌ట‌ప‌తి ఖిన్నుడై తాము విడిది చేసిన స‌త్రంలో త‌న త‌ల్లులిద్ద‌రి తోడ‌నూ దిన‌దిన‌ము మాట్లాడిన‌ట్లు మాట‌లాడ‌లేదు. సూర‌మాంబ‌కు కొమ‌రుని హృద‌య‌ము అప్పుడే అర్ధ‌మైన‌ది.

నాయ‌నా ! ఉదాత్త హృద‌యంలేని రాజుల‌ను కొల‌వ‌డంకంటె, ప‌ల్లెటూరులో వ్య‌వ‌సాయం చేసుకొని బ్ర‌త‌క‌టం ఎక్కువ గౌర‌వ‌ప్ర‌దం. మ‌న ప్ర‌యాణంలో కాపులు ఎంతో మ‌ర్యాద చూసిస్తున్నారు. గ్రామంలో స‌మృద్ధిగా పాలూ పెరుగూ ఇస్తున్నారు.