90
 

తండ్రి మాట‌ల‌కు చెంచుల‌క్ష్మి మోము ప్ర‌పుల్ల‌మైన ప‌ద్మంలాగ క‌ళ‌క‌ళ‌లాడిపోయిన‌ది. ప్ర‌భువు ఆనాటి చూపుల‌లోని భావాల‌కు భాష్యం చెప్ప‌డానికామె మ‌న‌స్సు త‌హ‌త‌హ‌లాడిపోతున్న‌ది. ప్ర‌ధ‌మంగా తాను ర‌ధం దిగుతున్న‌ప్పుడా నాయ‌కుని వెడ‌ద క‌న్నుల వెలుగు చూపులూ, తాను ద‌గ్గ‌ర‌గా వెళ్ళినప్పుడాత‌ని చిరువ్వుల చికిలి చూపులూ, విందుభోజ‌న‌ము స‌మ‌యాన కొస‌రి. తినుమ‌ని చెప్ప‌డమేగాక‌, ఎవ్వ‌రు చూడ‌కుండ త‌న‌మోముపై గోటితో పన్నీరు చిలికిన‌ప్ప‌టికి చిలిపి చూపులు, ఎడ‌తెగ‌కుండ ఆమె మ‌నోవీధిలో ప‌రిభ్ర‌మించుచునే ఉన్న‌ది.

పార‌మెరుగ‌ని మ‌ధురోహా స్ర‌వంతిలో కొట్టుకొని పోవుచున్న శుక‌వాణి హృదిలో హ‌ఠాత్తుగ నొక భ‌యంక‌ర‌మైన భావ‌మున‌కు బీజారోవ‌ణ‌ము జ‌రిగిన‌ది.

త‌ర‌తరాలుగా స్త్రీ సౌందర్య‌మే స్త్రీకి ప్ర‌ధ‌మ శ‌త్రువై జీవితాన్ని దుఃఖ‌భూయిష్టంగా మ‌రుస్తూఉన్న‌ది.

ఆ రేయి శుకవాణి నిద్రాదేవి ద‌య‌కు పాత్రురాలు కాలేక‌పోయిన‌ది. తాను త‌ల్లిదండ్రుల‌ను విడిచి ఇందిరా మందిరాతర్భ‌వంతిలో నివ‌సించ‌డానికి సంసిధ్దురాలు కాలేక‌పోతూన్న‌ది. ఒక చెంప పార‌మెరుగ‌ని ఆనందం, వేరొక చెంప ఏదో అంతుచిక్క‌ని అనుమానం !...ర‌ఘునాథ ప్ర‌భువులు శుద్ధ శీలుర‌ని లోక‌మంతా ఒక్క‌టేమాట‌...త‌న‌కీ భ‌య‌మెందుకు ?....దుష్యంతుడు దుశ్శీలుడా ?... శ‌కుంత‌ల వ‌లె తాను కూడ స‌మ‌స్య‌ల‌లో చిక్కుకొని దుఃఖించ‌వ‌ల‌సి రాదుకాదా?...స‌మ‌స్యే వ‌చ్చే అవ‌కాశ‌మే లేకుండ ఆదిలోనే చేసుకొన‌డం మంచిది కాదా ?... గురుదేవులు త‌మ వివాహ‌మున‌కు కొంత వ్య‌వ‌ధి కావ‌లెనన్నారు. ఎంత వ్య‌వ‌ధియో ? ఆ సుమూహుర్త మాస‌న్న‌మ‌య్యే దెన్న‌డో ?

స‌మ‌స్త జీవ‌కోటినీ జాగృతం చేయ‌డానికి చెంగావి రంగుచీర క‌ట్టుకొని యేతెంచిన‌ది, ఉషోదేవి. ఆమె తాంబూల‌రాగ రంజితా ధ‌రాల‌తో చిరున‌వ్వుల‌ను చిందిస్తూ ముగ్ధ‌మోహ‌నంగా విల‌స‌ద్వీ క్ష‌ణాల‌ను రంగ‌రించుకొన్న ఉద‌య సంధ్యా నాట్య భంగిమ‌ల‌ను విశ్వంభ‌ర ఒళ్ళంతా క‌ళ్ళు చేసుకొని చూస్తున్న‌ది. త‌టాకాల‌లో కెందామ‌రలు అర‌క‌న్నులు విప్పి చూడ సిద్ధ‌ప‌డుతున్న‌వి. గోకోష్ఠాల‌లో చిన్ని చిన్ని తువ్వాయిలు త‌ల్లుల ద‌గ్గ‌ర‌చేరి గారాలుపోతూ గంతులు వేస్తున్న‌వి. స్వ‌ర్ణ క‌ల‌శాల‌లోకి జారే గోక్షీర‌ధార‌లు, చివ్వు జువ్వుమ‌ని వింత వింత ల‌య‌ధ్వానాలు నిన‌దిస్తున్నాయి.

మాన‌వుల‌కేగాక ప‌శుప‌క్ష్యాదుల‌కు స‌హిత‌ము దినారంభ స‌మ‌య‌శుభ క్ష‌ణాన మ‌న‌స్సు ఉల్లాస త‌రంగాల‌లో తేలియాడ‌క త‌ప్పదు !

మ‌హారాజున‌కు బావ‌మ‌ర‌దులు యువ‌రాజున‌కు ముఖ్యాంగ ర‌క్ష‌కులు అయిన మూర్తెప్ప‌నాయ‌నిం వారి భ‌వ‌న‌ము ముంగిట మూడు గుఱ్ఱాల‌ను పూన్చిన ముచ్చ‌టైన ర‌ధ‌ము నిల‌చియున్న‌ది. అంత‌కు అరఘ‌డియ ముందు నుండి ఆ యింట‌నేదో ఘ‌ర్ష‌ఱ‌ము, ముఖ్య విష‌య‌మును గురించి చ‌ర్చ జ‌రుగుచున్న‌ట్లున్న‌దీ, దీప‌క‌రాళి క‌ల‌న్నియు ధ‌గ‌ద్ధ‌యామాన‌ముగా వెలుగుచున్న‌వి.

మూర్తెప్ప : త‌ల్లీ ! ఇంటిముంగిట ర‌ధం సిద్ధంగా ఉండి. నీ నిర్ణ‌యాన్ని మార్చుకొని చ‌క్క‌గా అంతః పురానికి బ‌య‌లుదేరు. స‌ర్వ‌శుభాల‌నూ పొందుతావు.

శుక‌వాణి : నాన్న‌గారూ, క్ష‌మించండి ! విద్యాభ్యాసం కొఱ‌కు నేను పాల‌కుల భ‌వ‌ల‌నానికి వెళ్ళ‌డానికి సిద్ధ‌ప‌డ‌లేను.

అలాగంటే ఏలాగూ తల్లీ ! యువ‌రాజుల‌ను మ‌న గృహానికే వ‌చ్చి విద్య నేర్ప‌మంటే ఏమి యుక్తంగా ఉంటుందో యోచించు.

నాన్నాగారూ ! ర‌ఘునాథుల‌కు మీరు ప‌రాయివారు కారుక‌దా ! స్వ‌యానా మేన‌మామ‌లు. శ్రీ‌వారు కొండ‌ల‌వెంట కోన‌ల‌వెంట వెళ్ళి, అడ‌వుల్లో తిరిగి కిరాతుల‌నూ చెంచుల‌నూ ప‌రిగెల‌నూ పిచ్చుకుంట్ల వారినీ ప‌రామ‌ర్శించి రెండు ఝూముల‌కు అంతఃపురాన‌కు వేంచేస్తూ ఉంటార‌ని మీరే చెబుతూంటారు గాదా ! మ‌న ఇంటికి రావాడానికి వారికి అభ్యంతరం ఉండ‌ద‌నే నేను భావిస్తున్నాను.

అలా సంచారం చేయ‌డం కూడా వారి రాచ‌కార్యాల‌లో ఒక భాగం. కేవ‌లం సింహాస‌నం మీద కూర్చొని వైభ‌వోపేతంగా దినాల‌ను వెళ్ళ‌బుచ్చ‌డ‌మే ధ్యేయ‌మ‌న్న‌ట్లుగా మెల‌గే ప్ర‌భువు కాడు, ర‌ఘ‌నాథుడు. వినోదాల‌లో తేలియ‌డుతూ సామాన్య జ‌నావ‌స‌రాల‌ను విస్మ‌రించే ధ‌రాఙ‌నాడున్నూకాడు. ప్ర‌జ‌ల‌తో క‌ల‌సిమెల‌సి సంచ‌రించి వారి సాధ‌క బాధ‌కాల‌ను తెలిసికొని స‌మ‌యానుకూలంగా ప్ర‌వ‌ర్తించే ఆద‌ర్శ ప్ర‌భువువ ! అంతేగాని చ‌దువు చెప్పెందుకు ఇంటింటికీ వ‌చ్చే ఉపాధ్యాయుడు కాడమ్మా !