తన నవలా మాధ్యమమున ప్రాచీన చరిత్రలోని ఉజ్వల జీవనాదర్శముల ప్రతిపాదనముతోబాటు, సమకాలీన సమాజమున కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమమునకు తాత్విక భూమికను ప్రతిపాదించుట గూడ బాపిరాజు సాహిత్యమున కనబడుచుండును. అడవి శాంతిశ్రీ నవలలోని ఈ క్రింది వాక్యములు, దేశము, ప్రజలు, రాజు, ప్రభుత్వము, యుద్ధము, అధికారులు, అర్హతలు వంటి వానిపై బాపిరాజుగారి ప్రబోధములుగా గుర్తించవచ్చును.
దేశమంతా సుభిక్షమై ఉన్నప్పుడు దేశంలో ధర్మం ఆనందనాట్యం చేస్తున్నప్పుడు రాజులు నూతనాలయాలు...సత్రములు, వైద్యశాలలూ నిర్మిస్తారు (పు. 414).
నీరసుడయిన పురుషుడు రాక్షసునికన్న హీనం రాక్షసుడు రాజ్యం చేస్తే రాజ్యం ఉంటుంది. ధర్మం ఉండకపోవచ్చుగాక, నీరసుడు రాజ్యం చేస్తే ఆరాచకమే - ప్రజానాశనమే...(పుట. 232)
రాజ్యాలు అవసరమా....? క్షత్రియత్వం, తమ జాతినీ, యజ్ఞయాగాది క్రతువులనూ ధర్మాన్ని రక్షించటం అంతేగదా ఆర్యమానస జీవితం... ఎంత మారిపోయింది మానవజీవితం. రాజ్యాలు స్థాపించటం అవసరమైంది. వృధ్ధిపొందే మానవజాతికి, రక్షణకు, శాంతికి, వృద్ధికి, బడాయికీ, అభిమానానికి, ఆశకూ రాజ్యాభివృద్ధి సాంకేతిక విద్యలు కారణాలయ్యాయి. ప్రజారక్షణ, ప్రజాశాంతి, ప్రజాభివృద్ధి, ఇవే ఆశయాలైనప్పుడు, ఆ ఆశయాలకు ప్రజాహింసా, ప్రజా సంక్షోభం, ప్రజానాశనమూ పెలా మార్గాలు అవుతాయి (పుట. 81).
ఆంధ్రులే (బ్రిటీష్ సామ్రాజ్యవాదం అనుకోవచ్చును) ఈలా సర్వసామ్రాజ్యాధినేతలు ఎందుకు కావాలి ? ఆ ధీరులు... ఇక్కడ నివసించి, ఇక్కడే పుట్టి, పెరిగి ఇక్కడే మట్టిలో కలుస్తున్నారు. ఇక్కడ వుండే ప్రకృతిలో వారు భాగం...వారిలో ఈ ప్రకృతి భాగం ఈ మహానదాలు....ఈ (పర్వత) శ్రేణీ ఈ ఫలవత్తరభూమి ఈ సముద్రమూ, ఈ రేవుపట్టణమూ, వీరవి ఇందులో భాగం పంచుకోవటానికి....శాతవాహనులకు (ఆంగ్లేయులకు) ఏమి సత్యం ఉంది ? (పుట.82)
ఒక్క విషయం చెపుతున్నాను విను. మనుష్యలందరూ సర్వధర్మాలూ నేర్చుకోవాలి. నేర్చుకున్నంత మాత్రమునమనకు ప్రీతిపాత్రమగు ధర్మము మనలో నీరసించిపోయేట్లయితే ఈ ధర్మము ఉన్నా ఒకటే, లేక పోయినా ఒకటే ! ఏ ధర్మమూ నిత్యంకాదు. లోకంలో అనేక ధర్మాలు యుగ యుగానికి, శకశకానికీ మారుతూ ఉంటాయి (పుట. 41).
అయినా మీ ధర్మం మాకు నచ్చలేదు మీరు (ఆంగ్లేయులు) మాలో మాకు జరిగే యుద్ధాల్లో పాల్గొనరాదు (పుట. 81).
ఎవ్వరీ భూమీశువులు ?...నువ్వూ (సామాన్య వ్యక్తి) భూపతివే ! అయితే నీకూ భూమికీ సర్వకాల సంబంధం. మహారాజుకు భూమికీ, నీవ్యాజాన సంబంధం (పుట. 288)
రాజు ప్రజాబలానికి చిహ్నం. ప్రజా ధర్మానికి సేవకడు. రాజ్యపాలనచేసే రాజుకు మనమందరం బలమూ, శక్తీ ఇస్తాము.
రేపు నువ్వు ప్రభువువైనా నా అంతే చదువు ఎక్కక పోతే గద్దెక్కటం మానాలి. మనం ఈ కాలంవాళ్ళం భవిష్యత్తు ఎట్లా వుంటుందో ?
ఉత్తమ భావాలు మనస్సుల్లో ఉంచుకొని జీవితం సాగించేవారికి ఎప్పడూ భయంలేదు (పుట. 289).
పై వాక్యాలు ఎంతటి ఆత్మ విశ్వాసమును, ఎంతటి అవసర సందేశమును మన సమాజమున నింపునోగదా ! పర ప్రభుత్వము నెదిరించి, బానిస శృంఖలాలు త్రెంచుకొన నుద్యమించిన సమాజమునకు కవిగా బాపిరాజుగారు చెప్పిన ఉపదేశము లెన్నియో గలవు.
ఆధునిక జాతీయ స్వాతంత్య్ర సమరంలో మహాత్మునిది ఆహింసా ప్రధానం. దీనిని చాలమంది సరిగా అర్థము చేసుకొనలేదు. కావుననే ఆయన నేనుపదేశించునది పిరికివానీ, అశక్తునీ అహింసాభరణముగాదు. అని ప్రకటించారుకూడా. శ్రీ బిపిన్ చంద్రపాల్‌గారు అతివాద నాయకులుగా దేశమున సుప్రసిద్ధులు. గాంధీజీ మితవాది. ఈ ఇద్దరి సిద్ధాంతములను, తనలో బాపిరాజుగారు సమన్వయము చేసికొనిన తీరును అడవి శాంతిశ్రీ నవలలోని నాయకుడైన బ్రహ్మదత్త ప్రభువుచే అనేక సందర్భములలో వివరింపచేసినాడు.
నేడు మానవత్వమందలి రాక్షసత్వం పులమావి రూపేణా (పరప్రభుత్వ రూపమున) విజృంభించింది. దాన్ని నాశనంచేసిన దివ్యత్వాన్ని కాపాడాలంటే యుద్ధం కాక మరో మార్గం ఏదీ ? ఇంకో మార్గం చూచేలోపలే ఆ పశుత్వం ఏమీ ఎరుగని ప్రజలను నాశనం చేయదా ? (పుట. 192)
యుద్ధము అహింసకాదు. హింస...కానీ ఎవరయితే స్థితప్రజ్ఞుడై తాను యుద్ధం చేయడం సంపూర్ణంగా స్వధర్మ నిర్వహణం అని యెంచి చేస్తాడో, ఆనాడతను అహింసాకృత మాచరిస్తున్నాడన్న మాటే. (పుట. 246)
నాడు స్వాతంత్ర సమరమున విప్లవవీరులు చేయు సాహసములను గాంధేయవాదిగా బాపిరాజు సమన్వయ పరుచుకొని అభినందించిన తీరు పై వాక్యములలో ప్రతిఫలించుచున్నది.
ఆంధ్రమున దేశభక్తి కవిత్వము, సంకుచిత ప్రాంతీయాభిమానముగా వెర్రితలలు వేసినట్లు కొందరు విమర్శకులనుట కలదు. బాపిరాజుగారి సాహిత్యమున ఎంతటి యాంద్రాభిమాన మున్ననూ భారత జాతీయతయే, ఒకే ఒకటైన సనాతన ధర్మమే ఆయన ప్రతి పదరచనమునకూ కారణమైనది. అడవి శాంతిశ్రీ నవలలోని ఉపక్రమణికలోని నృత్యక్షరము, తెలుగుదేశాభిమానమును, కణ్ణబెణ్ణ (కృష్ణానది) పట్ల ప్రగాఢ ప్రేమానురాగములను, ప్రకటించుచున్ననూ ఈ క్రింది వాక్యమొకటి చాలును ఆయనలోని భారత జాతీయతను ప్రకటించుటకు.
ఆంధ్రమాతా, భరతమాతకు అనుగుబిడ్డవు అంటాడాయన.
శ్రీ రాయప్రోలు మాటలలో అడవోరి చిన్నోడా, అమృతధారలవోడ అని ప్రశంశింపబడిన బాపిరాజు గారి సాహిత్యంలో, శ్రీ విశ్వనాధ వారన్నట్లు ప్రతి పదమూ అర్థవత్కృతియే స్థాలీపులాక న్యాయముగా అంచనావేసిన బాపిరాజుగారు నిర్వహించిన రచనా వ్యాసంగమును పరిశీలించి జాతీయోద్యమమున ఆయనకు పెద్దపీట వేయుటకే ఈ ప్రయత్నమంతయునని సవినయంగా మనవి చేస్తున్నాను.
ఓం తత్ సత్
*********
గురు
భోగీర నీరముల్ వాగు దొలచిన లోయ
అజాంత గుహలలో అభ్యసించాను
ధాన్యకటక క్షేత్ర దమ్మ పదసంగాన
స్థూప శిల్పాలలో చూపుప పొందాను
గౌతమి వినీలాల లోతు కెరటాలలో
పాపికొండల నీడ పాట పాడాను,
కూచిపూడీ నాట్యకోవిదత్వమ్ములో
తోలుబొమ్మల విద్దెతులలేని సొబగులో
ఆటపాటల అందమందుకొన్నాను
అయ్యావాద అస్వాల్డ అప్పుడే నవ్వుతూ
భారతీయుడనైతి ప్రణతులన్నావు. - బాపిరాజు
|