91
 

మీకు కోపం వ‌చ్చింది అయినా నన్ను నేను ఒప్పించుకోలేకుండా ఉన్నాను. యువ‌రాజులు ఏ ప‌దిదినాల‌కో ఒక్క‌సారి వ‌స్తూంటారు కదా, నేను అక్క‌డ ఈ మ‌ధ్య‌కాలాన్ని ఎలా గ‌డ‌పాలి, నాన్న‌గారూ ? ఇటు, అమ్మ‌నీ మిమ్మ‌ల్నీ చూడ‌కుండా ఎలా నిల‌వాలి ?

పిచ్చిత‌ల్లి ! అదా నీ భ‌యం ! అక్క‌డ నీకు కాలం ఎంత‌వేగంగా గ‌డ‌చిపోతుందో నువ్వే చూస్తావుగా ! నీ విద్యావ్యాసంగంలో మునిగిపోయి మ‌మ్ముల‌ను కూడా మ‌ర‌చిపోతావ‌ని చెప్ప‌గ‌ల‌ను. నా మాట‌విని త్వ‌ర‌గా బ‌య‌లుదేరు, తల్లీ ! యువ‌రాజులు నిర్ణ‌యించిన ముహూర్తానికే నువ్వ‌క్క‌డ ఉండాల‌ని ప్ర‌భువులఆకాంక్ష‌. ఇప్ప‌టికే బాగా ఆల‌స్యం అయింది. నీవు వెళ్ళ‌క‌పోతే అది రాజాజ్ఞ‌ను ధిక్క‌రించిన‌ట్లే క‌దా !

రాజాజ్ఞా ! ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించిన‌ది, శుక‌వాణి. ఒక యువ‌తిని విద్య గ‌రుపుతాము రమ్మ‌ని పిల‌వ‌డ‌ము రాజాజ్ఞ ఎలా అవుతుంది, నాన్న‌గారూ ? ఇదేమి ఆజ్ఞండీ !!

రాజ‌కీయాల‌ను ధ‌ర్మ సూక్ష్మాల‌నూ త‌రువాత చ‌ర్చించుకోవ‌చ్చును గాని ముందు ర‌ధ‌మారోహించు, త‌ల్లీ ! ఇప్ప‌టికే ర‌ఘునాథులు ఆర‌ఘ‌డియ నుండి శీత‌ల వాయువుల‌ను పీలుస్తూ అంత‌ర ప్రాకార‌ముక‌డ వేచివుండే ఉంటారు.

శుక‌వాణి అస‌మ్మ‌తిని త‌న దీర్ఘ న‌య‌నాల‌తో తెలిపిన‌ది.

మూర్తెప్ప నాయ‌కులు కొమ‌రిత త‌న మాట‌ల‌ను వ్య‌తిరేకించ‌డాన్ని భ‌రించ‌లేక‌పోయినారు. చెంచుల‌క్ష్మి ఇంత మొండిగా ప్ర‌వ‌ర్తించ‌డం ఆయ‌న ఇంత‌కు ముందు ఎరుగ‌రు. ఆమె ఎంత సుశీల ! ఎంత‌టి విన‌య విధేయ‌త‌లు క‌ల‌ది ! మూర్తెప్ప నాయ‌నింవారుగాని మ‌ర‌క‌త‌వ‌ల్లి గాని ఆడిన మాట‌కాబాల మున్నెన్న‌డూ ఇలా కాద‌న‌లేదు.

మ‌ర‌క‌త‌వ‌ల్లి మ‌ధుర‌ముగా న‌వ్విన‌ది. ప్ర‌భువువారు కూమ‌ర్తె గీచిన గీటును ఎన్న‌డైనా దాటినారా ? చెంచుల‌క్ష్మి ఆడిన‌ది ఆట పాడిన‌ది పాట‌గా చెల్లించినారు. నేడు చిట్టిత‌ల్లి రాచ‌న‌గ‌రుకు వెళ్ళ‌న‌ని ప‌ట్టుబ‌ట్టినందుకు బాధ‌ప‌డతారేమి ? అన్న‌ది.

మూర్తెప్ప నాయ‌నింవారు గాఢంగా నిట్టూర్చినారు. అమ్మ‌ణ్ణీ వెళ్ళ నిరాక‌రించి నందుకు కాదు నా బాధ‌. కూమార ప్ర‌భువు చెంచుత‌ల్లికి ఆ ఇందిరా మందిరాన విద్య బోధించాల‌ని కుతూహ‌ల ప‌డుతున్నాడు. ఇప్పుడీ ర‌ధాన్ని ఎలా త్రిప్పి పంపేది ? అన్నారు. నిద్ర‌లేక అల‌స‌ట చెంది ఉన్న కొమ‌రిత మోమును చూచి, నీవు ప్ర‌భువు వారి ద‌గ్గ‌ర విద్య నేర్చుకోవాల‌ని ఉవ్విళ్ళూరిన‌ది నాకు తెలియ‌నది కాదు. నేడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నా వెందుచేత కన్న తల్లీ ? అని ప్ర‌శ్నించినారు.

శుక‌వాణి, నాన్న‌గారూ ! నాన్న‌గారూ ! నాకు భ‌యంగా ఉందండీ ! ప్ర‌భువుని గురించి నేను నిజంగా దురూహ చేసానేమో ! మ‌ర‌లా ఆలోచించుకుంటానండీ. నేటికి ర‌ధాన్ని పంపివేయ‌రూ ? అన్న‌ది, రుద్ద‌కంఠంతో.

కుమార్తె స‌జ‌ల పూరిత న‌య‌నాల‌లోనికి క‌నులార్ప‌కుండా చూచి, అమ్మా ! నీకంగీకార‌మైతేనే వెడుదువుగాని. నిన్ను బ‌ల‌వంత‌పెట్టి పంప‌ను, త‌ల్లీ, వెళ్ళి విశ్రాంతి తీసుకో, అంటూ మూర్తెప్ప నాయ‌కులు నిష్క్ర‌మించినారు.

శుక‌వాణిని గొనిరాకుండా వ‌చ్చిన శూన్య‌ర‌ధాన్ని చూచిన ర‌ఘునాథ యువ‌ప్ర‌భువుల మ‌న‌స్సు, ఏదో తెలియ‌ని ఆవేద‌న చెందింది. నాటి అత్య‌వ‌స‌ర స‌మావేశాన త‌న తీక్ష‌ణ‌మైన మేధ‌స్సు ప్ర‌స‌రింప చేయ‌లేక‌పోయినాడు. పోర్చుగీసు వారితో చేతులు క‌లిపి చోళ‌గుడు గావించే దుష్ట‌కార్యాల‌నెన్నింటినో వేగులు తెచ్చిన వార్త‌ల‌నూ ముందుంచినారు, గోవిందామాత్యులు. ఆ భూర్జ‌ప‌త్రాల‌న్నిటిని అల‌వోక‌గా ప‌రికించి ప్ర‌క్క‌నుంచినారు, యువ‌ప్రభువులు. గోవిందుల‌వారి క‌నుస‌న్న‌తో అంద‌రూ లేచి స‌భాప్రాంగ‌ణాన్ని విడిచి వెళ్ళినారు. ర‌ఘునాథులు అంత‌ర మందిరాన‌కు వెళ్ళ‌గా గోవిందులు అనుస‌రించినారు.
గురుదేవా ! నిన్నటి ఉద‌యాన ముహూర్త‌మెట్లున్న‌దో చూడండి.

దేవికీ, తండ్రీ ! ఈ మూహూర్తాలు అన్ని విష‌యాల‌కూ ఒకేరీతిగా గ‌ణించ‌డం కూడ‌దుకదా !

గోవిందుల‌వారి క‌న్నులు ర‌ఘునాథుల హృద‌యాన్ని శోధిస్తున్న‌ట్లుగా దూసుకొని పోతున్న‌వి. ర‌ఘునాథులు త‌ల‌వంచుకొనినారు.

బాబ‌య్య‌గారూ ! మీకు ముందుగా తెలియ‌జేయ‌కుండా శుక‌వాణీ దేవిని ఇందిరా మందిరాన విద్యాభ్యాసం కొర‌కు ఆహ్వానించి మూహూర్త నిర్ణ‌య‌ము చేసి అర‌ధాన్ని అంపించినాను.

అదా తండ్రి, నీ ఈ వేద‌న‌కు కార‌ణ‌ము ! గోవింద‌మంత్రులు వారి హృద‌తేలిక‌ప‌డిన‌ది. చిరున‌వ్వుతో శుక‌వాణీనీ ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన‌ది క‌దూ ? ఆ బాలిక‌ ఒక్కో స‌మ‌యాన ప‌ర‌మ స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఒక్కో స‌మ‌యాన ప‌ర‌మ విధేయురాలుగానూ ఉంటుంది. నీవు పెట్టిన ముహూర్తంలో ఎట్టి దోష‌మూ లేదు. కార్య‌సాఫ‌ల్యం కాక‌పోవ‌డం చేత నీకు ఉత్సాహం త‌గ్గిపోయింది. మ‌రొక్క‌సారి ప్ర‌య‌త్నించు, రాఘ‌వా ! అన్నారు.