49
 

మాతృదేవోభ‌వ‌

 

న‌వ‌మాసాలూ మోసి క‌ష్ట‌ప‌డి క‌నిపెంచి పెద్ద చేసి ఏ కొంచెం వొళ్ళు వెచ్చ‌బ‌డినా న‌ల‌త‌గా ఉన్నా అన్నం నిద్రామానుకుని బిడ్డ‌ని కంటికి రెప్ప‌లా కాపాడేది త‌ల్లి.  డ‌బ్బు ఉన్నా లేక‌పోయినా బిచ్చ‌మ‌డుక్కువ‌చ్చి అయినా త‌ను తిన‌కుండా బిడ్డ క‌డుపునింప‌డానికి ఆత్ర పడుతుంది. ఎవ‌రి ఋణ‌మైనా తీర్చుకోవ‌చ్చుగాని త‌ల్లి ఋణం మాత్రం తీర్చుకోలేనిదంటారు పెద్ద‌లు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం ! ఎక్క‌డైనా చెడ్డ‌సంతానం ఉండ‌వ‌చ్చుగాని చెడ్డ త‌ల్లి ఉండ‌ద‌ని శ్రీ శంక‌రాచార్యుల‌వారు కుపుత్రోజాయేత క్వ‌చిద‌పి కుమతాన‌భ‌వ‌తి అంటారు.

క‌ష్టం వ‌స్తే శ‌రీరానికి చిన్న బాధ‌యినా క‌లిగితే ఎంత‌వృధ్ధులైనా తల్చుకొనేది అమ్మ నే అమ్మ అని పిల‌వ‌డం అతితేలిక‌. రెండు పెద‌వులు క‌లిస్తే శ‌బ్ద సంయోగంతో పుట్టేది మ‌కారం. ఏ భాష‌లోనైనా ఎక్కువ‌గా క‌న్న త‌ల్లిని మ కారం తోనే పిలుస్తారు. ఈ మ‌కారానికి రెండు మ లు ఇదే మ‌మ‌కారం తల్లికి బిడ్డ‌పై ఉండే మ‌మ‌కారానికి హ‌ద్దులుండ‌వు అమ్మ, మాత, మా, మ‌మ్మీ, ఆవుదూడ అంబా అంటుంది. మేక మే అంటుంది. బిడ్డ అమ్మా అఇ ఆక్రోశిస్తే అల్లాడిపోతుంది త‌ల్లి హృద‌యం.

పిల్ల‌లు పెద్ద‌ల చ‌ర్య‌లు గౌర‌వ‌నీయంగా ఉండాలి. మ‌నం బుద్ధి చెప్ప‌బోతే నువ్వు అలా చెయ్య‌లేదా అని అన్పించుకునే స్థితిలో ఉంటే ప‌రిస్థితి చెయ్యిదాటిపోయిన‌ట్లే ఉదాహర‌ణ‌గా ఒక్క విష‌యం తీసుకుదాం అత్త‌గార్ని నానాయాత‌న‌లూ పెట్టే వారుంటారు కొంద‌రు. తాము ఒక‌టి తింటూ అత్త‌గారికేదో ఇంత ప‌డేస్తూంటారు మొక్కుబ‌డిగా. ఈ స‌మ‌యంలో త‌ల్లి బామ్మ‌మీద చూపే ద్వేషం పిల్ల‌ల‌కూ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వారూబామ్మ‌ని నానా ఏడ్పులూ ఏడ్పిస్తుంటారు. త‌ల్లి త‌ప్పు అని చెప్ప‌లేదు. ఎందుకంటే పిల్ల‌ల‌లా ప్ర‌వ‌ర్తించ‌డానికి త‌నే కార‌ణంకూడా కాబ‌ట్టి. పై పెచ్చు ప్రోత్స‌హిస్తూ ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతుంది.

ఈ పిల్ల‌లు త‌ల్లి బామ్మ‌నెలా చూస్తున్న‌దీ నోరెలా పారేసుకుంటున్న‌దీ అబ‌ద్దాలు ఎలా ప‌లుకుతున్న‌దీ గ్ర‌హిస్తారు. వారూ అలాగే చేస్తారు. మ‌న‌సులో అమ్మ చ‌ర్య యొక్క ముద్ర‌ప‌డుతుంది. వార‌ది కావాల‌ని గుర్తు పెట్టుకోక‌పోయినా చిన్న బుర్ర‌లో గుప్తంగా ఉండిపోతుంది. త‌ల్లి పెద్ద‌దౌతుంది. పిల్ల‌లూ పెద్ద‌వారౌతారు. అప్పుడు అత్త‌గారున్న స్థితిలోకి కోడలు వ‌స్తుంది. త‌న‌నెలా చూస్తున్నారో అని బాధ‌ప‌డుతుంది. పిల్ల‌ల‌ను మంద‌లించ‌క బోతుంది. బామ్మ‌నెలాచూశావో నాకు తెలీదా అని కొడుకు అన్న‌ప్పుడు ఆ త‌ల్లి ఏం చెప్ప‌గ‌ల‌దు ?  నాన్నా ! నీ త‌ల్లిని నువ్వు ఎంత గౌర‌వంగా చూశావో నాకు తెలీదా అంటే ఆ తండ్రి ఏం చెప్ప‌గ‌ల‌డు ?

ఇది కేవ‌లం ఒక్క విష‌యం మాత్ర‌మే. ప్ర‌తి ప‌నినీ త‌ల్లి ఎలా చేస్తున్న‌దీ పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తారు. ఆవు గ‌ట్టున న‌డుస్తుంటే దూడ‌కూడా గ‌ట్టునే న‌డుస్తుంద‌ని సామెత !

త‌ల్లి సంస్కార‌వంతురాలైతే పిల్ల‌లు వారంత‌ట‌వారు సంస్కార‌వంతంగా పెరుగుతారు. ఇందుకు బోధ‌చెయ్య‌క్క‌ర‌లేదు. శిక్ష‌ణ గ‌ర‌ప‌నక్క‌ర‌లేదు. త‌న ప్ర‌వ‌ర్త‌న ద్వారా పిల్ల‌ల జీవితాన్ని తీర్చిదిద్ద‌గ‌ల గొప్ప అవ‌కాశం మ‌నుష్య జ‌న్మ‌నెత్తిన ప్ర‌తి మాతృమూర్తికి వుంది.

ఉగ్గుపాల‌తోపాటు లాలిపాట‌ల‌తోపాటు చ‌క్క‌ని నీతి క‌ధ‌ల‌ను  చెబుతూ బిడ్డ‌ల నైతిక ప్ర‌వ‌ర్త‌న‌కు రూపురేఖ‌ల‌ను చిత్రించే మ‌హాద‌వ‌కాశం ఒక్క త‌ల్లికే వుంది.

క‌థ‌లూ గాధ‌లూ అర్థ‌మ‌య్యే వ‌య‌స్సు వ‌చ్చాక పురాణ‌క‌థ‌ల‌లోని నైతిక విలువ‌ల‌ను మ‌న‌సును హ‌త్తుకునేలా చెప్తూవుంటే తాము కూడా అలాగే ప్ర‌వ‌ర్తించాల‌నే కాంక్ష వారికి త‌ప్ప‌కుండా జ‌నిస్తుంది. ఏక‌ప‌త్నీ వ్ర‌తాన్ని తీసుకోండి. ఈ విష‌యంలో శ్రీరామ చంద్రుడికి మించిన వారు లేరు. రామ‌గాధ‌ను బిడ్డ‌ల మ‌నోస్థాయికి తీసుకువచ్చి వారి చిన్న హృద‌యాల‌లో హ‌త్తుకునేలాగ అనేక మార్లు చెప్పాలి !  అంతేకాని ఏమో ఎవ‌డు చూసొచ్చాడు ?  రాముడికి ఒక పెళ్ళామో ప‌దిమంది పెళ్ళాలో అని అన‌కూడ‌దు.మ‌హా ఋషుల‌చేత పురాణ‌గాథ‌లు ఋజువ‌ర్త‌నం కోసం ఆద‌ర్శాల‌కోసం చెప్ప‌బ‌డినాయి. వాటికి విప‌రీతార్థాలు తీయ‌కూడ‌దు. ఏ మ‌హా విష‌యాన్నుద్దేశించి ఆ ర‌చ‌న‌లు చేయ‌బ‌డినాయో ఈ విష‌యానికి వ‌క్ర‌భాష్యాలు చెయ్య‌కూడ‌దు. చిన్న‌ప్పుడు ఏ భావాలు పిల్ల‌ల హృదయంలో నాటుకుంటాయో అవి శాశ్వ‌తంగా అలా వుండిపోతాయి.

ఇలా ఎప్పుడైతే త‌ల్లి త‌న మాట‌ల్లోనూ చేత‌ల్లోనూ సంస్కార‌వంతంగా ఉండి బిడ్డ‌ల‌కు స‌న్మార్గ ద‌ర్శ‌కురాలౌతుందో ఆమెయే గురువును మించిన గురువు. దేవ‌త‌ను మించిన దేవ‌త ! మాతృదేవ‌త !

క‌న‌డం, పెంచ‌డం ప్రేమ‌గా లాలించ‌డం స‌ర్వజంతువులూ స‌మాన ధ‌ర్మాలే ! మాన‌వుల‌మై పుట్టినందుకు బిడ్డ‌ల నైతిక జీవితాన్ని తీర్చిదిద్ద‌గ‌ల ప్ర‌వ‌ర్త‌న‌ను మ‌నం చేయ‌గ‌ల్గిన‌వాడే మాతృదేవ‌త అని పిల‌వ‌బ‌డేందుకు త‌గిన అర్హ‌త‌ను పొంద‌గ‌లుగుతాం !