అంతరాత్మ
అసలే మంచినీటి కరువు పక్కవాళ్ళింట్లో ఎక్కువమంది మనుష్యులున్నారు తమయింట్లో ఉన్నదిద్దరే. అయినా కావల్సిన దానికన్నా పోటీలు పడి ఎక్కువ నీళ్ళు పట్టి మోరీల్లో పారమెసే ప్రబుద్ధులున్నారు.
ఒకే ఇంట్లో అయిదారు వాటాలు ఉండే పొరుగింటి వారితోనే కాదు తమయింట్లో ఉండేవారిలోనే ఒకరంటే ఒకరికి గిట్టకకుండా సాడీల చక్రాన్ని తిప్పగలిగే సమర్ధులూ ఉన్నారు.
ఎదుటి వాళ్ళు పొయ్యిమండుతూ ఉంటే చూడలేక తమ పొయ్యిలో నీళ్లుపోసుకునే మాత్సర్య గ్రస్తులూ మరెందరో ఉన్నారు.
కాని మా ఆత్మ భూతేశ్వరి వంటివాళ్ళు మాత్రం ఎంతో ఆరుదుగా ఉంటారు. ఆమె పైకి ఎంతనవ్వుతుందో లోలోపల వారికెంత కీడు చెయ్యగలనా అనే గోతులను అంతగా తవ్వుతుంది ఆమె మాటకీ చేతకీ ఎక్కడా పోలిక ఉండదు. ఇలాంటి విలన్ పాత్రని ఏ మహాకవీ సృష్టించలేడని నా కన్పిస్తుంది. ( ఆడవారిని విలన్ అనకూడదుకదూ ) ఆమె స్వభావం తెల్సుకొనే సరికి ఇవతలివారు పైకి లేవలేతంగా గోతిలో కూరకుపోతారు. ఇక జ్ఞానోదయం అయిన ప్రయోజనం ఉండదు. ఆమె నోరువిప్పితే వచ్చేవి నీతి కథలే. భారత భాగవతాది పురాణగాథలే ! ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగితే బోరున ఏడ్చేస్తుంది. ఈమెదెంతటి సున్నిత హృదయం అని ఇవతలి వారుకూడా ఆశ్చర్యపోవాల్సిందే. అలా చెయ్యడానికి వారి ఆత్మ ఎలా ఒప్పిందో ? అంతరాత్మ నోరు మూసుకొని ఎలా కూర్చుందో అని అంటుండేది. ఇలా చెయ్యడానికి నా ఆత్మ చచ్చినా ఒప్పదు బాబూ అంటుంది. అంతరాత్మ చెప్పినట్లు వింటే లోకంలో అన్యాయాలు జరగవూ అంటుంది. పిల్లలందరూచేరి ఆత్మ అంటే ఏమిటి అంటీ ? అంటే ఆవేవో పంచభూతాలట అవన్నీ ఆత్మలో ఉంటాయట. అంటూ తనకే అర్థంకాని విషయాన్ని జ్ఞానోపదేశం చేస్తున్నట్లు ఫోజు పెట్తుంది. అందుకే ఆవిడకి ఆత్మభూతేశ్వరి అని మారుపేరు పెట్టారు కుర్రకారు.
ప్రతివారికీ తాముచేసిందే మంచిపని అనేభావం ఉంటుంది. ఒకవేళ లోపల మంచిపని కాదేమోనన్న అనుమానం పీడిస్తున్న ఆ లోగొంతుక నునొక్కి పట్టి మరింత దృఢంగా తమ పనిని గురించి తామే కితాబులిచ్చేసుకొంటారు.
ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయభేదం వచ్చిందనుకోండి అత్తాకోడళ్ళు అక్కా చెల్లెళ్ళు తల్లీకూతుళ్ళు ఎవరైనాసరే ఇరుపక్షాలవారు తాము చేసిందే రైటనీ తప్పంతా అవతలి వారిదేనని కన్పించిన వారందరికీ చెప్తారు. ఇద్దరినోటాకూడా ఒకే మాటని విటాం. ఇలా చెయ్యడానికి దాని అంతరాత్మ ఎలా ఒప్పింది అని.
అంతరాత్మ అందరికీ ఉంటుంది. దొంగని దొంగతనం చెయ్యమని తొందర పెట్టేది. ఉద్యోగిని లంచం పుచ్చుకోమని ఉసిగొల్పేదీ, నీతి బాహ్యంగా వ్యభచరించమని ఆ రెచ్చగొట్టేదీ అంతరాత్మేనా ?
నెలకు మూడేసి మంచి మంచి చీరలు కొనుక్కోగలిగే అమ్మణ్ణి అత్తగారికి సంవత్సరానికి రెండు నేత చీరలు కొనడం దండగ అనే నస పెట్టేదీ అంతరాత్మేనా !
అసలు అంతరాత్మ చెప్పేది ఖచ్చితంగా మంచిది అని చెప్పడం ఎలా ? అదికూడా కల్తీ ఆహారాల ప్రభావానికి లోనై తప్పుడు సలహాలియ్యదనే గారంటీ ఏమిటి ? అని ఒక సోదరి గురూజీని ప్రశ్నించారు. గురూజీ ఉలిక్కిపడ్డారు. మనసులో రేగే ప్రతి ఊహనూ అంతరాత్మ ప్రబోధం అనడం అదేదో రాజకీయాల వారికి సరిపడుతుందే గాని మనకి ప్రయోజనం లేదండి. అని గురూజీ సెలవిచ్చాడు. అయితే ఏ ఆలోచన మనసుపెట్లే ప్రలోభమో ఏది హృదయంనుండి పుట్టే సద్బుద్దో ఏది ఇంకా మరింత లోతుగా తవ్వుకుంటూ పోగలిగి అంతరాత్మ ప్రభోదమవుతుందో ఎలాగ నిర్ణయించుకోడం అని సోదరి నీరసపడి పోయారు.
గురూజీ ఉపనిషత్తులూ గీతా స్మృతులూ కోట్ చేసివిషయాన్ని మరింత కాంప్లికేట్ చేసిపారేసరికి ఈ హడావుడిలో అంతరాత్మ గారు ఏసుదీర్ఘ తీరాలకో పారిపోయారు. దేవుడు ఉన్నడా లేడా అనే ప్రశ్న వచ్చి సింహాసనంమీద ఆశీనురాలైంది. శ్రోతలంతా ఇటూ అటూగా చీలిపోగా రామరావణ సంగ్రామానికి దారి తీసింది. పాపం దేవుడుకూడా పిక్కబలం చూపకతప్పలేదు. ఈ మధ్యలో గురువుగారు దేహశుద్ధి అవకుండా పాలూ పళ్ళూపుచ్చకుని రెండు చేతులా ఇరుపక్షాలనూ దీవించేసి తప్పుకొన్నారు.
ఒక పని మంచిదైనా ఇలా చెయ్యమనే ఊహ పలిగే తావు మనస్సు . ఇక్కడే ఒద్దు అనే వికల్పం కూడా పుడుతుంది. సంకల్పం వికల్పాతక్మమైనదే మనస్సు. ఓపిక ఉన్నన్ని రోజులూ మా అత్త నన్ను నానా ఆరళ్ళో పెట్టింది. ఇప్పుడు మంచాన పడింది. గుక్కెడు నీళ్ళు కూడా నేను పోస్తేనే గతిలేకపోతే నోరెండి చావాల్సిందే ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళను అనే భావం ఒక కోడలి మనస్సులో కలిగింది. ఆమె పడ్డ కష్టాలకూ బాధలకూ అలా ప్రతీకారం తీర్చుకోవాలి అని అనిపించడం తప్పు కాదేమో ? కాని అది మానవత్వమనిపించుకుంటుందా ? శక్తి ఉడిగిపోయన వారిమీద పగతీర్చుకోవడమేమిటి ? ఆమెఉ ఆవస్థల పాలు చేయడం మహాపాపం కాదా అనే సంచలనం ఆమెలో కల్గినప్పుడు ఆమె చేయబోయే చెడ్డపనికి అంతరాయం కల్గించింది కూడా మనస్సులోని రెండోపొరే.
ఇకపోతే ఎన్నో దురవస్థలు ఆమె వల్ల తాననుభవించినప్పటికీ వాటిని గుర్తుపెట్టుకోక సానుభూతితో సేవచేయాలి అనే సత్సంకల్పం హృదయంనుండి చిగురించాల్సిందే. ఇటువంటి స్త్రీని సహృదయురాలు సంస్కారవంతురాలు అని అనవచ్చు.
ఇలాటి సహృదయులైన సంస్కారవంతులైన స్త్రీ పురుషుల హృదయాల అంతరాంతరాలలో నిగూఢంగా గుప్తమైన అంతరాత్మ తనంతతానుగా తలుపులు తెరుచుకొని బయటికి వస్తుంది. మిగిలిన కఠినహృదయం ఇనుప తలుపులు తెరవడం అంతరాత్మకి కాదుకాదా తనను పుట్టించిన దైవానికి కూడా శక్యంకాదు.
ఎక్కడైతే సద్భుద్ధి సదాలోచన, సత్కార్యం, సత్సేవాభావం సానుభూతి అనే సద్గుణాలు పుష్కలంగా రేకులు విప్పుకొని విచ్చుకుంటాయో అక్కడే అంతరాత్మ అనే అపూర్వ సుందర కుసుమం పరిమళ భరితంగా విరియ గల్గుతుంది. దాని తావులను అడ్డగలిగే శక్తి దేనికీ లేదు. దాని కాంతులను ఆపేశక్తి కూడా దేనికీ ఉండదు.
|