స్వాతంత్ర్య సమురంలో సబలలు
అణచిపెడితే ఆవల తేలుతుందన్నది సామెత. ఏ ఉద్యమాన్నైనా పశుబలంతో ఆపివెయ్యాలని ప్రయత్నిస్తే, అది రెట్టింపు బలంతో విజృభించిందన్నమాటే ! స్వాతంత్రోద్యమం భారతదేశంలోని అణువణువునూ జాగృతం చేయగల్గడానికి కారణం ఈ అణచిఏత ప్రయత్నమే !
భరతమాత ముద్దుబిడ్డలు మాతృదాస్య విమోచనానికి ఎన్నో త్యాగాలు చేశారు. జైళ్ళలో మ్రగ్గారు. ప్రాణాలనుసైతం త్యాగంచేశారు. భూమితల్లికి రక్త తప్పరణాలు చేశారు. కడకు పరాయి పాలననుండి విముక్తురాలినిచేసి తల్లి ఋణం తీర్చుకున్నారు. వినతాసుతుడికి ధీటుగా నిలువగల్గారు.
ఈ సందర్భంలో స్త్రీలు తమ శక్తి సామర్థ్యాలను ఎలా వినియోగించుకున్నారు ? పిల్లలకు ఆడించడం పిండివంటలతో కుటుంబాన్ని సంతృప్తిపరచడం మాత్రమేనా ఇంకా ఏమైనా ఘనకార్యం చేశారా అనే అనుమానం కొందరికి రావచ్చు !ఎందుకంటే ఒక దుర్గాబాయి ఒక సరోజినీ నాయుడు ఒక కస్తూరిబాయివంటి కొందరి పేర్లే పదేపదే వినబడడంతో స్వాతంత్రోద్యమంతో స్త్రీలు తక్కువగా పాల్గొన్నారనే భావన కల్గడంలో అసమంజసం ఏంలేదు.
నిజానికి దేశభక్తులైన స్వాతంత్ర్య సమరయోధులకు స్పూర్తినిచ్చినిది వారి సన్నిహిత స్త్రీ వర్గమే. ప్రోత్సహించినది వారీ మాతృమూర్తులూ, అర్థాంగులే ఉన్న ఒక్క కుమారుణ్ని దేశానికి అప్పగించిన త్యాగమూర్తులైన తల్లులెందరో చరిత్ర కెక్కకుండా అజ్ఞాతంగా మిగిలిపోయారు. అసంఖ్యాకంగా ఉన్న ఈ అజ్ఞాత మూర్తులకు నా జోహార్లు.
స్త్రీలు సహజంగా అలంకార ప్రియులు, రంగురంగుల వన్నెచిన్నెల మురిపెంపు విదేశీ వస్త్రాలంటే వారికెంతో మోజు ! విదేశీ వస్త్రాలు తమ పెట్టెలలో ఉంచుకొంటే ఘనం! ఇలా భావించే తరుణంలో విదేశీ వస్త్రాలను వస్తువులను బహిష్కరించాలి అనే నినాదం వినవచ్చింది. అందులోని బాగోగులను తెల్సుకోవాలనే వారు తమ పెట్టెలలో పాములున్నట్లుగా కలవరం చెందారు. నాల్గువీధులు కూడళ్ళలో భోగిమంటలు లాగా తమకు (అంతకుముందు) ప్రియమైన, విదేశి వస్త్రాలను దగ్గర చేశారు. ఈ కార్యంలో ముందుకు నడిచింది మహిళామణులే ! పురుషులకు శాయశక్తులా సహకరించింది స్త్రీలే !
వీరిలో మనదేశంలో జన్మించకపోయినా ముందు చెప్పుకోవల్సింది అనిబిసెంట్ సోదరిని. ఆమె ఐరిష్ వనిత అయినప్పటికి ఆత్మ మాత్రం హైందవార్పణమే ! భారతదేశం తన దేశాన్ని తాను పరిపాలించుకోగలదు. ఇందుకు బ్రిటీష్వారి ప్రసక్తి అనవసరం. ఇందులో భారతీయులు రాజీపడేదేంలేదు అని ఘంటాపధంగా చెప్పింది. అనిబిసెంట్గారి ఈ హోమ్రూల్ ఉద్యమానికి ప్రతిఫలంగా ఉద్బవించింది తిలక్గారి స్వరాజ్యం నా జన్మహక్కు అనే మాట.
స్త్రీలు అబలలు, ధైర్యంలేని పిరికివారు తోడుగా తండ్రో తమ్ముడో కొడుకో భర్తో ఉండి నడిపించాల్సినవారు అనే నమ్మకాన్ని దుమ్ముచేసి వమ్ముచేసి తుపాకులనుసైతం ఎదిరించి కరకు కసాయి సిపాయిల కర్రలకు వీపులప్పగించి నుడుముకట్టి అన్నలకు తండ్రులకు సాయంగా నిలచారు. పిల్లలను లాలించే ఒడులను నడుములకు ముడివేసుకున్నారు. నడిస్తే కందిపోయే పాదాలకు కంటకాలతో రక్తపారాణిని దిద్దుకున్నారు.
ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో ఉప్పు కొఠారులమీదికి ఉరికి తలలపై లాఠీలు తాండవమాడుతున్నా తగ్గకుండా స్వయంగా లవణాన్ని వండారు. సముద్రతీరానికి నడవాలంటే ఐదేసి పదేసి మైళ్ళను నడవాలి. ఇంతేసి దూరాలను ఇట్టే నడిచి జన్మించి నందుకు తమ జీవితాలను దన్యం చేసుకునేలా దేశం కోసం పోరాడారు శాసనోల్లంఘనంచేసి అరెస్టులవడానికి మహిళలు ఎప్పుడూ వెనుకంజవేయలేదు. నువ్వు బొద్దింకను చూస్తే భయపడతావుగదా ఇంత ధైర్యం ఎలా వచ్చిందని ఓ భర్త మేలమాడితే ఒక వీరవనిత నవ్వి అవసరం వస్తే ఏంచెయ్యడానికీ మేము వెనుకాడమని సమాధానం చెప్పిందట ! గాంధీజీ ఈ ఉద్యమం నడిపేందుకు వచ్చిన ధనరాసులలో మూడువంతులు ఆ స్త్రీలు ఇచ్చినవేనన్నారట. ఆంధ్రరాష్ట్రంలో మాగంటి అన్నపూర్ణమ్మగారు గాంధీగారికి తమ శరీరం మీద ఉన్న నగలన్నింటినీ ఒలిచి ఇయ్యడం చూసి ఎందరో ఆమెను అనుకరించారు.
వలంటీర్లుగా ఏర్పడి దళాలు దళాలుగా కల్లు, సారా దుకాణాలవద్ద ఫికెటింగులు చేశారు. శారీరకంగా శ్రమపడలేని ఇల్లాళ్లు చిటికెడు ఉప్పును వేలకొలది రూపాయలు వెచ్చించి కొనేవారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మీటింగులు పెట్టి ఉపన్యసించిందని ఆంగ్లేయ ప్రభుత్వం సబ్నివీసు కృష్ణారావు గారి సతీమణికి జైలుశిక్ష విధించింది. ఆమెకు ఆ వాతావరణమూ ఆ ఆహారమూ సరిపడక క్షయవ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో కారాగారంలోనే కన్నుమూసిందామె. వందేమాతరం అంటూ దిక్కులు దద్దరిల్లేలా ఘోషిస్తూ భారతీయులు జెండా ఎగురవేయడం, తుపాకుల ప్రేలుళ్ళ మధ్య బ్రిటీషువారు వాటిని పీకివేయడం చంటి బిడ్డలను చంకనేసుకుని శతఘ్నలను ఎదిరించిన ఎందరో అబలలు ! వీరు సబలలు ! వారికివే నావందనాలు ! మద్దూరి అన్నపూర్ణయ్యగారు అతివాద జాతీయవాది. వీరు మంగళపాండే వీరగాథను చిచ్చుల పిడుగు ద్వారా ప్రచురించేసరికి పధ్నాలుగేళ్ళు జైలుశిక్ష విధించారు. వీరి సతీమణి రమణమ్మగారు భర్త మార్గంలో అతి ధైర్యంగా నడిచింది ఈమెకూ జైలు తప్పలేదు.
కాంగ్రెసు మహాసభలకు కొన్నిటికి మహిళలు అధ్యక్షత నెరపిన మహాద్ఘంటలున్నాయి. 1920 ప్రాంతంలో రుద్రరాజు బంగారమ్మగారు నరసాపురం తాలూకా పాలకొల్లులోనూ లావు అంకమ్మగారు బాపట్లలోనూ అధ్యక్షత వహించిన దాఖలాలు ఉన్నవి. ఎందరి పేర్లో చరిత్రలో నమోదు కాకుండా ఉండిపోయాయి. వారందరికీ నా మనోవాకాలు ! ఉన్నవ లక్ష్మీబాయమ్మగారు గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు కనపర్తి వరలక్షమ్మగారు దువ్వూరి సుబ్బమ్మగారు మొదలైనవారు ఎంతో ధైర్యసాహసాలతో ఉద్యమాన్ని నిర్వహించారు.
1925 ఆ ప్రాంతాల వాడపల్లిలో ఏకాదశీ రధోత్సవం జరుగుతోంది. ఆ తిరుణాళ్ళకు ఇరవైవేలమంది జనం చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చారు. దేవుడి విగ్రహంతోపాటు వారు గాంధీ, నెహ్రు సరోజినీదేవి చిత్రపటాలను కూడా ఆ రథాల్లో పెట్టి ఊరేగించారుట ! ఆ ప్రజలు ఆ భక్తుల హృదయాల్లో సోదరి సరోజినిదేవికి కూడా భగవంతునితో సమానమైన స్థానం ఉందని తెలుసుకుంటే ఏ హృదయమైనా పులకించక మానదు.
కరివిడి గ్రామంగుండా సత్యాగ్రహాలు దేవరంపాడు శిబిరానికి వెడుతూఉంటే వారికి అన్నం పెట్టకుండా చూడాలని ఆంగ్లేయులు ఎంతో ప్రయత్నించారు. గ్రామాలలోని స్త్రీలు నడుంకట్టారు. ఏ ఒక్కరూ ఆభోజనంగా తమ గ్రామంనుండి వెళ్ళడానికి వీలులేదని నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఎందరికో లాఠీదెబ్బలూ తుపాకీ గుండ్లూ జైలుశిక్షలూ లభించాయి. అయితే యేం వారి జన్మలు ధన్యమయ్యేలా అతిధి సత్కారం చేసుకున్నారు.
బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం అనే దేశభక్తుడు మరణిస్తూ తమ తుదిఘడియల్లో బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమానికి చిహ్నంగా నా ఆత్మ ఇక్కడే స్థంభించిపోతుంది అన్నారుట. అలా స్థభించిన ఆత్మలకు శాంతి కలిగించేలా అంతిమ విజయాన్ని అందుకునేందుకు తోడ్పడిన దేశభక్తులై సోదర సోదరీమణులకు ఇవే నా హృదయపూర్వక అశ్రుతర్పణ భక్త్యంజలులు.
|