మరుపుకు మందు
ఇంట్లో ఏమీ తోచక అలా అలివేణీ వాళ్ళింటికి వెళ్ళాను. సాధారణంగా ఈ సమయంలో అలివేణి భర్త ఆఫీసులో ఉంటారు. పెద్ద ఆఫీసర్ అవడంతో ఒ పండగనాడుగాని ఆదివారంనాడు గానీ ఇంట్లో ఉండరు. ఎప్పుడూ ఆఫీసూ కాంపులూ.
ఇద్దరం సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూండగా ఇంట్లోంచి ఏవో దుబ్బు దబ్బుమన్న చప్పుళ్ళూ ఆవెనకనే ఆఫీసరు గారు గర్జించడం విన్పించి ఉలిక్కిపడ్డాను. ఈయన ఇంట్లోనే ఉన్నాడు ఏం విశేషమో అని. దువ్వెన ఎక్కడ చచ్చిందో ఇటొచ్చి నామొహాన తగలేస్తావు అనివో పొలికేకపెట్టాడు. మా వాడ కట్టు వారంతా ఆయనని పరమశాంతమూర్తి అంటారు. ఏ మూర్తి అయినా ఇంట్లో ఉంటేకదా గుణగణాలు తెలిసేందుకు ! అసలు రంగు ఇవ్వాళ బయట పడింది అనుకున్నాను. పాపం అలివేణి చిన్నమొహం చేసుకుంది. అవును మరి పక్కననేను చూస్తున్నానని సిగ్గుగా వుంది. మొగుడు కొట్టినందుకు కాదు గాని తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుగా వుంది ఆమె పని.
వెంటనే లేచివెళ్ళి దువ్వెన వెతకడం మెదలు పెట్టింది. కర్టిన్ ఇవతల్నించినాకు లోపల జరిగేదంతా కన్పిస్తూనే ఉంది. నన్ను వెళ్ళవద్దని ఆర్డరువేసి వెళ్ళింది అలివేణి. ఆయన వీరాంగం వేస్తున్నాడు. నేను వాళ్ళ గోలేమీ పట్టనట్లు పేపర్ కేసి చూస్తూండి పోయాను.
పెద్దమ్మాయి బెడ్రూమ్లో ఉన్న అలమారా, బీరువా, మంచాల కిందా, పుస్తకాల మధ్యనా, దుప్పట్లకిందా, దిళ్ళకిందా గాలించేసింది.
చిన్నమ్మాయి రెండో గదిలోకి దూసుకుపోయి డ్రాయర్లలోనూ ఫ్రిజ్ మీదా రేడియో కిందా అద్దం వెనకాలా వాళ్ళ తమ్ముళ్ళ పుస్తకాల పెట్టెల్లోనూ వెతికేసింది.
అలివేణి వంటింట్లోకి వెళ్ళి బియ్యండబ్బా పోవుల డబ్బా కూరగాయల బుట్టా, ఉప్పు బకెట్, మంచినీళ్ళ బిందెల సందునా పైనా క్రిందా ప్రక్కలా అన్ని తావుల్లోనూ వెతికింది. ఈ వెతుకుతున్నంతసేపూ ఆయన దండకం చదువుతూనే ఉన్నాడు. గొంతు తారస్థాయిలో ఉంది. కాస్త మెల్లగా మాట్లాండి నా ఫ్రెండ్ ఉంది అంది కాబోలు మరింత రెచ్చిపోయాడు. నీ ఫ్రెండుకి నువ్వెలాంటి పప్ప సుద్దవో తెలియాల్సిందే ఒక్క వస్తువూ ఉండాల్సిన చోటవుండదు. ఎందుకూ చదువుతున్నావ్. నీ కంటె నాల్గోక్లాసువాళ్ళు ఇళ్ళని చక్కగా సర్దుకుంటున్నారు అని కస్సుమన్నాడు. పిల్లల్ని నాలుగంటించాడు. అటూ ఇటూ మూడు తరాల వారికి తిట్ల తర్పణాలు వదిలి రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు కేంప్కి.
పేపర్ సందులోంచి చూశాను. వెనక తోమిన అలివేణంలా బట్టతల తళతళలాడుతోంది. ముందున్న పదిపరకలూ సంస్కారంలేక గాలికి ఎగిరి మొహాంమీదకొచ్చి పడుతున్నాయి.
అలివేణి వచ్చి మౌనంగా కూర్చుండి పోయింది. ఏమిటో అలివేణి మా యింట్లోనూ ఇంతే సమయానికి ఏదీ కన్పించదు ఒక చిన్న బ్లేడ్ కావాలంటే ఇల్లంతా వెదకాల్సిందే అన్నాను ఓదారుస్తూ.
ఇంట్లో నాలుగు దువ్వెనలున్నాయిట. అక్కరవచ్చినప్పుడు ఒక్కటీ కన్పించదు అని అలివేణి బాధపడింది. ఇంతలోవాళ్ళ పెద్దమ్మాయి మిరపకాయల బస్తా క్రిందినించి ఒక దువ్వెనని తీసుకువచ్చింది. ఈ కన్పించేది రెండునిముషాల క్రింద కన్పిస్తే ఎంత బాగుండేది. నాకు తిట్లూ తప్పేవి. అవమానమూ తప్పేది అంది. అవమానానికేంలే అందరమూ ఆడవాళ్లమే ప్రతిఇంట్లోనూ ఇలాంటి సమస్యలు ఒకో ఆరో రాకుండా ఉండవు. అని అలివేణిని బుజ్జగించాను.
అలివేణి సరిగ్గా కూర్చో లేక ఇబ్బంది పడుతోంది. ఏదో కుట్టినట్లు గభాల్నలేచి నుంచుని సోఫామీద సీటు తీసిదులిపింది. సీటుకి సోఫాకీ మధ్యన ఎర్ర పళ్ళ నల్లదువ్వెన !
అలివేణికి మెరుపులాగా గుర్తుకొచ్చింది. ఇప్పుడే అయిదు నిమిషాల క్రితం దువ్వుకుని నేనే ఇక్కడ పెట్టాను. మరీ మతిమరుపు ఎక్కువైపోయింద. ఏదైనా రసీదో ముఖ్యమైన కాగితమోదాచమని ఇస్తారాచాలా జాగ్రత్తగా దాస్తాన. కానీ ఆదాచిన జాగా మర్చిపోయి కావల్సివచ్చినప్పుడు ఇల్లంతా మూడు సార్లైనా గాలిస్తేగాని దొరకదు. డబ్బు సంగతి సరే సరి. పనిమనిషి పాలవాడు ఎప్పుడూ అయిదూపది పట్టికెడుతూ ఉంటారు. ఇచ్చినప్పుడు గట్టిగా గుర్తుపెట్టుకుంటాను. రెండురోజులు పోయాక ఎవరితో డబ్బు ఇచ్చినట్లు గుర్తుఉంటుంది. కానీ ఎవరికో ఎంతో గుర్తుండదు. అడిగితే వాళ్ళు ఒప్పుకోరు, సరిగదా యుద్ధానికి వస్తారన అ నష్టాన్ని నేనే గుట్టు చప్పుడుకాకుండా భరిస్తాను అంది.
అలివేణిలా నాకూ మతిమరుపు ఎక్కువే కానీ ఈ మధ్య కొంత జాగ్రత్తగా ఉండగల్గుతున్నాను. ఆ చిట్కాలు అలివేణికి తెల్సు అమలు చెయ్యడానికి కొంత ఓపికా అలవాటు కూడా కావాలి.
ఎవరికి ఏమి ఇచ్చినా ఎవరు ఏమి ఇచ్చినా మతిమరపు ఉన్న వారూ లేని వారు కూడా ఓ పుస్తకంలో రాసిపెట్టుకోవాలి. అప్పుడు పనిమనిషి నెలకు రెండు మార్లు జీతం వసూలు చేసుకోలేదు. మనల్ని ఎవ్వరూ దబాయించలేరు.
రెండోది ఏమిటంటే మనం ఏ విషయాన్ని గుర్తువుంచుకోవాలనకుంటామో ఆ విషయాన్ని చాలాసార్లు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉండాలి ! అందుకేనేమో మనకు నచ్చిన ఇష్టమైన విషయాలు ఎన్ని సంవత్సరాలైనా మరపుకురావు. చిన్ననాటి సంగతులు అప్పుడే జరిగినట్లు వర్ణించగల అలివేణికి అయిదునిముషాల క్రితం దువ్వుకుని పెట్టిన దువ్వెన సంగతి గుర్తురాదు. దువ్వెన ఇక్కడ పెడుతున్నా అని తనకుతానే చెప్పుకోవాలి,. అలా ఒకటిరెండుసార్లు చెప్పుకున్నాక ఎవరైనా అడిగితే వెంటనే తీసి ఇచ్చెయగల్గవచ్చు. ఇది చిన్న విషయమే.
మరెన్నో పెద్ద విషయాలు జ్ఞప్తిలో ఉంచుకోవాలంటే మొదటి రెండు మూడు రోజులు ఆ విషయాన్ని రోజుకు ముమ్మారు తరువాత వారానికోమారు ఇలా ఓ నెల చేస్తే జీవితాంతం ఆ మాట మరపుకు రాదు. విద్యార్థులకు కూడా ఈ పద్ధతి ఎంతో ఉపకరిస్తుంది. పాఠం అర్థం అవగానే అందులోని ముఖ్యాంశాలూ ఒకచోట నోట్చేసుకుని అప్పుడప్పుడూ చదువుతూ ఉంటే పరీక్షల్లో తేలికగా వ్రాయడమే కాదు, ఎంతవయస్సు వచ్చినా తమపిల్లలకు ఆ పాఠాన్ని చక్కగా చెప్పగల్గుతారు.
పూర్వ కాలం రోజూవచ్చిన పాఠాన్నే మళ్ళీ మళ్ళీ చదివించేవారు. దాన్నే వల్లె వేయడం అంటారు. ఈనాడు పిండిరుబ్బడం అంటారు కానీ పూర్వవిద్యార్థులకున్నజ్ఞాపకశక్తి ఎక్కువ అని చెప్పక తప్పదు.
ఇలా రోజూ కాకపోయినా మనసులో ముద్రపడే వరకూ మనకు కావల్సిన సంగతులను మళ్ళీ మళ్ళీ తలచుకోడం అంటే మననంచేసుకోడంతో మనం మరపు ను జయింగల్గుతాం.
ఇదినేను కొత్తగా కనిపెట్టిందికాదు. మనస్తత్వ శాస్త్రజ్ఞులు మరపుకు మందుగా ఇలాగే చేయమని చెప్తారు అని నొక్కి చెప్పాక అలివేణి తనూ అలాగే చేస్తానంది. ఎంతవరకు మాట నిలబెట్టు కుంటుందో చూడాలి !
|