94
 

ఒక సైనికుడు : దౌవారికా ! మూర్తెప్ప నాయ‌నింవారి కొమ‌రిత‌కు యువ‌రాజులు వార్త‌నంపినారు. ఆ వార్త నామెకంద‌జేయ‌వ‌లెను. మ‌మ్ము లోనికి పోనిమ్ము.

దౌవారికుడు : మీర‌క్క‌డ‌నే నిల‌వండి. అమ్మాయిగారి అనుజ్ఞ తీసికొని మిమ్ముల‌ను లోనికి తీసికొని పోతాను.

ఎవ‌రిదా గంభీర కంఠ‌ద్వ‌ని ? విన్న‌ట్లున్న‌దే ! శుక‌వాణీ గుండెచిన్న‌గా వ‌ణికిన‌ది. ఆమె కొంత ప్ర‌క్క‌కువ‌చ్చి చూచిన‌ది. ఎదురుగా ద్వార‌ముక‌డ ఇద్ద‌రు సైనికులు. అందులో ఒక‌నిమీద ఆమె దృష్టి నిల‌చిన‌ది. ఆమె భృకుటి ముడిప‌డిన‌ది. అంత‌రాంత‌రాల‌లో త్వ‌రిత‌మైన సంచ‌ల‌న‌ము క‌లిగిన‌ది. ఒక నిమేష‌మున కామె కేదియె స్ఫురించిన‌ది. నిశ్చేష్ఠ‌యైన‌ది. ఉచ్ఛ్వాస నిశ్వాప‌ముల‌ను స‌హిత‌ము మ‌రచి ఆ ఆగంతుల‌పె చూపు నిలిపిన‌ది.

దౌవారికూడామెను చూడ‌క లోనికి పోయినాడు. ఆమె లేడివ‌లె మ‌ధ్య భ‌వంతిలోనికి ప‌రుగిడి, వారిని తీసికొని ర‌మ్ము అని దౌవారికునాదేశించిన‌ది. ఆమెలో సంతోష‌ము, ఆనంద‌ము క‌లిసి హృద‌యాన ప‌ర‌వ‌శ నాట్యం చేయుచున్న‌వి. గ‌త కొల‌దినాళ్ళుగా, రాజు మందిరాన‌కు పోవ నిరాక‌రించి నందుల‌కుగాను వ్య‌ధాపూరిత‌మైన మ‌న‌స్సు, ప‌రిప‌రి విధాల వేద‌న చెందిన మ‌న‌స్సు నేటి వారి రాక‌తో పూవువ‌లె తేలిక‌యై స్వ‌చ్ఛ పారిజాతంలా మంద‌హాస ప‌రీమ‌ళాల‌ను గుభాశింప జేస్తూన్న‌ది.

శుక‌వాణి ఒక సైనికుని రాక‌ను గ‌వాక్ష‌ము నుండి పరీక్ష‌గా గ‌మ‌నించు చుండెను. ఆ గంభీర‌మూర్తి, ఆ ధీరోదాత్త నాయ‌క‌మ‌ణి, ఆజానుబాహుడు, పురుష పుంగ‌వుడు వసంత‌మూర్తిలా, మ‌న్మ‌ధ‌కుమారునిలా, జ‌యంత ద‌వునిలా, రాజ కిశోరంలా న‌డ‌చివ‌స్తూ ఉన్నాడు. ఆమె ఊపిరి రెప్ప‌మూసి తెరిచినంత సేపు ఆగిపోయిన‌ది. త‌న‌ హృద‌యాన్ని దొంగిలించిన ఆ పురుషుడు మారువేషాన త‌న గృహాన‌కు వేంచేస్తూ ఉన్నాడు...స‌త్క‌రించ‌వ‌ల‌యును !....భ‌క్తిగా పూజించ‌వ‌ల‌యును ! అంత‌రాన విరిసిన అర‌వింద కుసుమాన్ని ఆ పాదాల‌చెంత నైవేద్య మిడ‌వ‌ల‌యును. అర్ఘ్యం, పాద్యం, హార‌తి ! ఏ రాజోప‌చారాలు, షోడ‌శోప‌చారాలు చేయాలో అవి అన్నీ ఆమె మ‌న‌సు గుండెల‌లో గిర‌గిర తిరుగుచున్న‌వి.

శుక‌వాణిలో కొంటె కోరిక ఒక‌టి, క్ష‌ణంలో ప‌ద‌హార‌వ వంతు స‌మ‌యంలో త‌ల‌యెత్తిన‌ది. ఒక మ‌ధురోహ క‌ద‌లాడిన‌ది. హ‌రిణ బాల‌యైలోనికి రివ్వున దూసుకోయిన‌ది. బంగ‌రు ప‌ళ్లెరాన ప‌న్నీరు పునుగు జ‌వ్వాది ప‌రిమ‌ళ ద్ర‌వ్యాలు ప‌ట్టుకొని వ‌చ్చిన‌ది. అంత‌వ‌ర‌కు ఎక్క‌డ దాగి ఉన్నారో ఆమె స‌ఖులు తూనీగ‌ల‌వ‌లె అతివేగంగా వ‌చ్చినారు. ఒక క‌న్య వీణ ముంగిట కూర్చున్న‌ది. ఒక మృగ‌న‌య‌న మృదంగ‌ము మ్రోయించ సంసిద్ధ‌యైన‌ది. ఒక ర‌మామ‌ణి రావ‌ణ హ‌స్త‌ము పూనిన‌ది. ఒక నీల‌వేణి వేణువు స‌వ‌రించిన‌ది. కొంద‌రు మంద‌యాన‌లు చేతులు త్రిప్పుచు అభిన‌య‌ము తోడ శుక‌వాణి పాట‌కు వంత‌పాడుతున్నారు. ఏ రాగ‌ము నాల‌పించ‌వ‌లెనో ఆమె ముందుగ స‌ఖియ‌ల‌కు బోధించిన‌దా అన్న‌ట్లు అంద‌రూ ఒక్క గొంతుతో బంగారు రాగ‌ధార‌ల‌ను సృష్టిస్తూ ఉన్నారు.

శుక‌వాణి పాట పాడుతూనే ఆ ఆగంత‌కుని రెండు చేతులు పుచ్చుకొని తీసికొనిపోయి మెత్త‌ని దిండ్లున్న మెర‌పుల మంచంపై కూర్చుండ జేసిన‌ది. అత‌డు తెల్ల‌బోయి, అవాక్కయి వారి ఆగ‌డ‌ముల‌ను చూచుచు ఏమి చేయ‌వ‌లెనో తోచ‌క బొమ్మ‌లా కూర్చుండిపోయినాడు.

ఆమె పాటో అంత‌కంత‌కు హాస్వ‌రస‌ము ఎక్కుక‌వ‌య్యింది.....

కోతి బావాగారు కులుకుతూ వ‌చ్చారు
కొమ్మ‌లంతా రారె సేవ‌చేతాము. || కో ||

వేప పూలు తెచ్చి గుచ్చిమెడ‌లోవేసి
దుర‌ద‌గుండాకుతో దులిపి పోకె || కో ||

అత్త‌రూ ప‌న్నీరు జ‌వ్వాది క‌స్తూరి
చ‌లువ‌గంధ‌ము తెచ్చి మెత్తిపోరే || కో ||