59
 

వేంక‌ట‌ప‌తి హృద‌యం క్రుంగిపోయింది. త‌న నిష్ప్ర‌యోజ‌క‌త్వానికి అత‌ని హృద‌యం విచ్చిన్న‌మైపోయింది. ఈ దినాల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ వేంక‌ట‌ప‌తిరాయ సార్వ‌భౌములు చంద్ర‌గిరిలో రాజ్యం చేస్తున్న‌ప్పుడు, జింజిలో, తంజ‌పురిలో సామంతులు ప‌రిపాల‌నం చేస్తున్న‌ప్పుడు, ఈ ప్ర‌దేశంలో దోపిడి దొంగ‌లేమిటి ! అని అత‌ని మ‌న‌స్సు విక‌ల‌మైపోయింది.

ఏ భ‌గ‌వంతుడు నన్ను గోదావ‌రీ తీరం నుండి కావేరీ తీరం వ‌ర‌కు తీసుకువ‌స్తున్నాడో ఆ భ‌గవంతుడే తీర‌ని ఈ అవ‌మానం తీర్చుకునే మార్గం చూప‌డా ? అనిన్నీ అనుకున్నాడు.

స‌రే ! మీ చిత్తం వ‌చ్చిన‌వి తీసుకోండి, అన్నాడు వేంక‌ట‌ప‌తి.

ఏనుగులు, గుఱ్ఱాలు, ర‌ధాలు, బండ్లు, పెట్టెలు, ఒంటిని ఉన్న న‌గ‌లు అన్నీ బందిపోటు దొంగ‌లు తీసుకున్నారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో, రెండు బ‌ళ్ళ‌తో మ‌నుష్యులు మిగిలినారు.

ప‌ట్ట‌రాని దుఃఖంతోనూ, ప‌ర‌మ‌భ‌క్తితోనూ క‌నులు మూసికొన్నాడు, వేంక‌ట‌ప‌తి. త‌న ఆరాధ్య‌దైవం సూర్య‌నారాయ‌ణ‌మూర్తి దివ్య‌రూపంలీల‌గా అంత‌ర్నేత్రానికి పొడ‌గ‌ట్టింది. చేతులు జోడించి,

ఓం,
ద్యేయ‌స్స‌దా స‌వితృమండ‌ల మ‌ధ్య‌వ‌ర్తీ
నారాయ‌ణ స్స‌ర‌సి జాన‌న స‌న్నివిష్టః
కేయూర వాన్మ‌క‌ర కుండ‌ల‌వాన్ కిరీటీ
హ‌రీ హిర‌ణ్మ‌య వ‌పుర్ధృత శంఖ చ‌క్రః అని ధ్యానించినాడు.

ఒడ‌లు భ‌క్తి పార‌వ‌శ్యంతో గ‌గుర్పొడిచింది. క‌న్నులు విప్పిచూడ‌గా దొంగ‌ల గుంపు వెళ్ళిపోతూ క‌నిపించింది. త‌న తండ్రి తాత‌లు క‌ష్ట‌ప‌డి కూడాపెట్టిన సిరికి కాళ్ళువ‌చ్చి ప‌రుగున వెళ్ళిపోతోంది. క‌నుల‌కు దుమ్ముత‌ప్ప మ‌రేమీ గోచ‌రించ‌డం లేదు. ఇంతో ఏనుగు ఘీంకారం వినిపించింది. అది ఇంద్ర‌ద్యుమ్నుడు చేసే ఆర్త‌నాద‌మే ! సందేహంలేదు. నాలుగ‌డుగులు ముందుకుపోయి చూశాడు, వేంక‌ట‌ప‌తి, త‌న తండ్రి ల‌క్ష్మ‌యామాత్యుల‌కు ప్ర‌భువులు కాన్క‌చేసిన ఇంద్ర‌ద్యుమ్న మ‌హాగ‌జ‌ము వెనుక‌కు తిరిగి రాబోతోంది. ఉస్సురంటూ, నిట్టూర్పులు విడుస్తూ పొగ‌రుగా గిర‌గిర తిరుగుతూ, ముందుకుపోన‌ని మారాము చేస్తున్న‌ది.

ఆ నల్ల‌టివాడు, నాయ‌కుడు, త‌న చేతిలో ఉన్న ఖ‌డ్గంలో చిన్న చిన్న గాయాలు చేసి దానిని ఉర‌క‌లెత్తించ‌డానికి హింస పెడుతున్నాడు.

ఈ దృశ్య‌ము వేంక‌ట‌ప‌తి నీరు నిండిన క‌నుల‌కు మ‌స‌క‌గా క‌నుపించింది.

ఇంద్రుడంటే తండ్రిగారికెంత ప్రీతి ! క‌న్న‌కొడుకులైన త‌మ‌కు వారి హృద‌యంలో ఇంద్రుడి త‌రువాతి స్థాన‌మే ! ఆ దుష్టుడు త‌న తండ్రినే శూల‌ము పెట్టి బాధిస్తున్న‌ట్లుగా తోచిందాత‌నికి.

త‌న‌ను తాను చూచుకొన్నాడు. ఒర‌లో ఖ‌డ్గ‌ము, మూపున‌ధ‌నుర్బాణ‌ములు. ఎందుక‌వి ? క‌ట్టెలు కొట్టుకోడానికా ? పిట్ట‌ల‌ను కొట్ట‌డానికా ? ఇలా పిరికి పంద‌వ‌లె, శౌర్య‌హీనున‌వ‌లె ప్ర‌వ‌ర్తించినాడేమిటి ? ఆ ర‌క్క‌సుడేదైనా మంత్రంతో త‌న‌ను క‌ద‌ల‌కుండ క‌ట్టివేసినాడా ?

ఒరే, నీచుడా ! ఒక్క‌క్ష‌ణం ఆగు. నా భుజ‌శౌర్యాన్ని రుచి చూతువుగాని ! అంటూ మెరుము వేగ‌మున ఆ దండును వెంబ‌డించాడు, వేంక‌ట‌ప‌తి.

అబ్బాయీ, వెళ్ళ‌కు, వాళ్ళు మ‌హాక్రూరులు. ర‌క్త‌పాతానికి కూడ వెర‌వ‌ని హీనులు. వెళ్ళ‌కు ! ప్రాణాల‌తో ఉంటే ఇంత‌కు ప‌దింత‌లు సంసాదించుకొంటాము అని త‌ల్లులు చేసే ఆక్రంద‌న‌లాత‌ని చెవి సోక‌లేదు.

అన్న‌య్యా ! ఆగు నీతీ నేను వ‌స్తున్నాను అంటూ అన్న‌మ‌రాజు త‌న‌వెంటరావ‌డాన్ని అత‌డు గ‌మ‌నించ‌లేదు. క్ష‌ణాల‌లో దొంగ‌ల నాయ‌కుని ముందు నిలిచినాడు, వేంక‌ట‌ప‌తి.