58
 

వేంక‌ట‌ప‌తి త‌మ్ముడు స్వామికి అంజ‌లి ఘ‌టించి,

ప‌ర‌మ పురుష ! సుంద‌ర‌మూర్తి ! పాహి పాహి !
ఏడుకొండ‌ల‌వాడ ! మ‌మ్మేలువాడ !
బీబినాంచారి హృద‌యేశ ! ప్రేమ‌దేవ !
కొండ‌మెట్ల దారి మ‌ము చేకొన్న‌సామి ! అని ఆవేశ‌పూరిత హృద‌యుడై ప్రార్ధించుకొన్నాడు.

వేంక‌ట‌ప‌తికి ఒడ‌లు తెల‌య‌దు. ఏదియె పుల‌క‌రింపు, ఉన్మ‌త్త‌త అత‌ని మూర్తి అంతా నిండిపోయింది. చైత‌న్య ర‌హితుడై చేతులు జోడించి ఆ భ‌క్తుడు అలానిలుచుండియినాడు. విశ్వ‌మంతా నీల‌మ‌య‌మై, అత‌డు మూర్తి ర‌హితుడై ఆ నీలంలో అణువై అత‌ని జ్ఞాన‌దృష్టికి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ నీల‌మంత కంత‌కు స్నిగ్థ‌త తాలిచి, తేజ‌స్సుగా మారి, ఆ తేజ‌స్సుబంగారు కాంతిగా జ్వ‌లిస్తూ తోచిన‌ది. ఆ కాంతి మ‌ధ్యంలో వేంక‌టేశ్వ‌ర బింబ‌ము ధ‌నుర్భాణాంచిత హ‌స్తధ్వ‌య నీల‌మేఘ శ్యామ‌సుంద‌ర‌మూర్తి రాఘ‌వ‌మూర్తియై ప్ర‌త్య‌క్ష‌మైనాడు. వేంక‌ట‌ప‌తి ఎవ‌రో త‌ట్టిన‌ట్లు ఉలిక్కిప‌డి లేచినాడు.

అత‌డు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయినాడు. అత‌నికి పూర్తిగా మెల‌కువ వ‌చ్చిన‌ది. ప్ర‌భూ ! ఏమిటీ మ‌హాభావం ? అని ప్ర‌శ్నించుకొన్నాడు. ఇంత‌లో మెరుములా తోచిందొక గంభీర‌మైన అర్థ‌ము తంజాపురి రాజ‌ధానిగా చోళ‌రాజ్యాన్ని శ్రీ అచ్యుత నాయ‌నింవారు రాజ్యం చేస్తున్నారు. వారి కొమ‌రుం యువ‌రాజులం వారు అయిన శ్రీ ర‌ఘునాథ నాయ‌నింవారు ఉద్దండ‌పండితులు, మ‌హాక‌వులు, వాగ్గేయ‌కారులు, పండితాశ్రితులు, క‌విలోక విభ‌వ దేవేంద్రులు, ర‌స‌జ్ఞ శ్రేష్టులు. చంద్ర‌గిరికి పోయే బ‌దులు తిరుప‌తి నుండి ద‌క్షిణాప‌ధ మహారాజ ప‌ధ‌ము ప‌ట్టితే, చోళ‌మండ‌ల‌ము చేర‌వచ్చును. త‌రువాత కుల‌దైవ‌ము వేంకటేశ్వ‌రుడే ఉన్నాడు.
ఈ ఆలోచ‌న మెరుములా త‌ట్ట‌గానే వేంక‌ట‌ప‌తిస్వామి ఎదుట స‌మాలింగిత భూతలుడై.

ప్ర‌భూ ! నీవు చూపిన దారి నాకు సుగ‌మ‌ము. నీవు తెలిపిన అర్ధ‌ము నాకు సుబోధ‌క‌ము. నీవు క‌నుపించిన ప‌విత్ర‌భూమి నా యాత్రాభిగ‌మ్య‌ము ! తండ్రీ ! నువ్వే ర‌ఘునాథునియందు నిలిచి ఉన్నావా ? అని ప్రార్ధించుకొన్నాడు.

త‌న‌కు భ‌గ‌వంతుడు క‌నుపించిన మార్గ‌ము వేంకట‌ప‌తి త‌ల్లుల‌తో, చెల్ల‌ళ్ళ‌తో, త‌మ్ముళ్ళ‌తో స‌మాలోచించినాడు. అంద‌రూ చాలా ఉత్త‌మంగా ఉంద‌న్నారు.

ఏడు దినాలు తిరుప‌తి కొండమీద‌నే భోగాల‌న్నీ చేయిస్తూ, శేషాచ‌లం మీద ఉన్న ఆకాశ‌ధార‌, గోగ‌ర్భ‌ము మొద‌లైన తీర్థాల‌న్నీ సేవిస్తూ ఉండి, ఎనిమిద‌వ దినాన కొండ‌నుండి దిగువ తిరుప‌తికి వ‌చ్చినారు. గోవింద‌రాజును అలివేలు మంగ‌మ్మ‌ను ఇత‌ర దైవాల‌ను అర్చిస్తూ, దిగువ తిరుప‌తిలో ప‌దిదినాలు ఉండి తిరుప‌తి నుండి అరుణాచ‌లం ప్ర‌యాణం అయ్యారు.

అరుణాచ‌లేశ్వ‌రుని పూజించి కంచి వ‌చ్చారు. కంచి ఏకామ్రేశ్వ‌రుని, కామాక్షిని, వ‌ర‌ద‌రాజ స్వామిని పూజించినారు. కంచిలో ప‌దిదినాలుండి ప‌రివార జ‌న‌మూ బ‌ళ్ళూ అక్క‌డే వ‌ద‌లి, అక్క‌డ నుండి ప‌క్షి తీర్ధం పోయి వ‌చ్చినారు.

కంచినుండి బ‌య‌లుదేరి ప్ర‌యాణాలు సాగిస్తూ, జింజిన‌గ‌రం వ‌చ్చినారు. జింజిన‌గ‌రంలో మూడు దినాలుండి ప్ర‌యాణాలు చేస్తూ, ద‌క్షిణ పెన్న‌దాటి, సాయంకాలానికి రాజ‌ప‌ధంతో ఉన్న గురువ‌య్యూరు చేరేందుకు ఇంకా ఒక క్రోశం దూరం ఉంద‌న‌గా పెద్ద గాలి దుమారం వ‌చ్చిన‌ట్లు ఒక పెద్ద సైన్యం చుట్టుముట్టింది.

వేంక‌ట‌ప‌తి కుటుంబ‌పు ఏనుగులు , గుఱ్ఱాలు, బ‌ళ్ళు అన్నీ న‌దినిదాటి క‌లిసే ప్ర‌యాణం చేస్తూ ఉన్న‌వి. వేంక‌ట‌ప‌తి అశ్వం మీద ప్ర‌యాణంచేస్తూ ఉండెను. అత‌డు క‌త్తి దూసి త‌న జ‌ట్టు ముంద‌ర‌కు ఉరికినాడు.
ఎవ‌రు మీరు ? అని గంభీర‌కంఠంతో అత‌డు కేక‌వేసినాడు.

ముష్క‌రులైన ఆ దండువాండ్లు పైశాచ‌పు మోముల‌తో నిలిచి ఉన్నారు. కొంద‌రు విండ్లు ఎక్కుపెట్టి ఉన్నారు. కొంద‌రు తుపాకులు తాల్చి ఉన్నారు. కొంద‌రు శూలాలు, భ‌ల్లాలు తాల్చి ఉన్నారు. కొంద‌రు క‌త్తులు దూసి ఉన్నారు. అప్పుడొక రాక్ష‌సుని వంటి క్రూరుడు నల్ల‌టి గుఱ్ఱంపైన స్వారి చేస్తూ వేంక‌ట‌ప‌తి క‌డ‌కువ‌చ్చి, నువ్వు ఎవ‌ర‌వో నాకు తెలుసును. నీకి సిబ్బంది ఈ వైభ‌వ‌ము అవ‌స‌రంలేదు. ఇదంతా మేము తీసుకొనిపోతాము. మీ ఆడ‌వాండ్లు ప్ర‌యాణం చేయ‌డానికి రెండు ఎద్దుల బండ్లు ఇస్తాము. చ‌ల్ల‌గా మీ దారిని పొండి. లేదా, మిమ్మ‌ల్నంద‌రినీ హ‌త‌మారుస్తాము. ఆడ‌వాళ్ళ‌ను తురుష్కుల‌కు బానిస‌లుగా అమ్ముతాము. నీకు ఒక్క విఘ‌టిక‌కాలం ఇచ్చినాము నిర్ణ‌యించుకో ! అని తెలిపినాడు. ఈ మాట‌లు దాపున‌బండిలో ఉన్న వేంక‌ట‌ప‌తి స‌వ‌తి త‌ల్లి సూర‌మాంబ‌కు విన‌బ‌డినాయి కాబోలు, నాయ‌నా ! వేంక‌ట‌ప‌తీ ! అన్నీ వారికి అప్ప‌గించు. మ‌న‌దారిన మ‌నం వెడ‌దాము. ఇది కూడా భ‌గవంతుని ప‌రీక్ష సుమా ! అని ప‌లికింది.