2. జగన్మోహనరావు :-
ఈ నవలలోని పురుషపాత్రలలో విచిత్ర మనస్తత్వం కలవాడు జగన్మోహనరావు. ఇతడు విలన్. అంటే యుక్తియుక్తంగా ఉంటుంది. జమీందారుబిడ్డ .జమీందారు ప్రసాదరావుగారి మేనల్లుడు. ఈర్ష్యా ద్వేషాలు, సంకుత భావాలు, తుచ్ఛకామ వాంఛలు, విలయ తాడవం చేయగా జీవితాన్ని నాశనం చేసుకున్న కాముకుడు. విద్యావంతుడైనా వ్యక్తుల విలువలు గుర్తింపలేని కుసంస్కారి తన హృదయాన్ని ఆకర్షించిన సుందరీ మణులందరినీ తాను అనుభవించాలి అనే భోగైక లోలుడు, దుర్బల హృదయుడు, అన్య కాంతను వివాహమాడినా, పరకాంతా వ్యామోహంతో వివాహమైన తన మేనమామ కూతురు శారదనే చేపట్ట జూచి, చెంప పెట్టులు తిన్న కుత్సిత హృదయుడు. ఆదాయానికి మించిన ఖర్చులకు అలవాటుపడి యూరేషియా సుందరీమణులజోడి విందులకూ, వినోదాలకు, విలాసాలకు, అమితంగాధనవ్యయం చేసి అప్పులపాలై, చివరికి వెత చెందిన నీతి నియమ బాహ్యజీవి, ఆధునికమైన ఆంగ్ల విద్యా ప్రభావంచేత సంస్కార విదూరులై నవ్య నాగరికతా స్రవంతిలో మునిగి, జీవితాలు పాడుచేసుకున్న అభాగ్యులకు ప్రతీకగా ఈ పాత్రను రచయిత తీర్చినట్లు స్పష్టపడుతున్నది.
3. శారదా దేవి :-
ఇందలి స్త్రీ పాత్రలలో ప్రధానమైనది శారదాదేవి. కృతహస్తుడైన ఈ రచయిత ఈ పాత్రను కడుజాగరూకతతో శాత్వత చైతన్య మూర్తిగా చిత్రించారు. జమీందారు ప్రసాదరావు గారి ద్వితీయ పుత్రిక ఈమె పేరుకు తగ్గట్లు ఈమె విమల విద్యావితయే కాక, అమల గాంధర్వ విద్యనుకూడ అలవరుచుకున్న రాగమయి. సౌందర్యాతిశయం చేత సుకుమార జీవన విధానం చేత, కోమల స్వభావం చేతనూ, అందరికన్న మిన్న అనిపించుకున్న భాగ్యజీవి తల్లిదండ్రుల అతిశయ వాత్సల్యంచేత జమీందారీ కుటుంబంలో నాలుగు గోడల మధ్య స్వాతిశయాన్ని పెంచుకున్న అవివేకి. అదృష్ట బలంచేత, తండ్రి ప్రయత్నం కలిసిరాగా సకల సద్గుణ సంపన్న మాన్యమూర్తియగు నారాయణరావును పతిగా పొందగల్గినది. తల్లి యొక్క దురహంకార పూరిత దుర్భోదలవల్ల, తన బావయైన జగన్మోహనుని కపటనాటక దుష్ప్రభావము వలనను తొలిదశలో ఉత్తమోత్తముడైన తన పతికి అనురాగ మధువును పంచి యివ్వేలక పోయినా, చివరికి, వివేక సంపన్నురాలై తన పతి యొక్క సర్వతో ము్ సామర్థాన్ని గుర్తించి తన హృదయాన్ని ఆ సరసునకు అర్పించి, ఆ అపర మన్మధుని ఒడిలో ఒదిగి, పరవశించి, ఆత్మ ప్రణయ తరంగిణిని ఆత్మ నాధుని పాదసన్నిధిని జాలువార్చిన సుందర ప్రణయిని ఈమె.
4. పుష్పశీల :-
ఇందలి స్త్రీ పాత్రలలో విచిత్ర మనస్తత్వంగల పాత్ర పుష్పశీల. తన సహజ సజీవ రూప చిత్రణాత్మక ప్రతిభతో బాపిరాజుగారు కడు విచిత్ర వాతావరణంలో సృజించిన పాత్రగా యిది కనిపిస్తుంది. ఈమె అందాలరాణి. వన్నె చిన్నెలు నేర్చిన జాణలలో మేల్భంతి. కృతక ప్రణయాన్ని ప్రదర్శించే కుహనా శీలవతి. మేడిపండులా పైపైకి మిసమిసలాడు దేహకాంతితో సౌందర్యరాశిగా కానవచ్చినా, అంతరాంతరాలలో అపార కామ వాంఛలు యిముడ్చుకున్న కాముకురాలు. లైంగిక సుఖాలకోసం పరపురుష సంపర్కాలను ఆశించిన కపట ప్రణయిని. పేరునకు తగ్గట్లు నిజంగా పుష్పములాంటి శీలము కలది. వికసించిన పుష్పం మధువు నింపుకొని, ఆస్వాదింపమన్నట్లు ఎన్ని తుమ్మెదలనైనా ఆకర్షిస్తుంది. సరిగా అట్టి చపల స్వభావముకల సుశైకలోలుప హృదయ ఈమె. అగ్ని సాక్షిగా చేపట్టిన పతి లాయర్ సుబయ్య శాస్త్రితో - కామ సుఖపరమైన తృప్తిని పొందలేక, సుందర యువకుడగు రాజేశ్వరరావుతో కొంత కాలము సుఖించి, దశాంతరములో ఒక మహమ్మదీయ యువకుని జేరి కేవలము కామోప బోగాలకై తన అమూల్య శరీరాన్ని అమ్ముకొన్న మలిన హృదయ. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని పెద్దన అన్నట్లు అడుగడుగున చిత్త చాంచల్యాలు ప్రదర్శించి, జీవిత పరమార్ధాన్ని గుర్తించలేక, కాలు జార్చుకొని, వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకున్న అభాగ్యురాలు ఆమె.
అడివిబాపిరాజు గారు సహజంగా కవియు, చిత్రకారుడును అయి ఉండడంవల్ల ఏ పాత్రను చిత్రించినా, ఏ సన్నివేశాన్ని కల్పించినా, వాటిలో చైతన్య శక్తి, ఆకర్షణీయ వాతావరణము, హృదయంగమస్థితి కానవస్తాయి. ఆయన వ్యక్తిత్వము విశిష్టలక్షణ విలసితమై, సమకాలిక సాహిత్యంలో వైలక్షణ్యాన్ని సంతరించుకొంది. అది ఒక సమాహార కళావ్యవస్థ కనుకనే ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు, బాపిరాజు ఒక వ్యవస్థ, ఒక సంస్థ అని, ఆయన శక్తి యుక్తులకు సముచితమైన కైవరాన్ని సమర్పించారు.
|