ఎలా మాట్లాడాలి ? ఏం మాట్లాడాలి ?
ఏమండోయ్ పిన్నిగారూ ఇది విన్నారా వదినా ఆ పిల్ల అల్లాగునండీ అనే పోచికోలు కబుర్లకూ, ఉబుసుపోక కబుర్తకూ కాలం చెల్లిపోయింది. వండుకోడం తినడం మాత్రమే పనిగా వుంది కలాన్నెలా గడపాలో తెలీనప్పుడు ఇలాంటి కబుర్లు తప్పేవి కావు. ఈ రోజుల్లో కబుర్లు చెప్పుకోడానికి కాదుగదా అసలు ఊపిరి పీల్చుకోడానికి కూడా తీరిక లేకుండా పోతోంది. అంత బిజీ అయిపోయాము అందరమూ. ఎవరైనా వస్తే ఏం మాట్లాడాలో తెలీక తత్తరపడిపోతారు కొందరు.
ఎప్పుడైనా నలుగురమూ ఒకచోట జేరితే ఏం మాట్లాడుకుంటే బాగుటుంది ? ఇంకేముంటాయ్ మీ ఆడాళ్ళకి చీరలు నగలు వీటి గురించేగా ! మా మగాళ్ళమైతే ఇలాంటి విషయాలు మాట్లాడుకోము అన్నాడు నాకు తెలిసినతను. నిజమే మాట్లాడుకుంటాము. ఇందులో తప్పేమిటి ? మాకు అవంటే ఆకర్షణ ఎవరైనా మంచి చీర కొనుక్కుంటే నేనూ అలాంటిదే కొనుక్కుంటే బాగుండునని ఎవరికైనా అన్పిస్తుంది. అది సహజం. అందుకనే అది ఎక్కడ కొన్నారో ఎంతకి కొన్నారో మనకందుబాటులో వుందో లేదో తెల్సుకుంటే తప్పా ? ఇక ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకునేది భర్త సంతృప్తి కోసమే గదా అని అతని మీద విరుచుకుపడేసరికి పాపం కిమ్మనలేదు ఆ మానవుడు.
ఇక అస్తమానమూ వీటిగురించే మాట్లాడుకోము కదా ! ఒకరి మొగాలు ఒకరు చూసుకోకుండా ఏదైనా సరసమైన సంభాషణలు మొదలు పెట్టాలి ! చాలా మందికి ఏం మాట్లాడాలో తెలీదు. ఆ పక్కింటి కామాక్షి ఇల్లా ! ఆమెకో కబుర్లజోలికిపోకూడదు. సాధ్యమైనంతగా వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా జనరల్ టాపిక్స్ మీద మాటలు మొదలు పెట్టాలి.
ఈనాడు సాహిత్యం పుంఖానుపుంఖాలుగా పుట్టుకు వస్తోంది. కథలూ నవలలూ చదవని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇటీవల చదివిన కత మీకెలావుంది ? అనే అభిప్రాయం తెల్సుకోవచ్చు. ఒకరు బాగుందంటారు ఒకరు చదవలేదంటారు. ఒకరు చాలా నచ్చిందంటారు. బాగుందన్న వారు ఎలా బాగుందో బాగులేదన్నవారికెంత బాగులేదో చెప్తే కొంతకాలం గడిచిపోతుంది. మూడో ఆమెకి తాను చదవలేదన్న బాధలేకుండా కథ విన్నట్టూ అవుతుంది. సత్కాలక్షేపమూ సాహిత్య చర్చ చేనినట్టూ అవుతుంది.
తరువాత ఏ సినిమా గురించో మాట్లాడుకోవచ్చు. రేడియోలో చర్చావేదికలాగా గంభీరంగా చర్చించముకదా ! ఎవరికి తోచిన మాట వాళ్ళం చెబుతాము. అంతే సినిమాలతో అవాస్తవికతలు ఎంతగా పెరిగిపోతున్నాయో మాట్లాడవచ్చు. ఇహపత్రికలలో వచ్చే సీరియల్స్ ఏవిబావుంటున్నాయో ఏవి బావుంటం లేదో ఒకరి అభిప్రాయాలు ఒకరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. సైన్స్ ఫిక్షన్స్ పేరిట, టెర్రరిజమ్ ఐరాసైకాలజీ పేరిట ఎన్ని భయంకర గాధలను రచయితలు సృష్టిస్తున్నారో తెలసుకోవచ్చు ! వాటిని చదవడం వలన ప్రజానీకానిక ఏమైనా ప్రయోజనం ఉందా ? కేవలం కాలక్షేపానికేనా, దుష్పలితాలుకూడా కలుగవచ్చునా ? అన్న విషయాలు నలుగురూ చేరినప్పు మాట్లాడుకొంటే మన ఆలోచనా పరిథి పెరుగుతుంది. మనం కొత్త విషయాలూ తెల్సుకోగల్గుతాం.
మగ వారెక్కువగా రాజకీయాలు మాట్లాడతారు. ఆడవారు మాత్రం ఎందుకు మాట్లాడకూడదు ? మనమూ రాజకీయాలను అవగాహన చేసుకోవాలంటే దినపత్రిక చదవడం తప్పనిసరిగా చేయాలి.
ఒకచోట చేరిన నలుగురూ నాలుగు ప్రాంతాల వారైతే వారి ఆచారవ్యవహారాలను గురించి తెలుసుకోడం మంచిది. వారు ఏ రకమైన కూరగాయలు ఎలా ఎలా వండుతారో ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎప్పుడూ వంటల్ని గురించేనా మీ మాటలు అనే మగవాళ్ళు మనం కష్టపడి రకరకాల పదార్థాలు చేస్తే ఆరగించడానికి ముందే బయలుదేరతారు.
వంటలలో పోషకాహార విలువలు ఎలా అయితే ఎక్కువ మనకు లభిస్తాయో తెలుసుకుంటే పిల్లలకి పెద్దలకి కూడా మంచి ఆహారాన్ని పెట్టిన వాళ్ళమవుతాము.
అన్ని రసాల్లోకి క్షీణదశలో ఉన్నది హాస్యరసం. వరసకువదినను, బావనుచేసి సున్నితమైన హాస్యంచేసి నవ్వుల జల్లుల్ని కురిపించడం చాలా కష్టం కొంతమంది ఎదుటివారిని ఎద్దేవా చెయ్యడమే హాస్యమనుకుంటారు. కాల్చి వాత పెట్టినట్లు మాట్లాడి అబ్బే తమాషాకి అన్నాం అంటారు. ఇతరుల మనస్సు నొప్పించకుండా మాట్లాడటం ఒక కళ.ఆ కళ అందరికీ చేత కాదు. ఈ కళలో ప్రవీణురాలైన ఒకామెను చూశాను ఆమె ఎదుటి వారి అభిరుచిని తెలుసుకొని మాట్లాడకలదు. పెద్దలతో వేదాంతం పిన్నలతో సినిమాలు, కధల గురించి, ఆటల గురించి, చదువురాని స్త్రీలతో మరొకరకంగా చదువువచ్చిన వారితో మరివొక రకంగా మాట్లాడి తానూ అచ్చంగా వారి అభిప్రాయాలతోనే ఉన్నట్లు మాట్లాడగలదు. ఎవరొచ్చినా గంటల తరబడి ఆమెతో కాలం ఇట్లే గడిపేస్తారు. ఆమెది నట అనే మీరనుకుంటే పొరపాటు పడ్డట్టే. అన్ని విషయాలూ కూలంకషంగా ఆమెకు తెలుసు. తెలిసిన విషయాల్ని మాటల్లో పెట్టగల కళా, నేర్పు ఆమెలో ఉన్నాయి. అందరూ అన్ని విషయాలూ తప్పనిసరిగా తెలుసుకోవాలనేది నా అభిమతం కాదు. వ్యక్తిగత విషయాల జోలికిపోయి కలతలకూ, కలహాలకూ కారకులు కాకుండా చక్కని స్నేహాన్ని, రూపొందించుకొనేలా, మళ్ళీ ఆమెతో మాట్లాడాలి అనిపించేలా మాట్లాడటానికి ప్రయత్నించాలి. నొప్పించక, తానొవ్వక అన్నరీతిలో మాట్లాడటం సర్వత్రా మంచిది.
|