55
 

మ‌న ప‌శువుల‌కు గ్రాసం ఇస్తున్నారు. ధ‌నం పెట్టినా దొర‌క‌ని వ‌స్తువు ప్రేమ‌. నువ్వు ఏమీ కించ‌ప‌డ‌కు. మ‌నం చంద్ర‌గిరి పోతున్నాము. ఇక్క‌డ చ‌క్ర‌వ‌ర్తి వేంక‌ట‌ప‌తిరాయ‌లుంవారు నీ ప్ర‌జ్ఞ మెచ్చుకోరా ? నీకు కొలువు దొర‌కదా ? అని అన్న‌దామె.

సూర‌మాంబ త‌న‌కూ త‌న కొమ‌రున‌కూ వేరే వంట చేసుకుంటూ ఉంటుంది. త‌న కొమ‌రునికి పెళ్ళి చేయించి, అత‌నికి గ‌ర్భం ఫ‌లించి చేమ‌కూర ల‌క్ష్మ‌ణ‌మంత్రి అవ‌త‌రించినాడ‌ని తెలియ‌గానే ఆమె ప్రాణ‌ము త‌న‌కై ఎదురుచూసే పతిని క‌లుసుకుంటుంద‌ని తెలుసు. కురంగ‌న‌య‌న వేరే వంట చేసి త‌న సంతానానికి పెట్టుతూ ఉంటుంది. భ‌ర్త మ‌ర‌ణానంత‌రం ఆమె మూగ‌బోయింది.

కొల‌నిపుర మ‌ల్లిఖార్జున మంత్రి ల‌క్ష్మ‌ణ‌మంత్రి అల్లుడు. అల్లుడు అత్త‌గారినీ బావ‌మ‌రిది అన్న‌మ‌రాజునూ చూడ‌డానికి వేంగీపురంలో స‌త్రానికి వ‌చ్చినాడు. ల‌క్ష్మ‌ణ‌మంత్రి కొమ‌రిత భ్ర‌మ‌రాంబ భ‌ర్త‌క‌న్న ముందుగ‌నే స‌త్ర‌మున‌కు యిరువ‌ది మంది సేవ‌కుల‌తో, బోయీలూ మెస్తూ ఉండ‌గా బంగారు పూవుల శిబిక‌ముపై వ‌చ్చిన‌ది. తండ్రిపోయిన‌ప్పుడా బాల నిడుదప్రోలు వ‌చ్చిన‌ది. ఆ వెన‌క తల్లీ కూతుళ్ళు ఇదే చూసుకొన‌డం.

ఇద్ద‌రూ ఒక‌రిని చూచి ఒక‌రు దుఃఖించినారు. కొమ‌రిత తల్లిని చూచి, మా మామ‌గారికీ మీ అల్లుడుగారికీ అన్న‌య్య అంటే అవ‌హేళ‌న‌. అన్న‌య్య‌తో నువ్వు బ‌య‌లుదేరి వెళ్తున్నావంటే వారంద‌రికీ చాలా కోపం వ‌చ్చింది. ఎవ‌రి ధ‌ర్మం వారికి తోచ‌దు. ఎక్కిరంచే వారేగాని హృద‌యాల‌ను అర్ధం చేసుకొనేదెవ‌రు, అమ్మా ? అని దొన‌దొన క‌న్నీరు కార్చిన‌ది.

తల్లీ ! నువ్వేమీ బాధ‌ప‌డ‌కు. నాకు వీరు గౌర‌వం చేయ‌లేద‌నీ వారు గౌర‌వం చేయ‌లేద‌నీ, ఏవేవో అనుకుంటున్నార‌నీ నేనుకించ‌ప‌డ‌ను. ఎప్పుడూ నా జీవితం ఆ ప‌రామాత్ముని పాదాల ద‌గ్గ‌రే. నీ త‌మ్ముణ్ణి ఒక ఇంటివాణ్ఱి చేసి ఆ వెన‌క వారిని క‌లుసుకోవ‌డ‌మే ! నువ్వు మాత్రం మ‌న అన్న‌ద‌మ్ముల వాళ్ళ చుట్ట‌రికాలు, మీ మేన‌మామ‌ల విష‌య‌మూ మ‌రచిపోకు. నువ్వూ నీ భ‌ర్తా కులాసాగా ఉండ‌ట‌ము నాకు కావ‌ల‌సింది.

ప్ర‌స్తుత‌ము నీ మ‌నుమ‌రాలూ మ‌నుమ‌ళ్ళిద్ద‌రూ నాకు ఏడుగ‌డ‌ల‌య్యారు, అమ్మా !

నీ మొగం. నీ భ‌ర్త‌కు నువ్వంటే ఆపేక్ష‌. అత‌నికి అత‌ని మామ గారంటేనే కోపం. ఆ కోసం కొంత నీమీద ప్ర‌స‌రించిన మాల నిజం!

ఆ కోపం అంతా అన్న‌య్య‌మీదా ఉంది.

అన్న‌య్య‌కేమ‌మ్మా, రేపు చంద్ర‌గిరిలో ఆంధ్ర చ‌క్ర‌వ‌ర్తి ఆ స్థానంలో చేరితే, వీరంతా అన్న‌య్య‌కు చేసిన అవ‌మానానికి త‌లలు వంచుకొంటారు.

అక్క‌గారూ త‌మ్ముడూ మాట్లాడుకొన్నారు. త‌మ్ముడు ఆరువేల నియోగి బ్రాహ్మ‌ణుడైనా. అన్న‌తారు వేశ్యాకుల సంజాతుడైనా, ల‌క్ష్మ‌ణున‌కు శ్రీ‌రాముడ‌న్న ఎంత భ‌క్తి ఉందో అన్న‌మ‌రాజుకు వేంక‌ట‌ప‌తి అంటే అంత భ‌క్తి ఉంది. వేంగీపురంలో అన్న‌గారికి జ‌రిగిన ప‌రాభ‌వం త‌మ్ముని హృద‌యం మండించింది. ఆ ప‌రాభవంలో త‌న బావ‌గారూ ఆయ‌న తండ్రీ పాలు పుచ్చుకొన్నారు. ఆ కార‌ణంచేత అన్న‌మ‌రాజు కొల‌నిపురం వారి భ‌వ‌నాల‌కు వెళ్ళ‌లేదు.

అన్న‌గారిని తొంద‌ర‌పెట్టి అన్న‌మ‌రాజు తెల్ల‌వార‌గ‌ట్ల‌నే ప్ర‌యాణ‌మ‌న్నాడు. ఇప్పుడు అక్క‌గారువ‌స్తే స‌రిగా మాట్లాడున‌న్నాలేదు. అక్కా ! అన్న‌ను చేసిన ప‌రాభ‌వం తండ్రిని చేసిన‌ట్లే ! నీ హృద‌యం నాకు తెలుసును. అయినా నువ్వు కొల‌నిపురం వారి కోడ‌లివి. బావ‌గారిలో అర్ధ‌ప్రాణానివి. నాలోనూ నీలోనూ మ‌న‌కు తెలియ‌కుండా ఏమ‌న్నాలోట్లు ఉన్నాయేమో ! లేక‌పోతే అన్న‌కు ఎందుకు అలాంటి ప‌రాభ‌వం జ‌రుగుతుంది ? అని క్రోధ‌భూయిష్ట‌మైన ఎఱ్ఱ‌టి చూపుల‌తో చూచినాడు.

భ్ర‌మ‌రాంబ అత‌ని మోము చూచి, విచారంతో త‌ల‌వంచేసింది. త‌న క‌న్నా రెండు దినాలు మాత్రం పెద్ద అయిన వేంక‌ట‌ప‌తికి భ్ర‌మ‌రాంబ న‌మ‌స్క‌రించి, అన్నా ! ఆడ‌వాళ్ళ స్థితి ఈలాగే అవుతూ ఉంటుంది. త‌మ్ముడు ఎప్పుడో అప్పుడు అర్ధం చేసుకుంటాడు. అని అన్న‌ది.

వేంక‌ట‌ప‌తి న‌వ్వు తెచ్చుకొని, చెల్లీ ! నువ్వు నీ మ‌న‌స్సు నిర్మ‌లంగా ఉంచుకో. నేను ఈ కుడిచేత్తో గంట‌మూ ప‌ట్టినాను, క‌త్తీ ప‌ట్టినాను. ఈ విశాల భ‌ర‌త ఖండంలో భోజులు ఎప్పుడూ ఉంటారు, కృష్ణ‌దేవ‌రాయ‌ళ్ళూ ఉంటారు. కాని మేము ఎక్క‌డ వున్నా మా అంద‌రి ప్రేమామ‌ల‌య ప‌ర్వాతాల నుండి క‌ర్పూర ప‌రిమ‌ళావృత వాయువు ప్ర‌స‌రించిన‌ట్లు నీక‌డ‌కు వ‌స్తూనే ఉంటుంది. ఒక‌నాడు నిన్ను క‌లుసుకుంటాము. బావ‌గారికీ మామ‌గారికీ మా న‌మ‌స్కారాలు. బావ‌కు అమ్మ‌గారి ఆశీర్వాదాలు చెప్పు, అని స‌ముదాయించినాడు. భ్ర‌మ‌రాంబ వెళ్ళిపోయిన‌ది.